cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

అమ్మకమే...అభివృద్ధా?

అమ్మకమే...అభివృద్ధా?

ప్రజాధనంతో మరింత ప్రజాదాయాన్ని పెంచి, తద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలన్న ఆలోచనలు మాయమయ్యాయి. ఎంత సేపూ, ఏవి అమ్మేద్దాం, ఖజానాకు ఎంత జమచేద్దాం అని ఆలోచించే ప్రభుత్వాలు వచ్చాయి. భూములు అమ్ముదామా.. ఇసుక అమ్ముదామా.. ఎర్ర చందనం అమ్ముదామా.. ఇలా అమ్మకం అనే జాడ్యం పట్టుకుంది ప్రజా ప్రభుత్వాలకు. ప్రజా ధనంతో ఫ్యాక్టరీలు పెడదాం.. ప్రజల ఆదాయం పెంచుదాం.. దాంతో పన్నుల ఆదాయం పెరుగుతుంది అన్న ధ్యాసలేదు. ఎంతసేపూ, ఓట్ బ్యాంక్ రాజకీయాలకు సంక్షేమ కార్యక్రమాలకను ఊతగా చేసేందుకు, అయ్యే ఖర్చుకు డబ్బు కావాలి. 

అది కావాలంటే, కనబడ్డ సరుకు అమ్మేయాలి. అదే.. ఇప్పుడు ప్రభుత్వాల ధ్యేయంగా మారుతోంది. రాజధాని కట్టడానికి కూడా ఆఖరికి ప్రభుత్వం ప్రజాధనం వాడే పరిస్థితిలో లేదు. ఓ ఫ్రయివేటు రియల్ ఎస్టేట్ డీల్ మాదిరిగా, భూమి తీసుకుని, అభివృద్ధి చేసి, వారికి కొంత ఇచ్చి, తాను కొంత తీసుకుని, అందులో కొంత అమ్ముకుని, ఆదాయం చేసుకుందామనే చూస్తోంది. మంచి నీళ్లు మున్సిపాల్టీ నుంచి కొంటున్నాం.. భూమి ప్రభుత్వం వేలం వేస్తొంది.. గ్యాస్ మంటకు సబ్సిటీ తగ్గిపోయింది.. ఇప్పుడు మనకు గాలి తప్ప మరేదీ ఫ్రీగా దొరకడం లేదు. కొన్నాళ్లకు స్వచ్ఛమైన గాలి కూడా పైప్ లైన్ల ద్వారా సరఫరా చేసి డబ్బులు తీసుకుంటారేమో?

మీ ఆదాయానికి మీరు పన్ను కట్టాలి.. మీ వాహనం మీరు కొంటే పన్ను కట్టాలి. రోడ్టుపై నడిపినందుకు పన్ను చెల్లించాలి. మీ ఆస్తి మీరు అమ్ముకుంటే చెల్లింపులు చేయాలి. ఇలా ప్రతి పనికీ చెల్లింపులు చేసుకుంటూనే బతకాలి. మరి ప్రభుత్వం నుంచి మీకు అందుతున్నది ఏమిటి? ఒక్క రక్షణ అన్నది తప్పిస్తే?

మరి ప్రతిగా ఇన్ని వసూళ్లు చాలక ప్రభుత్వాలు చేస్తున్నదేమిటి? అయినకాడికి ప్రభుత్వ ఆస్తులు, చెట్టు చేటలు, ఇసుక, రాళ్లు, క్వారీలు అమ్మేసుకోవడం తప్పితే. ఎక్కడికి పోతోందీ డబ్బంతా?  ఏ విధంగా ఖర్చయిపోతోంది... అంతా ప్రభుత్వాల నిర్వహణేక. అంటే ఉద్యోగుల జీతాలు, ప్రజా ప్రతినిధుల వేతనాలు, వారి విలాసాలు,. భారీ టెలిఫోన్ బిల్లులు, టిఎ బిల్లులు, వైద్య చికిత్స ఖర్చులు, ఇంకా.. ఇంకా,.., ఇంకా,.

ప్రజాస్వామ్య పునాదులపై, ఓ మంచి రాజ్యాంగంతో ఏర్పాటైన ప్రజాపాలన రానురాను పక్కదారి పడుతోంది. ప్రభుత్వం.. పాలన అన్నది స్థూలంగా చూస్తే ఏమిటి? ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ప్రభుత్వం, దానికి పారలల్‌గా వుండే అధికార యంత్రాంగం కలిసి సంక్షేమం చూడడం. అది ఎలా? ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను బట్టి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏవి, ఏ విధంగా చేపట్టాలో ప్రజా ప్రభుత్వం నిర్ణయిస్తే, అధికార యంత్రాంగం అమలు చేయడం. 

