ఎమ్బీయస్‌: స్పార్టకస్‌ – 2/5

ఈలోగా రోమన్‌ సైన్యాలు ఆఫ్రికాను జయించడం జరిగింది. రోమన్‌ వ్యాపారులు ఆఫ్రికాలో చొచ్చుకుపోయారు. వాళ్లను బానిసలుగా పట్టుకుని తెచ్చేవారు. ఎత్తుగా, శిలావిగ్రహాల్ల్లా కనబడే ఆఫ్రికన్లు చచ్చేట్లా కొట్టుకుంటూంటే రోమన్లకు వెర్రెక్కిపోయేది. చూడడానికి విరగబడేవారు. యుద్ధాలెప్పుడు…

ఈలోగా రోమన్‌ సైన్యాలు ఆఫ్రికాను జయించడం జరిగింది. రోమన్‌ వ్యాపారులు ఆఫ్రికాలో చొచ్చుకుపోయారు. వాళ్లను బానిసలుగా పట్టుకుని తెచ్చేవారు. ఎత్తుగా, శిలావిగ్రహాల్ల్లా కనబడే ఆఫ్రికన్లు చచ్చేట్లా కొట్టుకుంటూంటే రోమన్లకు వెర్రెక్కిపోయేది. చూడడానికి విరగబడేవారు. యుద్ధాలెప్పుడు యిద్దరు థ్రేసియన్లు, లేదా యిద్దరు ఆఫ్రికన్ల మధ్య జరిగేవి. ఎందుకంటే వాళ్ల యుద్ధరీతులు వేర్వేరు. బేటియాటస్‌ ఈ మల్లయుద్ధాలమీద బోల్డంత సంపాదించాడు. అతను ఎప్పటికప్పుడు కొత్త బానిసలను తెప్పించుకుని వాళ్లను మల్లయోధులుగా తయారుచేసేవాడు. దానికోసం అయిదుదేశాల్లో ఏజంట్లను పెట్టాడు. ఓ బానిసను మల్లుడిగా మార్చడానికి వాళ్లకు శుబ్భరంగా తిండి పెట్టేవాడు. స్త్రీని సమకూర్చి వాళ్లకు హుషారు కలిగించేవాడు. ఆరోగ్యంగా వుండేట్లు చూసేవాడు. అందువల్ల అతని మల్ల కేంద్రానికి ఎంతో పేరు వచ్చింది. అయిదు సంవత్సరాలు తిరిగేసరికి అతను క్రమంగా ఓ బలమైన ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదిగాడు. స్థానికంగా వున్న పోలీసులకు లంచాలిచ్చి తన కేంద్రానికి రక్షణ కల్పించుకునేవాడు.  

ఇతని కేంద్రం సంపాదించిన ఖ్యాతి చూసి ప్రతీ ఊళ్లోనూ ఇలాటి మల్లయుద్ధ కేంద్రాలు వెలిసాయి. ఇతనిలాగే ఈ వ్యాపారంలో బాగా గడించి వాళ్లు సెనేటర్లుగా ఎన్నికయి, చట్టాన్ని తమ కనుకూలంగా మార్చుకున్నారు. బానిస వ్యాపారాన్ని, ఈ మల్లయుద్ధ మారణక్రీడను ప్రోత్సహించారు. ఈ కేంద్రాల్లో  వందల కొద్దీ మల్లుల జంటలు రోజుల తరబడి, వారాల తరబడి పోట్లాడేవారు. క్రమంగా మల్లులకు కొరత ఏర్పడింది. మల్లులుగా మారగలిగిన బానిసలకై వెతుకులాట జోరుగా సాగింది. బేటియాటస్‌ రెండేళ్ల కోసారి తన ఏజంట్లను న్యూబియా ఎడారికి పంపుతాడు. అక్కడ అష్టకష్టాలు పడి మొండికెత్తిన బానిసలని  తమకు అమ్మేయమని మేస్త్రీలకు చెప్పి వుంచాడు. అలాటి బానిసలే మంచి యోధులు కాగలరు. స్పార్టకస్‌ను, గ్యానికస్‌ అనే మరో థ్రేసియన్ను గని మేస్త్రీలు అమ్మేశారు. బేటియాటస్‌ ఏజంట్లు వాళ్లకు గొలుసులు కట్టి అలెగ్జాండ్రియాలో నుండి ఓడలో పంపారు. నేపుల్స్‌ వద్ద ఇతని ఓడరేవు ఏజంటు వాళ్లను కేపువాకు డోలీల మీద తీసుకువచ్చాడు. వాళ్లను బేటియాటిస్‌ మల్లులుగా తీర్చిదిద్దాడు.

