ఎమ్బీయస్‌: సెజ్‌ల నుంచి నేర్చుకున్నదేమిటి? – 3

గట్టిగా మాట్లాడితే తెలంగాణకూ యిలాటి సమస్యలు వస్తాయి. హజ్‌ భవన్‌, క్రైస్తవ భవన్‌, జైన్‌ భవన్‌ అన్నీ హైదరాబాదులోనే పెట్టి, డబ్బంతా యిక్కడే కుమ్మరిస్తే జిల్లా నాయకులు మా మాట ఏమిటంటారు. ఇప్పటికే ఉత్తర…

గట్టిగా మాట్లాడితే తెలంగాణకూ యిలాటి సమస్యలు వస్తాయి. హజ్‌ భవన్‌, క్రైస్తవ భవన్‌, జైన్‌ భవన్‌ అన్నీ హైదరాబాదులోనే పెట్టి, డబ్బంతా యిక్కడే కుమ్మరిస్తే జిల్లా నాయకులు మా మాట ఏమిటంటారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అనే పదాలు వినబడుతున్నాయి. తప్పదు కదా. ఉమ్మడి రాష్ట్రంలో సిఎం ఆంధ్ర అయితే, పిసిసి అధ్యకక్షుడు తెలంగాణ అనేవారు. ఇప్పుడు విడిపోయాక యిలాటి బాలన్సింగ్‌ ఫ్యాక్టరేదో పట్టుకురావాలి. పిసిసి అధ్యక్ష పదవి యిప్పటిదాకా ఉత్తర తెలంగాణకు యిచ్చారు, యిప్పటికైనా దక్షిణ తెలంగాణకు యివ్వాలి అని ఏ డికె అరుణో అడగవచ్చు. వీళ్లందరికీ నిజంగా మనసులో ప్రాంతీయభేదాలుంటాయని కాదు. నాయకత్వం కావాలంటే ప్రత్యేకత చాటుకోవాలి. రేపు నేనేదైనా పార్టీయో, సంఘమో పెట్టాలనుకోండి, కళ్లజోళ్ల వాళ్లందరికీ ఓ సంఘం అవసరం. లేనివాళ్లు మాపై వివక్షత చూపిస్తున్నారన్న నినాదం లేవనెత్తుతాను. 

అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే తప్ప యిలాటి గొడవలు తగ్గవు. రాజధాని మాత్రమే కాదు,  ప్రతి జిల్లా గురించి నేను బ్లూ ప్రింట్‌ వేశాను అంటున్నారు బాబు. అలాటివి కెసియార్‌ పూటకొకటి వేస్తున్నారు. ఆయనతో ఎవరూ పోటీ పడలేరు. ఇవన్నీ అమలు కావడానికి డబ్బేదీ? బజెట్‌లో వేటికీ కేటాయింపులు లేవు. బాబు చూపిస్తున్న అరచేతిలో వైకుంఠానికి బజెట్‌లో కేటాయించిన మొత్తం ఎంతో చూడండి. భూములు సేకరిస్తాం, డబ్బులిస్తాం, డెవలప్‌ చేస్తాం, కళ్లు చెదిరే భవంతులు కడతాం, స్థలాలు యిచ్చిన రైతులకు యిళ్లు కట్టించి యిస్తాం యిలా ఎన్నో చెప్పారు. మీరు యిస్తున్న హామీలకు డబ్బు లెలా వస్తాయనే ప్రశ్న ఎన్నికల మ్యానిఫెస్టో చూసినప్పుడే కొందరు అడిగారు. 'జగన్‌ లోటస్‌ పాండ్‌ ఆక్రమించి, అక్రమంగా ఆర్జించిన లక్ష కోట్లు కక్కిస్తాం, ప్రజలపై ఖర్చు పెడతాం' అన్నారు. అవినీతిపరులైన నాయకులకు ఎన్నడూ లోటు లేకపోయినా ఇలాటి ఏర్పాటు స్వాతంత్య్రం వచ్చిన యిన్నేళ్లలో ఎప్పుడూ జరగలేదు. అయినా నాయకులు యీ తరహా కబుర్లు చెపుతూనే వుంటారు. సరే, ఆ లక్ష కోట్ల రికవరీ దిశగా ఏమైనా అడుగు పడిందా? కొత్తగా కేసేదైనా పెట్టారా? అసెంబ్లీలో జగన్‌ లేచి నిలబడగానే అడ్డుకోవడానికి తప్ప ఆ లక్ష కోట్ల నినాదం మరెందుకూ పనికి రావడం లేదు. వాస్తు చూసి మరీ కొత్త రాజధాని నిర్మిస్తున్నారు కాబట్టి వాస్తుపురుషుడు మెచ్చి నోట్లవర్షం కురిపించాడనుకున్నా డెవలప్‌మెంట్‌ పనులన్నీ మూడేళ్లలో పూర్తి చేస్తారనడం మరో విడ్డూరం! అంటే ఆ మూడేళ్లూ ప్రభుత్వం యీ రాజధాని పని తప్ప మరేమీ చేయదా? ప్రభుత్వోద్యోగుల ఎలాట్‌మెంట్‌ యింకా పూర్తి కాలేదు. అయ్యేటప్పటికి ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుంది. ఎన్నో ఖాళీలున్నాయి. గోదావరి, కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాల సంగతి సరేసరి. ఇవన్నీ మానేసి రాజధాని డెవలప్‌ చేస్తూనే కూర్చున్నా మూడేళ్లలో పూర్తి కావడం అసంభవం.

నిజంగా అన్ని శక్తులూ రాజధాని పైనే కేంద్రీకరిస్తే మిగతా అంశాలు, ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం సహజం. కెమెరా కన్ను కూడా ఒక దానిపైనే ఫోకస్‌ చేస్తుంది, పక్కనున్నవి ఔటాఫ్‌ ఫోకస్‌ అవుతాయి. చంద్రబాబుగారిని ఏడాదిన్నర క్రితం మంచు లక్ష్మి యింటర్వ్యూ చేశారు. ''అంకల్‌ (ఆవిడ తెలుగును అక్షరాల్లో దించడం చాలా కష్టం) మీరు హైదరాబాదునే ఎందుకు డెవలప్‌ చేశారు, తక్కినవి ఎందుకు పట్టించుకోలేదు' అని అడిగితే బాబు యిచ్చిన సమాధానం – ''హైదరాబాదుకు ఆల్‌రెడీ యిన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వుంది. అక్కడ డెవలప్‌ చేసి బ్రాండ్‌ యిమేజి సృష్టించడం ఫస్ట్‌ స్టెప్‌గా అనుకున్నా. ఆ తర్వాత తక్కిన చోట్లను కూడా  డెవలప్‌ చేద్దామనుకున్నాను. ఇంతలోనే ఎన్నికలలో ఓడిపోయాం.'' అని. అంటే బాబు 9 ఏళ్ల పాటు రాజ్యం చేసినా ఆయన దృష్టి హైదరాబాదు నుండి తక్కిన చోట్లకు ప్రసరించలేదు. ఆల్‌రెడీ వున్న యింటికి ఎక్స్‌టెన్షన్‌ చేసి, రంగులేశారు. ఆయన డెవలప్‌ చేసిన సైబరాబాదుకి ఆక్సిజన్‌ యిచ్చినవి హైదరాబాదు, సికిందరాబాదు. అలాటి హింటర్‌ లాండ్‌ లేకపోతే సైబరాబాదు ఆ తీరుగా డెవలప్‌ అయ్యేది కాదు. జంటనగరాల ఘనతను బాబుకి కట్టపెట్టేముందు మొత్తం ఏరియాలో సైబరాబాదు విస్తీర్ణం ఎంత వంతో గమనించాలి. దాంతో బాటు సైబరాబాదుకు పునాదులు వేసినవారెవరో కూడా గుర్తు తెచ్చుకోవాలి. బాబు రాజకీయాల్లో అడుగుపెట్టడానికి ముందే హైదరాబాదులో ఎన్నో కేంద్రసంస్థలున్నాయి. రాష్ట్రసంస్థలున్నాయి. విద్యావంతులున్నారు. స్కిల్‌డ్‌ మ్యాన్‌పవర్‌ వుంది. 'మళ్లీ యింకో హైదరాబాదును ఆంధ్రలో కట్టేస్తా' అని బాబు చెప్పినప్పుడు ఇవేమీ పరిగణనలోకి తీసుకోకుండా నమ్మేవాళ్లను చూసి జాలి పడక తప్పదు.  బాబు ఒకవేళ తననుకున్న రాజధానిలో పదోవంతు కట్టినా దాని అర్థం – రాష్ట్రంలో తక్కిన ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతాయనే! తను సిఎంగా వుండగా హైదరాబాదుని మాత్రమే డెవలప్‌ చేసిన బాబు యిప్పటికీ పాఠం నేర్చుకోలేదు. అన్ని జిల్లాలలో తలో ఆఫీసూ పెట్టి వికేంద్రీకరణ చేయకుండా మళ్లీ యింకో సూపర్‌ సైజ్‌ రాజధాని ప్లాన్‌ చేస్తున్నారు.