అందుకోసం ఓ బడ్జెట్ తయారుచేసుకోవడం. పన్నుల మొత్తం ఇంత, ఇందులో ఖర్చులు పోను మిగిలేది ఇంత.. దాంట్లోంచి అన్ని శాఖలకు తలా కొంత... ఇదీ బడ్జెట్ సంగ్రహ రూపం. అంటే ఇక్కడ ప్రజా ప్రభుత్వం అన్నది ప్రజల నుంచి వచ్చే సొమ్ముకు కేర్ టేకర్‌గా వుంటూ, వారి సొమ్ముతో వారికి ఉపయోగపడే పనులు చేస్తుంది. కొన్నేళ్ల క్రితం వరకు ఇలాగే జరిగింది. కానీ రాను రాను.. చదవేస్తే, కాకర కాయ కాస్తా కీకర కాయ అయిందన్న చందంగా మారింది. 

ఒకప్పుడు రూపాయి ఆదాయం వస్తే, పది పైసలు ఖర్చులకు పోను, తొంభై పైసలు ప్రజోపయోగ కార్యక్రమాలకు ఖర్చు చేసేవారు. కానీ ఇప్పుడు డెభై పైసలు ఖర్చులేక పోతోంది. ముఫై పైసల్లో పాతిక పైసలు సంక్షేమ పథకాలకు పోతున్నాయి. ఇక అభివృద్ది కార్యక్రమాలకు డబ్బెక్కడిది. ఇందుకు ఎంచుకున్న మార్గాలు రెండు.. ఒకటి ప్రయివేటు సహకారం. లేదా ప్రభుత్వ ఆస్తులుఅమ్ముకోవడం.

విశాఖ నుంచి హైదరాబాద్ స్వంతవాహనంలో వెళ్లాలంటే సుమారు ఆరేడు వందల రూపాయిలు టోల్ కట్టాలి. దార్లోని పర్యాటక కేంద్రాలను దర్శిస్తే, అక్కడ ప్రభుత్వ పర్యాటక కేంద్రాల లాడ్జీల ధరలు వింటే గుండెలు గుభేల్ మంటాయి. లేదూ దార్లోని ఓ ఆలయం సందర్శిస్తే, ఎంట్రీ టికెట్ కొనాలి.. పెట్రోలు కొట్టిస్తే, మార్కెట్ ధరకు అనుగుణంగానే కొనుక్కోవాలి. ప్రభుత్వ సబ్సిడీ ఏమీ వుండదు. హైదరాబాద్ లో ప్రభుత్వ శిల్పారామానికి వెళ్తే నలభై రూపాయిల టికెట్ తీయాలి. ఇలా ఎక్కడ ఏ ప్రభుత్వ సర్వీసు వాడుకున్న దానికి ఇంతో అంతో ముట్టచెప్పాలి. ఆఖరికి రైల్వే స్టేషన్, బస్ట్ స్టాండ్‌లో ఎసి వెయింటింగ్ రూమ్ అయినా.

మరి మీరు పన్నులు కట్టడం లేదా? మీ రాబడి నుంచి పన్నులు కడుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మీకు అందుతున్నది ఏమిటి? మళ్లీ అన్నింటికీ ఏదో ఓ రూపంలో చెల్లింపులు చేస్తూనే వస్తున్నారు? మరింక పన్నులు కట్టడం దేనికి? మనను పాలించడానికి మనం నెత్తికి ఎక్కించుకున్న ప్రభుత్వాన్ని నిర్వహించడానికే ఇప్పుడు మనం కడుతున్న పన్నులు సరిపోతున్నాయి. 

పోలీస్, రక్షణ శాఖ మినహా, మన పన్నులతో నడుస్తున్న మరే శాఖ కూడా మనకు ఉపయోగపడడం లేదు అంటే అతిశయోక్తి కాదు. రోడ్లు భవనాల శాఖకు ప్రజలే జీతాలు ఇస్తారు. కానీ రోడ్లు ప్రయివేటు వారు వేసి, టోల్ వసూలు చేసుకుంటారు. గృహనిర్మాణ శాఖకు ప్రజలే పన్నుల రూపంలో జీతాలు ఇస్తారు. కానీ అది ప్రభుత్వస్థలాలను వేలం వేసి, పక్కాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. విద్యా శాఖ జీతాలకు మన పన్నులే ఆధారం. కానీ వర్సిటీలో అన్నీ పెయిడ్ సీట్లు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు.

