ఎమ్బీయస్‌ క్రైమ్‌ కథ: ఎలుకలబోనులో పిల్లి

''శ్రీధర్‌, నువ్వు పోలీసువి కదూ!?'' అన్నాడు పాండురంగం హఠాత్తుగా. తిన్న ప్లేట్లు కడిగేసి లోపల పెడుతున్న నేను ఉలిక్కిపడి కిచెన్‌లోంచే డ్రాయింగ్‌రూమ్‌లోకి తొంగిచూసేను. మా ఆయన మొహం పాలిపోయింది. పాండురంగం తొణక్కుండా సిగరెట్టు కాలుస్తూ…

''శ్రీధర్‌, నువ్వు పోలీసువి కదూ!?'' అన్నాడు పాండురంగం హఠాత్తుగా. తిన్న ప్లేట్లు కడిగేసి లోపల పెడుతున్న నేను ఉలిక్కిపడి కిచెన్‌లోంచే డ్రాయింగ్‌రూమ్‌లోకి తొంగిచూసేను. మా ఆయన మొహం పాలిపోయింది. పాండురంగం తొణక్కుండా సిగరెట్టు కాలుస్తూ పొగ రింగులు రింగులుగా వదిలేడు.

నేను భయపడినంతా అయింది. పాండురంగం ఈ ఊరు వస్తున్నాడని చెప్పినప్పుడే నేను నచ్చచెప్పానాయనకు. ''కలిస్తే పాతఫ్రెండుగా కలవండి, డ్యూటీ మర్చిపోండి. లేదా పోలీసులాగ వెళ్లి అతన్ని అరెస్టు చేయడానికి సహకరించండి. అంతేకానీ ఫ్రెండులా వెళ్లి పోలీసులా ప్రవర్తించకండి. మీరు పోలీసని అతను ఏదో ఒక విధంగా కనుక్కోగలడు. అప్పుడు మీరు చిక్కుల్లో పడతారు.'' అని ఎన్నో విధాల చెప్పాను.

''చూడు సువర్చలా, నువ్వొక విషయం మర్చిపోతున్నావు. పాండు, నేను కలిసి మిలటరీలో పనిచేసాం. ఒకరికోసం మరొకరు ప్రాణాలొడ్డి పోరాడేం. అదంతా గతం. ఈనాడు అతను దొంగ, హంతకుడు. సిబిఐ వాళ్లకు తలనొప్పిగా దాపురించిన ప్రబుద్ధుడు. మరి నేను? ఒక పోలీసు అధికారిని. నాకూ సిబిఐకు డైరక్టుగా సంబంధం లేకపోవచ్చు. కానీ మొత్తంగా పోలీసు వ్యవస్థలో భాగస్వాములమే కదా. సిబిఐ వాళ్లకు సహకరించకుండా..''

''…అసలు సిబిఐ వాళ్లు మిమ్మల్నెందుకు ఇరికించాలి? వేరే ఎవరూ దొరకనట్లు?''

''నన్నొక్కణ్నే కాదు అడిగింది. బాంక్‌ దోపిడీ కేసులో పాండు పాత్ర బయటపడగానే వాడి చరిత్రంతా తవ్విదీసారు. మిలటరీలో వాడితో క్లోజ్‌గా తిరిగిన వాళ్లందరినీ వెతికి పట్టుకుని అందరికీ చెప్పి వుంచారు. ఎప్పటికో అప్పటికి పాండు వాళ్లని కాంటాక్ట్‌ చేయకపోడని వాళ్ల అంచనా. కరెక్టే అయ్యిందిగా.''

''అయితే అయిందిలెండి. 'మీ ఊరొస్తున్నా, మీ ఇద్దరూ ఎయిర్‌పోర్టులో కలవండి' అని పాండు ఫోన్‌ చేయగానే మీరు సిబిఐ రంగారావుకి వెంటనే ఫోన్‌ చెయ్యాలా?''

''చెయ్యక తప్పదు. నా డ్యూటీ.''

