కరోనా కట్టడి గురించి ఇండియా ఇప్పటికే పలు ప్రయత్నాలను చేసింది. ఎవ్వరూ ఊహించని రీతిలో మానవాళి జోలికి వచ్చిన ఈ వైరస్ ను ఎదుర్కొనడానికి, అత్యంత కఠినమైన నిర్ణయాలనే అమలు చేశారు ఇప్పటి వరకూ. లాక్ డౌన్ విధించడం అంటే మాటలేమీ కాదు. అది కూడా రెండు నెలలకు పైగా సమయం లాక్ డౌన్ లో గడిచిపోయింది. అయితే ఇప్పుడిప్పుడు దేశంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇదే సమయంలో లాక్ డౌన్ నుంచి మినహాయింపులు మొదలయ్యాయి.
కేసులు పెరుగుతున్న సమయంలో లాక్ డౌన్ నుంచి మినహాయింపులా? అనేది ఒక ప్రశ్న. ఇప్పటికే మొదలైన లాక్ డౌన్ మినహాయింపుల వల్లనే కేసుల సంఖ్య పెరుగుతోంది అనేది మరో వాదన! ఈ రెండూ పరస్పరం ఆధారపడిన అంశాలని మాత్రం సుస్పష్టం. అయితే కేసుల సంఖ్య పెరుగుతుందేమో అనే భయంలో లాక్ డౌన్ లను పొడిగించుకుంటూ పోవడం కూడా అంత గొప్ప నిర్ణయం ఏమీ కాదు. లాక్ డౌన్ అంటూ పోతే కరోనా కన్నా లాక్ డౌన్ వల్ల ఎక్కువ సమస్యలు తలెత్తి ప్రజలు ఇక్కట్ల పాలయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే పక్షం రోజుల నుంచి చాలా రకాలుగా లాక్ డౌన్ నుంచి మినహాయింపులు లభించాయి. ప్రజలు స్వేచ్ఛగానే తిరుగుతున్నారు. వారు తమ వంతు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. పెళ్లిళ్లు కూడా సింపుల్ గా జరిగిపోయే పరిస్థితి వచ్చింది. తక్కువమందితోనే వివాహాలు జరుగుతున్నాయి. గుంపులుగా గుమికూడాలంటే ప్రజలే భయపడుతూ ఉన్నారు. ఎవరి జాగ్రత్తలు వారే తీసుకునే పరిస్థితి వచ్చింది. ఈ మార్పే అవసరం.
ఇక ఇప్పటికే ప్రజలు రాష్ట్రాలు దాటే ప్రయాణాలు చేస్తున్నారు. అలా ప్రయాణించిన వారికి వైద్య పరీక్షలను తప్పనిసరి చేశాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే లాక్ డౌన్ సమయంతో పోలిస్తే ఇప్పుడు రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. రోజుకు ఆరేడు వేల స్థాయిలో కేసులు రికార్డు అవుతున్నాయి.
ఈ పరిస్థితిని గమనిస్తే.. ఒక విషయం మాత్రం స్పష్టం అవుతోంది. జూన్ నెల అతి కీలకం కాబోతోందనే విషయం స్పష్టత వస్తోంది. ఇప్పటికే లభించిన మినహాయింపులతో ప్రజలు బయట తిరుగుతున్నారు, మార్కెట్ చాలా వరకూ ఓపెన్ అయ్యింది. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తి కూడా ఎంతో కొంత పెరిగే అవకాశం ఉంది. కేసులు బయట పడడానికి వారమో, పది రోజులో సమయం పడుతుందని అంటున్నారు కాబట్టి.. మే రెండో వారం నుంచి లభించిన లాక్ డౌన్ మినహాయింపుల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి ఏమైనా జరిగి ఉంటే జూన్ మొదటి వారంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఏ హెర్డ్ ఇమ్యూనిటీ వల్లనో, ఇండియాపై కరోనా వైరస్ ప్రభావం అంతగా లేకపోవడం.. అనే అంశాలు ప్రభావితం చేస్తే కేసుల సంఖ్య మరీ భారీగా పెరిగే అవకాశాలు ఉండకపోవచ్చు. ఏదేమైనా జూన్ నెలలో రికార్డయ్యే కరోనా కేసుల సంఖ్య ఇండియాపై ఆ వైరస్ ప్రభావం ఎలాంటిదో స్పష్టం చేయనుంది.