ఇటీవల సీఎం జగన్ వద్ద నెల్లూరు పంచాయితీ జరిగిన సందర్భంలో మంత్రి కాకాణి ఓ అద్భుమైన డైలాగ్ చెప్పారు. కూర్చున్న కొమ్మను నరుక్కునే మూర్ఖులం తామెవరం కాదని అన్నారు. అంటే.. అంతర్గత కలహాలు ఉన్నా కూడా.. అంతిమంగా పార్టీ కోసం పనిచేస్తామని ఆయన చెప్పకనే చెప్పారు.
పార్టీలో కుమ్ములాటలుంటే చివరకి ఏమవుతుందో కూడా అందరికీ అవగాహన ఉందన్నమాట. అందుకే వ్యక్తిగత ప్రతిష్టలు, పంతాలు, పట్టింపులకు పోయి తమ రాజకీయ భవిష్యత్తుని, పార్టీ భవిష్యత్తుని నాశనం చేయకూడదనుకుంటున్నారు వైసీపీ నేతలు.
మొన్న కాకాణి-అనీల్..
ఈమధ్య నెల్లూరు వైసీపీలో ఫ్లెక్సీల రాజకీయం ముదిరి పాకానపడిన సందర్భంలో ముందుగానే జగన్ అలర్ట్ అయ్యారు. మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్ ని పిలిపించుకుని మాట్లాడారు.
తన సహజ స్వభావానికి విరుద్ధంగా ఈ పంచాయితీ పెట్టారు జగన్. నాయకులిద్దరూ జగన్ మాటని గౌరవించారు. ఆ తర్వాత కలిసిపోయారు.
ఇప్పుడు భరత్-జక్కంపూడి
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ భరత్ రామ్ మధ్య దూరం కూడా ఇలాగే తగ్గిపోయింది. సీఎం జగన్ సూచనలతో అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి వారి మధ్య రాయబారం నడిపి సక్సెస్ అయ్యారు.
ఎంపీ భరత్ రామ్ ఇంట్లో పంచాయితీ ముగిసింది. భరత్ రామ్ ఇంటికొచ్చిన ఎమ్మెల్యే రాజా.. తమ మధ్య పొరపొచ్చాలు లేవన్నారు. అందరం కలసి తిరిగి జగన్ ని అధికారంలోకి తీసుకొస్తామన్నారు.
రోజా పంచాయితీ కూడా ముగిసింది..
ఆమధ్య స్థానిక ఎన్నికల సందర్భంగా మంత్రి రోజా, ఆమె వైరి వర్గం రోడ్డునపడ్డారు. పార్టీ అంతర్గత క్రమశిక్షణ గీత కూడా దాటారు. ఇప్పుడు రోజా మంత్రి అయిన తర్వాత అంతా సర్దుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా రోజా సర్దుకుపోవడంతో.. చిత్తూరు జిల్లాలో వైసీపీ రాజకీయాలు కూల్ గా సాగిపోతున్నాయి.
నాయకుల మధ్య ఈ స్థాయిలో సామరస్యపూర్వక వాతావరణాన్ని సృష్టించడంలో జగన్ తలపండిన నాయకుడిగా కనిపిస్తున్నారు. జగన్ కోసం ఇగోల్ని, అభిప్రాయబేధాల్ని పక్కనపెడుతున్నారు నేతలు. మరోవైపు మంత్రి పదవులు కోల్పోయిన ఎమ్మెల్యేలు కూడా అపోహలు వీడి, జగన్ కోసం మనస్ఫూర్తిగా పని చేస్తున్నారు.
ఇప్పుడు పార్టీలో ఎలాంటి విబేధాల్లేవు, ఎలాంటి అసంతృప్తి లేదు. ఒకవేళ అపోహలు వచ్చినా పరిష్కరించేందుకు జగన్ ఉన్నారనే భరోసా అందరిలో ఉంది. జిల్లాల్లో ఇద్దరు నాయకుల మధ్య తగవు పెట్టి, తనవరకు ఎవరూ రాకుండా చూసుకోవడం చంద్రబాబు నైజం.
ఒకరు ఎదుగుతున్నారంటే.. వెంటనే వారికి మరొకర్ని పోటీగా తెస్తారు. కానీ జగన్ అలా కాదు. పార్టీకోసం నాయకులంతా కష్టపడి పనిచేసే విధంగా సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. నాయకుడంటే జగన్ లా ఉండాలని అనిపించుకుంటున్నారు.