ఇలా ఎక్కడిక్కడ అన్నీ అంతే. ఒక పక్కన పన్నులు చెల్లించడం. మళ్లీ ప్రభుత్వ సేవలకు మళ్లీ ఫీజులు చెల్లించడం. అంటే ఇలా ప్రయివేటు చేత ప్రజలకు సౌకర్యాలు అందించి,  ఆ విధంగా ప్రయివేటు సంస్థలు లాభార్జన చేసుకునేలా చేయడానికి ఉద్దేశించిన ప్రభుత్వం నడవడానికి మాత్రం మన పన్నుల డబ్బే కావాలి. అదే సరిపోతోంది. రైల్వే స్టేషన్ లో సరిపడా కౌంటర్లు వుండవు. సరిపడా సిబ్బంది వుండరు. అందుకోసం ప్రయివేటు కౌంటర్లు తెరుస్తారు. టికెట్‌కు ముఫై రూపాయిలు అదనం. రైల్వే టికెట్‌లు కాసిన్ని వెనక్కుపెట్టుకుంటారు. ఆ రోజు డిమాండ్‌ను బట్టి, అప్పటికప్పుడు రేట్లు పెంచి అమ్ముతారు. పండుగలు వస్తే, ఆర్టీసీ తన టికెట్ రేట్లను అమాంతం పెంచేస్తుంది.

ప్రభుత్వ పాఠశాలలపై వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ ప్రయివేటు విద్య వేల కోట్లు సంపాదించుకుంటోంది.

ప్రభుత్వ ఆసుపత్రులకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.

కానీ కార్పొరేట్ వైద్యం వేల కోట్లు ఆర్జించుకుంటోంది.

మరి దేనికీ వేల కోట్లు ఖర్చవుతున్నాయి.. వైద్య, విద్యలో అంటే కేవలం ఉద్యోగస్తులను పోషించడానికి, కరెంటు బిల్లు, ఎసీలు, ఇతరత్రా వ్యవహారాలైన నిర్వహణ ఖర్చులకు మాత్రం. రూపాయికి పది పైసలు మందులకు, రూపాయికి పది పైసలు విద్య వసతులకు. మిగిలినదంతా నిర్వహణేక.

మరింక మనకు మిలటరీ, పోలీస్ రక్షణ మినహా ప్రభుత్వం చేస్తున్నది ఏముంది?

వినడానికి, చదవడానికి కాస్త అతిశయోక్తిగా, వాస్తవ దూరమేమో అనిపించినా, కాస్త ఆలోచిస్తే తట్టేది ఇదే.

అమ్మకం.. అమ్మకం

ఇక రెండో విధానం ఒకటి వుంది. అదే అయినకాడికి అన్నీ అమ్మేసుకోవడం.. గడచిన పది పదిహేను ఏళ్లుగా అవిభక్త ఆంధ్రలో కావచ్చు.. ఇప్పటి తెలంగాణ, ఆంధ్రలో కావచ్చు.. జరుగుతున్నది అదే.

చంద్రబాబు అదికారంలోకి రాగానే.. ఏవి అమ్మితే డబ్బులు వస్తాయి అని చూడ్డం మొదలెట్టారు. ఎర్రచందనం నిల్వలు వున్నాయి.. అమ్మేయండి. ఇసుక అవసరం చాలా వుంది.. మనకు ఇసుక కూడా బాగానేవుంది.. అమ్మేయండి.. ప్రభుత్వ స్థలాలు వున్నాయి.. అమ్మేయండి..

ఇంకా ఆదాయం చాలదా.. అడ్డగోలుగా కట్టేసిన ఇళ్లు, వాకిళ్లు వుంటాయి చూడండి.. వాళ్ల తప్పులు క్షమించేద్దాం.. అడిగిన ఫీజు ఇవ్వగలిగితే. దీన్నే రెగ్యులరైజేషన్ అని ముద్దుగాపిలుస్తారు. తెలంగాణ ప్రభుత్వం భూముల అమ్మకం, రెగ్యులరైజేషన్ ద్వారా పాతిక వేల కోట్లు వస్తుందని అంచనా వేస్తోంది. తదనుగుణంగానే ఆంధ్ర కూడా.
జనార్థన రెడ్డి దగ్గర నుంచి వైఎస్ మీదుగా చంద్రబాబు వరకు భూములు అమ్ముతూనే వున్నారు. గతంలో చంద్రబాబు రెగ్యులరైజ్ చేసారు. ఇప్పుడు మళ్లీ చేస్తామంటున్నారు. అంటే ఇక ఎన్నటికీ ఇవేనా ఆదాయ మార్గాలు?

ఫ్యాక్టరీలు నిర్మించడం.. ఉపాధి కల్పించడం, ఆ ఆదాయం నుంచి పన్నులు వసూలు చేసుకోవడం ఇవి కాదా.. ఆదాయ మార్గాలు? ఆ దిశగా ఆలోచనలు ఎందుకు సాగడం లేదు? ఫ్యాక్టరీలు నిర్మిస్తాం అనేవారికి ముందుగానే సాగిల పడిపోతున్నారు. వాళ్లకి సవాలక్ష వరాలు ఇచ్చేస్తున్నారు. మరింక ఎక్కడి ఆదాయం. జనాల ముక్కుపిండడం మాత్రమే ప్రభుత్వాలకు తెలిసింది. అదీ కాక, ప్రభుత్వం ఫ్యాకర్టీలు పెట్టడం అన్నది ఏనాడో మానేసింది. వున్న సుగర్ ఫ్యాక్టరీలను కూడా చంద్రబాబు అమ్మేసిన వైనాలు వున్నాయి. లాభదాయకంగా లేవనేగా. 

