లబ్ధి ఉంటే తప్ప భాజపా ఆ పనిచేయదా?

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారం అనేది సుదీర్ఘకాలంగా పెండింగ్ లో పడి ఉంది. నిజానికి ఇది కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు దయాభిక్షగా ఇచ్చేది ఎంతమాత్రమూ కాదు. విశాలమైన ఆంధ్రప్రదేశ్ ను…

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారం అనేది సుదీర్ఘకాలంగా పెండింగ్ లో పడి ఉంది. నిజానికి ఇది కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు దయాభిక్షగా ఇచ్చేది ఎంతమాత్రమూ కాదు. విశాలమైన ఆంధ్రప్రదేశ్ ను రెండు ముక్కలుగా విభజించినప్పుడు చేసిన చట్టం ద్వారా ఇది ఆయా రాష్ట్రాలకు సంక్రమించిన హక్కు. అయితే తాజా పరిణామాలను గమనిస్తోంటే.. విభజన చట్టంలోని అనేక హామీలను అమలు చేసే విషయంలో – ఆ తర్వాత ఏలుబడిలోకి వచ్చిన మోడీ సర్కారు టోకరా ఇచ్చినట్లే… నియోజకవర్గాల పెంపును కూడా పక్కన పెడతారా? అనే అభిప్రాయం కలుగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అనే వ్యవహారం ఏ దశలో ఉన్నదో తెలుసుకునేందుకు, ఇనగంటి రవికుమార్ అనే సెఫాలజిస్టు సమాచారహక్కు చట్టం ద్వారా ఈసీని సంప్రదించారు. వారిచ్చిన వివరాల్ని బట్టి కొత్త సంగతులు తెలుస్తున్నాయి. ఈ విషయంపై కేంద్ర హోంశాఖ ఈ ఏడాది ఏప్రిల్ లో (సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చిన తర్వాత) ఈసీకి ఒక నోట్ పంపింది. అభిప్రాయం అడిగింది. ఏ అభిప్రాయం కావాలో క్లారిటీ లేనందున ఈసీ దాన్ని హోంశాఖకు తిప్పిపంపింది. తర్వాత ఇప్పటిదాకా ముందడుగు పడలేదు.

జమ్మూకశ్మీర్, సిక్కింలలో సీట్లు పెంచే ప్రక్రియ ప్రస్తుతం నడుస్తోంది. అయితే హోంశాఖ ఇప్పటికి తెలుగురాష్ట్రాల సంగతి పక్కన పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. చూడబోతే.. రాజకీయం తమ పార్టీకి గరిష్టమైన లబ్ధిచేకూరే అవకాశం ఉంటే తప్ప భారతీయ జనతా పార్టీ సీట్లపెంపునకు అనుకూల నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో తెలుగురాష్ట్రాల సీఎంలు తమ తమ సొంత రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా 2019కి ముందే సీట్ల పెంపు జరగాలంటూ పలుమార్లు కేంద్రాన్ని అభ్యర్థించినా.. సాంకేతిక కారణాలు చూపించి 2024 వరకు సాధ్యం కాదని తిప్పికొట్టారు.

తీరా ఇప్పుడు… ఆ గడువులోగానైనా చేస్తారా లేదా అనేది సందేహంగా ఉంది. ఎందుకంటే ఈ దిశగా అడుగులు సక్రమంగా పడడంలేదు. పార్లమెంటు ఎన్నికల్లో పరిస్థితి ఆశాజనకంగా కనిపించిన తెలంగాణలోను, తెదేపా నుంచి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోనూ బలపడాలని కలలుకంటున్న భాజపా.. సీట్ల పెంపువల్ల తమకు లబ్ధి ఉంటుందని భావిస్తే తప్ప.. ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లదేమో అనే అభిప్రాయం కలుగుతోంది.

ఫిల్మ్ నగర్ అయిపోయే.. ఇప్పుడు వయా ముంబై

ఎవరిది పిచ్చోడి చేతిలో రాయి పాలన అవుతుంది!