నాకు తెలుసు. ఈయన మహ డ్యూటీ కాన్షస్‌ అని. మామూలుగా అయితే ఆయన కార్యదీక్ష, చిత్తశుద్ధి, మేధాసంపత్తి చూసి గర్వపడుతూంటాను. కానీ ఈ విషయంలో మాత్రం ఆయన విజయం సాధిస్తారని నమ్మకం పోయింది నాకు. ఆర్మీలోంచి బయటకు వచ్చేసేక పాండూ, ఈయనా కలవలేదు. ఈయన పోలీసు ఉద్యోగంలో ప్రవేశించారని తెలియదు కాబట్టే పాండు ఫోన్‌ చేసాడు. ఈయన మిత్రద్రోహం (అతని దృష్టిలో) చేసారని తెలియగానే అతని ప్రతిక్రియ ఎలా ఉంటుందో ఊహించడానికే భయం వేసింది. పాండు కర్కశత్వం గురించి, ఆర్మీలో అతనెంత కరకుగా శతృ సైనికులను వధించేడో ఈయన ఎన్నోసార్లు చెప్పారు. అలాటి మనిషి చేతిలో పడితే ఇంకేమైనా ఉందా?

***********

'' నేను ఇంటికొస్తానని నువ్వు ఊహించలేదు కదూ శ్రీధర్‌?'' అంటున్నాడు పాండు.

అవును, ఎలా ఊహిస్తాం? సాయంత్రం ఎయిర్‌పోర్టులో మా ఇద్దర్నీ కలవమన్నాడు. 'ఎయిర్‌పోర్టు రెస్టారెంటులో తింటూండండి. మా వాళ్లొచ్చి పాండురంగాన్ని పట్టేసుకుంటారు, మీకూ ఇబ్బంది ఉండదు' అన్నాడు రంగారావు. ఈయన సరేనన్నారు.

కానీ పాండు తెలివైనవాడు. అలాటి పబ్లిక్‌ప్లేసులో గంటా, గంటన్నర ఉండడం ప్రమాదమని గ్రహించినట్టున్నాడు. 'మీ ఊరొచ్చి హోటల్లో తినడమేమిటి? పద, మీ ఇంటికి పోదాం.'' అన్నాడు. 

''సువర్చల ఇవాళ్టికి వంట ప్రోగ్రాం పెట్టుకోలేదు.'' అన్నారు మా వారు గాభరాపడుతూ. 

''మొగుడు బెస్ట్‌ఫ్రెండు అడిగినా కూడానా?'' అన్నాడు పాండు నా కేసి నవ్వుతూ చూస్తూ.

నేను ఇంకేం అనగలను? ''భలేవారే, ఆయన మాటలకేం? రండి. కానీ దార్లో కాస్త ఆగాల్సి వుంటుంది. కూరలూ, అవీ కొనాలి.'' అన్నాను. సూపర్‌మార్కెట్‌ కెళ్లాక వాళ్లిదర్ని కారులో వెయిట్‌ చేయమని చెప్పి రంగారావుకి ఫోన్‌చేసి జరిగినది చెప్పాలని నా తాపత్రయం. చెప్పా కూడా.

''అదా సంగతి! మీరెక్కడా కనబడలేదని మా వాళ్లు ఫోన్‌ చేస్తే ఏమైందా అని ఖంగారు పడ్డాను. పాండు ఫోటో ఇక్కడ ఫైల్స్‌లో లేదు. అతన్ని ప్రత్యక్షంగా చూసినవాడు ఒకతనే ఉన్నాడు. అతను ఎయిర్‌పోర్టుకి లేటుగా చేరాడు. శ్రీధర్‌ కూడా మా డిపార్ట్‌మెంటులో చాలామందికి తెలియదు. దాంతో ఎయిర్‌పోర్టుకి వచ్చినవాళ్లు తికమక పడ్డారు. రెస్టారెంటులో కాకపోయినా ఎయిర్‌పోర్టు లాంజ్‌లోనైనా మీరు కనబడ్డారా? అని అడిగితే అదీ సరిగ్గా చెప్పలేకపోయారు. అదృష్టవశాత్తూ మీరే ఫోన్‌ చేసి…''

''అది సరే, ఇప్పుడేం చేస్తారో అది చెప్పండి ముందు…''

''మీ ఇంటికి తీసుకెళ్లి డిన్నర్‌ పెట్టించి బయటకు పంపండి. బయటకు రాగానే మేం పట్టుకుంటాం.''

