కంటైన్మెంట్ జోన్లు మినహా మొత్తం గ్రీన్ జోన్

ఊహించినట్టుగానే తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. తెలంగాణలో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో ఉన్న కంటైన్మెంట్ జోన్లను మినహాయించి మిగతా ప్రాంతం మొత్తాన్ని గ్రీన్ జోన్ గా ప్రకటించారు. అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు…

ఊహించినట్టుగానే తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. తెలంగాణలో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో ఉన్న కంటైన్మెంట్ జోన్లను మినహాయించి మిగతా ప్రాంతం మొత్తాన్ని గ్రీన్ జోన్ గా ప్రకటించారు. అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు అనుమతించడంతో పాటు బస్సులకు కూడా అనుమతినిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1452 కుటుంబాలు మాత్రమే కంటైన్మెంట్ జోన్ లో ఉన్నాయని, మిగతా ప్రజలంతా గ్రీన్ జోన్ లోనే ఉన్నారన్నారు కేసీఆర్.

తెలంగాణలో హైదరాబాద్ సిటీలో తప్ప శివారు ప్రాంతాల నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు బస్సులు తిరుగుతాయి. బయట జిల్లాల నుంచి వచ్చే బస్సులు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే ఆపేస్తారు. అయితే బస్సులన్నీ పూర్తిగా రాష్ట్రానికే పరిమితం. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు సర్వీసులు నడపమని, ఆ రాష్ట్రాల నుంచి వచ్చే బస్సుల్ని అనుమతించమని కేసీఆర్ విస్పష్టంగా ప్రకటించారు. నడిపే బస్సుల్ని కూడా నిబంధనలకు తగ్గట్టు, ముందు జాగ్రత్తలతో నడుపుతామన్నారు. బస్సులు రేపు ఉదయం నుంచే నడుస్తాయి.

హైదరాబాద్ నగరంలో మాత్రం సిటీ బస్సుల్ని అనుమతించలేదు ముఖ్యమంత్రి. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా వ్యక్తిగత వాహనాల్ని మాత్రం అనుమతించారు. ద్విచక్ర వాహనంపై ఒకరు, ఆటోలో డ్రైవర్ తో పాటు ఇద్దరు, క్యాబ్ లో డ్రైవర్ తో పాటు ముగ్గురు ప్రయాణం చేయొచ్చు. కర్ఫ్యూ మాత్రం ఎప్పట్లానే కొనసాగుతుందని స్పష్టంచేశారు.

లాక్ డౌన్ ను కూడా 29 వరకు కాకుండా, 31 వరకు కొనసాగిస్తామని ప్రకటించిన కేసీఆర్.. హైదరాబాద్ మినహా అన్ని ప్రాంతాల్లో షాపులు తెరుచుకోవచ్చని, గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో మాత్రం సరి-బేసి విధానంలో షాపులు తెరుస్తామన్నారు. కంటైన్మెంట్ ఏరియాల్లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో సెలూన్లకు అనుమతిచ్చారు. అటు రాష్ట్రం మొత్తం ఈ-కామర్స్ కు కూడా అనుమతిచ్చారు సీఎం. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు కూడా వంద శాతం మేన్ పవర్ తో పనిచేసుకోవచ్చన్నారు.

పార్కులు, షాపింగ్ మాల్స్, థియేటర్లు, వ్యాయామశాలలు, బార్లపై మాత్రం నిషేధాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. మెట్రో రైలు సర్వీసులపై కూడా నిషేధం విధించారు. ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తిచేశారు. మాస్క్ పెట్టుకోకపోతే వెయ్యి రూపాయల ఫైన్ వేస్తామని హెచ్చరించారు. అటు శానిటైజర్లు అందుబాటులో లేని షాపుల్ని కూడా మూసేస్తామని హెచ్చరించారు.

ఆంక్షల్లో భారీ సడలింపులు ఇచ్చినప్పటికీ ప్రజలు స్వీయ నియంత్రణతో ఉండాలని కోరారు కేసీఆర్. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, మరోసారి వైరస్ వ్యాప్తి చెందితే మాత్రం నిర్మోహమాటంగా లాక్ డౌన్ విధిస్తామని స్పష్టంచేశారు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో లాక్ డౌన్ -4 అనేది నామమాత్రమే.

కేసీఆర్ న్యూ రూల్స్