విదేశాల్లో వుండే సండే పేపరు కాన్సెప్ట్‌తో యిక్కడ ఒక వీక్లీ పేపరు ప్రారంభించాలనే ఐడియా వినోద్‌కు వుండేది. అప్పట్లో ఇండియాలో అది కొత్త ఐడియా. మామూలు దినపత్రికలు ప్రతీరోజూ వార్తలు మాత్రమే యిస్తూ, ఆదివారం అనుబంధం కింద మూడు వారాల క్రితం తయారుచేసిన ఫీచర్లను ఓ నాలుగు పేజీల్లో సప్లిమెంటుగా యిచ్చేవి. వినోద్ అనుకున్నదేమిటంటే – అది డైలీ న్యూస్ పేపరంత ఫ్రెష్‌గా వుండాలి, వారపత్రికలా ఫీచర్లు కలిగి వుండాలి. వినోద్ సండే పేపరు పెట్టడానికి డెబెనేర్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాడన్న బయటకు పొక్కగానే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అధినేత రామనాథ్ గోయెంకా పిలిపించాడు – ''ఆ ఐడియా ఇండియాలో వర్కవుట్ కాదు. ఐదేళ్ల క్రితమే నేను దాని మీద గట్టిగా ఆలోచించి, ప్లాన్లు వేయించాను. ఖర్చు కిట్టుబాటు కాదని తేలింది. ఇదిగో ఆ ఫైలు'' అని చూపించాడు. ''దాని మాట వదిలేసి మా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఆదివారం నాడు ఎత్తే సండే స్టాండర్డ్ అవతారానికి ఎడిటరుగా వుండు. 3000కు పైగా జీతం యిస్తాను. సండే స్టాండర్డ్‌కు అసిస్టెంటు ఎడిటరు అనే పేర యిదిగో అపాయింట్‌మెంట్ లెటరు.'' అన్నాడు. గోయెంకా లాటి పెద్దాయన మాటకు వినోద్ ఎదురాడలేకపోయినా మనసు అంగీకరించలేదు. ఉద్యోగంలో చేరకుండా ఆగి, కొన్ని రోజులు పోయాక మళ్లీ ఆయన దగ్గరకి వెళ్లి ''మీరు యిచ్చిన గౌరవానికి థాంక్స్. కానీ సండే పేపరు ఐడియా నన్ను వదిలిపెట్టటం లేదు.'' అన్నాడు. ''అది ఒక కల, విఫలం కాక తప్పదు'' అని హెచ్చరించాడు గోయెంకా. ''నా వయసులో వుండగా మీరు కలలు కనలేదా?'' అని అడిగాడు వినోద్. గోయెంకా చిరునవ్వు నవ్వి, ''నీ ప్రాజెక్టు దెబ్బ తిన్నాక నా దగ్గరకి రా, ఉద్యోగం యిస్తాను.'' అన్నాడు.
డెబెనేర్‌లో ఉద్యోగం వదిలిపెడుతున్నపుడు పబ్లిషరు సుశీల్ సోమానీ తనను సాదరంగా సాగనంపాక, తన మీనాకుమారి, సంజయ్ పుస్తకాలు వేసిన జైకో పబ్లిషింగ్ హౌస్ అశ్విన్ షా వద్దకు వినోద్ వెళ్లి యీ ప్రతిపాదన అతని ముందు పెట్టాడు. ''సండే పేపరా? అలా ఎలా?'' అని ఆశ్చర్యపడ్డాడు