రాజీ పడటం నేర్చుకో..ఇది ఇండియా

లైఫ్‌లో కొన్ని సందర్భాల్లో మనం రాజీ పడుతూంటాం.మరి కొన్ని చోట్ల అస్సలు రాజీపడం. ఇది కామన్. మనకి వాటర్ వర్క్స్ వాళ్ళు మంచి నీళ్ళని చెప్పి బురద నీళ్ళు సప్లయ్ చేస్తారనుకోండి. అనుకోవటమేమిటి-ఓ పక్క…

లైఫ్‌లో కొన్ని సందర్భాల్లో మనం రాజీ పడుతూంటాం.మరి కొన్ని చోట్ల అస్సలు రాజీపడం. ఇది కామన్. మనకి వాటర్ వర్క్స్ వాళ్ళు మంచి నీళ్ళని చెప్పి బురద నీళ్ళు సప్లయ్ చేస్తారనుకోండి. అనుకోవటమేమిటి-ఓ పక్క చేస్తూన్టేనూ-అని మీకనిపించవచ్చు. అయినా మనం ఎవరికీ కంప్లయింట్ చేయం. ఎందుకంటే చేసినా పట్టించుకునే దిక్కుండదు గనుక. అలాగే వచ్చే వాళ్ళు డైనేజ్ పాబ్లెం గురించి పట్టించుకోరు. అక్కడా నానా గొడవా చేసి చివరకు రాజీపడిపోతాం. 

ఆన్‌లైన్‌లో కొన్న సరకు దిఫెక్టివ్ ది డెలివరీ చేస్తారు. అడ్డమైన వాడికీ కంప్లైట్ చేసి చేసి అలసిపోయి రాజీ పడిపోతాం.

అలాగే రాజేష్ ప్రేమించిన లైలా అతన్ని కాదని గీజేష్ అనే వాడిని లవ్ చేస్తుంది. చేసేది లేక రాజేష్ రాజీపడి తను అంతగా లైక్ చేయని సైలాతో అడ్జస్ట్ అయిపోతాడు.

ఎమ్పీయో ఏమ్మేల్యేయో అవాలనుకుని కార్పోరేటరుగా  రాజీపడే కేటగిరీ ఇంకోటి.

అమెరికా వెళ్ళడం లైఫ్ ఎయిమ్ అయినా వీసా రిజెక్ట్ అయేసరికి రాజీపడి రష్యా వెళ్ళిపోతాం. ఇలా జీవితంలో సవా లక్ష రాజీలు. అసలు జీవిత మంటేనే రాజీ అంటారు కొందరు రాజీ రాయుళ్ళు.

ఇంతవరకూ ఓకే.

కానీ మనకు ఘోరమయిన అన్యాయం జరిగినప్పుడు కూడా నోరు మూసుకుని రాజీపడు అని మన నెవరైనా శాసిస్తే?

ఎవరో కాదు-మనందరం గౌరవించే జడ్జీలూ మనందరం గత్యంతరం లేక ఎన్నుకునే ప్రభుత్వాలూ మనల్ని మోసాలూ అక్రమాలూ అన్యాయాలనుంచి రక్షించాల్సిన పోలీసులూ -అందరూ కూడా ఎందుకొచ్చిన గొడవలు-రాజీ పడిపో-అంటూ మనకే నీతులు చెప్పటం మొదలు పెట్టారనుకోండి. మనకు ఎక్కడ మండాలో అక్కడ మండుద్ది.  

ఈ మధ్య ఒక తమిల్నాడు జుడ్జ్‌గారి దగ్గరకు ఒక రేప్ కేస్ వచ్చింది. ఆ జుడ్జ్‌గారు సినిమాల్లో లాగా ఒక రివల్యుషనరీ జడ్జ్జ్‌‌టమెంట్ ఇచ్చేసి ఆలిండియా లెవల్లో పేరు పఖ్యాతులు కొట్టేయాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తుంటే ఆ అవకాశం ఈ కేస్‌లో దొరికినట్లయింది. బహుశా ఆయన అలాంటి సెన్సేషనల్ జడ్జ్‌మెంట్ ఇచ్చిన పాత హిందీ సినిమా దుష్మన్ చూసిఉంటాడు. రాజేష్‌ఖన్నా తను చేసిన ఆక్సిడెంట్‌లో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ సినిమా జడ్జ్ తీర్పు ఇచ్చాడు. అలాంటి తీర్పు ఇవ్వటం వల్ల మాంచి బాక్సాఫీస్ సినిమాకి కధ తయారు అవుతుంది అని ఆ సినిమా రైటర్‌కి ఐడియా వచ్చి అలాంటి మషాలా కోర్టూ,మషాలా జడ్జ్‌మెంటూ కల్పించేసాడు.

