చంద్రబాబు వైఖరితో విద్యార్థులకు నష్టం

ఆగస్టు 31 ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ పూర్తి చేయలేమని తమకు అక్టోబర్‌ వరకు గడువు ఇవ్వాలని గతంలో తెలంగాణ సర్కార్‌ చేసిన వాదనకు అడ్డుతగిలినందుకు చంద్రబాబుకు తగిన శాస్తి లభించింది. తాము ఆగస్టు 31 వరకు…

ఆగస్టు 31 ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ పూర్తి చేయలేమని తమకు అక్టోబర్‌ వరకు గడువు ఇవ్వాలని గతంలో తెలంగాణ సర్కార్‌ చేసిన వాదనకు అడ్డుతగిలినందుకు చంద్రబాబుకు తగిన శాస్తి లభించింది. తాము ఆగస్టు 31 వరకు కౌన్సిలింగ్‌ పూర్తి చేస్తామని సుప్రీంకోర్టు ముందు ఏపీ ఉన్నత విద్యామండలి గతంలో స్పష్టమైన హామీ ఇవ్వడం, విధి విధానాల ఖరారులో ఆలస్యం అవుతున్నందువల్ల మరింత గడువు ఇవ్వాలని తెలంగాణ సర్కార్‌ చేసిన వాదనను ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో దాదాపు 65వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు గండికొట్టినట్లైంది. ఇచ్చిన సమయంలోపు కౌన్సిలింగ్‌ పూర్తి చేయకుండా రెండో విడత కౌన్సిలింగ్‌కు సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తొలి విడత కౌన్సిలింగ్‌లో 1.17 లక్షల విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు లభించాయని, మరో 65 వేల సీట్లు ఖాళీగా ఉన్నాయని, వాటితో పాటు బీ కేటగిరీ సీట్లలో కూడా కౌన్సిలింగ్‌ నిర్వహించేందుకు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం త్రోసిపుచ్చింది. 

సకాలంలో కౌన్సిలింగ్‌ ఎందుకు నిర్వహించలేదు? రెండో విడత కౌన్సిలింగ్‌కు సమయం అవసరమని ముందే ఎందుకు చెప్పలేదు? ఆస్టు 31లోగా ప్రవేశాలు పూర్తి చేసి సెప్టెంబర్‌ 1 వరకు తరగతులు ప్రారంభిస్తామని మీరే చెప్పారు. ఇప్పుడెలా గడువు అడుగుతున్నారు? ఇప్పుడు సమయం ఇస్తే మళ్లీ సమయం అడగరని ఏమైనా గ్యారంటీ ఉందా? ఖాళీలు ఉన్నాయంటే ఉండనివ్వండి. అది మా తప్పు కాదు.. అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ముఖోపధ్యాయ గట్టిగా చెప్పారు. 

కనీసం నాలుగురోజులైనా అనుమతినివ్వాలని చేసిన అభ్యరర్తనను కూడా న్యాయమూర్తులు జస్టిస్‌ సుధాంశు జ్యోతి ముఖోపాధ్యాయ, జస్టిస్‌ ప్రపుల్లచంద్ర పంత్‌లతో కూడిన ధర్మాసనం త్రోసిపుచ్చింది. పర్షవనాథ్‌ కేసులో జూలై నెలాఖరు నాటికల్లా కౌన్సిలింగ్‌ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారని, మరో పదిహేను రోజులు అదనపు సమయం కూడా ఇచ్చారని గుర్తు చేస్తే జస్టిస్‌ ముఖోపాధ్యాయ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కేసులో పదిహేను రోజులు అదనపు గడువు ఇచ్చిన సంగతి మీకు ఇప్పుడే తెలిసిందా? మరొకమారు గడువు పొడిగించాలని అడుగుతామని అప్పుడు చెప్పలేదు. మీకు ఇప్పుడు గడువు ఇవ్వాలంటే మొత్తం ప్రక్రియ రీషెడ్యూల్‌ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అడుగుతున్నదేదో అప్పుడే అడగాల్సింది. మీకు అప్పుడు ఇచ్చిందే చివరి అవకాశం. ఇక మళ్లీ ఇవ్వబోం. అని ఖచ్చితంగా స్పస్టీకరించారు. ఉన్నత విద్యామండలి తరపున న్యాయవాది విశ్వనాథన్‌ ఇంకా వాదించబోతే న్యాయమూర్తి తీవ్రంగా మందలించారు. గడువులోపు అడ్మిషన్లు పూర్తి చేయనందుకు నిజానికి మీపై చర్యలు తీసుకోవాలి. కానీ వదిలేస్తున్నాం ఈ రోజు మీకు చెడ్డరోజు.. మంచి రోజు కోసం వేచి చూడాల్సిందే.. అని ఆయన స్పష్టం చేశారు.

