కత్తితో వ్యవహరించినవాడు కత్తితోనే మరణించును అంటుంది బైబిల్. ఉగ్రవాదంతో చెలగాటం ఆడిన పాకిస్తాన్ ఉగ్రవాదానికి తన పిల్లల్ని బలి యిచ్చుకుంది. హిందువులు వేరు, మేము వేరు, వారితో మేం కలిసి బతకలేం అంటూ ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన కొందరు ముస్లిములు బ్రిటిషు వారిని ఒప్పించి పాకిస్తాన్ సంపాదించుకున్నారు. ఇప్పుడు అక్కడున్నదంతా ముస్లిములే. అయినా బతకలేకపోతున్నారు. మతం పేర విడగొట్టుకున్న తర్వాత ప్రాంతం పేర, తెగల పేర, రాజకీయ సిద్ధాంతాల పేర యిలా విడదీసుకుంటూనే పోతున్నారు. ఈ విభేదాలను వారు హింసతో తీర్చుకుంటున్నారు. దేశవిభజన తర్వాత పాకిస్తాన్ రాజకీయంగా అస్థిరంగానే వుంది. సైన్యం జోక్యం ఎక్కువై పోయింది. పాలకులలో ఉదారులెవరైనా వుంటే సైన్యం సహించడం లేదు. కుట్ర జరిపి వాళ్లను దింపేస్తోంది. ప్రజలు ఏమనుకుంటున్నారో వినేవారు లేరు. ప్రజాస్వామ్యం పటిష్టంగా వున్నపుడే ప్రజావాణి వినబడుతుంది. మతఛాందసం పేర జనాలను గుప్పిట్లో పెట్టుకుని, భారత్‌ను బూచిగా చూపిస్తూ ఏలడానికే ప్రతీ పాలకుడూ చూస్తున్నాడు. నిజానిజాలు చెప్పడానికి మీడియా ప్రయత్నిస్తే వాళ్ల నోరు నొక్కుతున్నారు. తమ దేశప్రయోజనాలకు కాకుండా అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించే సైన్యం పరిస్థితిని పూర్తిగా తమ అదుపులో పెట్టుకుంది. ఈ రోజు దానికి మూల్యం చెల్లించింది. సైనికుల పిల్లలే దాడికి గురయ్యారు.
వేరే వాళ్ల కొంపకు అగ్గి పెడదామని చూస్తే చివరకు అది మన కొంపనే కాలుస్తుంది. అఫ్గనిస్తాన్‌ను రష్యా ఆక్రమించినపుడు వారికి వ్యతిరేకంగా పోరాడి తరిమివేయాలని అమెరికా ప్రణాళిక రచించి పాకిస్తాన్ సహాయం తీసుకుని తాలిబన్లను తయారుచేసింది. రష్యా రాజకీయ వ్యవస్థలో మార్పు వచ్చి తమంతట తాము వదిలివేసి వెళ్లిపోయారు, బురద కడిగేసుకోవడంతో వాళ్లకు యిప్పుడు ఏ చింతా లేదు. కానీ అమెరికా యిరుక్కుపోయింది. తాలిబన్లు క్రమేపీ బలపడి, అమెరికాపైనే దాడి చేశారు. అమెరికా నాలిక కరుచుకుని వాళ్లను నాశనం చేయబోయింది. అప్పుడు పాకిస్తాన్ దొంగనాటకం ఆడి యిరువైపుల వారినీ ఆదుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ తను కూడా ఉగ్రవాదానికి ఎఱగా మారుతున్నానని గ్రహించి, తాలిబన్లను అదుపు చేయబోతోంది. కానీ వాళ్లు లొంగటం లేదు. తాలిబన్లకు పాకిస్తాన్ గడ్డపైనే తర్ఫీదు యివ్వడం చేత వారికి పాకిస్తాన్ వ్యవస్థంతా కరతలామలకం. అందుకే పాకిస్తాన్‌పై సులభంగా దాడి చేయగలుగుతున్నారు.
