cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

తెరాసకు ‘కమ్మ’దనం?

తెరాసకు ‘కమ్మ’దనం?

కెసిఆర్ ఏ సామాజిక వర్గాన్నయితే విపరీతంగా ద్వేషించి, ఆ ద్వేషాన్ని జనంలో అసమానత రూపంలో రగిల్చి, ఆపై ఉద్యమం చేసి, విభజనకు మార్గం సుగమం చేసారో, ఇప్పుడు అదే సామాజిక వర్గాన్ని అక్కున చేర్చుకోవాలని చూస్తున్నారా?  ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం, వరంగల్,నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లొండ జిల్లాల్లో కమ్మ సామాజికవర్గం ఎక్కువగా వుంది. వీరిలో ఎక్కువ మంది వ్యాపార వర్గాలు, బడా బాబులు, సినిమా వారు. మిగిలిన వారు ఉద్యోగులు. ముఖ్యంగా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో వీరి ప్రభావం చాలా వుంటుంది. అందుకే ఈ వర్గం మద్దతు సంపాదించడానికి కెసిఆర్ ఎత్తులు వేస్తున్నారని తెలుస్తోంది.

ఈ ఎత్తుగడలో భాగంగా ముందుగా ఖమ్మం జిల్లా దేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావును చేరదీసారు. ఇప్పుడు ఆయనకు కీలక మంత్రి పదవి ఇవ్వడం ద్వారా, తెలంగాణ అభివృద్ధి బాటకు మీరు కూడా భాగస్వాములే అని తెలియచెప్పాలన్నది కేసిఆర్ ప్రయత్నం. ఇప్పటికే ఈ సామాజిక వర్గానికి చెందిన హీరో కృష్ణ అటే వున్నారు. మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా కేసిఆర్ కుటుంబంతో మంచి సంబంధాలు కలిగివున్నారు. అన్నింటికి మించి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా కెసిఆర్ తో మంచి సంబంధాలతోనే వున్నారు.

 ఒకసారి విడిపోయిన తరువాత గతకాలపు వ్యవహారాలు అనవసరం. తమకు కావాల్సిన తెలంగాణ వచ్చేసింది. ఇక అది వెనక్కుపోదు. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గాన్ని చేరదీస్తే, ఇక సమస్యలు చాలా వరకు సద్దుమణుగుతాయి. ఇదీ కేసిఆర్ వ్యూహంగా తెలుస్తోంది.

కానీ ఈ వ్యూహం అమలు చేయడం అంత సులువు కాకపోవచ్చు. ఎందుకంటే పైకి ఎన్ని కారణాలు చెప్పినా, ఎన్ని కబుర్లు చెప్పినా తెలంగాణ ఉద్యమపునాదుల్లో ఈ కమ్మ సామాజిక వర్గ ప్రాభవం కూడా ఒకటిగా వుందన్నది వాస్తవం. ఆ సామాజికవర్గం తెలంగాణలో చొచ్చుకుపోయినంతగా, ఆంధ్రకు చెందిన మరే ఇతర సామాజికవర్గ జనాలు చొచ్చుకుపోలేదు. 

ఖమ్మం జిల్లాను దాదాపు రాజకీయంగా హస్తగతం చేసుకున్నారు. అందువల్ల తెలంగాణ సంప్రదాయ వాదులు కేసిఆర్ చర్యను ఏ మేరకు సమర్ధిస్తారన్నది చూడాలి. ఇక తెలంగాణ కాంగ్రెస్ ఇటు రెడ్డి, అటు ఎస్ సి సామాజికవ్గర పునాదులపై వుంది. వారు నేరుగానే దీనిపై విమర్శల దాడి చేయవచ్చు. భాజపా కూడా కొంత వరకు దాడికి దిగుతుంది. ఎటొచ్చీ మౌనంగా వుండేది వామపక్షాలు, లోక్ సత్తా, టీడీపీ లే. ఎందుకంటే వారికి ఈ చర్య చాలా వరకు ఆమోద యోగ్యంగానే వుంటుంది. స్థానిక నేతలకు కాస్త ఇబ్బందిగా వున్నాపార్టీ నాయకత్వాలకు జడిసి గొంతు విప్పరు.