విచిత్రమేమంటే గడువు పొడిగించే విషయంపై తెలంగాణ సర్కార్‌ పెద్దగా అభ్యంతరం తెలుపలేదు. ఎందుకంటే గడువు పొడిగిస్తే 65వేల మంది విద్యార్థుల్లో అత్యధికులు హైదరాబాద్‌లోనే చదువుకునేందుకు వస్తారని తెలంగాణ సర్కార్‌కు తెలుసు. వారు హైదరాబాద్‌ కాలేజీల్లో చేరితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాల్సి వస్తుందని కూడా తెలుసు. అందుకే ఏపీ ఉన్నత విద్యామండలి న్యాయవాదులు వాదిస్తున్నప్పుడు తెలంగాణ ఉన్నత విద్యామండలి న్యాయవాదులు మౌనం పాటించారు. పైగా ఏపీ ఉన్నత విద్యామండలి వాదనలతో ఏకీభవించడం లేదని చెప్పారు. గతంలో తాము గడువు అడిగినపుడు ఏపీ సర్కార్‌ వ్యతిరేకించినందుకు తెలంగాణ సర్కార్‌ చంద్రబాబుకు తగిన శాస్తి చేసింది. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో తొలిషాక్‌ తగిలింది. ఎంసెట్‌ ప్రవేశాల చరిత్రలోనే తొలిసారిగా తొలివిడత కౌన్సిలింగ్‌లోనే సీట్లు భర్తీ నిలిచిపోయింది. సీటు రాకుండా మరో అవకాశం కోసం చూస్తున్న వారికి, ఒక కోర్సు నుంచి మరో కోర్సు మారాలనుకున్నవారికి, ఒక కళాశాల నచ్చకుండా మరో కళాశాలకు మారాలనుకున్నవారికి, తొలివిడత సీటు వచ్చినా మరరో విడత సీటుకోసం ఎదురు చూస్తున్నవారికి సుప్రీంకోర్టు తీర్పు వల్ల తీవ్ర నష్టం జరిగింది.

దీనితో విద్యార్థుల భవితవ్యంతో చంద్రబాబు సర్కార్‌ చెలగాటమాడినట్లైంది. దేశంలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా తామే ఆంధ్ర ప్రజలను రక్షిస్తున్నట్లు ప్రచారం చేసుకునే  చంద్రబాబు సర్కార్‌ చేజేతులారా తమ విద్యార్థుల భవిష్యత్తుకు తామే గండికొట్టింది. తెలంగాణ వాదనలను గుడ్డిగా సుప్రీంలో వ్యతిరేకించినందుకు ఫలితం అనుభవించింది. ఉన్నత విద్యామండలి గడువు తేదీలోపు పనిపూర్తి చేయకుండా ఉదాసీనతతో వ్యవహరించింది. సుప్రీంలో బలంగా వాదనలు వినిపించే నాథుడు కూడా లేకుండా పోయాడు. ఏమైనా ఇది చంద్రబాబు సర్కార్‌ తొలి వైఫల్యం. ఆయన హయాంలో వందరోజుల్లోనే విద్యార్థులకు జరిగిన తీరని నష్టం.

హరీష్