ఆనంద జోషి కేంద్ర హోం శాఖలో ఫారినర్స్ డివిజన్‌లో అండర్ సెక్రటరీగా పనిచేసే ఉన్నతోద్యోగి. మే నెలలో అరెస్టయ్యాడు. జూన్ నెలలో బెయిలు తెచ్చుకున్నాడు కూడా. అతని మీద అభియోగమేమిటంటే విదేశాల నుంచి విరాళాలు పొందే స్వచ్ఛంద సంస్థలను సతాయించడం, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సిఆర్‌ఎ) నియమాలను మీరు ఉల్లంఘిస్తున్నారంటే నోటీసులిచ్చి బెదరగొట్టి డబ్బులు లాగడం, డిపార్టుమెంటు నుంచి ఫైళ్లు యింటికి పట్టుకుపోవడం! జోషి కన్నేసిన సంస్థల్లో సునీతా నారాయణన్ నడిపే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్‌మెంట్ కూడా వుంది. పారిస్‌లో క్లయిమేట్ ఛేంజ్ గురించి జరిగిన సదస్సులో ఇండియా నుంచి వెళ్లి కీలకమైన పాత్ర పోషించిన సంస్థ అది. దానికి కేంద్ర ప్రభుత్వం దన్ను కూడా వుంది. 2015 సెప్టెంబరులో జోషి తనకు నోటీసు పంపినప్పుడు సునీత అతని పై అధికారుల వద్దకు వెళ్లి ఏమిటిదంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. దాని ఫలితంగానే జోషిని 2015 డిసెంబరులో ఆ శాఖ నుంచి తప్పించి వేరే డిపార్టుమెంటుకు బదిలీ చేశారు. అ తర్వాత కూడా జోషి ఆ డిపార్టుమెంటుకి వచ్చి డాక్యుమెంట్లు చేజిక్కించుకోవడానికి చూసేవాడు. తర్వాత మూణ్నెళ్లపాటు సిబిఐ, యితర ఏజన్సీలు జోషి చర్యలను పరిశీలించి, అతనిపై నిఘా వేసి అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు సేకరించాయి. సమన్లు పంపగానే అతను మాయమై పోయాడు. పట్టుకుని అరెస్టు చేశారు. ఆధారాలు ఎదుర్కోవడానికి ఆనంద్ జోషి తీస్తా అస్త్రం బయటకు లాగాడు. ''నేను తీస్తా సెతల్వాడ్ నడుపుతున్న ఎన్జీవోలకు, ఫోర్డ్ ఫౌండేషన్‌కు, గ్రీన్‌పీస్‌కు వ్యతిరేకంగా అభిప్రాయాలు వెలిబుచ్చాను. దాంతో వాళ్లు నాపై కుట్ర పన్ని నన్ను యిరికించారు.'' అని వాపోయాడు. ప్రస్తుత ప్రభుత్వానికి తీస్తా అంటే ఒళ్లు మంట కాబట్టి దాన్ని తన కనుకూలంగా వాడుకుందామని చూశాడు.
మన దేశంలో 34 వేల స్వచ్ఛంద సంస్థలున్నాయి. 2015-16లో వాటికి 12 వేల కోట్ల రూ.ల విరాళాలు విదేశాల నుంచి వచ్చాయి. ఇవన్నీ సక్రమంగా వస్తున్నాయో లేదో, సద్వినియోగం అవుతున్నాయో లేదో పర్యవేక్షించవలసిన శాఖలో ఆనంద్ జోషి చాలాకాలం పనిచేశాడు. ఈ విరాళాలపై తరచుగా ఫిర్యాదులు వస్తూ వుంటాయి. వాటిని పరిగణనలోకి తీసుకుని స్వచ్ఛంద సంస్థ నుద్దేశించి ఒక ప్రశ్నాపత్రాన్ని తయారుచేసి పంపుతుందీ యీ శాఖ. సంతృప్తికరమైన సమాధానాలివ్వలేని ఎన్జీవోలపై చర్యలు తీసుకునే అధికారం కూడా ఆ శాఖ కుంది. ఈ నోటీసులిచ్చేముందు అండర్ సెక్రటరీ తన కంటె పై అధికారి జాయింట్ సెక్రటరీతో చర్చించి మరీ పంపాలి. కానీ జోషి అలాటి పట్టింపులు పెట్టుకోలేదు. సొంతంగానే పంపేశాడు. శాఖలో అధికారులందరూ కలిసి చర్చించి 2014-15 సం||కి 33 ఎన్జీవోలకు నోటీసులు పంపితే యితను పనిలో పనిగా మరో 20 సంస్థలకు కూడా పంపేశాడు. వాటిల్లో ఏడాదికి 552 కోట్లు విరాళాలు వచ్చిన సంస్థల నుంచి కోటి రూ.ల లోపు వచ్చినవి కూడా వున్నాయి. పెద్ద సంస్థల మీద రాళ్లేస్తేనే పళ్లు రాలతాయని జోషికి తెలుసు. కానీ వాళ్లకే పంపితే డిపార్టుమెంటులో అనుమానాలు వస్తాయని చిన్నవాళ్లను కూడా నామమాత్రంగా కలిపాడు.
