తెలంగాణ కానీయండి, ఆంధ్ర కానీయండి – ఫిరాయింపుదారులందరూ చెప్పేది ఒకే మాట. 'మేం మారేది పదవుల కోసం కాదు, మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే..' అని. చేర్చుకునే పార్టీలు యీ మాటలను ఖండించటం లేదు. ఔనౌనంటున్నాయి. 'ఆయనకు తన నియోజకవర్గం గురించి అక్కర వుంది కాబట్టి చేరాడు, లేనివాళ్లు యింకా అవతలిపార్టీలోనే వున్నారు, కానీ వాళ్లకు కూడా యీ అవగాహన కలిగినపుడు ఎవరు అడ్డుపడినా ఆగకుండా గోడ దూకేసి మా దగ్గరకు వచ్చేస్తారు' అంటున్నారు. కాబట్టి ప్రతిపక్షాలలో వున్నవారి నియోజకవర్గాలలో అభివృద్ధి జరగటం లేదన్నమాట నూటికి నూరుపాళ్లు వాస్తవమే అనుకుని ఆ దిశగా ఆలోచన మొదలుపెట్టాలి.
కేంద్రం ఆంధ్ర లేదా తెలంగాణకు నిధులివ్వకపోతే మనకు ఆవేశం వస్తోంది – 'ఏం ఆంధ్ర రాష్ట్రం దేశంలో భాగం కాదా? మనకు న్యాయంగా రావలసిన వాటా మర్యాదగా యిచ్చేయకుండా దాచుకోవడమేమిటి? ఇచ్చిన కాస్త కూడా ఏదో ముష్టి వేసినట్లు యివ్వడమేమిటి? ఏం మనం పన్నులు కట్టడం లేదా? ఇంత పక్షపాతమేమిటి?' అని. మరి అదే లాజిక్ రాష్ట్రప్రభుత్వానికి అన్వయించినపుడు యిలాటి ప్రశ్నలే వస్తాయి. ప్రతిపక్ష సభ్యులు ఎన్నుకున్న నియోజకవర్గాలు పన్నులు కట్టడం లేదా? వాళ్లు రాష్ట్రంలో భాగం కాదా? అని. రాష్ట్రమన్నాక అన్ని చోట్లా అభివృద్ధి జరగాలి. కొన్ని చోట్లే చేయడమేమిటి? ఇదెక్కడి అన్యాయం? ఈ ముక్క ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిథులు నిలదీసి అడగాలా లేదా? ఆంధ్ర, తెలంగాణల్లో పాలన ప్రారంభమైన ఏడాదిన్నర తర్వాత పార్టీ మారుతున్నవారిని యిన్నాళ్లగా యీ విషయమై ప్రభుత్వాన్ని నిలదీయలేదేమని అడగాలి. ఒక వేళ అడిగి వుంటే వాళ్లు ఏం జవాబు చెప్పారు? 'మీరు మా పార్టీలో మారితేనే మీ నియోజకవర్గంలో అభివృద్ధి.., లేకపోతే లేదు' అనా?
కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యే మాత్రమే ఫిరాయించి, ఎంపీ ఫిరాయించకపోతే ఏం చేస్తున్నారు? అభివృద్ధి జరుపుతున్నారా? ఆపేశారా? ఎంపీ ఫిరాయించి, ఎమ్మెల్యే ఫిరాయించకపోతే ఆ పార్లమెంటుగ స్థానం పరిధిలోని తక్కిన నియోజకవర్గాలను అభివృద్ధి చేసేసి, దీన్ని మాత్రం వదిలేస్తున్నారా? ఇప్పుడేదైనా పంట కాలువ తవ్వారనుకోండి, మధ్యలో ప్రతిపక్ష నియోజకవర్గం రాగానే ఆపేసి, కాస్త దూరం పోయాక అధికార నియోజకవర్గం రాగానే మళ్లీ అక్కణ్నుంచి తవ్వుతున్నారా? ఏమిటో అంతా కన్‌ఫ్యూజింగ్‌గా వుంది. కొందరు వెలుగొండ ప్రాజెక్టు గురించి కోసం చేరామంటున్నారు, మరి కొందరు హంద్రీనీవా కోసం అంటున్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికే 100 కోట్లు విదిలిస్తే, యిక వీటికి ఏం నిధులు వస్తాయి? ఎప్పుడు కడతారు? రాష్ట్ర బజెట్‌లో తగినన్ని నిధులు కేటాయించకపోతే వీళ్లు వెనక్కి ఫిరాయిస్తారా? ఆ ప్రాజెక్టు వలన లాభపడే నియోజకవర్గాల్లో సగం వాటిలో అస్మదీయులు, సగం మంది తస్మదీయులు వుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? తస్మదీయులందరూ అస్మదీయులయ్యేదాకా వేచి చూస్తుందా?
