ముందుగా జవాబులు – సీరియల్ తొందరగా ముగించమని అడిగితే నస పెట్టినట్లు కాదు. నిజానికి నేనూ తొందరగా ముగించకపోతే సబ్జక్ట్ మర్చిపోతానని, గాడి తప్పుతానని, రచనాశైలిలో మార్పు వస్తుందని భయపడతాను. పాఠం పూర్తిగా వినకుండానే తొందరపడి నిర్ణయాలు చేసేసుకుని, అదెందుకు చెప్పావు, యిదెందుకు చెప్పలేదు, యిప్పుడెందుకు చెప్పావ్, కావాలని సాగదీశావ్ అనేవాళ్లే నస పెట్టినట్లన్నమాట! 2) ఫలానావ్యక్తి గాంధేయవాది అంటే తెలుస్తుంది, లోహియావాది అంటే ఎంతమంది పాఠకులకు తెలుస్తుంది? ప్రతి నాయకుడికి రాజకీయ సైద్ధాంతిక నేపథ్యం, వ్యక్తిగత రాగద్వేషాలు వుంటాయి. రాజ్ నారాయణ్ గురించి చెప్పినపుడు లోహియా గురించి చెప్పి తీరాలి. 3) కమలాపతి త్రిపాఠీ, ఉత్తర ప్రదేశ్ రాజకీయాల గురించి ఎమర్జన్సీ సమయంలో ఇందిర – బహుగుణ వైమనస్యాల గురించి చర్చించినపుడు కాస్త చెపుతాను. 4) రాజ్ నారాయణ్ విదూషకుడు కాదు, ''ఒథెల్లో''లో ఇయాగోలా అందర్నీ నవ్విస్తూనే భార్యాభర్తల మధ్య కూడా వైరం పెట్టగల కుటిలుడు. 5) సుబ్రహ్మణ్య స్వామిపై చర్చకు యిది సమయం కాదు. అతని విజయాలతో పాటు వైఫల్యాలు కూడా లెక్కలోకి తీసుకున్నపుడే సమగ్రరూపం బోధపడుతుంది.
6) చౌధురీ చరణ్ సింగ్ భూస్వామ్యవర్గానికి ప్రతినిథి. భూసంస్కరణల బిల్లు ఆయనే తయారుచేసినా ఆ దృక్పథం మారలేదు. సోషలిస్టు ఐన రాజ్ నారాయణ్ కొంతకాలానికి అతని పంచన చేరడం ఒక వైరుధ్యం. జీవితమంతా కాంగ్రెసుకి వ్యతిరేకంగా పోరాడిన రాజ్ నారాయణ్ మొరార్జీని పడగొట్టాలని కుట్ర పన్ని దానికోసం సంజయ్ గాంధీతో రహస్యంగా సమావేశమయ్యాడు. ఇందిర, సంజయ్‌లు విధించిన ఎమర్జన్సీకి వ్యతిరేకంగా పోరాడినందుకు ప్రజలు తనను నెత్తిన పెట్టుకున్నారన్న విషయం విస్మరించి, సంజయ్‌తో చేతులు కలిపాడు. (ఎక్కడ ఎలా కలిశారు అనే సమస్త వివరాలతో వ(బ)రుణ్ సేన్‌గుప్తా మంచి పుస్తకం రాశాడు) జనతా పార్టీని ఎలా కూల్చాలా అని చూస్తున్న సంజయ్ చరణ్, రాజ్ నారాయణ్‌ల అత్యాశను చక్కగా వినియోగించుకున్నాడు. చరణ్ సింగ్‌ను ప్రధాని చేయడానికి మద్దతిస్తాం, ముందు మొరార్జీని కూల్చేయండి అని చెప్పి, చరణ్ ప్రధాని కాబోయే సమయంలో తనకూ బ్బెబ్బెబ్బే అన్నాడు. చరణ్ ఆపద్ధర్మ ప్రధానిగానే మిగిలాడు. ఏడు నెలలపాటు దేశంలో అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడడంతో ప్రజలు ఇందిరా గాంధీ ఒక్కతే మనని పాలించడానికి అర్హురాలు అనుకుని ఆమెకు 1980లో ఘనవిజయం కట్టబెట్టారు. రాజ్ నారాయణ్‌లో ఇవన్నీ వైరుధ్యాలు కావా? రాజ్ నారాయణ్ గురించి, చరణ్ సింగ్ గురించి ప్రస్తుతం లభ్యమౌతున్న రైటప్స్లో యిలాటివి వదిలేస్తున్నారు. 1967 నాటి సంయుక్త ప్రభుత్వాల వైఫల్యం గురించి, ఆడ్వాణీ తన ఆత్మకథలో ప్రస్తావించనే లేదు. అంతెందుకు, పాఠ్యపుస్తకాల్లో పెట్టబోయే తెలంగాణ ఆవిర్భావ చరిత్రలో, కెసియార్ జీవితచరిత్రలో ఆయన నిరాహారదీక్ష మానేయడం, ఉస్మానియా విద్యార్థుల ఆగ్రహం చూసి భయపడి మళ్లీ మొదలుపెట్టడం వుంటాయనుకుంటున్నారా? ఇలాటి అనేక అంశాలను తెలుసుకుంటేనే చరిత్రగతిని సమగ్రంగా అర్థం చేసుకోగలం. అందుకే సంబంధిత అంశాలన్నీ ప్రస్తావిస్తున్నాను.
