హీరోయిన్లు అంటే గ్లామర్ షోకు మాత్రమే పరిమితం అనేది అన్ని భాషల ఇండస్ట్రీలకూ ఉన్న ట్యాగే. ఆరుపాటలు కంపల్సరీగా ఉంటాయి. వాటిల్లో ఐదు పాటల్లో హీరోయిన్ అందాలు ఒలకపోయడం, క్లైమాక్స్ ముందు ఐటమ్ సాంగ్‌కు డ్యాన్స్ వచ్చిన, కురచ దుస్తుల్లో నర్తించే ఐటమ్ బాంబ్ ఉండాలి… దశాబ్ధాలుగా ఇదే ఫార్ములా. ఈ ఫార్ములాలోనే కొట్టుమిట్టాడుతూ, అదే ఫార్ములాకు అనుగుణంగా నటించిన హీరోయిన్లే.. స్టార్లుగా వెలుగొందుతూ ఉంటారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా చిత్ర పరిశ్రమ ఏదైనా ఇదే ఫార్ములా. ఇలాంటి పరిశ్రమలో ఒక మహిళ రాణించడం అనేది అరుదైన విషయం. ఆమె భర్త సినీ హీరో కాబట్టి, స్టార్ కాబట్టి.. ఆమె రాణించగలిగారు అనేది సులభంగా అనేసేమాట. అయితే చాలామంది స్టార్ హీరోలకు భార్యలున్నారు. వాళ్లలో కొందరు హీరోయిన్లనే పెళ్లి చేసుకున్నారు. అలాంటి వారంతా ఏం చేశారు? అనే ప్రశ్న కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిందే.
చాలామంది హీరోల భార్యలు నిర్మాతలుగా వ్యవహరించారు. ఆ సినిమాల నిర్మాణంలో పూర్తి పాత్ర తమదే అయినా, లక్కీ చార్మ్‌గా తమ భార్యల పేర్లను వేసుకున్నారు సదరు హీరోలు. వివిధ చిత్ర పరిశ్రమల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో అనేకమంది హీరోలు తమ భార్యలను నిర్మాతలుగా పెట్టి తమే హీరోలుగా నటించడం, తమ వారసులను పరిచయం చేయడం చేశారు, చేస్తున్నారు. తమ భార్య పేరిట బ్యానర్లు నెలకొల్పి సినిమాలు నిర్మించిన వారూ ఉన్నారు. ఇక మరికొందరి హీరోల భార్యలు క్యాస్టూమ్ డిజైనర్స్‌గా మారారు! ఒకరుకాదు ఇద్దరు కాదు చాలామంది ఆ ఈజీ పనినే ఎంచుకున్నారు. తమ భర్త హీరోగా నటించే సినిమాలో ఆయన పాత్రకు వారు క్యాస్టూమ్స్‌ను డిజైన్ చేస్తారనమాట! టైటిల్ కార్డ్స్‌లో అలా తమ భార్యల పేర్లను వేయించుకోవడానికి హీరోలు ముచ్చటపడటమే అక్కడ ఉన్న అసలు కథ అనేది అర్థం చేసుకోదగిన అంశమే!
అలాంటి పైపై మెరుగల సంగతలా ఉంచితే.. విజయనిర్మల మాత్రం ఒక లేడీ లెజెండరీ ఆర్టిస్ట్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టడంతోనే ఆమె ప్రతిభ ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ చేతే 'కృష్ణా' అనిపించుకుంటూ విజయనిర్మల తన ప్రతిభను చాటుకున్నారు. ఆ తర్వాత నటిగా లెజెండరీ దర్శకుల వద్ద పని చేశారామె. మహామహా దర్శకుల సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. స్టార్ హీరోల సరసన నటించారు. అవన్నీ చాలామంది చేసినవే. కేవలం చైల్డ్ ఆర్టిస్టుగా, హీరోయిన్‌గా నటించి ఉంటే విజయనిర్మల చాలామంది హీరోయిన్లలో ఒకరిగా నిలిచిపోయేవారు. అయితే మెగాఫోన్ పట్టడమే ఆమెను ప్రత్యేకంగా నిలుపుతూ ఉంది! ఇండస్ట్రీలో భర్త స్టార్ హీరోగా ఉన్నాడు, ఆయన ప్రముఖ నిర్మాత కూడా.. అలాంటప్పుడు ఆమె దర్శకురాలిగా మారాలనే ఆసక్తితో ఆ పని మొదలుపెట్టడం కూడా పెద్దకష్టం ఏమీకాదు. అయితే దర్శకురాలిగా మారిన తర్వాత ఆమె ఎలాంటి సినిమాలు తీశారనే అంశాన్ని పరిశీలిస్తేనే.. విజయ నిర్మల ప్రత్యేకత అర్థం అవుతుంది!
తొలి చిత్రం 'మీనా'తోనే విజయ నిర్మల తన ఉనికిని చాటుకున్నారు. యద్ధనపూడి సులోచన రాణి రాసిన అద్భుతమైన నవల 'మీనా'. దశాబ్ధాల కిందట వచ్చిన ఆ నవల ఇప్పటికీ నవ్యనూతనంగా ఉంటుంది. హీరోయిన్ స్వగతంలా మొత్తం కథను చెప్పించే అద్భుతమైన రచనా ప్రక్రియ 'మీనా'. ఆ నవల ద్వారా తెలుగు నవలా రంగంలోనే ఒక ట్రెండ్ సెట్ చేశారు యద్ధనపూడి. నవలా రచయితల్లోనే యద్ధనపూడి ఒక ట్రెండ్ సెట్టర్. ఆమె కెరీర్‌లో 'మీనా' అమోఘమైన నవల. అలాంటి నవలను సినిమాగా మలచాలి అనే ఆలోచనే సాహసం! ఎందుకంటే నవల వేరు, సినిమా వేరు. అద్భుతమైన వర్ణనతో ఉండే నవలను సినిమాగా తీయాలంటే దర్శకుడిలో ఎంతో విషయం ఉండాలి. ఆ విషయంలో విజయవంతం అయ్యారు విజయ నిర్మల.
