మామూలుగా అయితే యీ ప్రశ్న ఉదయించేది కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టేవరకు ఎన్టీయార్ ఎలాటి రాజకీయ అవగాహనను బహిరంగంగా కనబరచలేదు. ఏ పార్టీకి అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ మాట్లాడలేదు. సెట్స్ మీద ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే 'అవి మన కెందుకు బ్రదర్?' అనేవారని రావి కొండలరావుగారు ఓ సారి రాశారు. ఎయన్నార్ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకపోయినా మఱ్ఱి చెన్నారెడ్డి వంటి నాయకులతో రాసుకుపూసుకుని తిరిగేవారు. అనేకమంది నాయకులతో సత్సంబంధా లుండేవి. మద్రాసు బయట ఏవైనా సోషల్ ఫంక్షన్లు, అంటే కాలేజీల్లో ఉపన్యాసాలు, ప్రారంభోత్సవాలు ఉంటూంటే వెళ్లి సాధారణ జనంతో కలిసేవారు. ఎన్టీయార్ మద్రాసు విడిచి వెళ్లడానికి యిష్టపడేవారు. తెలుగు ప్రాంతాల్లో ఔట్‌డోర్లకు వెళ్లడం కూడా చాలా ఆలస్యంగా ప్రారంభించారు. ఫంక్షన్లకు వెళ్లడం అదీ దండగ అనుకునేవారు.
నటుడికి పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్స్ ముఖ్యమనే వాదనను ఒప్పుకునేవారు కాదు. పత్రిక రిపోర్టర్లు వచ్చి మీ ఫోటో తీసుకోనివ్వండి, మా పత్రికకు ముఖచిత్రంగా వేసుకుంటాం అంటే దాని వలన నా సినిమాకు ఎక్కువ టిక్కెట్లు తెగుతాయా? అని అడిగేవారు. పత్రికలకు యింటర్వ్యూలు యివ్వడం, లేదా ఏదైనా విషయంపై తన ఆలోచనలు వ్యాసాల ద్వారా పంచుకోవడం.. యివన్నీ చాలా చాలా తక్కువ. ''విజయచిత్ర''లో కాసిని వచ్చాయి. అదే ఎయన్నార్ అయితే అ-అక్కినేని ఆ-ఆలోచనలు అని, మరొకటని వ్యాసాలు రాసేవారు. పత్రికల వాళ్లతో కలుపుగోరుగా మాట్లాడేవారు. ఎన్టీయార్ ఎంతసేపూ సినిమాలకు సంబంధించిన పనే చూసుకునేవారు. సినిమా ఫంక్షన్లకే హాజరయ్యేవారు. అసలాయన పత్రికలు పెద్దగా చదివేవారా, రాజకీయ విషయాలు తెలుసుకునేవారా అనేది కూడా సందేహమే.
పార్టీ పెట్టినపుడు ''నేను యిప్పటివరకు పత్రికలే కాదు, సినిమా స్క్రిప్టులు తప్ప వేరేవీ చదవలేదు.'' అని చెప్పుకున్నారు. దాన్ని పట్టుకుని కాంగ్రెసు వాళ్లు అనేకసార్లు వెక్కిరించారు. అది అతిశయోక్తి కావచ్చు. పేపరు బొత్తిగా చదవలేదని అనుకోవడానికి లేదు. ఏదో పైపైన సంగతులు తెలుసుకుంటూ ఉండవచ్చు. సినిమారంగంలో ఎందరికో రాజకీయాలతో అనుబంధం ఉంది. ప్రజా నాట్యమండలి పేర ప్రదర్శనలిచ్చే కమ్యూనిస్టు రచయితలు, కళాకారులపై పోలీసులు కేసులు పెట్టినపుడు వారంతా సినీరంగానికి తరలి వచ్చేశారు. నాగయ్య వంటి వారు కాంగ్రెసు పార్టీకి విరాళాలిచ్చారు. జగ్గయ్య కాంగ్రెసు తరఫున ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. వల్లం, నాగభూషణం వంటి వారు కమ్యూనిస్టు పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేవారు. శ్రీశ్రీ సంగతి చెప్పనే అక్కరలేదు. తెలుగు రంగం మద్రాసులో ఉండగా నిత్యం సంపర్కం ఉండే తమిళ నటీనటులైతే దాదాపు ప్రతి ఆర్టిస్టుకి ఏదో ఒక పార్టీతో అనుబంధం ఉండేది. ఈ వాతావరణంలో కూడా ఎన్టీయార్ రాజకీయాలకు దూరంగానే ఉన్నారు.