ఇప్పుడీ తమిళనాడు జడ్జ్‌కి కూడా అలాంటి ఐడియాయే వచ్చి ఉంటుంది. అందుకని తనూ తక్కువ కాదని రుజువు చేసుకోడానికి ఒక సెన్సేషనల్ జడ్జ్‌మెంట్ ఇచ్చేసాడు. ఆ తీర్పు ఏంటంటే రేప్ చేసిన వాడూ, రేప్‌కి గురి అయిన అమ్మాయీ కలసుకుని కేస్ లేకుండా సెటిల్మెంట్ చేసుకోవాలని!

అంటే ఆ కేస్ ఎలా సెటిల్ అవుతుందో ఒక ఫ్లాష్ ఫార్వార్డ్ సీన్ వేసుకుని చూడండి.

శీలక్ష్మీ! నేను నిన్ను రేప్ చేసిన మాట నిజమే-కానీ నేరం నాది కాదు. అది మా వంశ పారంపర్యంగా వస్తున్న ఆచారం. మా ముత్తాత, మాతాత, మానాన్న అందరూ రేప్‌లు అనాదిగా చేస్తూ వస్తున్నదే-కొత్తేం కాదు. కానీ నేరం మా వంశానిది కూడా కాదు. మేము తాగే విస్కీది. ఎందుకనో విస్కీ పదహారు పెగ్గులు కొట్టగానే ఎదురుగ్గా ఎవరుంటే వాళ్ళను రేప్ చేసేస్తాం. మా ముత్తాత రేప్‌కేస్ ఇంకా ఇంతవరకూ కోర్ట్‌లోనే ఉంది. కాని మా ముత్తాత పోయి పదేళ్లయింది. ఈ సంగతి కోర్ట్‌కి ఇంకా తెలీదు..ఇక మాతాత రేప్‌కేస్ సుపీం కోర్ట్ వరకూ పోయింది. అది తేలేప్పటికి ఆయనేలాగూ ఉండదు. పైకెళ్ళి పోతాడు. రేప్ చేసిన మర్నాడే బెయిల్ తీసుకున్నాడు కనుక ఆయన లైఫంతా హ్యాపీగా గడచిపోయింది. మరి మా నాయన ఎనిమిది రేప్‌లు చేసాడు. అప్పటికి ఆయన వయసు ఇరవై రెండేళ్ళు. మా లాయర్ అద్భుతంగా వాదించి మానాన్న మైనర్ అనీ అంచేత జైలుశిక్ష వేయడానికి వీల్లేదని బహ్మాండంగా వాదించి గెలిపించాడు. మా నాయనకు వయసు పదహారేళ్ళే అని బీహార్ నుంచి బర్త్ సర్టిఫికేట్ పొడ్యూస్ చేసాడు. దాంతో ఆయన్ని చిన్న పిల్లల జువెనైల్ హోమ్‌లో ఉంచారు. అక్కడ ఉండగానే ఇంకో అరడజను రేప్‌లు చేసాడు గానీ చాలా వరకూ పోలీసులు కోర్ట్ వరకూ పోనీకుండా మ్యానేజ్ చేసేసారు. ఒకటి రెండుకేసులు కోర్ట్‌కి పోయినా గానీ మైనర్ గనుక ఇంకో రెండు నెలలు హోమ్‌లో ఉండమన్నారు.

కనుక ఇప్పుడు మనిద్దరం రాజీకి రావటం మంచిది శీలక్ష్మీ-రాక పోయినా నాకు నష్టమేం లేదు. రెండు నెలలు జువెనైల్ హోమ్‌లో హ్యాపీగా ఉంటా. నాకు కాపలా ఉండే పోలీసులను ఎలా మ్యానేజ్ చేసుకోవాలో నాకు తెలుసు.

నేను రాజీకి వప్పుకోకపొతే?

నీకే నష్టం.

నాకేమి నష్టం?

