రాజకీయ నాయకులు ఎలాగైనా మాట్లాడవచ్చు. అది వారి హక్కు. పైగా వారి పరిజ్ఞానం చాలా వరకు అంతంత మాత్రం. అందువల్ల అడ్డగోలుగా మాట్లాడడం అన్నిది కామన్. కానీ మేధావులు లేదా మంచి మంది ఉద్యోగాలను వదులుకుని, రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మంచి చేస్తాము అనే కొందరు అయినా పద్దతిగా మాట్లాడాలి. అంతేకానీ, రాజకీయాల్లోకి వచ్చాం కదా? అని మిగిలిన రొడ్డ కొట్టుడు రాజకీయ నాయకుల మాదిరిగా తమ చిత్తానికి మాట్లాడకూడదు.
ప్రస్తుతం దేశంలోని రాజకీయ నాయకుల్లో అధికశాతం మందికి వ్యాపారాలు వున్నాయి. అసలు అలా వ్యాపారాలు వున్నవారే వాటిని కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు. తమకున్న డబ్బు బలంతో టికెట్ లు తెచ్చుకుంటున్నారు. ఓట్లు సంపాదించి గెలుస్తున్నారు. అంతవరకు బాగానే వుంది. కానీ అలాంటి వాళ్లు తమ వ్యాపారాల్లో అక్రమాలు చేస్తే, వాళ్ల జోలికి వెళ్లకూడదన్న సూత్రం మాత్రం భలే చిత్రంగా వుంది.
ఏమైనా అంటే రాజకీయపరంగా వేధిస్తున్నారు అంటారు. అదే మీడియాకు వ్యాపారాలు వుండి, అక్రమాలు చేస్తే, దానిపై దాడిచేస్తే, మీడియాపై దాడి అంటారు. ఇది ఎంతవరకు సమంజసం? కేంద్ర మాజీమంత్రి సుజనాచౌదరి వ్యవహారాలు ఇప్పటికే అనేకసార్లు పత్రికల్లోకి వచ్చాయి. ఆయన బ్యాంకులకు బకాయిపడింది వాస్తవం. అంతర్జాతీయ కంపెనీలతో లావాదేవీల్లో కేసులు నడుస్తున్నది వాస్తవం.
మరి అలాంటి సంస్ధలపై దాడిచేస్తే, రాజకీయంగా దాడి అనడం ఏమిటి? అంటే ఈ లెక్కన ఈ దేశంలో ఏ ఎంపీ,. ఏ ఎమ్మెల్యే పైన కూడా ఐడి, ఇడి దాడి చేయకూడదు. ఎందుకంటే వాళ్లందరికీ వ్యాపారాలు వుంటాయి. అలాగే మీడియా సంస్థలు నిర్వహించే వేరే వ్యాపారాల జోలికి కూడా వెళ్లకూడదు.
ఇంక ఎవరయ్యా మిగిలింది అంటే అమ్మకు చిక్కిన మేకల్లాంటి ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న చితక వ్యాపారులు. అంతే కదా? సరే, ఇలాంటి వ్యవహారం మీద అనేకమంది అనేక రకాలుగా మాట్లాడారు. ఆఖరికి ఢిల్లీ సిఎమ్ కేజ్రీవాల్ కూడా. కేజ్రీవాల్ సాధారణ వ్యక్తి కాదు. కేంద్ర సర్వీసుల్లో వుండి వచ్చిన వ్యక్తి. ఆయనకు కేంద్ర రెవెన్యూ వ్యవహారాలు, ఇన్ కమ్ టాక్స్ వ్యవహారాలు అన్నీతెలుసు. అన్నీతెలిసి, కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి ఆఫీసులపై దాడిచేస్తే, తప్పు పడతారేంటీ?
ఇదంతా రాజకీయ కక్షసాధింపు అంటారు ఆయన. మరి ఇప్పుడు సుజనా చౌదరి బాకీ పడ్డ బ్యాంకులు అన్నీ ఏం చేయాలి? ఆయన ఎంపీ కాబట్టి, తాము మౌనంగా వుండిపోవాలా? ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును, రుణాల రూపంలో రాజకీయ నాయకులు తన్నుకుపోతుంటే చేష్టలుడిగి కూర్చోవాలా?
ఇదేనా కేజ్రీవాల్ లాంటి కేంద్ర సర్వీసుల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చెప్పేది? చదవేస్తే ఉన్నమతి పోయినట్లు, రాజకీయాల్లోకి వస్తే, ఇలాగే మారిపోతారేమో? అడ్డగోలుగా ఆరోపించడంలో ఆరితేరిపోతారేమో?
ఎన్టీఆర్ కు భవిష్యత్ లేకుండా చేసే ప్లాన్… చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్