నిమ్మ‌గ‌డ్డ‌ను మ‌రిచిపోలేని ఏపీ స‌ర్కార్‌

కొన్ని వ్య‌వ‌స్థ‌ల‌పై కొంత మంది బ‌ల‌మైన ముద్ర వేస్తారు. కొంద‌రు ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా కొన్ని ప‌నులు చేసి పోతారు. ఆ ప‌నులు కొంద‌రికి బాధ లేదా సంతోషం క‌లిగించేవిగా వుంటాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మాత్రం…

కొన్ని వ్య‌వ‌స్థ‌ల‌పై కొంత మంది బ‌ల‌మైన ముద్ర వేస్తారు. కొంద‌రు ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా కొన్ని ప‌నులు చేసి పోతారు. ఆ ప‌నులు కొంద‌రికి బాధ లేదా సంతోషం క‌లిగించేవిగా వుంటాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మాత్రం నిమ్మ‌గ‌డ్డ రూపంలో ఓ చేదు జ్ఞాప‌కం మిగిలిపోయింది. ప‌రిష‌త్ ఎన్నిక‌ల కౌంటింగ్‌పై హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన నేప‌థ్యంలో… నిమ్మ‌గ‌డ్డ‌ను ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు గుర్తు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఇన్ని రోజులు ప‌రిష‌త్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు ప‌ట్టిన గ్ర‌హ‌ణం వీడింద‌ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల కౌంటింగ్‌కు హైకోర్టు డివిజ‌న్ బెంచ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన నేప‌థ్యంలో ఆయ‌న మీడియా ముందు కొచ్చారు. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌  ఇచ్చిన తీర్పును  స్వాగతిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ప్రజస్వామ్య ప్రక్రియను అడ్డుకునే కుట్రలు చేశారని ఆయ‌న మండిపడ్డారు.

చంద్రబాబు హయాంలోనే స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉందని ఆయ‌న గుర్తు చేశారు. ఎన్నికలు జరపకుండా బాబు వాయిదా వేసుకుంటూ వచ్చారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ తర్వాత రిజర్వేషన్ల అంశంతో మరికొంత సమయం వాయిదా పడిందన్నారు. గత ఏడాది మార్చిలో ఎన్నికల ప్రక్రియ జరగాల్సి ఉండింద‌న్నారు.

అయితే నాటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కరోనా పేరుతో, క‌నీసం ప్రభుత్వంతో చర్చించకుండానే  ఎన్నికలను వాయిదా వేశారని విమర్శించారు. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలనే నిమ్మగడ్డ అమలు చేశారని స‌జ్జ‌ల అన్నారు. ఏకగ్రీవాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని నిమ్మ‌గ‌డ్డ‌పై నిప్పులు చెరిగారు. 

నిమ్మ‌గ‌డ్డ ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి ఎక్క‌డున్నారో కూడా తెలియ‌దు. కానీ ఆయ‌న మిగిల్చిన చేదు జ్ఞాప‌కాలు ప్ర‌భుత్వాన్ని వెంటాడుతూనే వున్నాయ‌నేందుకు స‌జ్జ‌ల విమ‌ర్శ‌లే నిద‌ర్శ‌నం. మొత్తానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి నిమ్మ‌గ‌డ్డ మ‌రుపురాని వ్య‌క్తిగా నిలిచిపోతాడంటే ఆశ్చ‌ర్యం లేదని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయప‌డుతున్నారు.