ఇంతకీ ఏ పదవి?

ఇంతకీ తుమ్మలకు ఏ పదవి ఇవ్వాలనుకుంటున్నారు కేసిఆర్ అన్నది మరో హాట్ టాపిక్. రెడ్డి సామాజిక వర్గానికి కీలకమైన హోంమంత్రి పదవి ఇచ్చారు. వెలమ సామాజిక వర్గానికి ఏకంగా ముఖ్యమంత్రి పదవే వుంది. ఎస్ సి, ముస్లిం వర్గాలకు ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. అందువల్ల వీటన్నింటితో సరితూగే సరైన మంత్రి పదవిని తుమ్మలకు ఇవ్వాలని కేసిఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

తుమ్మల ద్వారా జంటనగరాల్లో వుండే కమ్మ సామాజికవర్గాన్ని దగ్గరకు తీసి కార్పొరేషన్ ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలని చూస్తున్నారని రాజకీయ వర్గాల బోగట్టా. రాష్ట్రం ఎలాగూ విడిపోయింది..మనం ఇక్కడే బతకాలి..అలాంటపుడు మనకు ప్రభుత్వంతో, దాన్ని నడుపుతున్న టీఆర్ఎస్ తో వైరం ఎందుకు....అన్న పాయింట్ ను తుమ్మల తన సామాజికవర్గంలోకి తీసుకెళ్తారని బోగట్టా.

వ్యూహం బాగానే వుంది, కానీ ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని కమ్మ సామాజిక వర్గం తుమ్మల అంటే మండి పడుతోంది. మూడు సార్లు పదవులు అనుభవించి, ఇప్పుడు చంద్రబాబుకు ఇలా ఢోకా ఇవ్వడం సరికాదన్నది వారి వాదన. ఖమ్మం జిల్లాలో పార్టీకి నామా ఎంతో చేసారని వారు అంటున్నారు. అసలు ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కానీ, కమ్మసామాజిక వర్గ నాయకులు కానీ ఇంతలా అన్ని విధాలా ఎదగడానికి చంద్రబాబు కారణం అన్నది కాదనలేని సత్యం. ఆయన తన సామాజికవర్గానికి ఖమ్మం జిల్లాలో అనేకానేక అవకాశాలు కల్పించారని జనం చెప్పుకుంటారు. అలాంటి చంద్రబాబును కాదని ఇప్పుడు,  తుమ్మల వెళ్లారని వెంట వెళ్తారా అన్నది ఓ ప్రశ్న.

మరోపక్క తుమ్మలను తీసుకురావడం ద్వారా పార్టీలో వున్న జలగం వెంకటరావును కాస్త దూరం చేసుకుంటున్నట్లు అయింది కేసిఆర్ కు. ఎందుకంటే తుమ్మల గ్రూప్ కు, జలగం గ్రూప్ కు చిరకాల వైరం వుంది. ఈ వైరం ఇప్పుడేమీ సమసిపోదు. ఆ వర్గ పోరు ఇక్కడా కొనసాగుతుంది.  అందువల్ల ఇది కేసిఆర్ కు కొత్త రకం తలకాయనొప్పి తెచ్చి పెడుతుంది. 

పైగా ఏ నాయకుడు లేదా నాయకులు తమ తమ అధికారం కోసమో, వ్యాపారాల కోసమో పార్టీలు మారినంత మాత్రాన, బరిలో తెలుగుదేశం పార్టీ వున్నంతకాలం దానిని అభిమానించేవారు దాంతోటే వుంటారు. కానీ కొంతవరకు తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది తప్పుదు. ఎందుకంటే ఏ రాజకీయం, అధికారం, వ్యాపారం కోసం నాయకులు పార్టీలు మారుస్తారో, సరిగ్గా వాటికోసమే నాయకులను మార్చే కార్యకర్తలు కూడా వుంటారు. ఆ విధంగా తెలుగుదేళం ఓట్ బ్యాంకుకు కాస్త కన్నం తప్పదు. అదే కనుక ప్రారంభమైతే మాత్రం....2019కి తెలంగాణలో అధికారం సాధించాలన్న చంద్రబాబు కలలు చెదిరిపోతాయేమో?

చాణక్య

writerchanakya@gmail.com

 


×