ఇంకో మాట – ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి అధికారపార్టీని ఎన్నుకున్న నియోజకవర్గాల్లో జరిగిందని అనుకోవాలి. వాళ్లింకాయింకా జరుగుతుంది కదాని ఎదురు చూస్తూ వుంటే యిప్పుడు ఫిరాయింపుదార్ల నియోజకవర్గాలు కూడా వచ్చి జాబితాలో చేరితే వాళ్ల వాటా తగ్గిపోదూ? మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన. రైల్వే కంపార్టుమెంటాలిటీ అని వుంది. కంపార్టుమెంటులో వున్న జనం కొత్తవాడెవడైనా లోపలకి వస్తానంటే ప్రతిఘటిస్తారు. ఇప్పటికే చోటు లేక ఛస్తున్నామండీ, కావాలంటే తర్వాతి ట్రైన్‌లో రండి అంటారు. తలుపులు తెరవరు, కిటికీలోంచి బ్యాగు తోస్తూ వుంటే నెట్టేస్తారు. చివరకు జబ్బబలం చూపించి కొందరు లోపలకి చొరబడతారు. తర్వాతి స్టేషన్ వచ్చేసరికి వీళ్లంతా ఏకమవుతారు. అక్కడ ఎక్కబోయేవాళ్లను అడ్డుకుంటారు. అడ్డుకునేవాళ్లలో అందరి కంటె ముందువరుసలో వుండేవాళ్లు- కితం స్టేషన్‌లో చొరబడినవారే! అలాగే ఇప్పటికే అభివృద్ధి అనుభవించేస్తున్న నియోజకవర్గాల ప్రతినిథులు కొత్తగా ఎవరైనా పార్టీలోకి ఫిరాయిస్తూంటే ప్రతిఘటిస్తారు. తిరుగుబాటు చేసేటంత ధైర్యం వుండకపోవచ్చు. కానీ ఫిరాయింపులు ఎక్కువైన కొద్దీ ఒరిజినల్ అస్మదీయుల కేటాయింపుల్లో కోతలు పెరిగిపోతాయని పళ్లు నూరుకుంటూ వుంటారు.
ఈ మనస్పర్థలు తగ్గించడానికి నా సూచన ఏమిటంటే, ఎన్నికల మ్యానిఫెస్టోలోనే పార్టీలు క్లియర్‌గా చెప్పేయాలి – మమ్మల్ని ఎన్నుకున్న నియోజకవర్గాలలోనే అభివృద్ధి, తక్కినవాటికి ఐదేళ్లపాటు గుండుసున్నాయే, ప్రభుత్వం ఏర్పడ్డాక ఫిరాయింపులు ఒప్పుకోం అని. దాని వలన ప్రజలకు చాలా లాభాలున్నాయి. ఎలాగో చెప్తాను చూడండి. ఉదాహరణకి నియోజకవర్గాల అభివృద్ధికై 180 వందల కోట్ల నిధులున్నాయనుకోండి. 180 నియోజకవర్గాలలోను ఒక పార్టీయే గెలిచిందంటే నియోజకవర్గానికి తలా వంద కోట్లు వస్తాయి. దానికి బదులు ఏదైనా పార్టీకి 100 సీట్లు మాత్రమే యిచ్చి అధికారంలో కూర్చోబెడితే అప్పుడు నెగ్గించిన ఒక్కో నియోజకవర్గానికి 1.80 వంద కోట్లు వస్తాయి. అందరినీ అర్ధాకలితో మాడ్చి చంపేబదులు, 100 నియోజకవర్గాలలో ఐదేళ్లపాటు ఝామ్మని అభివృద్ధి సాగిపోతుంది. తర్వాతి టెర్మ్ వచ్చేసరికి వీళ్లు వెనక్కి తగ్గి తక్కిన నియోజకవర్గాలవాళ్లు అధికారపక్షాన్ని ఎన్నుకోవాలి.
సరే యిదంతా భవిష్యత్ ప్రణాళిక అనుకోండి. ప్రస్తుతానికి టిడిపి ఫిరాయింపులను ప్రోత్సహించడానికి కారణం 'గంటలో పడగొడతా' అని జగన్ విసిరిన ఛాలెంజే అని టిడిపి నాయకులంటున్నారు. జగన్ అలా అనడంతోనే బాబుకి రోషం వచ్చి తన తడాఖా చూపించడానికి యిలా చేస్తున్నారని, జగన్ వాచాలత్వానికి తగిన శిక్ష పడిందని మీడియా అంటోంది. ఇప్పుడు నాకు వచ్చిన సందేహం ఏమిటంటే – వైసిపి నుంచి పార్టీ మారినవారు నియోజకవర్గంలో అభివృద్ధి జరగటం లేదనే బాధతోనే పార్టీ ఫిరాయించి వుంటే మరి జగన్ స్టేటుమెంటు యిచ్చేవరకూ ఆగారెందుకు? అని. జగన్ ఆ స్టేటుమెంటు యివ్వకపోతే నియోజకవర్గం ఏమై పోయినా ఫర్వాలేదా? తాను ఆ స్టేటుమెంటు యివ్వలేదని, ఒక ప్రశ్నకు జవాబుగా 'నా వద్ద మెజారిటీ సభ్యులుంటే…' అంటూ క్వాలిఫై చేశానని జగన్ నాలుగు రోజులు పోయాక వివరణ యిచ్చారు. ఆ ఆలస్యం చేయకుండా వెంటనే 'నేను అనలేదు' అని ఆయన వుంటే వీళ్లేం చేసేవారు? ఏమిటో, అంతా గందరగోళంగా వుంది. ఓ ఏడాది పోయిన తర్వాత యీ ఫిరాయింపుదార్లు 'మా నియోజకవర్గం, నా ఫిరాయింపుకు ముందు- ఫిరాయింపుకు తర్వాత' అని గణాంకాల పట్టిక విడుదల చేస్తే మనకు స్పష్టత రావచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2016)