మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఓ విచిత్రం చోటు చేసుకొంది. ఓ ముస్లిం కుటుంబం వీడియో కాల్లో పెళ్లి తంతు ముగించి అందరి దృష్టిని ఆకర్షించింది. కరోనాను కట్టడి చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చాడు. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని శుభ కార్యాలు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అనేక మంది సినీ సెలబ్రిటీలు తమ వివాహాలను వాయిదా వేసుకోవడం రోజూ వింటున్నాం.
అంతేకాదు, ప్రభుత్వ ఆదేశాలతో ఫంక్షన్ హాళ్లను బాడుగకు ఇవ్వడం లేదు. అందులోనూ గుంపులు గుంపులుగా పోగు కావడాన్ని ప్రభుత్వం నిషేధించడంతో పెళ్లిళ్లు వాయిదా వేసుకోవలసిన పరిస్థితి. కానీ చావుల విషయానికి వస్తే మొక్కుబడిగా ముగించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఓ ముస్లిం కుటుంబం ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూనే ఎలాంటి హడావుడి లేకుండా వీడియో కాల్లో పెళ్లి తంతు మమ అనిపించారు. మహారాష్ట్రకు చెందిన వరుడు మహమ్మద్‌కు జౌరంగబాద్‌కు చెందిన యువతితో కుటుంబ సభ్యులు కరోనా వేళ వినూత్నంగా వీడియో కాల్లో పెళ్లి వేడుక జరిపించారు.
ఈ సందర్భంగా వరుడి తండ్రి మొహమ్మద్ గయాజ్ మాట్లాడుతూ ఆరు నెలల క్రితమే వివాహ తేదీ నిశ్చయమైందన్నాడు. లాక్డౌన్ కారణంగా తమ కుటుంబ పెద్దలతో కలిసి ఇలా వీడియో కాల్ ద్వారా పెళ్లి జరిపించినట్టు ఆయన వివరించాడు.
ఈ వీడియో కాల్ పెళ్లి వేడుక సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇదే సందర్భంలో పలు అనుమానాలు, ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తుతున్నారు. పెళ్లి అనంతరం జరగాల్సిన సాంగ్యాలను ఎలా జరుపుతారని ప్రశ్నిస్తుండటం కొసమెరుపు. హేమిటో…కరోనా పుణ్యమా అని లోకంలో ఎన్నెన్ని వింతలు, విడ్డూరాలు ఇంకా చూడాల్సి వస్తుందో మరి!