Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: ఆంబేడ్కర్ – రాజ్యాంగం

ఎమ్బీయస్‍: ఆంబేడ్కర్ – రాజ్యాంగం

హైదరాబాదులో 125 అడుగుల ఆంబేడ్కర్ విగ్రహం నెలకొల్పిన సందర్భంగా ఆయన గురించి కాస్త రాయాలనిపించింది. ఆంబేడ్కర్ అనగానే రాజ్యాంగ రచయిత అనే పదం చేర్చకుండా, దళిత నాయకుడు అనే వర్ణన లేకుండా ఎవరూ రాయరు. వాటి గురించి నేను సేకరించినది మీతో పంచుకుంటున్నాను. తప్పులుంటే ఎత్తి చూపండి. ముందుగా రాజ్యాంగ నిర్మాణం గురించి కాస్త చెప్తాను. రామాయణం రాసిందెవరు అంటే వాల్మీకి, భారతం రాసిందెవరు అంటే వ్యాసుడు అని చెప్పినట్లుగా భారత రాజ్యాంగం రాసింది ఎవరు అనగానే ఆంబేడ్కర్ అని చెప్పేస్తారు. ఆయన విగ్రహం చేతిలో ఓ పుస్తకం (రాజ్యాంగం కాబోలు) పెట్టకుండా వదిలిపెట్టరు. దీన్ని బట్టి ఋషుల తరహాలో బాసింపట్టు వేసుకుని ఆంబేడ్కర్ ఒక్కరే ఒంటిచేత్తో యింత పెద్ద రాజ్యాంగం రాసేశారు అనే అభిప్రాయం కలిగితే తప్పుపట్టలేం.

రాజ్యాంగ నిర్మాణంలో ఆంబేడ్కర్ పాత్ర గణనీయమైనదే. అంతమాత్రం చేత తక్కినవారి సేవలను విస్మరించకూడదు అనే భావంతోనే యీ వ్యాసం రాస్తున్నాను. రాజ్యాంగ నిర్మాణంలో కొన్ని కమిటీలు పాలుపంచుకున్నాయి. వాటిలో డ్రాఫ్టింగ్ కమిటీకి 56 ఏళ్ల ఆంబేడ్కర్ చైర్మన్. ఆయన మహారాష్ట్రకు చెందినవారు. దానిలో యితర సభ్యులు ఆరుగురున్నారు. వాళ్లు కెఎం మున్షీ, సర్ సయ్యద్ ముహమ్మద్ సాదుల్లా, సర్ అల్లాడి కృష్ణస్వామి, సర్ గోపాల స్వామి అయ్యంగార్, సర్ న్యాపతి రాఘవరావు (బిఎల్ మిత్తల్ అస్వస్థులైతే వారి స్థానంలో వచ్చారు), టిటి కృష్ణమాచారి (డిపి ఖైతాన్ 1948లో మరణిస్తే ఆయన స్థానంలో వచ్చారు). వీళ్లెవరూ తక్కువ వాళ్లు కారు. 60 ఏళ్ల మున్షీ గుజరాత్‌కు చెందినవారు. రచయిత. భారతీయ విద్యాభవన్ సంస్థ నిర్మాత. హైదరాబాదును నిజాం పాలిస్తూండగా ఏజంట్ జనరల్‌గా, కేంద్రమంత్రిగా చేశారు.