అలా 60 ఏళ్లు గడిపాక పార్టీ పెట్టినపుడు జనాలందరికి అనుమానం వచ్చింది, యీయనకు ఏం తెలుసని యీ రంగానికి వస్తున్నాడని. ఆ సందేహాలు నివృత్తి చేయడాని కన్నట్లు ''ఈనాడు'' పేపరు ఎంవిఆర్ శాస్త్రి (తర్వాతి రోజుల్లో ''ఆంధ్రభూమి''కి ఎడిటరయ్యారు) రామానుజన్ అనే జర్నలిస్టులను ఎన్టీయార్ వద్దకు యింటర్వ్యూకై పంపింది. అవేళ ఎన్టీయార్ కనబరచిన రాజకీయ అపరిపక్వత చూసి తాము నివ్వెరపోయామని వాళ్లు తర్వాతి రోజుల్లో చెప్పుకున్నారు. ఇంటర్వ్యూని యథాతథంగా కాకుండా మేనేజిమెంటు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ప్రచురించారట. బహిరంగసభల్లో యిలాటి దిద్దుబాట్లు కుదరవు కదా, ప్రకాశం గారి గురించో ఎవరి గురించో ఏదో పొరపాటు మాట్లాడారు. వెంటనే కాంగ్రెసు వాళ్లు 'దుర్యోధనుడు మయసభను ప్రవేశించి కాలుజారి పడ్డాడు' అని గేలి చేశారు. తనకు రాజకీయాలు కొత్త కావంటూ ఎన్టీయార్ 'నేను చిన్నపుడు కమ్యూనిస్టు పార్టీలో ఉన్నాను, కార్డ్ హోల్డర్‌ను కూడా' అని చెప్పుకున్నారు. 'నక్సలైట్లు అచ్చమైన దేశభక్తులు' లాటి స్టేటుమెంటూ యిచ్చారు.
ఇలాటి పరిస్థితుల్లో ఎన్టీయార్ ఎమర్జన్సీ విధింపు గురించి నొచ్చుకున్నారనీ, బహిరంగ వేదికలపై కాకపోయినా పోలీసు అధికారుల వద్దనైనా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారని బయోపిక్‌లో చూపిస్తే ఔననీ, కాదనీ అనడం కష్టం. ఎందుకంటే దానికి సాక్ష్యం లేదు. బయోపిక్ తీసినపుడు ప్రధాన పాత్రధారిని ఎలివేట్ చేయడానికి కొన్ని సన్నివేశాలను కల్పించవలసివస్తుంది. కల్పన అర్థవంతంగా ఉంటే అసత్యమైనా చెల్లిపోతుంది. కానీ అన్వయం చూసుకోకుండా కొన్ని సన్నివేశాలు పెట్టారని యిప్పటికే తేలింది. రాయలసీమ క్షామనివారణ నిధికి విరాళాలు సేకరించే ఐడియా హీరోదే అని చూపించారు. కానీ గుమ్మడి తన ఆత్మకథలో రాసిన దాని ప్రకారం రాయలసీమ కరువు గురించి ఫోటోలు, నార్ల వారి సంపాదకీయాలు ఆంధ్రప్రభలో చూసిన గుమ్మడి ఎన్టీయార్‌తో యథాలాపంగా 'పృథ్వీరాజ్ కపూర్ సాంఘిక నాటక ప్రదర్శనల ద్వారా విరాళాలు సేకరించి సామాజిక ప్రయోజనాల కోసం వెచ్చిస్తున్నారు కదా, ''పెళ్లి చేసి చూడు'' ద్వారా మీకు వచ్చిన పాప్యులారిటీని మనం యిలా వినియోగిస్తే మంచిది కదాని సూచించారు. 