చంద్రబాబు దోపిడీకి ఇదే ఉదాహరణ!

జగన్మోహన రెడ్డి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ పద్ధతి సత్ఫలితాలు ఏమిటో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంచుమించుగా 300 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండరు వ్యవహారంలో 58 కోట్ల రూపాయల లాభం కనిపించింది. దీనిని…

జగన్మోహన రెడ్డి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ పద్ధతి సత్ఫలితాలు ఏమిటో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంచుమించుగా 300 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండరు వ్యవహారంలో 58 కోట్ల రూపాయల లాభం కనిపించింది. దీనిని లాభం అనకూడదు… జరగబోయిన వృథాను అరికట్టడంగా పేర్కొనాలి. మరోరకమైన మాటల్లో చెప్పాలంటే.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం పాల్పడదలచుకున్న దోపిడీని, అవినీతిని అరికట్టడం అని అనుకోవాల్సి వస్తుంది.

పోలవరం ప్రధానడ్యామ్ ను ఎడమ కాలువతో అనుసంధానించే పనులకు జగన్మోహన రెడ్డి ప్రభుత్వం కొత్తగా టెండర్లు పిలిచింది. 274కోట్ల రూపాయల అంచనాలతో టెండర్లు పిలిచారు. 260 కోట్లకే పనులు చేస్తామంటూ ఒక సంస్థ ఎల్1గా ముందుకు వచ్చింది. అప్పుడు రివర్స్ టెండరింగ్ ప్రారంభించారు. రివర్స్ టెండరింగ్ లో 231 కోట్లకే తాము చేయగలం అంటూ మాక్స్ ఇన్ ఫ్రా సంస్థ ముందుకొచ్చింది. టెండరు విలువతో పోల్చినప్పుడు ఇది సుమారు 42 కోట్లకు తక్కువ అవుతుంది.

గత ప్రభుత్వ హయాంలో ఆమోదం పొందిన టెండరు ధరతో పోల్చినప్పుడు 58 కోట్ల తక్కువకే ఇప్పుడు పనులు చేస్తున్నట్లు అవుతుంది. తమాషా ఏంటంటే… అప్పట్లో చంద్రబాబు హయాంలో టెండరు విలువకంటె ఎక్కువకు కోట్ చేసి కాంట్రాక్టు పొందిన సంస్థే… ఇప్పుడు 15శాతం తక్కువకు కోట్ చేసి.. కాంట్రాక్టు చేజిక్కించుకుంది. అదే సంస్థ 58 కోట్ల తక్కువకు మళ్లీ పనులు దక్కించుకోవడంతో.. గతంలో ఆ 58 కోట్ల అదనపు భారం ఎందుకు కోట్ చేయవలసి వచ్చిందో ప్రజలు తమ సొంత వివేచనతో ఆలోచించి నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

2005లో ఒక సంస్థకు ఈ పనులు అప్పగించి, వాటిని 2018లో రద్దుచేశారు. 2019 మార్చిలో ఎన్నికలకు నెలముందు చంద్రబాబు సర్కారు మళ్లీ టెండర్లు పిలిచింది. టెండరు విలువకన్నా 4.66 శాతం అదనంగా కోట్ చేసిన మాక్స్ ఇన్‌ఫ్రా సంస్థే అప్పుడు టెండరు దక్కించుకుంది. 290 కోట్లతో అగ్రిమెంటు చేసుకుని ఒక్కశాతం పనులు కూడా పూర్తి చేయకముందే.. చంద్రబాబు ఓడిపోవడం జరిగింది. జగన్ రాగానే 25 శాతం పనులు జరగని టెండర్లను రద్దు చేసేశారు.

మిగిలి ఉన్న పనులకు 274 కోట్ల విలువ నిర్ణయించి రీటెండరింగ్ పిలిచారు. రివర్స్ టెండరింగ్ పద్ధతి అనుసరించారు. అదే సంస్థ.. మాక్స్ ఇన్‌ఫ్రా ఈసారి 15 శాతం తక్కువకు అంటే 231 కోట్లకే పనులు చేస్తామంటూ కోట్ చేసి.. పనులు దక్కించుకుంది. దాంతో 58 కోట్ల రూపాయల మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేకూరినట్లు అయింది. మరి చంద్రబాబు దీనిని ఎలా బుకాయిస్తారో చూడాలి.

సినిమా రివ్యూ: బందోబస్త్‌        సినిమా రివ్యూ: వాల్మీకి