నష్టం కాదామారి? మీ సిస్టర్‌ని ఇందాకే మా వాళ్ళు కిడ్నాప్ చేసి ఓ ఫాంహౌస్‌లో దాచారు. నువ్వు అవుటాఫ్ కోర్ట్ సెటిల్‌మెంట్‌కి వప్పుకోలేదనుకో దాన్ని కూడా మొత్తం మాగ్యాంగ్ అంతా కలసి రేప్ చేస్తాం.

ఇదన్యాయం-నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

అవుటాఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అంటే ఇలాగే ఉంటుంది మరి. పోనీ ఇంకో చాయిస్ ఇస్తా! ఎలాగూ ఊళ్ళో అందరికీ నేను నిన్ను రేప్ చేసానని తెలిసిపోయింది.అంటే నిన్నెవ్వడూపెళ్లి చేసుకోడు.అవునా?

xxxxxxxxxxxxxx

చేసుకోరని నీకూ తెలుసు. అందుకే సైలెంట్‌గా ఉన్నావ్. ఇప్పుడు నువ్వు అవుటాఫ్ కోర్ట్ సెటిల్మెంట్‌కి వప్పుకున్నావనుకో-నేను నిన్ను పర్మనెంట్‌గా నా సెకండ్ సెటప్‌గా మెంటైన్ చేస్తా. ఎలావుంది ఐడియా?

ఛీ నీకు సిగ్గు లేదూ ఇలా మాట్లాడ్డానికి? అయినా నాకు కావలసింది నీకు శిక్ష పడటం. అంతేగాని నీతో సెటిల్మెంట్ చేసుకోవలసిన అవసరం నాకులేదు.

ఉందని జడ్జీగారూ మీ లాయరూ ముక్త కంఠంతో ఘోషిస్తున్నారు. అలా సెటిల్ చేయమని మీ లాయర్‌కి నేను చాలా మనీ ఇచ్చా

నేనిప్పుడే టీవీ చానల్‌కి వెళ్లి ఈ విషయాలన్నీ చెప్తా

ఇందాకే మీ బంధువులకు కూడా అయిదు లక్షలిచ్చా 

సెటిల్మెంట్ చేయమని వాళ్ళంతా వప్పుకున్నారు తీ ఏసెస్ బార్లో ఉన్నారు వాళ్ళంతా ఇప్పుడు-కావాలంటే నీ సెల్ కొట్టి మాట్లాడు-

వాళ్ళెవరు వప్పుకోడానికి?అన్యాయం జరిగింది నాకు 

వాళ్ళనలా కొట్టి పారేస్తే ఎలా? నీ సైడ్ విట్‌నెస్లు వాళ్ళే కదా అలా నీ దగ్గర డబ్బు తీసుకున్నారని కోర్ట్‌లో చెబుతా

అవుటాఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అంటే ఇంక నీకు నేనే కోర్ట్ నేనే జుడ్జ్ నేనేం తీర్పు ఇచ్చినా నోర్మూసుకుని పడుండాలి. అర్థమయిండా? అన్నట్లు ఇంకో విషయం! ఇప్పుడే అందిన వార్త  మా గ్యాంగ్ మీ నాన్నని ఇంకాసేపట్లో లేపేయబోతున్నారు. నువ్వు నా సెటిల్మెంట్‌కి వప్పుకోలేదనుకో-పోతాడు-వప్పుకుంటే వస్తాడు. ఆలోచించుకో  తొందరేం లేదు. అయిదు నిమషాలు టైముంది. 

ఇలా ఉంటుందా అవుటాఫ్ కోర్ట్ సెటిల్మెంట్ లక్కీగా సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆ తమిళనాడు జడ్జ్‌కి చివాట్లేసి ఇలాంటి కేసుల్లో అలాంటి సెన్సేషనల్ జడ్జిమెంట్లు ఇవ్వడానికి చట్టం వప్పుకోదని చెప్పి ఆ తీర్పు కాన్సిల్ చేయించారు.

నిజానికి అలాంటి సున్నితమైన కేసుల్లో మరోసారి అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జడ్జ్‌లను నియంతించే గైడ్‌లైన్స్ ఇప్పటికీ లేవు.

అందుకని చిన్నప్పటి నుంచే మన పిల్లలకు రాజీపడటం నేర్పించాలి. ఎందుకంటే ఇది ఇండియా!  

యర్రం శెట్టి సాయి