2, 3 రోజుల చర్చల తర్వాత ఎన్టీయార్ తమ్ముణ్ని, పుండరీకాక్షయ్య గారిని మద్రాసు రప్పించి అందరూ కలిసి ప్రోగ్రాం ఫైనలైజ్ చేశారు. ఎన్టీయార్, జి వరలక్ష్మి, గుమ్మడి ''కరువు రోజులు'' అనే నాటికను, పుండరీకాక్షయ్య, పేకేటి, వి.మధుసూదనరావుగారి భార్య సరోజని, యింకా కొందరు కలిసి ''దారిన పోయే దానయ్య'' నాటికను, ఎమ్మెస్ రామారావు గారి సొంత ఆర్కెస్ట్రాతో లలిత సంగీతం.. యిలా ఓ కార్యక్రమం రూపొందించి నెల్లూరు నుంచి విజయనగరం వరకు తిరిగి నిధులు సేకరించారు.
ఇది ఎన్టీయార్ బయోపిక్ కానీ, గుమ్మడి బయోపిక్ కాకపోవడం చేత ఆ నిధిసేకరణ ఐడియా ఎన్టీయార్‌కు వచ్చినట్లే చూపించారు, ఒక నటుడు యిలా సేకరించడం యిదే తొలిసారి అని బుకాయించారు, అర్థం చేసుకోవచ్చు. కానీ దాని కారణంగా నాగిరెడ్డి గారితో గొడవ వచ్చినట్లు చూపించడమే విమర్శలకు తావిచ్చింది. తమ సంస్థతో కాంట్రాక్టు నడుస్తూండగా, తనతో చెప్పకుండా నిధిసేకరణకు వెళ్లడం పట్ల నాగిరెడ్డి అభ్యంతరం తెలిపినట్లు, దానిపై కినిసి ఎన్టీయార్ సొంత సంస్థ స్థాపించినట్లు, బయటి సినిమాలకు సైన్ చేసినట్లు చూపించారు. కానీ అప్పటికే ఎన్టీయార్ ఐదు బయటి సినిమాలు – రాజ్యం పిక్చర్స్ వారి ''దాసి'', ఎవిఎం వారి ''సంఘం'', భరణి వారి త్రిభాషా చిత్రం ''చండీరాణి'' ఒప్పుకుని సంతకాలు పెట్టారని ప్రఖ్యాత సినీజర్నలిస్టు ఎమ్మెల్ నరసింహం రాశారు. ఎన్టీయార్ అలిగితే చక్రపాణి ఎల్వీ ప్రసాద్‌ను వెంటపెట్టుకుని వారింటికి వెళ్లి నచ్చచెప్పి ''చంద్రహారం''కు సైన్ చేయించారన్నది కూడా సత్యదూరమని రావి కొండలరావు గారు చెప్పారు. 'చక్రపాణి గారు ఎవరింటికి వెళ్లనక్కరలేదు, ఆయన ఒక్క ఫోన్ చేయిస్తే చాలు తారలందరూ వెంటనే వచ్చి వాలేవారు. పైగా అప్పటికే ''చంద్రహారం'' షూటింగు నడుస్తోంది' అన్నారాయన.