''మీ సిబిఐ వాళ్లు అసలే దుడుకువాళ్లు. మా ఫ్లాట్‌లోకి చొరబడి…''

''..అబ్బెబ్బే, అదేం జరగదు. ఫ్లాట్‌లో మీరున్నారు. శ్రీధర్‌ దగ్గిర ప్రస్తుతం తుపాకీ కూడా లేదట. రిపేర్‌కి ఇచ్చేట్ట. మేం కాల్పులు మొదలెడితే పాండురంగం ఎదురుకాల్పులు కాల్చవచ్చు. మీ అందరికీ ప్రమాదం. ఫ్లాట్‌లోకి వస్తే ఇంకో చిక్కు కూడా ఉంది…''

''అదేమిటి?''

''శ్రీధర్‌ డిపార్టుమెంటు వేరు కదా. మా వాళ్లెవరికీ శ్రీధర్‌ ఎలా ఉంటాడో తెలియదు. ఎవళ్లో ఒకళ్లిద్దరికి మాత్రమే ముఖపరిచయమట. మీ బిల్డింగు చుట్టూ కాపలా పెట్టేవాళ్లలో శ్రీధర్ని గుర్తు పట్టే వాళ్లుంటారో లేదో తెలియదు. ఫ్లాట్‌ లోపలికి వెళ్లమంటే పొరబాట్న ఒకరనుకొని మరొకరిని కాల్చవచ్చు…''

''అమ్మబాబోయ్‌.''

''ఖంగారు పడకండి. నేనెందుకిదంతా చెప్తున్నానంటే – మేం ఎలాటి రిస్కూ తీసుకోము. నేను మా వాళ్లకి క్లియర్‌గా ఆదేశాలు ఇచ్చేను. 'పాండుకు శ్రీధర్‌ పోలీసని తెలియదు. మీరేదైనా అడావుడి చేసి అతనికి తెలిసేట్లు చేసారంటే శ్రీధర్‌ని నిలువునా పాతేయడానికి కూడా వెరవని మనిషి పాండు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి.' అని ఒకటికి పదిసార్లు చెప్పాను.''

''ఏమో మరి, అంతా మీరే భారం. మా వారి దగ్గర తుపాకీ కూడా లేదంటున్నారు. బయట మీ వాళ్లు కాపలా ఉంటారో లేదో, లేదా ఎయిర్‌పోర్టులో చేసినట్టే ఏదైనా పొరబాటు..''

''..పొరబాటు జరగదు. కావలిస్తే మీరు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో బాల్కనీలోకి వెళ్లి చూడండి. ఒక్క విషయం. ఏదో పని కల్పించుకుని మరీ వెళ్లండి. లేకపోతే పాండురంగానికి అనుమానం రావచ్చు. ఏ అరటిపండు తొక్కో విసిరేయడానికి బయటకు వచ్చినట్టు వచ్చి…''

''అర్థమయింది లెండి.'' అని ఫోన్‌ పెట్టేసా.

ఇంటికొచ్చే దారిలో కానీ, డిన్నర్‌ తయారుచేస్తూన్నంతసేపూ గానీ ఆయనకు ఈ విషయాలన్నీ చెబుదామని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. చిన్న ఫ్లాటు. పాండురంగానికి వినబడుతుందేమోనని భయం. అసలు ఒక్క క్షణం కూడా వదిలితేగా! ఇద్దరూ ఆర్మీలైఫ్‌ గురించి ఒకటే కబుర్లు. భోజనం చేస్తూ కూడా అవే ముచ్చట్లు. భోజనాలయ్యేక సిగరెట్లు కాల్చుకుంటూన్నప్పుడు 'ఇక వెళ్లిపోతాడురా బాబూ, గొడవ వదిలినట్లే' అనుకున్నాను. ఈలోగానే మా కాంప్లెక్స్‌కు ముందూ, వెనకా కూడా సిబిఐ మనుష్యులు చుట్టుముట్టిన విషయం కూడా నేను కన్‌ఫమ్‌ చేసుకున్నాను. 'సీ ఆఫ్‌' చేయడానికంటూ అతనితో బాటు ఈయన బయటకు వెళ్లకుండా ఉండాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ కూచున్నాను. ఇద్దరూ కనబడితే సిబిఐ వాళ్లు గందరగోళపడిపోతారని నా భయం.