కొన్నాళ్లకి అతను వరీనియా అనే ఓ ఆడ బానిసను అతి చవకగా కొన్నాడు. ఆమె ఓ జర్మన్‌ యువతి. చాలా అందగత్తె. మరి అంత చవక ఎందుకంటే ఆమెకు మగవాళ్లంటే అసహ్యం. చెప్పినమాట వినే రకం కాదు. బేటియాటిస్‌ ఆమెను అనుభవించి తర్వాత ఆమెచేత వేశ్యావ్యాపారం చేయిద్దామనుకున్నాడు. కానీ అనుభవించడం అతని తరం కాలేదు. పిచ్చెత్తిన పులిలా అతన్ని గిచ్చి, గీరి, కొరికి వదిలిపెట్టింది. అతని పడగ్గదిలో వస్తువులన్నీ విరక్కొట్టింది. చంపి పారేద్దామా అనుకున్నాడు. లేదా అమ్మి పారేద్దామా అనుకున్నాడు. కానీ అంతలోనే ఓ ఐడియా వచ్చింది. బలిసిన మల్లుడికి ఒకడికి అప్పగించి దాని పొగరు అణచాలని అనుకున్నాడు. అతని కంటికి స్పార్టకస్‌ కనబడ్డాడు. అతనంటే కూడా బేటియాటిస్‌కి అసహ్యమే! అతన్ని పిలిచి 'ఇదిగో ఈ పిల్లను ఏమైనా చేయి, కానీ అనాకారిని మాత్రం చేయవద్దు' అన్నాడు. ఆమెను చూస్తే స్పార్టకస్‌కు గౌరవం కలిగింది. ఆ రాత్రి ఇద్దరూ ఒకే గదిలో పడుక్కున్నా ఆమెను ముట్టుకోలేదు. పైగా చలి వేస్తోందని తన చాప ఆమె వైపు జరిపాడు. ఇతని దయకు ఆమె కరిగిపోయింది. ఇతన్ని ఆరాధించింది. వాళ్లిద్దరూ చేరువయ్యారు. 

ఇలా నడుస్తూండగా ఓ రోజు ఓ వింత సంఘటన జరిగింది. కథలో ముందుగా చెప్పుకున్న కైయస్‌ వున్నాడు కదా, అతనికో ఫ్రెండు వున్నాడు, బ్రాకస్‌ అని. బాగా డబ్బున్నవాడు. అతను బేటియాటస్‌ కేంద్రానికి వచ్చి ఓ వింతరకమైన మల్లయుద్ధం కావాలని అడిగాడు. రెండు జంటల యోధులు కావాలట. చచ్చేదాకా పోట్లాడాలి. దిగంబరంగా పోట్లాడాలి. వాళ్లలో ఒకడు థ్రేషియన్‌ అయి వుండాలి, మరొకడు ఆఫ్రికన్‌ అయివుండాలి. 'కొన్ని మల్లయుద్ధ కేంద్రాలలో చచ్చిపోయినట్టు నటిస్తున్నారు. ఓ సారి కింద పడిపోయి చచ్చిపోయినట్టు నటిస్తే మా దగ్గర కుదరదు. ఓడిపోయినవాడి తల నరికి చూపించాలి.' అన్నారు. ఈ వేడుక చూసే  ప్రేక్షకులు ఎవరయ్యా అంటే వీళ్లిద్దరూ కాక వీళ్ల ఫ్రెండు మరొకడు, అతని భార్యా మాత్రమే! కావాలంటే ఎంత డబ్బయినా తీసుకో, కానీ ఏర్పాటు చేయి అన్నాడు బ్రాకస్‌. 