అశ్విన్. వినోద్ తన జోబులోంచి పది రూపాయిలు తీసి జైకోలో ప్యూన్‌ని పిలిచి ''థాకర్ అండ్ కంపెనీ బుక్‌షాపుకి వెళ్లి లండన్ నుంచి వచ్చే ''అబ్జర్వర్'' పత్రిక తీసుకురా'' అని పంపించాడు. వచ్చాక దాన్ని తిరగేసిన అశ్విన్ ''ఇది న్యూస్‌పేపరా, మ్యాగజైనా నాకేమీ బోధపడటం లేదు. ఈ కిచిడీ చేసేబదులు హాయిగా 'ఇండియా టుడే'లాటి మ్యాగజైనే పెట్టవచ్చు కదా.'' అన్నాడు. ''లేదు, యిది కొత్త ప్రయోగం. సక్సెసవుతుంది.'' అని వినోద్ మొండికేశాడు. చివరకు అశ్విన్ ఒప్పుకున్నాడు. ఒక్కటే షరతు – ఇలాటి సంకర పత్రికకు యాడ్స్ వస్తాయని తనను కన్విన్స్ చేయగలగాలి. ఇక వినోద్ యాడ్ కంపెనీలో ఉన్నతాధికారులను దువ్వడం మొదలుపెట్టాడు. అప్పట్లో దిగ్గజాలైన జె.వాల్టర్ థాంప్సన్‌లో పనిచేసే మైక్ ఖన్నా, ఎస్‌ఎచ్ బెన్సన్స్‌లో పనిచేసే ఫ్రాంక్ సిమోస్‌లను కలిశాడు. వాళ్లిద్దరూ డెబొనేర్ అభిమానులు, వినోద్ టాలెంట్ అక్కడ వేస్టవుతోందని ఫీలయ్యే స్నేహితులు. వాళ్లకు అశ్విన్‌తో డిన్నర్ ఏర్పాటు చేశాడు వినోద్. రెండో రౌండు పూర్తయ్యేసరికి 'వినోద్ సండే పేపరు ఎడిట్ చేయడం గ్రేట్ ఐడియా, దానికి మా ఫుల్ సపోర్టు వుంటుంది' అని వాళ్లు అశ్విన్‌కు ధైర్యం చెప్పారు. వినోద్‌కు అప్పటికే పెళ్లయింది. అతని భార్య రేఖ ఆర్థిక వ్యవహారాల్లో దిట్ట. ఎడిటోరియల్ సైడ్ ఎంత బాగా చేయాలా అని వినోద్ తంటాలు పడుతూంటే ఆమె వాళ్ల జీతాలకు ఎంతవుతుంది, ప్రింటింగ్, పేపరు, ఆఫీసు, డిస్ట్రిబ్యూషన్‌కు ఎంతవుతుంది, రేటు ఎంత పెట్టవచ్చు యిలాటి వాటిపై వర్క్ చేసింది. అన్నీ చూశాక అశ్విన్ కన్విన్స్ అయ్యాడు కానీ 'నువ్వు కూడా కాస్త పెట్టుబడి పెట్టు' అన్నాడు వినోద్‌తో. అక్కడా యిక్కడా పోగు చేసి వినోద్ రూ.50 వేలు పెట్టాడు. ఆ విధంగా ఆ పేపరు మార్కెట్లోకి వచ్చేసరికి అతని బ్యాంకు బాలెన్సు రూ.2.50! (అప్పట్లో బాంకుల్లో మినిమమ్ బాలన్స్ రూ.5 వుండేది. ఇతను బాంక్ మేనేజరును కూడా మేనేజ్ చేసినట్టున్నాడు). 1981 మేలో ఏ సౌకర్యాలు లేని ఆఫీసులో వినోద్ పని మొదలుపెట్టాడు. డిజైనింగ్‌కు డెబెనేర్‌లో పనిచేస్తున్న మొయినుద్దీన్‌ను కన్సల్టన్సీ బేసిస్‌లో తీసుకున్నాడు.