పరిస్థితి ఇలా ఉండగా పాండురంగం ఈ బాంబు పేల్చాడు. ఈయన పోలీసు అని కనిపెట్టేసి ఆ విషయం బాహాటంగా చెప్పేసాడు కూడా. ఎలా కనుక్కున్నాడో మరి? అదే ఆయనా అడిగేరు. ''ఇందాకా సిగరెట్లు అయిపోయినప్పుడు నేను లేచి వెళ్లి కప్‌బోర్డులోంచి కొత్త పాకెట్‌ తీసుకున్నాను చూడు, అప్పుడు కనబడింది నీ పోలీసు యూనిఫామ్‌.''

ఈయనకు బుద్ధి లేదు. యూనిఫాం అక్కడ వదిలేయడమేం? పాండు ఇంటికొస్తాడని అనుకోలేదనవచ్చు. అయినా పోలీసన్నాక ఆ మాత్రం ఊహించవద్దూ…

''పోలీసు కావడం నేరమేమీ కాదుగా'' అన్నారీయన.

''అబ్బే నేరమేమీ కాదులే, ముఖ్యంగా ఇంటిచుట్టూ పోలీసులందర్నీ కాపలా పెట్టుక్కూచున్నప్పుడు…'' అన్నాడు పాండురంగం విశాలంగా నవ్వుతూ.

''అదెప్పుడు చూశావ్‌? నాకే తెలియదు.''

''యూనిఫాం కనబడగానే అనుమానం వచ్చింది. 'సీనరీ బాగుందే' అంటూ కిటికీలోంచి బయటకు చూసాను చూడు. అప్పుడు కనబడ్డారు ఇద్దరు. తుపాకీలు కూడా ఉన్నట్టున్నాయి.''

''అబ్బా, సిబిఐ వాళ్లు అన్ని ఏర్పాట్లు చేసారా?''

''అంటే నీకు తెలియదన్నమాట. ఏమండీ సువర్చల గారూ, కాస్త ఇలా రండి. సూపర్‌మార్కెట్టు నుంచి మీరే ఫోన్‌ చేసి ఈ ఏర్పాట్లు చేయించారా?''

నాకు గొంతు తడారిపోయింది. అతను చాలా ప్రసన్నంగానే అడిగినా నాకు వణుకు ప్రారంభమయ్యింది. ''మీ ఫ్రెండుకు డ్యూటీ ముఖ్యం కదా..'' అని ఏదో చెప్పబోయా.

''పాండూ, నా మాట విను. సిబిఐకు లొంగిపో. అనవసరంగా ఛాన్స్‌ తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోకు.'' అన్నారు మా వారు.

''చూడు శ్రీధర్‌, యుద్ధంలో కూడా నేనెప్పుడైనా వెనుకడుగు వేయగా చూసావా? మంచికో, చెడుకో ఓ మార్గం ఎంచుకున్నాను. నిబ్బరంగా ముందుకు సాగడమే నా పని. దురదృష్టవశాత్తూ మనం చెరోపక్షాన ఉన్నాం.''

''నువ్వీ ఊరు రాకూడదనే దేవుణ్ని ప్రార్థించేను. వస్తే నాకీ ధర్మసంకటం తప్పదని ముందే తెలుసు.''

''నీ సంగతి తెలుసులే'' అంటూ గట్టిగా నవ్వి ''నా సంగతి నీకు తెలుసుగా. ఊపిరున్నంతవరకూ ఛాన్స్‌ తీసుకుంటూనే ఉంటాను. బయట పోలీసులు లోపలికి వచ్చేట్టయితే ఈ పాటికి ఎప్పుడో వచ్చేసి ఉండేవారు. అంటే నేనిక్కడ ఉన్నంతసేపూ క్షేమం అన్నమాట.''