ఇక రాయలసీమ కరువు నిధిని తన తండ్రికి యివ్వబోయిన సీను గురించి నాగిరెడ్డిగారి తనయుడు విశ్వనాథ రెడ్డి అభ్యంతరం తెలిపారు. 'దానికీ మాకూ ఏ సంబంధమూ లేదు, అసలు ఆ నిధి పేరే 'ఆంధ్రప్రభ రాయలసీమ క్షామ నివారణ నిధి'! 1952 మే 25న మద్రాసులోని వాణీమహల్‌లో ఓ సభ జరిపి ''ఆంధ్రప్రభ'' ఎడిటరు నార్ల వెంకటేశ్వరరావుగారికి ఎన్టీయార్ అందచేశారు. ఆ నిధులను రామకృష్ణ మఠం ద్వారా వెచ్చించమని కూడా ఎన్టీయార్ కోరారు.' అని గుర్తు చేశారు. 'ఇంకా నయం, అది మా నాన్న తన దగ్గరే ఉంచేసుకున్నాడని చూపించారు కాదు' అని జోక్ చేశారు కూడా. ఆ నిధులను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారికి యిమ్మని చెప్పినట్లు సినిమాలో చూపారు. 1953 దాకా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు, 1956 దాకా ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు. అప్పుడు కానీ సంజీవరెడ్డి ముఖ్యమంత్రి కాలేదు. ఈ విషయాన్ని మరో ప్రముఖ జర్నలిస్టు రెంటాల జయదేవ ఎత్తి చూపారు. ''పిచ్చిపుల్లయ్య'' (1953) ద్వారా తాతినేని ప్రకాశరావు (తొలిచిత్రం 1952 నాటి ''పల్లెటూరు'') కి, ''తోడుదొంగలు'' (1954) ద్వారా యోగానంద్ (తొలిచిత్రం 1953 నాటి ''అమ్మలక్కలు'') కు డైరక్షన్ తొలి ఛాన్సు ఎన్టీయారే యిచ్చారని చూపడమూ సరి కాదు. టీవీ రాజు కూడా 1952లో ''టింగురంగా''కు చేశాకనే ఎన్టీయార్ సినిమాలకు చేశారు.
ఇక ఎమర్జన్సీ టైములో ఎన్టీయార్ ''అన్నదమ్ముల అనుబంధం'' సినిమా రీళ్లను తీసుకురావడానికి మద్రాసు వెళ్లి కర్ఫ్యూ సమయంలో ధైర్యంగా వ్యవహరించే సీను, ఆ సందర్భంగా ప్రజాస్వామ్యం చెఱపాలైందని వ్యాఖ్యానించిన సందర్భం గురించి చెప్పాలంటే – అది మొత్తమంతా తప్పులతడకే. మొదటగా చెప్పవలసినది ఎమర్జన్సీ విధించినది 1975 జూన్ 26న. ముందు రోజు రాత్రే ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్టు చేసేశారు. ఆ రోజున అన్ని చోట్లా మామూలుగానే కార్యకలాపాలు నడిచాయి. మన రాష్ట్రంలో ఏ అలజడీ లేదు. క్రమేపీ అరెస్టు వార్తలూ అవీ బయటకు వచ్చాయి. చాప కింద నీరులా వ్యతిరేకత బలపడుతూ వచ్చింది తప్ప అప్పటికప్పుడు ఏ విప్లవమూ వచ్చేయలేదు. ఇక తమిళనాడుకి వస్తే, శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోకి వస్తాయి కాబట్టి అక్కడ ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయమంటే అప్పట్లో ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా వున్న కరుణానిధి సహకరించలేదు. ఆ కోపంతో ఆమె '20 సూత్రాల పథకం తమిళనాడులో అమలు కావటం లేదు' అంది. '..ఎందుకంటే అవన్నీ మేం ఎప్పుడో అమలు చేసేశాం కనుక..' అన్నాడు కరుణానిధి.
