వందకోట్ల రూపాయలకు మించిన కాంట్రాక్టు పనులకు న్యాయసమీక్ష తర్వాతే టెండర్లు పిలవాలనే జగన్ ప్రభుత్వ నిర్ణయం మన దేశరాజకీయాల్లో, పరిపాలనలో ఒక మైలురాయి కాబోతోంది. పెద్దపెద్ద టెండరు పనులకు సంబంధించి.. పనుల కేటాయింపు అమలు అన్నీ పారదర్శకంగా జరిగే, అవినీతిని గరిష్టంగా కట్టడి చేసే దిశగా ఇది చాలా పెద్ద ముందడుగు. ప్రతిపక్షాలు ఈ విషయంలో ఎలాంటి రంధ్రాన్వేషణ చేస్తున్నాయనేది ఇప్పుడే తెలియదుగానీ.. నిజం చెప్పాలంటే.. ముందు ముందు.. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా… నిజాయితీగల పరిపాలన అందించే ఉద్దేశం ఉంటే జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చిన్న చిన్న మార్పు చేర్పులతో అనుసరించాల్సి వస్తుంది.
పాలనలో సంక్షేమం నిజాయితీ అనేవి కీలక అంశాలుగా ఉంటాయి. సాధారణంగా ప్రతి ప్రభుత్వమూ సంక్షేమ పథకాలమీద తమకు తోచిన రీతిలో దృష్టి పెడుతుంది. ఆ సంక్షేమ పథకాల ముసుగులో… తమ ప్రభుత్వం అవినీతి రహితంగా ఉన్నదా? లేదా? అనే విషయంపై ప్రజలు గమనించకుండా.. పొరలు కప్పేస్తుంటుంది. కానీ… జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రిగా తనదైన ముద్రచూపిస్తూ.. రెండు కీలకాంశాల్లోనూ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమ్మ ఒడి పథకానికి ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు చెందిన వారినుంచి కూడా ప్రశంసలు దక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వందకోట్ల రూపాయల విలువ దాటిన కాంట్రాక్టు పనులకు న్యాయసమీక్ష తర్వాతే టెండర్లు పిలవాలని నిర్ణయించడం అనేది అవినీతి రహిత పాలన దిశగా గొప్ప ముందడుగుగా కనిపిస్తోంది.
టెండర్లు పిలిచే సమయంలోనే గత ప్రభుత్వాలు సకల అరాచకాలకు తెరతీస్తూ వచ్చాయి. టెండరుదార్లకు అర్హతలను నిర్ణయించడంలోనే… అయినవారికి మాత్రమే అనుకూలించే నిబంధనలను విధించడం అనేది ఒక పెద్దకుట్ర. ఇలాంటి కుట్రలకు న్యాయసమీక్ష ద్వారా తెరపడుతుంది. ముందుముందు జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్రం కూడా అనుసరించే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యంలేదు.
నాలుగైదు భాగాలుగా విడగొట్టినా సరే అన్నీకలిపి వందకోట్ల రూపాయల విలువ చేసే పనులను చేపట్టేప్పుడు అవికూడా న్యాయసమీక్షకు లోబడి ఉండాల్సిందేనన్న విషయం.. వక్రమార్గాల్లో సమీక్షను తప్పించుకునే ప్రయత్నాలకు చెక్ పెడుతుంది. మొత్తానికి భారీ కుంభకోణాలు చోటు చేసుకుంటూ ఉండే.. కాంట్రాక్టుల వ్యవహారాల్లో అవినీతిని రూపుమాపడానికి జగన్ కృతనిశ్చయంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆచరణలో ఎలా ఉంటుందో చూడాలి.