పొద్దున్న లేచిన వెంటనే గుడ్ న్యూస్ వినొచ్చని అంతా ఎదురుచూశారు. అంతరిక్షం రంగంలో భారత జెండా మరోసారి రెపరెపలాడుతుందని అంతా గర్వపడ్డారు. కానీ ఊహించని విధంగా చంద్రయాన్-2 ఆగిపోయింది. విజయవంతంగా సాగుతున్న కౌంట్ డౌన్ ను ఆఖరి నిమిషంలో ఆపేశారు. ప్రత్యక్ష ప్రసారం కూడా కట్ చేశారు.
అవును.. మరో 56 నిమిషాల 24 సెకెన్లలో రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుందని భావించగా.. క్రయోజనిక్ సిస్టమ్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. వాహకనౌక జీఎస్ఎల్వీ మార్క్-3లో సాంకేతిక లోపమే ప్రయోగం నిలిచిపోవడానికి కారణమని ఇస్రో ప్రకటించింది.
లెక్కప్రకారం, ఈరోజు తెల్లవారుజామున ఉదయం 2 గంటల 51 నిమిషాలకు చంద్రయాన్-2 ప్రారంభం అవ్వాలి. ఆ వెంటనే 16 నిమిషాల్లో చంద్రుని కక్ష్యలోకి వెళ్లిపోతుంది. ఈ క్షణం కోసం ఎదురుచూసిన భారతీయులకు నిరాశే ఎదురైంది. అయితే ఇది కేవలం చిన్న అంతరాయం మాత్రమే. వీలైనంత త్వరలోనే చంద్రయాన్-2 మొదలవుతుందని ఇస్రో ప్రకటించింది.
ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రునిపైకి రోవర్స్ పంపాయి. రోవర్ ను పంపించిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే దానికి ఇంకొన్ని రోజులు టైమ్ పడుతుంది. చంద్రయాన్-2 మళ్లీ ఎప్పుడు ప్రారంభమౌతుందనే విషయాన్ని ఇస్రో ఇంకా ప్రకటించలేదు.
ఈ ప్రయోగంతో మరో ఘనతను కూడా అందుకోబోతోంది భారత్. చంద్రుడి దక్షిణ ధృవంపైకి రోవర్ ను పంపించనున్న మొదటి దేశంగా రికార్డు సృష్టించబోతోంది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు చంద్రుని ఉత్తర భాగంవైపే ల్యాండ్ అయ్యాయి. అంతేకాదు.. అతి తక్కువ ఖర్చుతో చంద్రునిపైకి రోవర్ ను పంపిస్తున్న దేశంగా కూడా భారత్ చరిత్ర సృష్టించబోతోంది. ఈ రికార్డుల కోసం మరికొన్ని రోజులు ఆగాలంతే.