''నిజమే''

''కానీ ఎల్లకాలం నేనిక్కడే ఉండలేను కదా, బయటకు పోవలసినదే.''

''కానీ అది సాధ్యం కాదు, పాండూ''

''గుర్తుందా శ్రీధర్‌, మనం యుద్ధంలో ఉండగా కూడా నువ్వామాట అన్నావోసారి. కానీ నేనేం చేసాను?''

''గుర్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు.''

'' …అవును కానీ శ్రీధర్‌, నీ తుపాకీ ఎక్కడుంది?''

''లేదు. రిపేరు కిచ్చాను.''

''మతి లేదా? ఎవరైనా అంత రిస్కు తీసుకుంటారా?''

ఈయన విషయమంతా చెప్పుకొచ్చారు. ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేసేసి ప్లాను గురించి, పాండు ఇంటికొస్తాడని ఊహించకపోవడం గురించి…

పాండు ఆలోచిస్తూ ఇంకో రెండు సిగరెట్లు తాగేడు. ''చూడు శ్రీధర్‌, నువ్వే ఎలాగోలా ఇక్కణ్నుంచి తప్పించాలి. పోలీసులు కవర్‌ చెయ్యని దారి ఏదో ఒకటి ఉంటుంది. ఆ సంగతి చూడు. లేకపోతే అనవసరంగా సువర్చల గార్ని దీన్లో ఇరికించాల్సి వస్తుంది.''

''అంటే..?''

''ఆవిడ ఉందనే కదా వాళ్లిప్పటి దాకా ఫ్లాటులో చొరబడకుండా ఆగడం జరిగినది. అందుకని ఆవిణ్ని అడ్డుపెట్టుకుని నేను బయటపడతాను. వాళ్లు అడ్డగిస్తే ఆవిణ్ని కాలుస్తాను. నేను కాల్చడానికి వెరవనివాణ్ని నీకు తెలుసుగా శ్రీధర్‌''

నా పై ప్రాణాలు పైనే పోయాయి. లేని నవ్వు పెదాల మీదకు తెచ్చుకుని ''మీరలా ఎన్నటికీ చేయరని నాకు తెలుసులెండి. ఏదో తమాషాకి..'' అనబోయేను.

''తమాషాకి అనడం కాదు. మార్గాంతరం లేనప్పుడు ఏం చేస్తాం. మీరయినా అదే చేస్తారు.'' అన్నాడు పాండురంగం నిర్లిప్తంగా.

''సువర్చలా, పాండు విషయం నీకు తెలియదు. కానీ చూడు పాండూ, మాటవరసకి సువర్చలను బలిచేసి తప్పించుకున్నావే అనుకో. కానీ ఎన్నాళ్లు? ఆర్నెల్లకో, ఏడాదికో దొరక్క తప్పదు కదా.''

''ఆర్నెల్ల దాకా దొరక్కుండా ఉంటానుగా, అది చాలు నాకు. చూడు శ్రీధర్‌. కనీసం మీ ఆవిడ క్షేమం కోరైనా నువ్వు ఏదో ఒకటి చేయాలి.''

''సిబిఐ వాళ్లకి ఫోన్‌ చేసి బయట పోలీసులను వెనక్కి రప్పించమంటాను.''

''కానీ ఆ తర్వాతైనా నన్ను వెంటాడుతారుగా.''

''వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తారు.''

నాకు మతిపోయింది వాళ్ల సంభాషణ వింటూంటే. రాత్రి పదకొండుగంటల వేళ భోజనాలు చేసి, సిగరెట్లు కాలుస్తూ నా ప్రాణాల గురించి పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు. పాండు మా ఇంటికి వస్తున్నాడని అనగానే రంగారావు 'అతను బోనులో చిక్కినట్లే' అన్నాడు. ఇప్పుడు ఎవరి బోనులో ఎవరు చిక్కారో నాకు అర్థం కావటం లేదు. మా చుట్టూ పాండు ఒక వలయం గీస్తే అతని చుట్టూ పోలీసుల ఇంకొక వలయం గీసారు. ఈ వలయాల వలల్లో ఎవరు గేలం? ఎవరు చేప?

