ఏం మాట్లాడినా సంచ‌ల‌న‌మే!

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ ఏం మాట్లాడినా సంచ‌ల‌న‌మే. ఒక్క మాట‌లో చెప్పాలంటే సంచ‌ల‌నాల కోస‌మే నారాయ‌ణ మాట్లాడుతుంటార‌నే వాళ్లు లేక‌పోలేదు. ఒక్కోసారి నారాయ‌ణ నోరు జారి, ఆ త‌ర్వాత క్ష‌మాప‌ణ చెప్పిన సంద‌ర్భాలు…

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ ఏం మాట్లాడినా సంచ‌ల‌న‌మే. ఒక్క మాట‌లో చెప్పాలంటే సంచ‌ల‌నాల కోస‌మే నారాయ‌ణ మాట్లాడుతుంటార‌నే వాళ్లు లేక‌పోలేదు. ఒక్కోసారి నారాయ‌ణ నోరు జారి, ఆ త‌ర్వాత క్ష‌మాప‌ణ చెప్పిన సంద‌ర్భాలు లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌పై నారాయ‌ణ త‌న మార్క్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

బీజేపీకి ఓటేసి ఒక‌సారి అవ‌కాశం ఇస్తే ఉరేసుకున్న‌ట్టే అని నారాయ‌ణ వ్యాఖ్యానించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేసీఆర్‌ను అధికారం నుంచి దించేస్తామ‌ని అమిత్‌షా హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి ఎంతో చేశామ‌ని అమిత్‌షా చెప్పారు. ఇంకా ఏం దోచుకోవాల‌ని పదేప‌దే అప్పులు అడుగుతున్నార‌ని అమిత్ షా తెలంగాణ అధికార పార్టీని నిల‌దీశారు.

అయితే టీఆర్ఎస్ కంటే ఘాటుగా నారాయ‌ణ కౌంట‌ర్ ఇవ్వ‌డం విశేషం. విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల గురించి అమిత్ షా మాట్లాడ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు.  మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల గురించి చెప్ప‌లేద‌న్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఏం చేశారో చెప్ప‌లేక పోయార‌ని విమ‌ర్శించారు. 

కేవ‌లం ఒక‌సారి ఓటేయండి.. అధికారం ఇవ్వండి అని ప్రాథేయ‌ప‌డుతున్నార‌ని నారాయ‌ణ చెప్పు కొచ్చారు. మ‌న దేశ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ను బీజేపీ ధ్వంసం చేస్తోంద‌ని విరుచుకుప‌డ్డారు. అలాంటి పార్టీకి తెలంగాణ‌లో అవ‌కాశం ఇవ్వ‌డం మంచిది కాద‌ని నారాయ‌ణ అన్నారు.

టీఆర్ఎస్‌తో సీపీఐకి పొత్తు లేదు. కానీ బీజేపీని టీఆర్ఎస్ వ్య‌తిరేకిస్తుండ‌డం వ‌ల్ల ప్ర‌స్తుతానికి కేసీఆర్ స‌ర్కార్‌ను నారాయ‌ణ వెన‌కేసుకు రావ‌డం విశేషం. జాతీయ స్థాయిలో వామ‌ప‌క్షాలు, ఇత‌ర ప్ర‌తిప‌క్షాల‌తో క‌ల‌సి కూట‌మి ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే కేసీఆర్‌కు నిల‌క‌డ ఉండ‌ద‌ని, ఆయ‌న్ని న‌మ్ముకుంటే మోస‌పోతామ‌ని ఇటీవ‌ల కేసీఆర్‌పై కూడా నారాయ‌ణ విమ‌ర్శ‌లు చేశారు.