వినోద్ వేసిన ప్లాను ప్రకారం – అది 20 పేజీల పత్రిక. న్యూస్, న్యూస్ ఫీచర్లు, వ్యాఖ్యానాలు, వార్తానేపథ్యాలు, విశ్లేషణలు 10 పేజీల్లో వుంటే తర్వాతి పది పేజీల్లో సాహిత్యం, లైఫ్‌స్టయిల్, కల్చర్, సోషల్ థీమ్స్ మిగతా పేజీల్లో వుండాలి. ప్రతీ సంచికలో రెండు ప్రత్యేక కథనాలు వుంటాయి. మొదటి 10 పేజీల విభాగంలో 'ఇన్-ఫోకస్' అని ఫుల్ పేజీ పరిశోధనాత్మక రాజకీయ కథనం. తర్వాతి 10 పేజీల విభాగంలో కూడా సాహిత్యం/సంస్కృతి పై ఫుల్ పేజీ కథనం వుంటుంది. ఏదైనా వింత విషయంపై కథనం 'యాంకర్ స్టోరీ' మొదటి పేజీలో మొదలై లోపలి పేజీల్లో కొనసాగుతుంది. సగం పేజీ పాఠకుల ఉత్తరాలకు కేటాయించారు. ఓప్-ఎడ్ పేజీ పెట్టి దానిమీద మీడియాకు సంబంధించిన వ్యక్తి నిష్పక్షపాతంగా రాసిన వ్యాసం వుంటుంది. ఆఖరి పేజీలో ప్రశ్నోత్తరాల యింటర్వ్యూ. ఆ పేజీలో మూడో వంతు చోటులో వెయ్యి పదాలతో ఒక ఫీచర్ వుంటుంది. ఇక రాసేవాళ్లు దొరకాలి. డెబెనేర్‌లో పరిచయమైన వాళ్లందరినీ వినోద్ దీనికి వాడేసుకున్నాడు. ఆబూ అబ్రహామ్‌కు 5 కాలమ్‌ల రాజకీయ కార్టూన్ వేసే అవకాశం యిచ్చాడు. కె ఆర్ సుందరరాజన్‌ను ఢిల్లీ రాజకీయాల గురించి నుంచి కాలమ్ రాయమన్నాడు. అప్పట్లో ఖుశ్వంత్ సింగ్ ఢిల్లీలో వుంటూ అక్కడి ''హిందూస్తాన్ టైమ్స్''కు ఎడిటరుగా వుంటూ వారం వారం 'మేలిస్' కాలమ్ రాసేవాడు. 'మీ పేపరుకు బాంబే ఎడిషన్ లేదు కదా, మా పేపర్లో సిండికేట్ చేసి వేసుకుంటాం. కింద హిందూస్తాన్ టైమ్స్ సౌజన్యంతో అని వేస్తాం' అని వినోద్ ఖుశ్వంత్‌ను, వాళ్ల పబ్లిషరును ఒప్పించాడు. ఇక పేరు వద్దకు వచ్చేసరికి వినోద్ ఆదర్శం ''అబ్జర్వర్'' కాబట్టి, దానికి ముందు సండే చేరిస్తే సరిపోతుందనుకున్నారు. దానివలన పేపరు ఆదివారం ఆదివారం వస్తుందని చెప్పకనే చెప్పినట్టవుతుంది.
బజెట్ పరిమితుల వలన ఎక్కువ మంది సిబ్బందిని పెట్టుకోలేకపోయారు. జర్నలిస్టులందరూ సోమవారం నుంచి శుక్రవారం వరకు రిపోర్టర్లుగా పనిచేసి, శనివారం నాడు సబ్ ఎడిటర్లుగా పని చేసి, రాత్రికల్లా మాటర్‌ను ప్రెస్‌కు పంపేవారు. పిటిఐ, యుఎన్‌ఐ యిచ్చే కథనాలు కూడా కొన్ని వుంటే తప్ప లేటెస్టు లుక్ రాదు కాబట్టి టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేసే చీఫ్ సబ్ ఎడిటర్లు కొందరిని పట్టుకుని స్టోరీకి రూ.100 యిచ్చి సంపాదించేవారు. 1981 ఆగస్టు 23 సంచికతో మార్కెట్లోకి వచ్చింది. దాని డిజైన్, కంటెంట్ చూసి అందరూ ముగ్ధులై పోయారు. వివాదాస్పద విషయాలను వెలుగులోకి తీసుకురావడానికి జంకని వినోద్ తనేమిటో తొలి సంచికలోనే చూపించాడు. దానిలో వేసిన పరిశోధనాత్మక వ్యాసం తమిళనాడులోని మీనాక్షీపురంలో హరిజనులు మూకుమ్మడిగా ఇస్లాంలోకి మారిన తర్వాత జరిగిన ఘటనల గురించి! ఇది జరిగాక హిందూ నాయకులు కొందరు ఇందిరా గాంధీ వద్దకు వెళ్లి 'ఈ మతమార్పిడికి అరబ్ దేశాల నుంచి డబ్బు వచ్చింది. మతం మారిన ప్రతి హరిజనుడికి తలా రూ.500 యిచ్చారు' అని చెప్పబోతే ఆమె '500 కాదు, వెయ్యి' అని సరిదిద్దిందట. ఈ విషయమంతా ఆ కథనం రాసిన రామన్ స్వామీ బయటపెట్టాడు. అప్పుడే బుకర్ ప్రైజ్ తెచ్చుకున్న ''మిడ్‌నైట్ చిల్డ్రన్'' రచయిత సల్మాన్ రుష్దీతో షష్టి వ్రత అనే ప్రసిద్ధ వివాదాస్పద బెంగాలీ రచయిత చేసిన యింటర్వ్యూని అదే సంచికలో వేశారు. వీటితో బాటు వేసినవి – సునీల్ గవాస్కర్‌తో మాటామంతీ, సయీద్ మీర్జా సినిమాలపై చేసిన విమర్శ, రస్కిన్ బాండ్ రాసిన ''మసూరీ మ్యూజింగ్స్''.
