సినిమాకి ఎంత హైప్ తీసుకొచ్చామనే దానిపైనే ఇప్పుడు ఓపెనింగ్స్ ఆధారపడుతున్నాయి. ఖచ్చితంగా ఇది చూడాలనే విధంగా ఆసక్తి రేకెత్తించినట్టయితే బ్యాడ్ టాక్ కూడా తొలి వారాంతం వసూళ్లని ప్రభావితం చేయడం లేదు. అందుకే హైప్ కోసం నిర్మాతలు వివిధ టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు. అల వైకుంఠపురములో చిత్రానికి విడుదలకి దాదాపు వంద రోజుల ముందే ఫస్ట్ సింగిల్ వదిలారు.
'సామజవరగమన' అంటూ సాగే ఈ పాటని రెగ్యులర్ లిరికల్ వీడియోలా కాకుండా ప్రత్యేకంగా తమన్, సిడ్ శ్రీరామ్‌లపై సెట్‌లో చిత్రీకరించారు. ఇందుకోసం పాతిక లక్షల వరకు ఖర్చు పెట్టినట్టు సమాచారం. వారు అంచనా వేసినట్టే ఈ పాట స్మాష్ హిట్ అయింది. ఇప్పటికే యూట్యూబ్‌లో నాలుగు కోట్లకి పైగా వ్యూస్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి ఈ పాట తెచ్చిన క్రేజ్ ఖచ్చితంగా ఓపెనింగ్ కలక్షన్స్‌పై రిఫ్లెక్ట్ అవుతుంది.
ఈ పాట సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఈ చిత్ర నిర్మాతలు దీపావళికి ఒక మాస్ సాంగ్‌ని ఇదే పద్ధతిలో షూట్ చేసి విడుదల చేయబోతున్నారు. క్లాస్‌ని ఆకట్టుకున్న సామజవరగమన తర్వాత ఈ సెకండ్ సింగిల్‌తో మాస్ ఆడియన్స్‌లోను క్రేజ్ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. సంక్రాంతికి భారీ పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ స్ట్రాటజీతో కాంపిటీషన్ చిత్రాలకి వైకుంఠాన్నే చూపిస్తున్నారు.