ఇటువంటి పరిస్థితి వచ్చినపుడు ఫ్రాన్‌కెన్‌స్టీన్‌తో పోలుస్తారు. మేరీ షెల్లీ రాసిన సై-ఫి నవలలో ఫ్రాన్‌కెన్‌స్టీన్ అనే నేచురల్ ఫిలాసఫీ విద్యార్థి సమాధుల్లోని శవాల నుండి ఒక జీవిని సృష్టిస్తాడు. దానికి అమేయబలాన్ని సమకూరుస్తాడు. అది తన దుష్కృత్యాలతో అందరికీ భయాన్ని పుట్టిస్తుంది. కానీ ఆ జీవి ప్రేమకోసం తపించి, తనకు జోడీని తయారుచేయమని ఫ్రాన్‌కెన్‌స్టీన్‌ను కోరుతుంది. అతను సరేనని పని మొదలుపెడతాడు కానీ యిలా చేస్తే ఆ జీవి సంతతి యిబ్బడిముబ్బడిగా పెరిగి జగత్తుకే విపత్తు కలిగిస్తుందని గ్రహించి, తను తయారుచేసిన జోడీని నాశనం చేస్తాడు. దాంతో ఆ జీవికి కోపం వచ్చి తన సృష్టికర్తపై పగ సాధిస్తుంది. అతని పెళ్లిరోజున వధువును చంపేస్తుంది, ఆ శోకంతో ఫ్రాన్‌కెన్‌స్టీన్ తండ్రి చనిపోతాడు. ఇక ఆ జీవిని నాశనం చేయవలసిన బాధ్యత తనదేనని గుర్తించిన ఫ్రాన్‌కెన్‌స్టీన్ ప్రపంచమంతా వెంటాడి అతనితో తలపడతాడు. పోరాటంలో ఫ్రాన్‌కెన్‌స్టీన్ చనిపోతాడు. కానీ ఆ జీవి కూడా పశ్చాత్తాప పడుతుంది. రజనీకాంత్ 'రోబో' సినిమా కథకు స్ఫూర్తి దీనిలో కనబడుతుంది.
ఇదే తరహాలో యిప్పుడు తాలిబన్లకు ముకుతాడు వేయబోతే సైనికుల కుటుంబాలనే నష్టపోయాయి. ఆ దాడిలో బతికినవారిని కూడా ఆ ఘాతుకపు స్మృతులు కొన్నేళ్లపాటు వెంటాడి వారి జీవితాలను అతలాకుతలం చేస్తాయి. పాకిస్తాన్ సైన్యం అని ఒక్క ముక్కలో అనేస్తాం కానీ తాలిబన్లను పెంచి పోషించిన సైనికాధికారులు వేరు, యిప్పుడు బాధితులైన సైనికులు వేరు కావచ్చు. ఆ మాట కొస్తే పాకిస్తాన్ శత్రుదేశం కాబట్టి పాకిస్తానీయులందరూ మన పట్ల వ్యతిరేక భావం కలిగి వున్నారని తీర్మానించడానికీ వీలు లేదు. మొన్ననే వార్త వచ్చింది దావూద్ ఇబ్రహీంను మన కమెండోలు పట్టుకుని కాల్చివేయబోతున్న ఆఖరి క్షణంలో ఎవరో పెద్ద తలకాయ ఫోన్ చేసి ఆపరేషన్‌ను ఆపించేశారని! అది పెట్టుకుని భారతీయులందరూ దావూద్‌కు రక్షగా వున్నారని ఎవరైనా ఆరోపిస్తే ఎంత లక్షణంగా వుంటుందో ఆలోచించండి.
ప్రతీ వ్యవస్థలో అన్యాయానికి కొమ్ము కాసేవారుంటారు. ఎదిరించేవారుంటారు. సైనికుల పిల్లలపై ఘాతుకం జరగగానే నవాజ్ యూరోప్, అమెరికా ఏమనుకున్నా సరేనని సిద్ధపడి మరణశిక్షపై మారటోరియంను రద్దు చేశారు. అది జరుగుతూండగానే మరో పక్క కోర్టు వాళ్లు బొంబాయి దాడుల సూత్రధారి లఖ్వీకి బెయిల్ యిచ్చారు. అదేమిటంటే తగినన్ని సాక్ష్యాలు సమర్పించలేదు అంటారు. ఇంత ఘాతుకం జరిగినా పరిపాలించే వాళ్లలో ఏకాభిప్రాయం లేదని తేలుతోంది. రాజకీయ నాయకులు, న్యాయాధీశులు, సైన్యాధికారులు ఒక్కొక్కరు ఒక్కో వైపుకి లాగుతున్నారు. ఎవరి స్వప్రయోజనాలు వారివి, ఎవరి భయాలు వారివి. అందుకే ఉగ్రవాదులు, తీవ్రవాదులు తెగబడుతున్నారు. దావూద్ వుదంతంలో తెలిసినదేమిటి? పైకి ఏవైనా హామీలు యివ్వవచ్చు, కానీ అంతర్గతంగా అతనికి సాయపడేవాళ్లు మన దేశంలో, మన ప్రభుత్వాలలోనే వున్నారని! వీళ్లు తక్కినవాళ్లపై పాకిస్తాన్ ఏజంట్లను, పాకిస్తాన్‌కు తమ ఆత్మను అమ్ముకున్నారనీ, పిరికివారనీ ఆరోపణలు గుప్పిస్తూనే యీ పని చేస్తూంటారు. అమాయకులను జైళ్లల్లో కుక్కిస్తారు. ఈ ఆటల్లో భారత్‌లోగాని, పాక్‌లో గాని ప్రాణాలు పోగొట్టుకునేది సామాన్యులు!
ఎమ్బీయస్ ప్రసాద్