మార్చి నెలలో ఫారినర్స్ డివిజన్‌లో ఎడిషనల్ సెక్రటరీగా వున్న బ్రజ్ కిశోర్ ప్రసాద్ తన సిబ్బందితో తీస్తా సెతల్వాడ్, భర్త జావేద్ ఆనంద్ నడిపే సబ్‌రంగ్ ట్రస్టు ఫైళ్లను పంపమన్నాడు. చూడబోతే ఎక్కడా కనిపించలేదు. ఆ ఫైలు చాలా ముఖ్యమైంది. ఎందుకంటే హోం శాఖ సబ్‌రంగ్ ట్రస్టు కున్న ఎఫ్‌సిఆర్‌ఎ రిజిస్ట్రేషన్‌ను సెప్టెంబరు 9 న సస్పెండ్ చేసింది. ఆర్నెల్లలోగా అంటే మార్చి 9 లోగా రిజిస్ట్రేషన్ కాన్సిల్ చేయడమో, పునరుద్ధరించడమో ఏదో ఒక చర్య తీసుకోవాలి. పునరుద్ధరించమని కోరడానికి వస్తామని జావేద్ ఆనంద్ కబురంపాడు. 'మీరు కోరిన సమాచారమంతా యిచ్చాం. అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం యిచ్చాం. మాపై నిషేధం అనాలోచితంగా, అర్థరహితంగా తీసుకున్న చర్య' అని అతని వాదన. తమపై మోపిన అభియోగాలకు వాళ్లిచ్చిన వివరణలెలా వున్నాయో తెలుసుకోవాలంటే ఫైలు కావాలిగా. అందుకని అడిగాడు. వెతికితే మూణ్నెళ్లగా ఆ ఫైలు డిపార్టుమెంటులోనే లేదని, శాఖ మార్చినపుడు జోషి యీ ఫైలూ, యితర ట్రస్టులకు సంబంధించిన ఫైళ్లు కొన్నీ పట్టుకుని వెళ్లిపోయాడనీ తేలింది. వెంటనే సిబిఐను పిలిచారు. ఇన్నాళ్లగా అవి మిస్సింగని కనిపెట్టనందుకు యితర అధికారులను కూడా ప్రశ్నిస్తున్నారు.
తనపై అనుమానం తగిలిందని తెలియగానే జోషి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వెళ్లబోయే ముందు మీడియాతో ''హోం శాఖలో టాప్ అధికారులందరూ అవినీతిపరులు. నేను నిప్పు. అనేక ఎన్జీవోలు తమను 'వాచ్ లిస్ట్' నుంచి తప్పించమని నాకు లంచాలు యివ్వజూపాయి. ఉదాహరణకి ఫోర్డ్ ఫౌండేషన్ రూ.250 కోట్లు యివ్వబోయింది. నేను ఒప్పుకోలేదు. మా జాయింట్ సెక్రటరీ ప్రసాద్ వాళ్లకు క్లీన్ చిట్ యిమ్మనమని నాపై ఒత్తిడి తెచ్చాడు. నేను నిరాకరించడంతో నన్నెలాగైనా యిరికించాలని చూస్తున్నాడు.'' అని చెప్పాడు. సహజంగానే ప్రసాద్ ఆరోపణలు తిరస్కరించాడు. హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజ్జు ''జోషియే అవినీతిపరుడు. ఫోర్డ్ ఫౌండేషన్‌ను కాని, మరో దాన్ని కానీ వాచ్ లిస్టులో పెట్టడానికి, తీసేయడానికి జోషికి ఏ అధికారమూ లేదు.'' అన్నాడు. ఫోర్డ్ ఫౌండేషన్ ప్రతినిథి తాము జోషికి లంచం యివ్వచూపామన్న మాట కొట్టిపడేశాడు.
