తెలుగు సినిమాల పరిస్థితి ఎలా తయారైందీ అంటే ఎక్కడ సోలో డేట్ దొరుకుందా? అని చూస్తూ, సినిమాలను మురగబెట్టుకునేలా. సినిమాలు రెడీ చేసుకుని, సోలో డేట్ కోసం చూస్తూ వెనక్కు, వెనక్కు నడస్తూ ఎక్కడికో చేరి, ఆఖరికి ఏదో డేట్ కు విడుదల చేసాం అనిపించుకుంటున్నారు.
లేటెస్ట్ గా రెండు సినిమాల పరిస్థితి అలాగే వుంది. శర్వానంద్ లాంటి హీరో కూడా సోలో డేట్ కోసం చూస్తున్నారు. సుధీర్ వర్మ డైరక్షన్ లో శర్వానంద్ చేసిన రణరంగం సినిమా ఇంకా విడుదల డేట్ విషయంలో ఊగిసలాడుతోంది. ఇప్పటికే రెండు మూడు డేట్ లు మారిన ఈ సినిమా ఆగస్టు 2న రావాలని ఫిక్స్ అయింది.
కానీ బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు సినిమా పరిస్థితి అంతకన్నా ఘోరంగా వుంది. ఎక్కడ సోలో డేట్ దొరుకుతుందా అని వెనక్కి వెనక్కి వెళ్తున్నారు. ఆఖరికి తమ డేట్ మీద పూరి-రామ్ సినిమా వస్తే వెనక్కు జరిగారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆగస్టు 2న ఫిక్స్ అయ్యారు. అయితే అక్కడ శర్వా సినిమా వుంది.
అందువల్ల ఈ మేరకు రెండింటి డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు దగ్గర పంచాయతీ నడుస్తోంది. ఈ రెండింటిలో ఏదో ఒక సినిమాను సెప్టెంబర్ 13కు జరపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ శర్వానంద్ సినిమా వెనక్కు వెళ్తే, బెల్లంకొండ సినిమాకు భయపడి వెనక్కు వెళ్లారు అంటారు. అందుకే శర్వా ఆగస్టు 2నే రావాలని అనుకుంటున్నట్లు బోగట్టా.
అయితే అలా అని ఆగస్టు 2 డేట్ అద్భుతమేమీ కాదు. వారం వెనుకగా మన్మధుడు 2, ఆ తరువాత వారం సాహో విడుదల వున్నాయి. 2న వచ్చే సినిమాలు అద్భుతం అంటే తప్ప మలివారానికి థియేటర్లలో మిగలవు. మరి ఇంతకీ సెప్టెంబర్ కు ఎవరు వెళ్తారో? ఆగస్టు 2కు ఎవరు వుంటారో తేలాల్సివుంది.