నవలతో యద్ధనపూడి పాఠకులను ఎంతగా ఆకట్టుకున్నారో, దర్శకురాలిగా విజయనిర్మల ప్రేక్షకులను అంతే స్థాయిలో ఆకట్టుకున్నారు. ఆ సినిమాకు తనే దర్శకత్వం వహించడంతో పాటు టైటిల్ రోల్‌లో కూడా తనే నటించి.. ఆకట్టుకున్నారు విజయనిర్మల. కృష్ణ వంటి హీరోని పెట్టి, లేడీ ఓరియెంటెడ్ కథతో, 'మీనా' అనే టైటిల్‌తో, ఆల్రెడీ పాఠకులకు తెలిసిపోయిన కథతో సినిమా తీసి.. సక్సెస్ సాధించడం అంటే.. ఒక దర్శకురాలిగా ఆమె సక్సెస్ ఏ స్థాయిదో అర్థం చేసుకోవడం కష్టం ఏమీకాదు.
విజయనిర్మల దర్శకత్వం కృష్ణను హీరోగా పెట్టి సినిమా తీయడంతో మొదలుపెట్టినా ఆ తర్వాత వేర్వేరు భాషల్లో వేర్వేరు హీరోలతో ఆమె సినిమాలు రూపొందించ సాగారు. అలా కృష్ణ అనే నీడ నుంచి ఆమె బయటకు వచ్చారు. ఏఎన్నార్ సరసన 'బుద్ధిమంతుడు' సినిమాలో నటించారామె. దానికన్నా ముందు ఒక సినిమాలో ఆమె ఆయనకు చెల్లెలుగా నటించారు. హీరోయిన్‌గా తదుపరి సినిమాలో అవకాశం అనే షరతుతోనే ఆ సినిమాలో తను చెల్లెలి పాత్రలో చేసినట్టుగా విజయనిర్మల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ షరతు మేరకు దక్కిన సినిమానే 'బుద్ధిమంతుడు' వంటి క్లాసికల్ హిట్.
అలా ఆయన సరసన నటించడమే కాదు.. ఆయనకు డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు విజయనిర్మల. ఏఎన్నార్ మాత్రమేకాదు.. శివాజీ గణేషన్ కూడా విజయనిర్మల దర్శకత్వంలో నటించారు. మలయాళంలో కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు విజయనిర్మల. హిందీ సూపర్ హిట్ 'అమర్ అక్బర్ ఆంథోనీ'ని తెలుగులో 'రామ్ రాబర్ట్ రహీమ్'గా రీమేక్ చేశారు. విజయశాంతిని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తూ 'కిలాడీ కృష్ణుడు' వంటి సరదా సినిమాను రూపొందించారు.
ఎన్టీఆర్‌పై సెటైరిక్‌గా రూపొందించిన 'సాహసమే నా ఊపిరి' సినిమాకు దర్శకత్వం వహించింది కూడా విజయ నిర్మలే. పి.చంద్రశేఖర రెడ్డి ఆ సినిమాకు కథా రచన చేయగా కృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. ఎన్టీఆర్‌పై వ్యంగ్యాస్త్రం ఆ సినిమా. ఎనభైలలో దర్శకురాలిగా వరసగా సినిమాలు చేశారు విజయనిర్మల. తొంబైయవ దశకం ప్రథమార్థం వరకూ కూడా ఆమె తన పరంపర సాగించారు. ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలకు కూడా దూరం అయ్యారు. ట్రెండ్ మారిపోవడంతో మెగాఫోన్‌కు దూరమైన ఎనభైల దర్శకుల్లో ఒకరిగా మిగిలారు విజయనిర్మల. అప్పటికే ఆమె నలభైకి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.
రెండు వేల సంవత్సరంలో ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ వారు గుర్తించారు. ప్రపంచంలోని అన్ని చిత్ర పరిశ్రమలనూ పరిశీలించి చూసినా.. నలభైకి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళ మరొకరు లేరు అనే విషయాన్ని గుర్తించి, అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా విజయనిర్మలకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కల్పించారు. ఆ రికార్డు సంగతెలా ఉన్నా.. పురుషాధిపత్యం పుష్కలంగా ఉండే సినీ పరిశ్రమలో ఒక మహిళ అన్నిసినిమాలకు దర్శకత్వం వహించడం మాత్రం నిస్సంకోచంగా గొప్ప సంగతి.
స్త్రీ సాధికరతకు ఉదాహరణ విజయనిర్మల. దర్శకత్వం అంటే అది మగాళ్లు మాత్రమే చేసే పని అనే ట్రెండ్‌ను బ్రేక్ చేశారామె. దశాబ్ధాల పాటు అలా సినిమాలు రూపొందించి ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, మరింతమంది మహిళలు దర్శకత్వం వైపు రావడానికి ఆమె స్ఫూర్తిగా నిలిచారు. అలా ఒక లేడీ లెజెండరీగా నిలిచిపోతారు విజయనిర్మల.
సమ్మర్‌కి బంపర్ బిగినింగ్! హడలెత్తించిన మార్చి! ఆల్‌టైమ్ డిజాస్టర్!