ఇందులో తిరకాసేమిటంటే థ్రేసియన్లు చిన్న బాకుతో పోట్లాడతారు. ఆఫ్రికన్లు వల, త్రిశూలంతో పోట్లాడతారు. ఆఫ్రికన్‌ విసిరిన వలలో థ్రేసియన్‌ బాకు పడితే అతని పని అంతటితో సరి! అది సమవుజ్జీల మధ్య యుద్ధం కాదు. అందుకే బేటియాటస్‌ మొదట్లో ఈ షరతుకి ఒప్పుకోలేదు. కానీ వచ్చినవాళ్లు బోల్డంత డబ్బిస్తాననడంతో సరేననేసాడు. అతనికేం పోయింది? వాళ్లిచ్చే డబ్బుతో ఇంకో మల్లుణ్ని కొంటాడు. ఆ నాటి మల్లయుద్ధానికి నలుగురు మల్లుల్ని ఎంపిక చేశాడు. వాళ్లలో స్పార్టకస్‌ ఒకడు. అతను చిన్నబాకుతో పోట్లాడతాడు. దీనివల్లనే అతను థ్రేసియన్‌ అనుకున్నారు కానీ నిజానికి థ్రేస్‌ వాడు కాదని కొందరు చరిత్రకారులంటారు. కానీ ఈ పుస్తక రచయిత మాత్రం స్పార్టకస్‌ థ్రేస్‌వాడే అన్నాడు. ఆఫ్రికన్‌తో పోట్లాడి చావడానికి స్పార్టకస్‌ను ఎందుకు ఎంచుకున్నాడంటే స్పార్టకస్‌ అంటే తక్కిన బానిసలు గౌరవం చూపుతున్నారు. అతనితో కష్టం, సుఖం చెప్పుకుంటున్నారు. అతను ఆ జర్మన్‌ పిల్లను తన భార్య అని అందరితో చెప్పుకుంటున్నాడు. అందరిలోనూ ఇలాటి భావాలు మరింత వ్యాప్తి చెందడానికి ముందే స్పార్టకస్‌ను బలి వేసేస్తే సరి అనుకున్నాడు బేటియాటస్‌. కత్తియుద్ధం మాత్రమే పెడితే సార్టకస్‌ చేత యింకా కొన్ని యుద్ధాలు చేయించి మరింత సంపాదించవచ్చు కానీ యిలాటి సందర్భం, యింత డబ్బు వస్తున్నపుడు వీణ్ని చావనివ్వడమే మంచిది అనుకున్నాడు బేటియాటస్‌. 

ముందుగా ఓ థ్రేసియన్‌, ఓ యూదుడు కత్తులతో కొట్లాడుకున్నారు. కాస్సేపటికి యూదుడిది పైచేయి అయింది. థ్రేసియన్‌ను పొడిచాడు. అతను రక్తంలో విలవిల కొట్టుకుంటున్నాడు. అంతలోనే యూదుడికి ఏం తోచిందో ఏమో, కత్తిని యిసుకలోకి విసిరేశాడు. తలవంచుకుని నిలబడ్డాడు. దెబ్బలాడు, దెబ్బలాడు అంటూ పక్కనున్న శిక్షకుడు కొరడా పెట్టి కొట్టినా అతను కదల్లేదు. చూసే రోమన్లు కూడా చంపు, చంపు అని అరిచారు. అయినా అతను మెదల్లేదు. సాటి బానిసను ఎందుకు చంపాలన్న ఆలోచన వచ్చి ఆగిపోయాడు. కానీ అతను ముందు కొట్టిన దెబ్బలకి థ్రేసియన్‌ చచ్చిపోయాడు. అతను చచ్చిపోయాడని ఋజువు చేయడానికి సుత్తితో అతని తల పగలకొట్టి ప్రేక్షకులకు చూపించారు బేటియాటస్‌ మనుష్యులు. ఇదంతా చూసి స్పార్టకస్‌తో ద్వంద్వ యుద్ధం చేయవలసిన ఆఫ్రికన్‌ చలించిపోయాడు. 'స్పార్టకస్‌! నేను నిన్ను చంపను' అన్నాడు. 'మనం దెబ్బలాడకపోతే యిద్దరమూ ఛస్తాం' అన్నాడు స్పార్టకస్‌ నిశ్చలంగా. 