ప్రసాద్ చేసిన ఫిర్యాదుపై సిబిఐ వాళ్లు మే 9న జోషిపై కేసు బుక్ చేసి, అతనికి సమన్లు పంపారు. సమన్లు వస్తున్నాయనగానే జోషి పారిపోయాడు. ''సిబిఐ నన్ను మానసికంగా హింసిస్తోంది. అందుకే వెళ్లిపోతున్నా'' అంటూ కుటుంబసభ్యుల నుద్దేశించి ఓ ఉత్తరం రాసి పెట్టి వెళ్లాడు. మే 15 న సిబిఐ వాళ్లు అతన్ని వెతికి పట్టుకుని విచారణ ప్రారంభించారు. అతనికి సంబంధించిన యిళ్లు, ఆఫీసులపై సిబిఐ చేసిన దాడిలో రూ. 7.50 లక్షలు, ఫైళ్లు దొరికాయి. వాటిలో హోం శాఖకి సంబంధించినవే కాక ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగుకి సంబంధించినవి కూడా వున్నాయి. అతను గతంలో యిన్ఫర్మేషన్ డిపార్టుమెంటులో పనిచేసినపుడు తన భార్య మీనాక్షి డైరక్టరుగా మూడు మీడియా సంస్థలు నెలకొల్పి వాటి ద్వారా ప్రభుత్వ యాడ్స్ సంపాదించేవాడు. ఆ కంపెనీల ఫోన్ల నుంచే ఎన్జీవోలకు బెదిరింపు కాల్స్ చేసేవాడు. 2015 జులైలో ఫోర్డ్ ఫౌండేషన్ను వాచ్ లిస్టులో పెట్టి, ఢిల్లీలోని వారి ప్రతినిథికి ఫోన్ చేసి 'మనిద్దరి మధ్య బేరం కుదిరితే మినిస్ట్రీలో జరిగిన మీటింగు మినిట్స్ కాపీ మీ చేతిలో పెడతా' అని ఆఫర్ చేశాడు. ఆ ఫోర్డ్ ప్రతినిథి యితని ఆఫర్ పట్టించుకోలేదు కానీ వెంటనే అతని ఉన్నతాధికారులకు యీ విషయాన్ని తెలియపరిచాడు. జోషి చేసిన ఫోన్ కాల్స్‌ను యింటెలిజెన్సు అధికారులు రికార్డు చేశారు.
చివరకు మే 15 న అరెస్టు చేశారు. జోషి బెయిలు కోసం దరఖాస్తు చేసుకుంటే, సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి వినోద్ కుమార్ జూన్ 6 న 'అతను పారిపోలేడు. సాక్షుల నెవరినీ ప్రభావితం చేసే, సాక్ష్యాలు తారుమారు చేసే స్థితిలో లేడు. బెయిలు యిచ్చినా నష్టం లేదు. బయటకు వచ్చాక ఏ ఎన్జీవోనైనా, ఏ సాక్షినైనా అతను సంప్రదించినట్లు సిబిఐ ఫిర్యాదు చేస్తే బెయిల్ కాన్సిల్ చేస్తా.' అంటూ 50 వేల పూచీకత్తు, యిద్దరు స్యూరిటీలు తీసుకుని బెయిలు యిచ్చేయవచ్చు అన్నాడు. సిబిఐ అతని పాస్‌పోర్టు స్వాధీనం చేసుకుంది. విచారణ పూర్తయేవరకు ఘజియాబాద్, ఢిల్లీ విడిచి వెళ్లకూడదని, మహా అయితే తలిదండ్రులు నివాసముండే రాంచీకి సిబిఐ అనుమతి తీసుకుని వెళ్లవచ్చని, ప్రతీ సోమవారం సిబిఐకు కనబడాలని, పాస్‌పోర్టును సిబిఐకు అప్పగించాలని షరతులు విధించాడు. అతని చరిత్ర మొత్తమంతా ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. ఎందుకంటే అతని గురించి ఎక్కువగా చెప్పిన కొద్దీ హోం శాఖ నిర్వహణ అంత అధ్వాన్నంగా వుందని ఒప్పుకోవలసి వస్తుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2016)