ఇవి వీర్రాజు లెక్కలు.. విని తరించాల్సిందే!

కొత్తగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి అందుకున్న సోము వీర్రాజు.. రాష్ట్ర రాజకీయాలపై తనదైన మార్క్ లెక్కలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా ఇటు వైసీపీని కాదని, అటు టీడీపీని కూడా కాదని.. గంపగుత్తగా…

కొత్తగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి అందుకున్న సోము వీర్రాజు.. రాష్ట్ర రాజకీయాలపై తనదైన మార్క్ లెక్కలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా ఇటు వైసీపీని కాదని, అటు టీడీపీని కూడా కాదని.. గంపగుత్తగా బీజేపీ-జనసేన పార్టీలకు ఓట్లు వేస్తారట. దీనికి ఆయన చెబుతున్న లాజిక్, వినిపిస్తున్న లెక్కలు కూడా భలే గమ్మత్తుగా ఉన్నాయి.  

“మొన్న ఎన్నికల్లో జనసేన పార్టీకి 7శాతం ఓట్లు వచ్చాయి. ఎలాగైనా చంద్రబాబును దింపేయాలని ప్రజలు అనుకున్నారు కాబట్టి, జనసేనకు 7శాతమే వచ్చాయి. ఏపీ రాజకీయాల్లో గ్యాప్ లేదంటున్నారు. అది అబద్ధం.. ఏపీ పాలిటిక్స్ లో 20శాతం వాక్యూమ్ ఉంది. బీజేపీ-జనసేన కలిసి 25శాతంతో ఆల్రెడీ ఉన్నాం. నేను చెప్పేదాంట్లో చాలా అర్థం ఉంది. అందరూ గమనిస్తున్నారు.”

తాము ఆల్రెడీ 25శాతంతో ఉన్నామని, 59శాతం ఓట్ల స్థాయికి చేరడం పెద్ద కష్టం కాదనే అర్థం వచ్చేలా మాట్లాడారు వీర్రాజు. అంతేకాకుండా.. వాజ్ పేయి హయంలో అవిభక్త ఏపీలో బీజేపీకి ఓట్లు పెరిగాయని, మోడీ తొలి హయాంలో, మలి హయాంలో కూడా ఏపీలో బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందని.. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి తమదే రాజ్యం అంటూ కొత్త లాజిక్ బయటకు తీశారు ఈ బీజేపీ కొత్త అధ్యక్షుడు. వచ్చే ఎన్నికల నాటికి మరోసారి టీడీపీతో కలుస్తామనే ప్రచారాన్ని ఈ సందర్భంగా ఆయన తిప్పికొట్టారు.

“చంద్రబాబు ఫోన్ తీసుకొని లోపలకు వెళ్తూ అమిత్ భాయ్ నుంచి ఫోన్ వచ్చింది అంటున్నారట. అంటే బీజేపీ నాన్-సీరియస్, మళ్లీ బీజేపీ తన దగ్గరకే వస్తుందనే ఫీలర్స్ వదలడం కోసం బాబు ప్రయత్నం. ఇటు వైసీపీ కూడా బీజేపీతో సత్సంబంధాలు కలిగి ఉన్నాం అంటోంది. ఇది పాలిటిక్స్ లో వాళ్లు ఆడే ఆట. దీనికి పైఎత్తు వేస్తాం. టీడీపీ-వైసీపీ బాగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను చెబుతున్నాను. మేం ఈసారి చాలా సీరియస్ గా ఉన్నాం. బీజేపీ-జనసేన కలిసి గట్టిపోటీ ఇవ్వబోతున్నాం.”

ఇక రాజధాని అంశం గురించి మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించుకున్నారని.. జపాన్, సింగపూర్, చైనా అంటూ దేశాల పేర్లు చెప్పారని.. అప్పుడు కేంద్రం కలుగజేసుకోలేదని అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కూడా 3 రాజధానులంటున్నారని, ఇప్పుడు కూడా కేంద్రం కలుగజేసుకోదని క్లారిటీ ఇచ్చారు. 

ఇంట‌ర్ లో ఉన్న‌ప్పుడే అర్జీవీతో నా ప్ర‌యాణం మొద‌లైంది