కాస్సేపటిలో వాళ్ల యుద్ధం ప్రారంభమైంది. ఆఫ్రికన్‌ వాడు రంగస్థలంలోకి దిగాడు. దిక్కులు పిక్కటిల్లేలా యుద్ధనినాదం చేశాడు. కానీ స్పార్టకస్‌వైపు కాకుండా వేడుక చూడడానికి వచ్చిన రోమన్ల కేసి పరిగెట్టాడు. ఆరడుగుల ఎత్తున్న కంచె అడ్డువస్తే దాన్ని పీకి పారేశాడు. అతను రోమన్లను ఎటాక్‌ చేసే లోపున సైనికులు బల్లాలు విసిరి అతన్ని చంపేశారు. అంతా చూస్తూ స్పార్టకస్‌ అలాగే నిలబడ్డాడు. తాము కుదుర్చుకున్న బేరం యిలా అర్ధాంతరంగా ముగియడంతో బ్రాకస్‌ సగం డబ్బు మాత్రమే చెల్లించాడు. జరిగిన ఆర్థిక నష్టంతో బేటియాటస్‌కు కోపం వచ్చింది. ఓ ఆఫ్రికన్‌ యిలా క్రమశిక్షణ తప్పి చరించాడు కాబట్టి తక్కినవాళ్లకు గుణపాఠం చెప్పడానికి మల్లులలోంచి మరో ఆఫ్రికన్‌ను ఎంచుకుని, అప్పటికప్పుడు శిలువ వేయించాడు. ఆ శవం వీళ్ల ముందు వేెళ్లాడుతూండగా వీళ్లకు తిరుగుబాటు చేసే ఆలోచన రాదని బేటియాటస్‌ యోచన. 

ఇది జరిగిన కొన్నాళ్లకు సిసిలీలో మూడు పెద్ద తోటలలో తిరుగుబాట్లు లేచాయి. రోమన్లు వాటిని అణిచేశారు. పట్టుకున్న వాళ్లలో 900 మందిని శిలువలపై వేలాడతీశారు. తక్కినవాళ్లను ఓడలవాళ్లకు అమ్మేశారు. అలా అమ్మేసినవాళ్లలో క్రిక్సస్‌ అనే ఓ గాల్‌ దేశస్తుడిని బేటియాటస్‌ ఏజంట్లు చూశారు. అతనో మొండిఘటంగా పేరుబడడం వల్ల తక్కువ ధరకే లభించాడు.  క్రిక్సస్‌ ఈ మల్లకేంద్రంలో చేరి స్పార్టకస్‌ అంటే గౌరవం పెంచుకున్నాడు. స్పార్టకస్‌తో బాటు గనుల్లో పనిచేసి, ఇప్పుడు మల్లకేంద్రంలో కూడా తోడుగా వున్న గ్యానికస్‌ అనే అతను కూడా స్పార్టకస్‌తో ఆఫ్రికన్లను చంపిన ఉదంతం గురించి చర్చించాడు.

