పెద్ద సినిమాల్లో రొటీన్ విలన్లను తీసుకోవడానికి ఇష్టపడడం లేదు హీరోలు. అటు దర్శకులు కూడా అదే ఆలోచన విధానంతో ఉన్నారు. ఓ క్రేజీ ప్రాజెక్టు స్టార్ట్ అయిందంటే చాలు, అందులో విలన్ గా ఎవ్వర్ని లాక్కొద్దామా అనే చర్చలు కూడా కీలకంగా మారుతున్నాయి. ఇప్పుడు రామ్ సినిమాకు కూడా అదే ప్రధాన చర్చగా కనిపిస్తోంది.
లింగుసామి దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు రామ్. రీసెంట్ గా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాకు ఓ పవర్ ఫుల్, స్టయిలిష్ విలన్ కావాలి. సరిగ్గా ఇక్కడే మేకర్స్ చూపు తమిళ నటుడు ఆర్యపై పడింది. అన్నీ కుదిరితే ఆర్యను ఈ సినిమాలో విలన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట.
ఆర్యకు విలన్ గా నటించడం కొత్తకాదు. ఎన్నో ఏళ్ల కిందటే తెలుగులో విలన్ గా నటించాడు. బన్నీ చేసిన వరుడు సినిమాలో ఇతడే ప్రతినాయకుడు. ఆ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో విలన్ గా కనిపించని ఆర్యను, రామ్ మూవీ కోసం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.
క్యారెక్టర్ బాగుంటే విలన్ గా చేయడానికి ఆర్యకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. కాకపోతే ఇప్పుడు విలన్ గా కంటే, హీరో-క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎక్కువగా రాణిస్తున్నాడు ఈ నటుడు. ఇలాంటి టైమ్ లో మరోసారి రామ్-లింగుసామి కోసం ప్రతినాయకుడిగా మారతాడా అనేది చూడాలి.