జాతీయ ప్రతిపక్ష నాయకుల్లో అరెస్టు తప్పించుకున్న వారందరికి తమిళనాడులో ఆశ్రయం యివ్వసాగాడు. ఇదంతా ఇందిరను రగిలించింది. కరుణానిధి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది కాబట్టి రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఎమ్జీయార్ యిచ్చిన అభ్యర్థన అడ్డం పెట్టుకుని 1976 ఫిబ్రవరి 1న ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ఆ సందర్భంగానే కరుణానిధి కొడుకు స్టాలిన్‌ను, యితర డిఎంకె నాయకులను జైల్లో పెట్టింది. జైల్లో స్టాలిన్‌ను చితకబాదారు. దానికి కారణం ఏమిటనేది ఎవరూ స్పష్టంగా చెప్పలేరు కానీ స్టాలిన్‌పై అప్పట్లో చాలా వార్తలు వస్తూండేవి. ఎమర్జన్సీ టైములో ప్రభుత్వాలకు ఉండే విశేషాధికారాలను ముఖ్యమంత్రి కొడుకు హోదాలో స్టాలిన్ పూర్తిగా దుర్వినియోగం చేశాడని, ముఖ్యంగా మహిళలను విపరీతంగా వేధించేవాడనీ అనేవారు. అందుకేలాగుంది, జైల్లో వేసి ఉతికారు. కరుణానిధి తక్కిన కొడుకులకు యీ దుర్గతి పట్టలేదు. స్టాలిన్ ఉతుకుడు వార్త బయటకు వచ్చి డిఎంకె వాళ్లు నిరసన ప్రదర్శనలు చేస్తే, వారిని అదుపు చేయడానికి గవర్నరు పాలనలో ఉన్న ప్రభుత్వం కర్ఫ్యూ విధించిందేమో తెలియదు.
ఒకవేళ కర్ఫ్యూ విధించినా, స్టాలిన్‌ను కొట్టారన్నా అదంతా 1976 ఫిబ్రవరిలో అయి వుండాలి. మరి ''అన్నదమ్ముల అనుబంధం'' సినిమా 1975 జులై 4కే రిలీజై పోయింది. దానికీ, దీనికీ ముడిపెట్టడం అర్థరహితం, అసంబద్ధం. అసలు దాన్ని ఎందుకు పెట్టినట్లు? రాజకీయాల్లోకి రాక పూర్వమే ఎన్టీయార్, ఇందిరా గాంధీకి విధానాలు నచ్చేవి కావని ఎస్టాబ్లిష్ చేయాలన్న ప్రయత్నమిది. ఎమర్జన్సీలో ప్రజాస్వామ్యాన్ని కాలరాయడాన్ని నిరసించిన, తమపై చేసిన జులుంను ధిక్కరించినవారు కళాకారులున్నారు. నటగాయకుడు కిశోర్ కుమార్ విసి శుక్లా ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఆలిండియా రేడియోలో అతని పాటలను బహిష్కరించారు. అయినా అతను తొణకలేదు. దేవ్ ఆనంద్, విజయ్ ఆనంద్ వంటి అనేకమంది ఎమర్జన్సీ నడుస్తున్నంత కాలం నిరసించినట్లుగా ప్రకటనలు యివ్వకపోయినా, ఎమర్జన్సీ ఎత్తివేయగానే కాంగ్రెసును ఓడించి, జనతా పార్టీని గెలిపించండి అంటూ బొంబాయిలో ర్యాలీలు నిర్వహించారు. ఎన్టీయార్ అలాటివి ఏమీ చేయలేదు. ఇందిరను నియంతగా పేర్కొంటూ ఎన్నడూ విమర్శించలేదు.