ఓ రోజు స్పార్టకస్‌ ఆలోచనలు ఘనీభవించాయి. 'ఇకపై ఏ మల్లుణ్ని నేను చంపను' అని ప్రకటించాడు.  ఓ అరడజనుమంది అతని మాటలు విన్నారు. క్రమంగా వాళ్లు పెరిగారు. అందరూ మౌనంగా తలాడించారు. 'అయితే ఏం చేద్దాం?' అన్నాడు గ్యానికస్‌. స్పార్టకస్‌ లేచి మాట్లాడడం మొదలెట్టాడు. 'అడ్డుగోడలు, మనుష్యుల మధ్య తేడాలు లేని రోమ్‌ను సృష్టించాలి మనం' అంటూ. శిక్షకులు యిద్దరు వచ్చి అతన్ని కొరడాతో కొట్టి ఆపబోయారు. మల్లులు వాళ్లమీద పడి చంపేశారు.  స్పార్టకస్‌ భార్య వరీనియా నాయకత్వంలో అక్కడి ఆడాళ్లు వంటశాలలో వున్న సైనికులను చంపేశారు. 'వెళ్లి తలుపు మూసి రండి, నేను మాట్లాడాలి' అన్నాడు స్పార్టకస్‌. ఈ గొడవ ఏమీ బయటవాళ్లకు తెలియకుండా తలుపులు మూసి వచ్చారు. అప్పుడు స్పార్టకస్‌ ప్రకటించాడు – ''నా తండ్రిగాని, తాతగాని వాళ్ల జీవితకాలంలో ఒక్కక్షణం స్వేచ్ఛావాయువులు పీల్చిన పాపాన పోలేదు. కానీ నేనిప్పుడు స్వేచ్ఛాజీవిని. ఇక ముందెన్నడూ నేను మల్లుణ్ని కాను. ఇంకో మల్లుణ్ని చంపేముందు నేనే ఛస్తా. మీరు నా ప్రజలేనా?' అని అడిగాడు.

 అప్పటిదాకా తన జీవితం గురించి పెద్దగా ఆలోచించని స్పార్టకస్‌ ఆనాటి ఘటనతో మారిపోయాడు. సాటి మల్లుడితో పోరాడడానికి బదులు మృత్యువును స్వయంగా ఆహ్వానించిన ఆఫ్రికన్‌ అతన్ని జాగృతం చేశాడు. స్పార్టకస్‌ ఉపన్యాసానికి వెంటనే స్పందన లభించింది. చచ్చిపోయిన శిక్షకుల కత్తులు తీసుకున్నారు ఈ మల్లులు. వంటగదిలోంచి యినుపసామాను సేకరించారు. అందరూ కలిసి శిక్షకులను, సైనికులను ఎదిరించారు. ఓ వైపు సుశిక్షితులైన, ఆయుధధారులైన సుమారు వందమంది సైనికులు, మరోవైపు రెండువందల మంది మల్లులు. వీళ్లకు సరైన ఆయుధాలు లేవు. యుద్ధం ఎలా చేయాలో నేర్చుకోలేదు.

 కానీ స్పార్టకస్‌ అప్పటికప్పుడు యుద్ధవ్యూహాన్ని రచించాడు. అతని మాటను మల్లులందరూ విన్నారు. 'రాళ్లు విసరండి' అన్నాడు స్పార్టకస్‌. సైనికులు ఈటెలు విసిరారు కానీ ఓ సారి విసరడంతో వాటి పని సరి. పైగా వాళ్లకున్న కవచాలు, శిరస్త్రాణాలు చచ్చేటంత బరువు. వీళ్లకు బట్టల బరువు కూడా లేదు. రాళ్లతోనే వీళ్లు ఆ యుద్ధాన్ని జయించారు. మల్లకేంద్రంలోంచి బయటపడి కేపువా రోడ్డుమీద పడ్డారు. (సశేషం) (ఫోటో- ఆఫ్రికన్‌, థ్రేషియన్ల పోరాటం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2016) 

[email protected]

Click Here For Archives