''పాండూ, నువ్వు సురక్షితంగా బయటపడడం ఎలాగా అని కనీసం డజన్లు ప్లాన్లు వేసి చూసాను. నీ తరఫు నుంచి. ఊహూఁ ఒక్కటీ పనికి రాదు.''

''శ్రీధర్‌, చిత్రం చూసావా? నువ్వు నన్ను దీన్లో ఇరికించినా నువ్వంటే నాకు కోపం రావటం లేదు. తమాషాగా ఉంది కదూ!?''

''భలేవాడివిలే, ఇరికించింది నువ్వు! ఇక్కడికి రావడం దేనికి, నాకు తెలియబరచడం దేనికి?''

''బాగుంది. నువ్వు పోలీసువాడివవుతావని కల గన్నానా?'' అని నవ్వుతూ అంటూండగానే పాండు  భృకుటి ముడిపడింది. ''అవునూ, నువ్వు పోలీసువి. నా వెంటపడ్డది సిబిఐ. కాపలా ఉన్నవాళ్లకి నువ్వెవరో సరిగ్గా తెలిసే అవకాశం లేదు. అవునా?'' అన్నాడు.

''అవును.'' అన్నారు ఈయన. నిజాయితీ మూర్తీభవించడం అంటే ఇదే కాబోలు. అంతా చేసి నా చావుకి వచ్చింది.

''నువ్వో పని చేయి. కిటికీ సందుల్లోంచి ముందువైపు వెనకవైపు చూసి కాపలా ఉన్నవాళ్లలో నిన్ను గుర్తు పట్టేవాళ్లున్నారేమో చెప్పు. అబద్ధం ఆడవులే. నాకు తెలుసు. కానీ డ్యూటీ, గీటీ అంటూ అబద్ధం చెప్పావో మీ ఆవిడకే డేంజరు. నువ్వు చూసిరా. నాకు తట్టిన ప్లాను తర్వాత చెబుతా.'' అన్నాడు పాండు.

మా వారు చూసి వచ్చారు. ''నన్నెరిగిన వాళ్లెవరూ లేనట్టున్నారు.'' అన్నారు సోఫాలో కూలబడుతూ.

''సరే, అయితే నా ప్లాను విను. నీ యూనిఫాం వేసుకుని వెనకగుమ్మం ద్వారా నేను బయటపడతాను. సువర్చల నాతో వస్తుంది. బాగా దగ్గరగా నడుస్తాం. నా రివాల్వర్‌ సువర్చలకు తగులుతూనే ఉంటుంది. నువ్వు గానీ, ఆవిడగానీ ఏదైనా సైగలు చేసారా, తుపాకీ పేల్తుంది. ముందే చెప్తున్నా.''

నేను ఖంగారు పడ్డాను. ''అలాటీవేమీ చేయను కానీ నన్నెక్కడికి తీసుకెళతారు?''

''చెప్తానుండండి. మనిద్దరం అలా నడుచుకుంటూ పక్కవీధికి వెళ్లాక ఓ టాక్సీ ఆపుతాను. పోలీసు ఆపితే ఎవడైనా సరే నోరెత్తకుండా వస్తాడు. కాస్త దూరం వెళ్లాక పోలీసుల ప్రమాదం లేదనుకున్నాక మిమ్మల్ని వదిలేస్తాను. మీరు ఇంటికి వచ్చేద్దురుగాని.''

''అసలు నువ్వు వెనకదారి నుంచి వెళితే పోలీసులకు అనుమానం రాదూ?'' అన్నారు మా వారు.

''దాని గురించి కూడా ఆలోచించాను. నువ్వు పోలీసువని నేను కనుక్కున్నానన్న విషయం వాళ్లకింకా తెలియదు. అందువల్ల మనం వేషాలు మార్చుకున్న సంగతి వాళ్లు పసిగట్టలేరు. అసలా ఆలోచన వాళ్లకు తట్టనే తట్టదు. నేను వెళ్లి  'పాండు ముందుగుమ్మం నుంచి వెళ్లిపోయే హడావుడిలో ఉన్నాడు. మేం ఇద్దరం మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాం' అంటాం. దెబ్బకి వాళ్లంతా ముందు గుమ్మం వైపు పరిగెడతారు. నేను, సువర్చల జారుకుంటాం.''