62 ఏళ్ల సయ్యద్ సాదుల్లా అసాంకు 1937 నుంచి తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో పుట్టిన 64 ఏళ్ల కృష్ణస్వామి మద్రాసు రాష్ట్రానికి అడ్వకేట్ జనరల్‌గా చేశారు. ఈ మధ్యే ఆయన మనుమరాలు అల్లాడి ఉమ రాజ్యాంగం రాసే రోజుల్లో దిల్లీలోని వాళ్ల యింట్లోనే కొన్ని సార్లు సమావేశాలు జరిగేవని, ఆంబేడ్కర్‌కు వాళ్లింటి కాఫీ, చారు చాలా యిష్టమని వ్యాసం రాశారు. ఎవరైనా తనను రాజ్యాంగ నిర్మాత అని సంబోధిస్తే కృష్ణస్వామిగారు సహించేవారు కాదుట. అది సమిష్టి కృషి అనేవారట. తమిళుడైన 65 ఏళ్ల గోపాలస్వామి ఐసిఎస్. కశ్మీర్‌కు ప్రధానిగా, స్వాతంత్ర్యానంతరం కేంద్రమంత్రిగా చేశారు. 60 ఏళ్ల న్యాపతి రాఘవరావు మచిలీపట్నంలో పుట్టారు. ఐసిఎస్. మైసూరు సంస్థానికి దివాన్‌గా చేశారు. 48 ఏళ్ల కృష్ణమాచారి తమిళుడు. పారిశ్రామికవేత్త. తర్వాతి రోజుల్లో కేంద్రమంత్రిగా చేశారు.

ఈ దిగ్గజాల్లో యిద్దరు తెలుగువాళ్లు ఉన్నా, మనమెప్పుడూ వాళ్ల గురించి తలవము. రాజ్యాంగ నిర్మాణంలో మనవాళ్లూ ఉన్నారని చాలామందికి తెలియకపోయినా ఆశ్చర్యం లేదు. పబ్లిసిటీ లేదు మరి. ఇదంతా డ్రాఫ్టింగ్ కమిటీ. ఇలాటి కమిటీలు ఎన్ని ఉన్నాయి? వికీపీడియాకు వెళ్లి చూస్తే మొత్తం 17 కమిటీలున్నాయి. రాజేంద్ర ప్రసాద్‌ గారు చైర్మన్‌గా రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ, స్టీరింగ్ కమిటీ, ఫైనాన్స్ కమిటీ, నేషనల్ ఫ్లాగ్‌పై అడ్‌హాక్ కమిటీలుండగా, నెహ్రూ గారు చైర్మన్‌గా స్టేట్స్ కమిటీ, యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ కాన్‌స్టిట్యూషన్ కమిటీ ఉన్నాయి. పటేల్ గారు చైర్మన్‌గా ఫండమెంటల్ రైట్స్ కమిటీ, కృపలానీ చైర్మన్‌గా ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ, ఎచ్ సి ముఖర్జీ అనే బెంగాలీ క్రైస్తవుడు చైర్మన్‌గా మైనారిటీస్ సబ్ కమిటీ, మావలాంకర్ చైర్మన్‌గా కాన్‌స్టిట్యుయెంట్ ఎసెంబ్లీ కార్యకలాపాల కమిటీ, మున్షీ చైర్మన్‌గా బిజినెస్ కమిటీ, ఠక్కర్ చైర్మన్‌గా ప్రాంతీయ కమిటీ, బోర్దొలోయ్ చైర్మన్‌గా ఈశాన్య ప్రాంతాల కమిటీ, అల్లాడి కృష్ణస్వామిగారు చైర్మన్‌గా క్రెడిన్షియల్ కమిటీ, పట్టాభి సీతారామయ్య గారు చైర్మన్‌గా హౌస్ కమిటీ.. యిన్ని ఉన్నాయి. వీరందరూ తమ కమిటీల నివేదికలు యిస్తే, వాటిని క్రోడీకరించి డ్రాఫ్టింగ్ కమిటీ పని చేసింది.

