అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు జగన్ పై అసత్య ప్రచారాలు విపరీతంగా చేసేవారు. అనుకూల మీడియా సాయంతో రెచ్చిపోయేవారు. అయితే అప్పుడు జగన్ కి రక్షణ కవచంగా ఉండేవారు కొంతమంది నేతలు. రోజా, అంబటి, చెవిరెడ్డి.. అప్పుడప్పుడూ బొత్స.. ఇలా కొంతమంది టీడీపీపై ఎదురు దాడికి దిగేవారు. రోజా, అంబటి అయితే చెప్పాల్సిన పనేలేదు. జగన్ పై పల్లెత్తుమాట అన్నా టీడీపీ నేతలకు బ్యాండ్ బజాయించేవారు. అలాంటిది ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ బలమైన గొంతులన్నీ కాస్త విశ్రాంతి తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో బలంగా మాట్లాడిన నేతలు కూడా సమావేశాలు ముగిశాక చప్పబడ్డారు.
టీడీపీ నుంచి ఓవైపు దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, యనమల, సోమిరెడ్డి, ట్విట్టర్ లో లోకేష్.. ఇలా చాలామంది రెచ్చిపోతున్నారు. జగన్ పై ముప్పేటదాడి మొదలు పెట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజులకే జగన్ పై అభాండాలు వేస్తూ రెచ్చిపోతున్నారు. పెయిడ్ ఆర్టిస్ట్ లతో నాటకాలు ఆడిస్తూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. వైఎస్సార్ పేరుని కూడా బైటకులాగి మహానేతకు మకిలి అంటేలా పెట్రేగిపోతున్నారు. ఆఖరికి బాలకృష్ణ కూడా విత్తనాలు అందడం లేదని, కరెంటు కోతలున్నాయని ప్రజల్ని రెచ్చగొడుతున్నారు.
ఇంత జరుగుతున్నా జగన్ టీమ్ ఎందుకో కాస్త సైలెంట్ గా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎక్కడికక్కడ లోకల్ గా మంత్రులు స్పందిస్తున్నారే కానీ.. గతంలో లాగా రాష్ట్రనాయకత్వం ఎదురుదాడికి దిగడంలేదు. ఒక్క విజయ సాయిరెడ్డి మాత్రమే సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతల్ని చెడుగుడు ఆడుకుంటున్నారు. వ్యంగ్యాస్త్రాలతో పచ్చబ్యాచ్ పరువు తీస్తున్నారు. అయితే ఇదంతా సోషల్ మీడియాకే పరిమితం కావడం గమనించాల్సిన విషయం.
ముఖ్యమంత్రి జగన్ అధికారుల సమీక్షల, నవరత్నాల అమలుతో బిజీగా ఉండటంతో.. ప్రతిపక్షం అదే పనిగా ఆయన్ను కదిలించాలని చూస్తోంది. ఈ టైమ్ లో జగన్ టీమ్ హుషారుగా ఉండకపోతే కష్టం. వైసీపీ అధికారంలో లేనప్పుడు, మీడియా మొత్తం ఏకపక్షంగా తమను దూరం పెట్టినప్పుడు.. ఎలాంటి వ్యూహాలతో అధికారపక్షానికి వణుకు పుట్టించారో ఇప్పుడు కూడా అదే పోరాట స్ఫూర్తి కనబరచాల్సిన టైమ్ వచ్చింది.
టీడీపీ ఎత్తులను చిత్తు చేయాల్సిన బాధ్యత వైసీపీ కీలక నేతలందరిపై ఉంది. ఎందుకంటే, పరిపాలనలో మునిగిపోయి టీడీపీ విమర్శల్ని చూసీచూడనట్టు వదిలిస్తే, జనాల దృష్టిలో అవే నిజాలుగా మారిపోయే ప్రమాదం ఉంది. సో.. ఇకనైనా జగన్ టీం ఎలర్ట్ అవ్వాలి. ఎత్తుల్ని చిత్తుచేయాలి. ముఖ్యమంత్రిగా జగన్ బిజీ అయిన ఈ టైమ్ లో అది అవసరం కూడా.
సమ్మర్‌కి బంపర్ బిగినింగ్! హడలెత్తించిన మార్చి! ఆల్‌టైమ్ డిజాస్టర్!