మరి లాభదాయకంగాలేని చోట్ల ప్రయివేటు వాళ్లు కూడా ఎందుకు వచ్చి ఫ్యాక్టరీలు పెడతారు. అందుకే ప్రజల డబ్బును దోచుకునేందుకు పనికివచ్చే వినోద కేంద్రాలు, మల్టీ ఫ్లెక్స్‌లు, మాల్స్ పెడతామంటున్నారు. దీనివల్ల వచ్చే ఉపాధి ఎంత? ఆదాయం ఎంత? కానీ ప్రజల ధనం పెట్టుబడి దారుల జేబుల్లోకి పోయేది ఎంత?

నాన్ ప్లానింగ్ ఖర్చు

కేంద్ర రాష్ర్ట బడ్జెట్ లో ఏ ఏటికాయేడు నాన్ ప్లానింగ్ ఖర్చు కొండంతగా పెరిగిపోతోంది. ఇప్పుడు అది ఆదాయంలో సగానికి పైగా తినేస్తోంది. ఇక ఆపై మిగిలిన దాంట్లో మూడువంతులు సంక్షేమపథకాలకు పోతోంది. ఎన్నికల్లో ఓట్ల కోసం, యాభై రూపాయిలు బయట బియ్యం అమ్ముతుంటే, రెండు రూపాయిలకు ఇవ్వడం, పంటపోయిన వారికీ, పోని వారికీ కూడా రుణమాఫీ చేయడం, ఏదో ఓ పేరు చెప్పి సరుకులు అన్నీ ఫ్రీగాపంచేయడం.. ఇదీ ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు. అంతే కానీ ప్రొడక్టివిటీ, ఆదాయం పెంచే దిశగా ఆలోచించడం మానేసాయి. ఏటేటే సిబ్బంది భారం పెరిగిపోతోంది. దాంతో నాన్ ప్లానింగ్ ఖర్చు పెరిగిపోతోంది. బడ్జెట్‌లో కొత్త ప్రగతికి చేద్దామన్నా పైసలు కనిపించడం లేదు.

ఖర్చు చేయించేయ్

ప్రజల చేత ఖర్చు చేయించడం అన్నది ఆదాయ వనరుగా చూస్తున్నారు చంద్రబాబు. ఆయన ప్రభుత్వం ఇప్పుడు ఫ్యాక్టరీల కన్నా, అమ్యూజ్మెంట్ పార్కులు, ఎంటర్ టైన్ మెంట్ సిటీలు, ఇలాంటి జనాల జేబులు గుల్ల చేసే ఆలోచనలు చేస్తోంది. ఎవరైనా ఓ ఫ్యాక్టరీ పెట్టి, ప్రజల జేబుల్లోకి డబ్బులు వచ్చేలా చేయాలనుకుంటారు. 

కానీ చంద్రబాబు ప్రజల డబ్బులు ఎలా ఖర్చు చేయించాలా అని చూస్తారు. టూరిజం.. టూరిజం అంటూ పర్యాటకం అన్నది సామాన్యుడికి అందకుండా చేస్తున్నారు. పర్యాటకం శాఖ హోటళ్లు, లాడ్జిలు ఒక్కటి సామాన్యుడికి అందుబాటులోవున్నాయా? మరెందుకు ఈ పర్యాటకం అభివృద్ధి. మనం మన పర్యాటక కేంద్రాలు చూడకూడదన్నమాట. విదేశాల వారు వచ్చి డబ్బులిచ్చి చూసుకోవాలి.

ప్రజలకు అందుబాటులో వుండి పనికివచ్చే పథకాల ఆలోచనలు చేయడం లేదు. ఎంతసేపూ, ప్రయివేటు పెట్టబడి దారులకు వ్యాపారమార్గాలు అన్వేషించి, వారికి కట్టబెట్టడం, వారు ప్రజల నుంచి ఎంత దండుకోవాలో అంతా దండేసి, కాస్త ప్రభుత్వాలకు విదిలించడం. అదే మహా భాగ్యం అని ప్రభుత్వాలు తమ భుజాలు తామే చరుచుకోవడం. ఇదీ ఇప్పటి కొత్త తరహ అభివృద్ధి.. అమ్మకమే అభివృద్ధి అనే కొత్త తారక మంత్రం ఇది.

చాణక్య

writerchanakya@gmail.com

 


×