ఎవరి బాడీ లాంగ్వేజ్ కు సూటయ్యే స్టయిల్ ను వారు ఎంచుకోవాలి. మంచిదైనా పరధర్మం కన్నా స్వధర్మమే బెటర్ అని చెప్పారు కదా? అందరు హీరోలు రవితేజ మాదిరిగా అల్లరి చేయలేరు కదా? కేసిఆర్ కు సూటయినట్లు సెటైరికల్ సంభాషణలు అందరికీ రావు కదా? వైఎస్ స్మూత్ గా గదమయించినట్లు ప్రతి ఒక్కరూ చేయలేరు కదా? చంద్రబాబు ప్రసంగించినట్లు సుదీర్ఘంగా, సవివరంగా మిగిలిన వారు ట్రయ్ చేయలేరు కదా? ఏతా వాతా చెప్పేది ఏమిటంటే ఎవరి బాడీ లాంగ్వేజ్, ఎవరి స్టయిల్ వారికి వుంటుంది.
అగ్రెసివ్ గా ముందుకు వెళ్లడం అన్నది రాజకీయాల్లో ఎప్పుడూ బాగుంటుంది. మాస్ జనాల్లో, పార్టీ కార్యకర్తల్లో కాస్త హీరోయిజం తెచ్చిపెడుతుంది అన్న మాట వాస్తవం. కానీ అలా అని చెప్పి, భాషను చూసుకోవాల్సి వుంటుంది. ఎంత అగ్రెసివ్ నేచర్ ను అలవర్చుకోవడం అవసరం అయినా, భాషను పద్దతిగా వుంచుకోవడం అత్యవసరం.
కేసిఆర్ ఎంత సెటైరికల్ గా మాట్లాడినా, భాషలో సంస్కారం దూరం అయిన సందర్భం తక్కువ. మహా అయితే సన్నాసి, బేకార్ మాటలు లాంటి రెగ్యులర్ పదాలు తప్ప మరేం వాడరు. వైఎస్ కూడా 'చాల్లేవయ్యా..ఊరుకో..భలేవాడివిలే..' ఇలా సున్నితమైన పదాలు వాడడం తప్ప, గీత దాటి భాష మాట్లాడింది లేదు.
జగన్ కూడా చంద్రబాబూ..కూచో..చెప్పాడు కానీ, అలా అంటాడు అనీ, ఇలా ఏకవచనం వాడిన సందర్భాలు వున్నాయి కానీ ఓరే చంద్రబాబు..అరే చంద్రబాబు అని మాట్లాడిన వైనాలు లేవు.
లోకేష్ బాబు ఈ మధ్య సన్నబడ్డారు. అంటే సినిమా జనాల పరిభాషలో మేకోవర్ అనుకోవాలి. ఈ మేకోవర్ ను లోకేష్ సాధించారు. ఛబ్బీగా వున్న తన లుక్ ను మార్చుకున్నారు. సన్నబడ్డారు. అంతవరకు బాగానే వుంది. కానీ మాస్ ను అట్రాక్ట్ చేయాలి అంటే అగ్రెసివ్ గా ముందుకు వెళ్లాలి, అగ్రసివ్ గా మాట్లాడాలి అని ఎవరో రాంగ్ డైరక్షన్ ఇచ్చినట్లున్నారు. దాంతో అరే, ఓరే..జగన్ రెడ్డీ, మగాడివైతే…ఇలాంటి పదజాలంతో విరుచుకుపడుతున్నారు.
ఇక్కడే లోకేష్ తెలుసుకోవాల్సి ఒకటి వుంది. తను ఎవరితో పోటీ పడాలి. ఎవరితో పోరాడాలి? కొడాలి నానితోనా? వైఎస్ జగన్ తోనా? కొడాలి నాని యూ ట్యూబర్లకు టైమ్ పాస్. వైఎస్ జగన్ కాదు. వైఎస్ జగన్ లీడర్. చంద్రబాబు లీడర్. కేసిఆర్ లీడర్. తను కూడా లీడర్ కావాలనుకుంటే లోకేష్ ఫాలో కావాల్సింది వీళ్లను, కొడాలి నాని ని కాదు.
జనం లీడర్ల భాషను, హావభావాలను మెచ్చుకుంటారు. కొడాలి నాని లాంటి వాళ్ల భాషను విని నవ్వుకుని లైట్ తీసుకుంటారు. ఈ తేడాను లోకేష్ గమనించాలి. కేటిఆర్ లాంగ్వేజ్ ను, భాషను లోకేష్ పరిశీలించాలి. కేటిఆర్ కు ఫాలోయింగ్ రాలేదా? నెటిజన్లలో మాంచి ఫాలోయింగ్ వుంది. ఈ ఫాలోయింగ్ ఫాల్తూ లాంగ్వేజ్ వాడడం వల్ల వచ్చిందా? లేదుగా? తనకంటూ ఓ సిస్టమాటిక్ ఆటిట్యూడ్ ను అలవర్చుకోవడం వల్ల వచ్చింది.
లోకేష్ కూడా ఎవరి గైడన్స్ ను పడితే దాన్ని నమ్ముకోకుండా, తనకంటూ ఓ బాడీ లాంగ్వేజ్ ను, భాషను, ఆటిట్యూడ్ ను అలవాటు చేసుకోవాల్సి వుంది. అలా కాకుండా ఇలా అరే..ఒరే..మగాడివైతే లాంటి పదజాలంతో కూడిన భాషను అలవాటు చేసుకుంటే చోటా మోటా నాయకుడిగా, వీధి నాయకుడిగా మిగిలిపోయే ప్రమాదం వుంది.
అందుకే తనకు రాంగ్ డైరక్షన్ ఇస్తున్నవారిని తక్షణం పక్కన పెట్టడం అత్యవసరం. పైగా జగన్ కు ఫాలోయింగ్ వున్న రాయలసీమలోకి వెళ్లి, అక్కడ అదే జగన్ ను అరే..ఒరే..మగాడివైతే..లాంటి భాష వాడడం వల్ల ప్రయోజనం ఏమిటి? అక్కడ జనాల్లో తన మీద మరింత ఏహ్యభావం పెంచుకోవడం తప్ప? ఈ చిన్న లాజిక్ ను లోకేష్ ఎలా మిస్ అయ్యాడో?