'నేను కనేవి పగటికలలు కావు. నాది విజన్‌. రవి గాంచని చోట కూడా నేను గాంచి చెపితే ముందులో ఎద్దేవా చేసినవారే తర్వాత నన్ను చూసి శభాష్‌ అన్నారు' అనే ధోరణిలో బాబు పదేపదే చెప్పుకున్నారు. అసెంబ్లీలో ప్రయివేటు యింజనీరింగు కాలేజీల ప్రస్తావన చేశారు. ఆ కాన్సెప్ట్‌ రాష్ట్రంలో ప్రవేశపెట్టినది నేదురుమల్లి జనార్దనరెడ్డి. 12 ఇంజనీరింగు కాలేజీలకు అనుమతి యిస్తే అప్పుడు ప్రతిపక్షంలో వున్న తెలుగుదేశం చాలా గోల చేసింది. సుప్రీం కోర్టు తప్పుపట్టింది. నేదురుమల్లి అప్రతిష్టపాలై ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్నత విద్యాశాఖకు ముఖ్యకార్యదర్శిగా చేసిన పివిఆర్‌కె ప్రసాద్‌ రాబోయే 15, 20 సంవత్సరాలలో ఇంజనీరింగు విద్యార్థుల అవసరం ఎంత వుందో లెక్కలు వేసి, తమిళనాడు, కర్ణాటకలతో పోలిస్తే రాష్ట్రంలో కాలేజీలు తక్కువ వున్నాయి కాబట్టి ప్రయివేటు కాలేజీలను అనుమతిద్దామని సూచిస్తే బాబు వద్దన్నారు. రాజకీయ పర్యవసానాలు ఆలోచించాలన్నారు. ఈ విషయం 'అసలేం జరిగిందంటే..' పుస్తకంలో ప్రసాద్‌ రాశారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం అక్కడ కాలేజీలు పెడుతున్నాం అని చెపితే ప్రతిఘటన రాదు అనే కోణంలో ప్రసాద్‌ చెప్పగాచెప్పగా చివరకు బాబు సరేనన్నారు. అంతవరకు బాగుంది. ఆ తర్వాత జరిగిందేమిటి? అతి చేశారు. ఏ సౌకర్యాలు లేకపోయినా కాలేజీలు మంజూరు చేసేశారు. వాటిలో బోల్డంత డొనేషన్లు కట్టి చదివిన కుర్రాళ్లు ఎందుకూ పనికి రాకుండా పోయారు. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2