ఎన్నికలలో అక్రమాలపై కేసు పెట్టి గెలవడం అనేది మన రాష్ట్రంలో కూడా జరిగింది. వందేమాతరం రామచంద్రరావు (1917-2001) అనే ఆయన అపర చాణక్యుడిగా పిలవబడే మంత్రి, తర్వాతి రోజుల్లో రాజ్యసభ సభ్యుడు వి.బి.రాజు అనే కాంగ్రెసు నాయకుడికి వ్యతిరేకంగా 1962 ఎన్నికలలో, 1967 ఎన్నికలలో చెన్నారెడ్డికి వ్యతిరేకంగా యిలాటి కేసులే వేసి గెలిచాడు. దెబ్బకి వాళ్లు ఆరేసేళ్లు రాజకీయాలకు దూరంగా వుండాల్సి వచ్చింది. మధ్యలో 1962లో అప్పటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెవి రంగారెడ్డిని ఓడించాడు. ఆయన చెన్నారెడ్డికి మేనమామ, పిల్లనిచ్చిన మావగారు. తను ముఖ్యమంత్రి అయ్యాక చెన్నారెడ్డి ఆయన పేర రంగారెడ్డి జిల్లా ఏర్పరచారు. వందేమాతరం ఫార్ములా చాలా సింపుల్. అప్పట్లో అభ్యర్థులకు అనుమతించిన ఎన్నికల వ్యయ పరిమితి చాలా తక్కువ. తన ప్రత్యర్థి యిన్ని జండాలు పెట్టించాడని, యిన్ని జీపులు తిప్పాడని, ఫోటోలు తీసి, లెక్కలు వేసి, వాటి ఖర్చులు చూపించి వ్యయం పరిమితి దాటిందని నిరూపించేవాడు. అయితే ఏళ్లూ పూళ్లూ సాగే కేసు పెట్టడానికి ఖర్చవుతుంది. ఎవరో ఒకరి దన్ను వుండాలి. తన రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయడానికి బ్రహ్మానందరెడ్డి వందేమాతరంకు అలాటి దన్ను యిచ్చాడని చెప్పుకుంటారు. ఆయన సహాయంతోనే వందేమాతరం 1962లో తన మామను ఎన్నికలలో, 1967లో తనను కోర్టులో ఓడించగలిగాడని చెన్నారెడ్డికి గట్టి నమ్మకం. అందువలననే చెన్నారెడ్డి నడిపిన 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొత్తం బ్రహ్మానంద రెడ్డికి వ్యతిరేకంగా సాగింది.
మరి రాజ్ నారాయణ్ వేసిన ఎన్నికల పిటిషన్ వెనుక ఎవరున్నారు? ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన ఎచ్ (హేమావతి) ఎన్ (నందన్) బహుగుణ అని ఓ పుకారు. కాంగ్రెసు తరఫున ముఖ్యమంత్రిగా పని చేసిన సి (చంద్ర) బి (భాను) గుప్తా కూడా కాంగ్రెసులో తన ప్రతిక్షకులను అదుపు చేయడానికి ప్రతిపక్షంలో వున్న సోషలిస్టులను వాడుకునే వాడంటారు. కాంగ్రెసులో పైకి రావాలంటే ఇందిరా గాంధీకి ముకుతాడు వేయాలని ప్లాను వేసిన బహుగుణయే రాజ్ నారాయణ్‌ను కేసు వేయమని పురికొల్పాడని, ఇందిరకు, ఆమె సహచరులకు అనుమానం. 1971లో ఎన్నికల పిటిషన్ దాఖలు కాగానే బహుగుణ లఖ్‌నవ్ నుండి ఢిల్లీకి ఫోన్ చేసి ''దాన్ని ఎదుర్కోవడానికి మన తరఫున లాయరు ఎవరు?'' అని అడిగాడు. ''హైకోర్టు నుంచి సమన్లు రానీ అప్పుడే చూద్దాం, అయినా బహుగుణకు మన గురించి కాదు, తన గురించే వర్రీ!'' అని వ్యాఖ్యానించాడు ఇందిర సహాయకుడు యశ్పాల్ కపూర్. అందరూ నవ్వారు. కేంద్రమంత్రి అయి, తన కంటూ ఒక గ్రూపు ఏర్పరచుకోవడానికి బహుగుణ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని అందరికీ తెలుసు. చివరకు ఎస్.సి.ఖారే అనే ఒకతన్ని లాయరుగా పెట్టి వూరుకున్నారు. ఇదో పెద్ద కేసు అని వాళ్లు అనుకోలేదు. కేసులో హియరింగ్స్ నాలుగేళ్లు సాగాయి. విచారణ సందర్భంగా జడ్జిగా వున్న జగ్ మోహన్ లాల్ సిన్హా అడుగుతున్న ప్రశ్నలు చూస్తే బెదురు పుట్టసాగింది. మే 23 నాటికి హియరింగ్ పూర్తయింది, తీర్పు యివ్వడం మిగిలింది. ఆయన ఎలాటి తీర్పు యివ్వబోతాడో కనుక్కోమని ఇంటెలిజెన్సు వారిని పురమాయించారు. ఆయన చాలా నిగూఢంగా వ్యవహరిస్తున్నాడని వాళ్లు చెప్పారు. ఇక తప్పదు ఆయనను ఎలాగైనా యిన్‌ఫ్లుయెన్సు చేసి, తమకు అనుకూలమైన తీర్పు యిచ్చేట్లా చేసుకోవాలని ఇందిర సహాయకులు ప్రయత్నించ సాగారు.