నిజానికి ఇందిరా గాంధీ 1972 నుంచి పార్టీని, దేశాన్ని తన చేతిలోకి తెచ్చుకోవడం మొదలుపెట్టారు. ప్రతి రాష్ట్రంలో బలమైన నాయకత్వాన్ని పక్కన పెట్టేసి, తనకు విధేయులైన బలహీనులను ముఖ్యమంత్రులుగా నిలబెట్టారు. మన రాష్ట్రంలో పివి అలాగే అయ్యారు. అంతకుముందు రాష్ట్రంలో ఎమ్మెల్యేలలో ఎక్కువమంది ఎవరికి మద్దతిస్తే వాళ్లే ముఖ్యమంత్రులయ్యేవారు. దిల్లీ నుంచి పరిశీలకులు వచ్చి గమనించేవారు. 1972 నుంచి ఆ పద్ధతి మారిపోయింది. ఎవర్ని ఎంపిక చేయాలో ఆ నిర్ణయాన్ని అధీష్టానికి వదిలేస్తూ తీర్మానం చేయడమొకటే పార్టీ ఎమ్మెల్యేలు చేయవలసిన పని ఐపోయింది. తను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీయారూ అదే పద్ధతి అనుసరించారు. సంస్థాగత ఎన్నికలు జరపడాలు లేవు, అన్ని అధికారాలు అధిష్టానానివే. అనగా ఎన్టీయార్‌దే. తను చెప్పినదే వేదం, తుచ తప్పకుండా చేయాల్సిందే. నోరెత్తడానికి లేదు. అందువలన ఎన్టీయార్‌కు ఇందిర అప్రజాస్వామ్య పోకడలు నచ్చలేదని అనుకోవడానికి లేదు. ఆవిడ పద్ధతులనే ఆయన అనుకరించాడు.
ఇక కాంగ్రెసు తన ముఖ్యమంత్రులను మార్చడం గురించి – 1972 నుంచి ఇందిర ఆ పని చేస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తను పాలించే అన్ని రాష్ట్రాలలోనూ అదే చేసింది. ఆ విషయం ఎన్టీయార్‌కు 1982 దాకా తెలియలేదా? అనే ప్రశ్న వస్తుంది. అదో పెద్ద యిస్యూ కింద చేసి, రాజకీయ లబ్ధి పొందాకైనా తన సహచరుల పట్ల ఎలా ప్రవర్తించారు? ఇష్టమొచ్చినపుడు తీసిపారేశారు. శ్రీపతి రాజేశ్వర్ వంటి వారిని మంత్రులను చేశారు. ఏమిటి అతని అర్హత అంటే ప్రపంచ ఎన్టీయార్ అభిమానుల సంఘం అధ్యక్షుడాయన. 1989లో ఒక్కసారిగా 31 మంది సభ్యులున్న కాబినెట్‌ను రద్దు చేసి పడేసి, 17 రోజులపాటు తనొక్కడే పాలించారు. సాకు ఏమిటంటే బజెట్ ప్రతిపాదనలు ప్రెస్‌కు లీకయ్యాయట. అలాటప్పుడు సంబంధిత మంత్రిని, అధికారులను మార్చేయాలి తప్ప తక్కిన శాఖల వారికి ఏం సంబంధం? ఇప్పుడు కెసియార్ గురువు ఎన్టీయార్‌ను మించిన శిష్యుడయ్యారు. అసలు కాబినెట్టే కూర్చలేదు. ఇలాటి వ్యక్తులకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందని, దాన్ని కాలరాసినవారిని చూస్తే కారం రాసుకుంటున్నట్లు ఉంటుందని ఎవరైనా చెపితే ఎలా నమ్మగలం?
రాజకీయాల్లోకి వచ్చాకనే ఎన్టీయార్ కాంగ్రెసును నానా తిట్లూ తిట్టారు. దుష్టకాంగ్రెసు, కుక్కమూతి పిందెలు.. అంటూ. నిజానికి కాంగ్రెసు పట్ల, కాంగ్రెసు విధానాల పట్ల ఎన్టీయార్ ఎన్నడూ వైముఖ్యం ప్రదర్శించలేదు. విద్యార్థి రోజుల నుంచి కాంగ్రెసులోనే ఎదిగి, మంత్రి కూడా అయిన చంద్రబాబుకు తన పిల్ల నిచ్చి పెళ్లి చేశారు. కూతురు అతన్ని వలచింది కాబట్టి చేయాల్సి వచ్చిందనో, తనతో అనేక సినిమాలు తీసిన నిర్మాత కుమారుడు కాబట్టి తప్పలేదనో చెప్పుకోవడానికి లేదు. చురుకైన కుర్రవాడు అనే చూశారు తప్ప