ఓవైపు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా జెమినీ టీవీలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమం మొదలైంది. ఆ వెంటనే మినిమం గ్యాప్ లో నాగార్జున హోస్ట్ గా స్టార్ మా ఛానెల్ లో బిగ్ బాస్ సీజన్-5 మొదలైంది. దీంతో సహజంగానే ఈ రెండు కార్యక్రమాల మధ్య పోటీ ఏర్పడింది.
ముందుగా ఎన్టీఆర్ షో రేటింగ్ వచ్చింది. ప్రారంభ ఎపిసోడ్ లో దీనికి గరిష్టంగా 11.37 టీఆర్పీ వచ్చింది. మొదటి వారం సగటు టీఆర్పీ 6.76 కాగా.. తాజాగా మూడోవారం యావరేజ్ టీఆర్పీ 7.30గా వచ్చింది. ఈ వారం ఎన్టీఆర్ షో కు వచ్చిన హయ్యస్ట్ రేటింగ్ 7.99.
ఇక నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్-5 విషయానికొద్దాం. దీనికి వచ్చిన హయ్యస్ట్ రేటింగ్ (ప్రారంభ ఎపిసోడ్ కు) 15.66. ఎస్ డీ, హెచ్ డీ బాక్సుల్లో కలిపి చూసుకుంటే రేటింగ్ 18. ప్రారంభ ఎపిసోడ్ ను మినహాయిస్తే, మిగతా అన్ని ఎపిసోడ్స్ కు టైమింగ్ మార్చారు. ప్రైమ్ టైమ్ దాటి కాస్త లేట్ గా రాత్రి 10 గంటల నుంచి బిగ్ బాస్ మొదలౌతోంది. దీంతో టీఆర్పీ తగ్గుతుందని చాలామంది భావించారు.
కానీ బిగ్ బాస్ కంటూ ప్రత్యేకంగా ఆడియన్స్ ఫిక్స్ అయి ఉన్నారు. కంటెస్టెంట్లు ఎవరైనా, ఈ రియాలిటీ షోకు వీక్షకులు ఫిక్స్. అందుకే టైమ్ మారినా బిగ్ బాస్ సీజన్-5 మంచి టీఆర్పీ సాధించింది. సాధారణ రోజుల్లో 6కి పైగా రేటింగ్ సాధిస్తూ కొనసాగుతోంది.
ఎన్టీఆర్ Vs నాగార్జున
తాజా రేటింగ్స్ తో జెమినీ టీవీ, స్టార్ మా ఛానెల్ మధ్య పోటీ సంగతి పక్కనపెడితే.. ఎన్టీఆర్, నాగార్జునలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలనే ఆసక్తి అందర్లో నెలకొని ఉంది. ప్రారంభ ఎపిసోడ్స్ కైతే నాగార్జున బిగ్ బాస్ గా మంచి టీఆర్పీలే సాధించాడు. అయితే అదే సమయంలో ఎన్టీఆర్ ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
ఎందుకంటే.. ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం రోజులు గడిచేకొద్దీ ఊపందుకుంటోంది. వారం వారం వస్తున్న టీఆర్పీలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. ప్రారంభ వారం సగటు టీఆర్పీతో పోలిస్తే.. తాజాగా వచ్చిన మూడో వారం యావరేజ్ టీఆర్పీ చాలా ఎక్కువ. ఈ లెక్కన తారక్ ప్రతి వారం తన కౌంట్ పెంచుకుంటూ పోతున్నాడని అర్థం.
సో.. రాబోయే రోజుల్లో బిగ్ బాస్ సీజన్-5 అత్యథిక రేటింగ్స్ సాధిస్తుందా లేక ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం పైచేయి సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రెండు కార్యక్రమాలు ఎంత పోటీపడినా కార్తీకదీపం సీరియల్ ను కొట్టలేవనే విషయం తాజాగా మరోసారి రుజువైంది. ఎన్టీఆర్, నాగ్ కార్యక్రమాల కంటే కార్తీకదీపం సీరియల్ చూస్తున్న జనాలే ఎక్కువమంది.