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఎంపీ ఒకతను జడ్జిగారిని కలిసి 'ఎవరైనా మీకు 5 లక్షల రూపాయలు యిస్తే ఏం చేస్తారు?' అని చాలా యాదాలాపంగా అడిగినట్లు అడిగాడు. సిన్హా జవాబివ్వలేదు. ఆ తర్వాత ఆయనతో పాటు పని చేసే ఒక న్యాయమూర్తి ''ఈ తీర్పు తర్వాత మిమ్మల్ని సుప్రీం కోర్టుకు ప్రమోట్ చేసే అవకాశాలున్నాయి'' అన్నాడు. సిన్హా ఆయన కేసి నిరసనగా చూశాడు తప్ప ఏమీ మాట్లాడలేదు. తీర్పును ఆలస్యం చేసే ప్రయత్నాలూ జరిగాయి. హోం శాఖలో జాయింట్ సెక్రటరీగా వున్న ప్రేమ్ ప్రకాశ్ నాయర్ డెహ్రాడూన్‌లో ఉత్తర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి ''ప్రధాని త్వరలో విదేశాలు పర్యటించబోతున్నారు. ఆమెకు వ్యతిరేకమైన తీర్పు వస్తే ఆమెకు, దేశానికి చాలా యిబ్బందికరంగా వుంటుంది. అందువలన తీర్పు వాయిదా వేస్తే మంచిది'' అన్నాడు. ఆయన సిన్హాకు ఆ విషయం చేరవేసి వూరుకున్నాడు. ఇది వినగానే సిన్హాకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే రిజిస్ట్రార్‌కు ఫోన్ చేసి 'జూన్ 12 న తీర్పు చెప్పబోతున్నానని ప్రకటించండి' అని చెప్పాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జూన్ 8 న జరుగుతున్నాయి. అవి అయ్యేదాకా ఓపిక పట్టాడాయన పాపం. 12 న తీర్పు వస్తుందని తెలియగానే దానిలో ఏముందో తెలుసుకోవాలని ఇందిర మనుష్యులు ఆరాటపడ్డారు. జడ్జిగారు తన తీర్పును స్టెనోగ్రాఫర్ నేగి రామ్ నిగమ్‌కు డిక్టేట్ చేస్తారు కాబట్టి అతన్ని పట్టుకుని కూపీ లాగితే సరి అనుకున్నారు. ఢిల్లీ నుంచి యింటెలిజెన్సు వర్గాలు అలహాబాదుకి వెళ్లి అతన్ని బతిమాలి, ఆ పై బెదిరించి కూడా చూశారు. అతనూ గురువుగారికి తగ్గ శిష్యుడే. నోరు విప్పలేదు. సిన్హాకు యీ వ్యవహారాలన్నీ మరింత కోపం తెప్పించాయి. తన తీర్పు కొద్దికొద్దిగా డిక్టేట్ చేస్తూ వచ్చి, శిక్ష గురించి మాత్రం జూన్ 11 రాత్రి మాత్రమే డిక్టేట్ చేశాడు. దాని టైపింగ్ అయిపోగానే 'ఇక నువ్వు మాయమై పో' అని నిగమ్‌కు చెప్పాడు. నిగమ్‌కు పిల్లలు లేరు, జడ్జి గారి యింటి నుంచే ఎక్కడికో వెళ్లిపోయి, భార్యను అక్కడకి రప్పించుకుని యిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్లిపోయారు. 11 రాత్రంతా అతని యింటి దగ్గర పడిగాపులు కాచిన నిఘా వర్గాలు మొహం వేలాడేశాయి. (సశేషం) (ఫోటో – రాజ్ నారాయణ్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)