ఇటీవలి కాలంలో కాస్త వైవిధ్యమైన పాటలు చేస్తూ, తన మీద వున్న కాపీముద్ర చెరిపేసుకోవడంలో వీలయినంత వరకు సక్సెస్ అవుతున్నాడు మ్యూజిక్ డైరక్టర్ థమన్. తొలిప్రేమ, అరవింద సమేత లాంటి మంచి అల్బమ్ లు ఇచ్చి, చేతినిండా సినిమాలతో బిజీగా వున్న థమన్ నుంచి రాబోతున్న మరో మంచి ఆల్బమ్ అల వైకుంఠపురములో. మ్యూజిక్ డైరక్టర్ ఎవరైనా మంచి పాటలు చేయించుకునే దర్శకుడు తివిక్రమ్ సినిమా ఇది. అంతేకాదు టాలీవుడ్ టాప్ స్టార్ ల్లో ఒకరైన బన్నీ చేస్తున్న సినిమా.
ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ బయటకు వదిలారు. సాంప్రదాయ స్వరఝరికి, వెస్ట్రన్ టచ్ ఇస్తూ, ప్యూజన్ స్టయిల్ లో ఈ పాటను చేసినట్లు వినిపిస్తోంది. అయితే ఈ మిక్సింగ్ లో కూడా దేశీయ వాయిద్యాలకే పెద్దపీట వేసారు. తన స్వరంతోనే పాటను సగం సక్సెస్ చేసే గాయకుడు సిద్దూ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. మంచి సాహిత్యానికి కేరాఫ్ అడ్రస్ అయిన సిరివెన్నెల పాట రాసారు.
కళ్లకు కాటుక కలలు కావలి కాయడం, చూపులు కాళ్లను పట్టుకుని వదలనని అనడం, వంటి మంచి భావుకత నిండిన వాక్యాలతో పాట ప్రారంభమైంది. సామజవరగమన..నిను చూసి ఆగగలనా? అనడం చూస్తుంటే అమ్మాయిని సామజవరగమన అని అభివర్ణించినట్లో లేదా అమ్మాయి పేరు సామజవరగమన అని పెట్టారనో అనుకోవాల్సి వస్తోంది.
మనసు మీద వయసుకు వున్న అదుపు చెప్పగలనా..? మల్లెల మాసమా..మంజుల హాసమా? విరిసిన పింఛమా? విరుల ప్రపంచమా? ఎంతో బతిమాలినా? ఇంతేనా అంగనా? ఇలాంటి లైన్ లు అన్నీ భావకవిత్వంతో పరిచయం వున్న జనరేషన్ కు కొత్తగా అనిపించకపోయినా, ఈ తరానికి ఆ సాహిత్యాన్ని పరిచయం చేసే ప్రయత్నంగా అనిపిస్తుంది. నీడ కరిగిపోయినా? అనే ప్రయోగం బాగుంది.
మొత్తంమీద వున్న కొద్దిపాటి కమర్షియల్ స్పేస్ లోనే త్రివిక్రమ్-సిరివెన్నెల-థమన్ ముగ్గురు కలిసి ఓ క్లాసిక్ సాంగ్ ను అందించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.