బ్లిట్జ్, స్టార్‌డస్ట్ లాటిదనుకుంటారేమోనన్న భయమో ఏమో వినోద్ తొలి సంచిక ఎడిటోరియల్‌లో వినోద్ స్పష్టంగా రాశాడు – ''ఇది సంచలన వార్తల టాబ్లాయిడ్ కాదు. కళ్లు మిరుమిట్లు గొల్పిస్తూ పుకార్లతో నడిచే ఖరీదైన మాసపత్రికా కాదు. దీనిలో సామాన్యపాఠకుల కోసం అంటూ మసాలా దట్టించలేదు, హైక్లాసు పాఠకుల కోసం అంటూ పాండిత్యమూ ఒలకబోయలేదు. మీకు సమాచారం అందించడానికి, మీ ఆలోచనలను ఉత్తేజపరచడానికి, భిన్నమైన ఆలోచనలు రగిలించడానికి ప్రయత్నిస్తున్నాం.'' అని. ''ద సండే అబ్జర్వర్'' ఆవిర్భవించినపుడు దాన్ని చూసి నేను ముచ్చటపడ్డాను. 'మనం రోజుకి ఒకసారి పేపరు చదవడం అలవాటు పడ్డాం. ఇది ఏడు రోజుల వార్తలను ఒక్కసారే యిచ్చేస్తుంది. పైగా వేరే మ్యాగజైన్ కొననక్కరలేకుండా ఫీచర్లు కూడా దీనితోనే యిచ్చేస్తోంది. అన్నీ కలిపి 75 పైసలే!' అని. కొన్నాళ్లు పోయాక కథలు కూడా వేసేవారు. ఈ ఫార్మాట్ మన దగ్గర ఎంత బాగా ఎడాప్ట్ చేసుకున్నారంటే తెలుగు దిన పత్రికలు ఆదివారం అనుబంధాల్లోనే కాదు, మెయిన్ పేపర్లో కూడా రోజూ ఫీచర్స్ యివ్వసాగారు. ఒకప్పుడు దినపత్రికలు రాజకీయ విషయాలు, అవసరమైన సమాచారం మాత్రమే యిచ్చేవి. వార, మాస పత్రికలు ఆరోగ్యం, విద్య, చరిత్ర, సాంకేతిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, సాహిత్యవిమర్శ, కథలు, సీరియళ్లు, సినిమా యిలాటి సబ్జెక్టులతో నడిచేవి. అన్నీ బతికేవి. పోనుపోను దినపత్రికలు వార, మాస పత్రికలలో కనబడే సమస్తమైన విషయాలూ – కొన్నాళ్లకు కలర్ పేజీల్లో కూడా – యివ్వసాగాయి. ఒక్క దినపత్రిక కొంటే చాలు యింకే మ్యాగజైనూ కొనక్కర్లేని పరిస్థితి వచ్చింది. ఒకదాని తర్వాత మరో దినపత్రికా అదే పంథా అనుసరించింది. అందువలన తెలుగునాట మ్యాగజైన్లన్నీ మూతపడ్డాయి. పైన చెప్పినట్లు ''స్వాతి'' వీక్లీ తప్ప మరే మ్యాగజైనూ లాభసాటిగా నడవటం లేదు. చదివేవారు పెద్దగా లేని కారణంగా వాటికి యాడ్స్ రావడం లేదు. తమిళనాట యీ పరిస్థితి లేదు కాబట్టే అనేక వీక్లీలు యాడ్స్ తెచ్చుకుంటూ విజయవంతంగా నడుస్తున్నాయి. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)