కాంగ్రెసు వాడని దూరం పెట్టలేదు. ఎమర్జన్సీ టైములో అన్ని అకృత్యాలకు మూలవిరాట్టయిన సంజయ్ గాంధీకి అనుచరుడు, యూత్ కాంగ్రెసు ద్వారా విశ్వాసపాత్రుడు అని తెలిసి కూడా, ఆ ఎమర్జన్సీ విధించిన ఇందిరా గాంధీ పార్టీలోనే వర్ధిల్లుతున్న యువనాయకుణ్ని అల్లుణ్ని చేసుకున్నారు. అంతేకాదు, భవనం వెంకట్రామ్ కాంగ్రెసు తరఫున ముఖ్యమంత్రి అయినపుడు ప్రమాణస్వీకార సభకు హాజరై అభినందనలు తెలిపారు. వ్యక్తిగతంగా స్నేహితుడు కాబట్టి అంటే.. యింటికి వెళ్లి షేక్‌హ్యాండ్ యిచ్చి రావచ్చు, సభకు వెళ్లవలసిన పని లేదు. అందువలన ఎన్టీయార్‌కు కాంగ్రెసు పట్ల ఏహ్యత ఉన్నట్లు ఏ రుజువూ లేదు. ఆధారాలు లేవు కానీ కాంగ్రెసు తరఫున రాజ్యసభ సీటుకై ప్రయత్నించారన్న పుకార్లు ఉండేవి కూడా.
ఇదంతా చూస్తే ఎన్టీయార్ ఎమర్జన్సీ విధింపుపై విరుచుకు పడినదంతా సినిమాస్రష్టల కపోలకల్పితం తప్ప నిజం కావడానికి ఏ మాత్రం ఆస్కారం లేనిదనిపిస్తుంది. నిజానికి సినిమాలో కూడా ఎన్టీయార్ తెగింపంతా సినిమా రీళ్లు తేవడానికి మాత్రమే అంటే నవ్వు వస్తుంది. అదో పెద్ద విషయమా? సినిమా యీ వారం రిలీజు కాకపోతే వచ్చేవారం అవుతుంది. ఈ రోజుల్లో అసలు చెప్పిన తేదీకి విడుదలయ్యే సినిమాలే తగ్గిపోయాయి. జయాపజయాలపై ఆలస్యం ప్రభావం పడటం లేదు. అప్పట్లో ఆలస్యమైతే మాత్రం ఏమయ్యేది కనుక? వీడియో పైరసీ అయిపోయి నిర్మాత నాశనమై పోయేవాడా? ల్యాబ్ నుంచి రీళ్లు దొంగతనంగా బయటకు దొర్లుకుంటూ వచ్చేసేవా? థియేటర్లు కొన్ని లాబీల లీజుల్లో ఉండి మరొక సినిమాకు ఎలాట్ చేసేసేవారా? ఎన్టీయార్, ఆయన కుమారుడు బాలకృష్ణ నటించిన చిత్రానికి అలా చేసే దమ్ము ఎవరికైనా ఉండేదా? సినిమా రిలీజుకని కాకుండా ఎవరైనా ప్రతిపక్ష నాయకుణ్ని అరెస్టు చేస్తే అడ్డుకుంటున్నట్లు చూపితే ఎఫెక్టివ్‌గా ఉండేది. కానీ అలా చూపాలంటే ఎవరు వారు? అనే ప్రశ్నను ఎదుర్కోవలసి వస్తుంది. ఇక సినిమా రిలీజే గతి అనుకుంటే, అప్పుడైనా 1976 ఫిబ్రవరిలో రిలీజైన సినిమా పేరు చెప్పాల్సింది. బొత్తిగా యిలా 7 నెలల కితం రిలీజైన సినిమా పేరు చెపితే ఎలా?
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2019)
[email protected]
ఎమ్బీయస్: ఎన్టీయార్ – 01 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 02 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 03
ఎమ్బీయస్: ఎన్టీయార్ – 04 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 05 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 06
ఎమ్బీయస్: ఎన్టీయార్ – 07 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 08 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 09
ఎమ్బీయస్: ఎన్టీయార్ – 10 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 11 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 12