ఈ డ్రాఫ్టింగ్ కమిటీ కూడా ఆకాశంలోంచి ఊడిపడలేదు. సర్ బిఎన్ రావు అనే ఆయన వివిధ దేశాల రాజ్యాంగాలు పరిశీలించి, పరామర్శించి ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తే, దాన్ని బేస్‌గా చేసుకుని ఆంబేడ్కర్ కమిటీ తక్కిన కమిటీల నివేదికల ఆధారంగా ఫైనల్ డ్రాఫ్ట్ తయారు చేసింది. ఎవరీ రావు? బెనగల్ నర్సింగ రావు అనే కన్నడిగుడు. ఆంబేడ్కర్ కంటె నాలుగేళ్లు పెద్ద. కేంబ్రిజ్‌లో న్యాయవిద్య చదివాడు. ఐసిఎస్. కలకత్తా కోర్టులో జజ్. బర్మా రాజ్యాంగం రాశాడు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో 1950-52 మధ్య భారత ప్రతినిథి, ప్రెసిడెంటు. ఐక్యరాజ్యసమితికి సెక్రటరీ జనరల్ అవుతాడామో అనుకుంటూంటే అంతర్జాతీయ న్యాయస్థానంలో జజ్ పదవి వస్తే దానికి వెళ్లిపోయాడు. ఈయన మౌలికమైన డ్రాఫ్ట్ తయారుచేశాడు.

అఖిల భారత విద్యార్థి పరిషత్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన రామ్ బహదూర్ రాయ్ అనే జర్నలిస్టు ఇండియా టుడేకి యిచ్చిన యింటర్వ్యూ 2016 జూన్‌లో వచ్చింది. ఆయనకు రాజ్యాంగంపై చాలా అభ్యంతరాలున్నాయి. దానిలో ఫెడరలిజం లేదంటాడు. మొత్తం జనాభాలో 12% మందికి ప్రాతినిథ్యం ప్రజాప్రతినిథులు మాత్రమే యిన్‌వాల్వ్ అయి రాసినది కాబట్టి ప్రజాభీష్టం దానిలో ప్రతిఫలించ లేదంటాడు. ఆ యింటర్వ్యూలో రాజ్యాంగం డ్రాఫ్ట్ చేయడంలో ఆంబేడ్కర్ పాత్ర కంటె రావు పాత్రే ఎక్కువ అన్నాడాయన. రావు రాసిన భాషను యీయన మెరుగు పర్చాడంతే అన్నాడు. నిజానికి 1949 నవంబరు 25న జరిగిన కాన్‌స్టిట్యుయెంట్ అసెంబ్లీ (కా.అ.) ఆఖరి సమావేశంలో ఆంబేడ్కర్ మాట్లాడుతూ ‘‘రాజ్యాంగం డ్రాఫ్ట్ చేయడంలో నాకిస్తున్న క్రెడిట్ నిజంగా నాది కాదు. అది కొంతమేరకు బిఎన్ రావుగారికి చెందాలి. ఆయనే రఫ్ డ్రాఫ్ట్ (చిత్తు ప్రతి) తయారు చేశారు.’’ అని చెప్పుకున్నారు. చిత్రమేమిటంటే బిఎన్ రావు గారి పేరు యిప్పుడు ఎవరూ తలవనైనా తలవరు.

డ్రాఫ్టింగ్ కమిటీలో అందరి కంటె ఆంబేడ్కర్ పడిన శ్రమే ఎక్కువ. ఓ పక్క న్యాయశాఖా మంత్రిగా పని చేస్తూనే, దీనిపై పని చేయడానికి ఆయన చాలా శ్రమించారు. తన ఆరోగ్యాన్ని కూడా ధారపోశారు. టిటి కృష్ణమాచారి ‘‘దీనిలో పూర్తికాలం పని చేసింది ఆంబేడ్కర్ ఒకరే. ఒక సభ్యుడు ప్రభుత్వ పనులలో తీరిక లేకుండా ఉన్నారు. మరో యిద్దరు అనారోగ్య కారణాల వలన దిల్లీకి దూరంగా ఉన్నారు. మూడేళ్ల పాటు రోజులో చాలా గంటలు కష్టపడినది ఆంబేడ్కరే.’’ అని ప్రశంసించారు. రాయ్ ప్రజల భాగస్వామ్యం లేదని ఎందుకన్నారో చెప్పాలంటే కాన్‌స్టిట్యుయెంట్ అసెంబ్లీ (కా.అ.) చరిత్ర చెప్పాలి.

