వికాస్ దుబే తెలివిగా దొరికాడా..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో పోలీసుల‌పైనే కాల్పులు జ‌రిపి, అక్క‌డ నుంచి ప‌రార్ అయిన గ్యాంగ్ స్ట‌ర్ వికాస్ దుబేను మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో పోలీసులు అరెస్టు చేశారు. అత‌డి కోసం యూపీ పోలీసులు గాలిస్తూ ఉన్నారు. అత‌డిని…

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో పోలీసుల‌పైనే కాల్పులు జ‌రిపి, అక్క‌డ నుంచి ప‌రార్ అయిన గ్యాంగ్ స్ట‌ర్ వికాస్ దుబేను మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో పోలీసులు అరెస్టు చేశారు. అత‌డి కోసం యూపీ పోలీసులు గాలిస్తూ ఉన్నారు. అత‌డిని ప‌ట్టించిన వారికి రివార్డును కూడా ప్ర‌క‌టించారు. మొద‌ట ప్ర‌క‌టించిన రివార్డును రెట్టింపు చేశారు.  మ‌రోవైపు వికాస్ అనుచ‌రుల‌ను యూపీ పోలీసులు కాల్చి చంపుతూ ఉన్నారు. ఇప్ప‌టికే అలాంటి ఎన్ కౌంట‌ర్లు న‌మోదు అయ్యాయి. పేరుకి అవి ఎన్ కౌంట‌ర్లే అయినా.. పోలీసులు ఉన్న ఫ్ర‌స్ట్రేష‌న్, ప్ర‌భుత్వంపై ఉన్న ఒత్తిడి నేప‌థ్యంలో దొరికిన వారిని దొరికిన‌ట్టుగా కాల్చేస్తున్నారేమో అనే అభిప్రాయాలు క‌లుగుతున్నాయి.

ఈ క్ర‌మంలో వికాస్ దుబే గ‌నుక పోలీసుల‌కు దొరికితే.. అత‌డెంత సేపు ఎన్ కౌంట‌ర్ కాకుండా ఉండ‌గ‌ల‌డు? అనేది ప్ర‌శ్నే. అందుకే అత‌డు కూడా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టుగా ఉన్నాడు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో అత‌డు మ‌రి కొన్నాళ్లు త‌ల‌దాచుకోగ‌ల‌డేమో! అల్రెడీ రాష్ట్రం దాటేశాడు. పోలీసులు ఎంత ఇన్ ఫార్మ‌ర్ల‌ను ప్ర‌యోగించినా, పోలీసుల్లోనే అత‌డికీ నెట్ వ‌ర్క్ ఉంద‌ని తెలుస్తోంది. అలాంటి నెట్ వ‌ర్క్ ద్వారానే అత‌డు పోలీసుల‌పై కాల్పులు చేయించ‌గ‌లిగాడ‌ని తెలుస్తోంది.

ఇలాంటి క్ర‌మంలో మ‌రి కొన్నాళ్ల పాటు పోలీసులకు దొర‌క‌కుండా త‌ప్పించుకునే మార్గాలున్నా వికాస్ దుబే లొంగిపోయాడు. అది కూడా ఉజ్జయిని ఆల‌యం వ‌ద్ద త‌నే వికాస్ దుబేనంటూ సెక్యూరిటీ సిబ్బందికి స‌మాచారం ఇచ్చి మ‌రీ పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌మ‌ని చెప్పాడ‌ట ఈ  గ్యాంగ్ స్ట‌ర్. ఉజ్జ‌యిని ఆల‌యానికి ఏదో డొనేష‌న్ రాయిస్తూ.. త‌న పేరు చెప్పాడ‌ట‌. యూపీ పోలీసులు గాలిస్తున్న వికాస్ దుబే త‌నేనంటూ.. స్థానిక పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని ఆ రౌడీషీట‌రే ఆల‌య సెక్యూరిటీ సిబ్బందికి చెప్పాడ‌ట‌. వాళ్లు స‌మాచారం ఇవ్వ‌డం, స్థానిక పోలీసులు దిగి అత‌డిని తీసుకెళ్ల‌డం జ‌రిగింది. 

అంతా మీడియా కంట‌, అక్క‌డ ఫోన్లు ప‌ట్టుకున్న వారి కంట ప‌డింది. ఎక్క‌డో దాక్కొని అక్క‌డి వ‌ర‌కూ పోలీసులు వ‌చ్చి త‌న‌ను ప‌ట్టుకెళ్లి ఎన్ కౌంట‌ర్ చేసేయ‌క‌ముందే వికాస్ దుబే తెలివిగా దొరికిన‌ట్టుగా ఉన్నాడు. అయితే.. పోలీసులు అనుకుంటే ఎన్ కౌంట‌ర్ల‌ను క్రియేట్ చేయ‌డం పెద్ద క‌ష్టం కాద‌ని ఇది వ‌ర‌క‌టి ప‌లు ఉదంతాలు తేట‌తెల్లం చెబుతున్నాయి. క్రైమ్ సీన్ రీ క్రియేష‌న్ అనే అస్త్రం పోలీసుల చేతుల్లో ఉండ‌నే ఉంటుంది. అంత వ‌ర‌కూ అయినా ఆగుతారో లేక మార్గ‌మ‌ధ్యంలో త‌ప్పించుకో ప్ర‌య‌త్నించి, త‌మ మీద కాల్పులు జ‌రిపే ప్ర‌య‌త్నం చేసే వికాస్ దుబే ఎన్ కౌంట‌ర్లో మ‌ర‌ణించిన‌ట్టుగా ప్ర‌క‌ట‌న వ‌స్తుందో!

మోహన్ బాబు కూడా ఫోన్ చేశారు, కానీ నా దేవుడు చెయ్యలేదు