''సువర్చల కూడా ఎందుకు వచ్చింది అని అడిగితే?''

''లోపల అతనితో ఒక్కత్తీ ఉండటానికి భయపడింది – అని చెప్తాం.''

''నీ ప్లాను నాకేమీ నచ్చలేదు. తర్వాత నీ ఇష్టం. సువర్చల విషయంలో మాత్రం జాగ్రత్త. తొందరపడి ఏమీ చేయకు.'' అన్నారు మా వారు. ఆయన నిర్లిప్తత చూస్తే నాకు కోపం వచ్చింది. ఆయన మేధాశక్తిని, ముందుచూపును మెచ్చుకుంటాను కానీ ఇవేళ మాత్రం ఆయన తెలివితక్కువతనం చూస్తే మండుతోంది. కానీ ఈ బోనులో ఎవరి పాత్రలేమిటో, ఎవరేం చేయాలో తెలియకుండా పోయింది.

***********
పాండు ఆయన యూనిఫాం వేసుకోవడం అయిపోయింది. తుపాకీ ఒకసారి చెక్‌ చేసుకుని నా కేసి తిరిగి ''పదండి పోదాం'' అని ''శ్రీధర్‌, సాధ్యమైనంత వరకూ నోరెత్తకుండా ఉండు. మీ ఆవిడ గురించి కాస్త ఆలోచించు.'' అన్నాడు షేక్‌హేండ్‌ ఇస్తూ.

''నువ్వూ కాస్త ఆలోచించు.'' అన్నారు మా వారు చిరునవ్వుతో.

''పాండురంగం గారు మంచివారు లెండి. నాకేం  జరగదు. క్షేమంగా తిరిగివస్తా.'' అన్నాను బింకంగా. ఆయన నవ్వి నా తలమీద నిమిరారు. వెళ్లి సోఫాలో కూచున్నారు తాపీగా.

అయిదు నిమిషాల తర్వాత అంత తాపీగానూ బయటకు నడిచివచ్చారు. ఈలోగా మా మీద పోలీసులు టార్చ్‌లైట్‌ వేయడం, ఒక్క ఉదుటున పాండు మీద పడి రెక్కలు విరిచికట్టి పడేయటం, తుపాకీ లాక్కోవడం, నన్ను రక్షించడం జరిగిపోయాయి.

మా వార్ని చూస్తూనే, ''ఏరా శ్రీధర్‌, నీకు తెలిసున్నవాళ్లెవరూ లేరని అబద్ధం చెప్పావు కదూ?'' అన్నాడు పాండు కోపంగా.

''లేదు. నిజమే చెప్పాను.''

''మరి యూనిఫాంలో ఉన్నది నువ్వు కాదని ఎలా తెలిసిందిరా వాళ్లకు?''

''నువ్వే చెప్పావు పాండూ! నేను పోలీసుననే విషయం నీకు తెలియదనే వాళ్లకు చెప్పాను. అలాటప్పుడు నేను సివిలియన్‌ డ్రస్సులోంచి నీ ఎదురుగా యూనిఫాం వేసుకుని పోలీసునని చాటి చెప్పుకోనని వాళ్లకు తెలుసు. ఎవరైనా యూనిఫాం వేసుకుని బయటకు వచ్చేరంటే దాని అర్థం ఏమిటి? అది నేను కాదు…అని.''

''హారినీఁ, ఈ విషయం నాకు తట్టనే లేదు.'' అన్నాడు పాండు నిర్ఘాంతపోతూ.

''నాకు తట్టింది. అందుకే నిబ్బరంగా సువర్చలను నీతో పంపాను.'' అన్నారు మా వారు.

మా వారి తెలివితేటలకు నా కెంతో గర్వం వేసింది. దగ్గరగా చేరి గట్టిగా కౌగలించుకున్నాను. 

Octavus Roy Cohen రాసిన ''Always Trust A Cop”  కథ ఆధారంగా…  (ఆంధ్రప్రభ వీక్లీ 1999లో ప్రచురితం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]

Click Here For Archives