ఈనాడు-తెరాస హనీమూన్ ముగిసిందా?

తెలంగాణ రాకముందు.. వచ్చిన తరువాత అన్నట్లు వుండేది ఈనాడు – తెరాస వ్యవహారం. తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడయితే పార్టీలోకి వచ్చారో, అప్పుడే కేసిఆర్ ను వెంటబెట్టుకుని, ఈనాడు రామోజీ దగ్గరకు వెళ్లారు. ఆయన కూడా…

తెలంగాణ రాకముందు.. వచ్చిన తరువాత అన్నట్లు వుండేది ఈనాడు – తెరాస వ్యవహారం. తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడయితే పార్టీలోకి వచ్చారో, అప్పుడే కేసిఆర్ ను వెంటబెట్టుకుని, ఈనాడు రామోజీ దగ్గరకు వెళ్లారు. ఆయన కూడా సాదరంగా స్వాగతించారు. నాటి నుంచి నేటివరకు ఎక్కడా ఇసుమంత పొరపచ్చాలు పొడచూపినట్లు కనిపించలేదు. చాలావరకు కేసిఆర్ కు, తెరాసకు అనుకూలంగానే వుంటూ వచ్చింది ఈనాడు. కనీసం అలా కనిపించింది అని కూడా అనుకోవచ్చు.

గడచిన ఎన్నికల టైమ్ లో కూడా ఈనాడు చాలా బ్యాలెన్స్ గా వ్యవహరించింది. ఎవరికి ఇవ్వాల్సిన స్పేస్ వారికి ఇచ్చుకుంటూ వచ్చింది. అప్పుడు కూడా తెరాస వైపు నుంచి ఈనాడు మీద ఎటువంటి అభ్యంతరం రాలేదు. ఎన్నికలు ముగిసి, తెరాస మళ్లీ అధికారంలోకి వచ్చాక, ఇటు విజవల్, అటు ప్రింట్ అన్నిరకాల మీడియాలు దాదాపు మౌనం వహించాయి. దీనిమీద సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినా ఎవ్వరూ చలించలేదు.

ఎన్నికల టైమ్ లో, ఎన్నికల తరువాత ఆంధ్రజ్యోతి ఒక్కటే కాస్త తెరాసకు నెగిటివ్ అన్నట్లు కనిపిస్తూ వచ్చింది. ఈనాడు కూడా ఇప్పుడేమీ అంతగా మారిపోయినట్లులేదు కానీ, ఈనాడు పట్ల తెరాస వైఖరి కాస్త ఎక్కువగా మారిందా అన్నట్లు అనిపిస్తోంది. తెరాస స్వంత పత్రిక నమస్తే తెలంగాణ ఈరోజు ఏకంగా అరపేజీని కేటాయించింది ఈనాడు వార్తను దుయ్యబట్టేందుకు. ఇదంతా ఏటిగడ్డ కృష్ణాపూర్ గ్రామం విషయంలో, మల్లన్న సాగర్ నిర్మాణం నేపథ్యంలో హైకోర్డు ఇచ్చిన తీర్పు ప్రచురణ కారణంగా వచ్చింది.

మరి తీర్పును ఈనాడు సిబ్బంది తప్పుగా అర్థం చేసుకున్నారో? లేక నిజంగానే తీర్పు అలాగేవుంటే, తెరాస అభ్యంతరం చెబుతోందో, మొత్తంమీద, మల్లన్న సాగర్ మీద ఈనాడు అక్కసు కక్కుతోందని, పోలవరం విషయంలో ఒక లాగ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మరోలాగ వ్యవహరిస్తోందని తెరాస అభిప్రాయ పడుతోంది. అందుకే ఈరోజు నమస్తే తెలంగాణలో డైరక్ట్ గా ఈనాడునే టార్గెట్ చేస్తూ, అరపేజీ కథనం వండివార్చింది.

సీదాగా ఈనాడు వైఖరి పైన ప్రశ్నలు సంధించింది. అంతేకాదు, ఆంధ్ర-తెలంగాణ సెంటిమెంట్ కూడా ఆ వార్తలో తొంగిచూసింది. రేపు ఈనాడు చూస్తే తప్ప, అసలు తప్పువుందా? లేదా? ఏం జరిగింది? అన్నది తెలియదు. ఈనాడుతో తెరాసపెద్దలు మాట్లాడకుండానే వుండి వుంటారని, వాళ్లకు వాళ్లకు తెలియకుండానే అరపేజీ వార్త అయితే రాదని జర్నలిస్ట్ వర్గాల టాక్.

మరీ దెబ్బతినని మోడీ ఇమేజ్… కోలుకున్నా పుంజుకోని కాంగ్రెస్!