ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని అని ఎప్పుడూ అమెరికాలోని ప్రవాస భారతీయులు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా కాన్సస్ లో జరిగిన రిపబ్లిక్ డే సంబరాల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రదర్శించిన దేశభక్తి పూరిత సంస్కృతిక అంశాలు ఆహూతులని విశేషంగా ఆకట్టుకున్నాయి. స్థానిక భారత సంఘం IAKC ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాట్స్ సహా పలు రాష్ట్ర సంఘాల ప్రతినిధులు కళాకారులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భారత మేజర్ శ్రీ అశోక్ ప్రత్యేక అతిదిగా పాల్గొని గణతంత్రదినోత్సవ విశిష్టతను సవివరంగా తెలియచేశారు.
స్థానిక నాట్స్ సంస్కృతిక బృంద నిర్వహణలో దేశభక్తి ప్రపూరితంగా బాలలు ఆలపించిన మిలేసుర్ మేరా తుమ్హారా గేయం సభికులని రోమాంచితం చేసింది. మువ్వన్నెల జండాలు చేతబూనిన చిన్నారులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉల్లాసభరితంగా పాల్గొని కార్యక్రమానికి వన్నెతెచ్చారు. జాతీయ సమైక్యత ప్రతిబింభించేలా వారు చేసిన బృంద నృత్యం గణతంత్ర దినోత్సవ సంబరాల్లో ఆబాల గోపాలాన్ని ఉర్రూతలూగించింది.
ఈ వేడుకల్లో స్థానిక భారతియులు, నాట్స్ సేవాదళ బృందం, బంధుమిత్రులతో పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా జరిగేందుకు సహకరించారు. నాట్స్ కాన్సస్ సమన్వయకర్త రవి గుమ్మడిపూడి, బృందం సభ్యులు రాజ గోపాలుని, వెంకట్ మంత్రి, శ్రీదేవి గొబ్బూరి, రాజ శేఖర్ కీర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఉన్నారు.