విపులంగా చెప్తే దినపత్రికలు గ్రూపు పరీక్షార్థుల కోసం రాసే వ్యాసంలా ఉంటుంది. క్లుప్తంగా చెప్పేస్తాను. బ్రిటిషు రాజ్యాంగం ప్రకారం భారతదేశం నడుచుకోనక్కర లేదని, వారి భిన్న సంస్కృతికి అనుగుణంగా వారి కంటూ ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే వాదన 1934లో వచ్చింది. వయోజన ఓటింగు ఆధారంగా కా.అ. ఏర్పడాలన్న కాంగ్రెసు ప్రతిపాదనను బ్రిటిషు వారు 1940లో ఆమోదించారు. యుద్ధం రావడంతో ప్రతిపాదన ఆలస్యమైంది. 1946లో కాబినెట్ మిషన్ ప్లాను కింద 389 మంది సభ్యులతో కా.అ.ని ఏర్పాటు చేశారు. వారిలో 93 మంది రాజసంస్థానాల ప్రతినిథులు. నలుగురు దిల్లీ, అజ్మేర్, కూర్గ్, బెలూచిస్తాన్ కమిషనర్లు, 292 మంది వివిధ ప్రాంతాల ప్రతినిథులు.

1946 ఆగస్టు కల్లా ఈ 296 స్థానాలకై ఎన్నికలు జరిగాయి. కాంగ్రెసు 208, ముస్లిము లీగు 73 గెలిచాయి. 1946 డిసెంబరు 9న మొదటి కా.అ. సమావేశం రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగింది. ఉపాధ్యక్షుడిగా కలకత్తా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఎచ్‌సి ముఖర్జీ ఉన్నారు. బిఎన్ రావును కా.అ.కు సలహాదారుగా తీసుకున్నారు. దీనిలో ఆంబేడ్కర్‌కు అవకాశం రావడం విశేషమే. ఎందుకంటే ఆంబేడ్కర్‌కు కాంగ్రెసుకు బద్ధవిరోధి. బ్రిటిషు వారికి అనుకూలుడు. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో 1942 నుంచి నాలుగేళ్ల పాటు సభ్యుడు. కాంగ్రెసుకు మెజారిటీ ఉన్న యీ కా.అ. సభలో ఆంబేడ్కర్‌ను ఎందుకు పిలిచారు అంటే రాజకీయ విరోధులు కూడా ఒప్పుకుని తీరవలసిన విషయమేమిటంటే ఆంబేడ్కర్ సాక్షాత్తూ సరస్వతీపుత్రుడు. భయంకరమైన వర్ణవివక్షత అనుభవించి కూడా పట్టుదలతో, స్వయంకృషితో, మేధోపటిమతో, నిజాయితీతో, నిర్భీకతతో పైకి వచ్చిన మహానుభావుడు.

సైమన్ కమిషన్‌లో, రౌండ్ టేబుల్ సమావేశాల్లో, 1935 చట్టం ఏర్పాటులో యీ విషయాలపై పని చేసి అనుభవజ్ఞుడు. అందుకే కా.అ. ఎన్నికలలో తామే ఓడించిన ఆంబేడ్కర్‌ను కాంగ్రెసు స్వయంగా పిలిచి పెద్ద పీట వేసింది. డా. రాజేంద్ర ప్రసాద్ యీ ప్రతిపాదనను కాంగ్రెసు ముందు ఉంచినపుడు ఎవరూ అభ్యంతర పెట్టలేదు. అంతే కాదు, స్వాతంత్ర్యం వచ్చాక ఏర్పడిన తొలి కాబినెట్‌లో నెహ్రూ ఆంబేడ్కర్‌ను న్యాయశాఖామాత్యులుగా తీసుకున్నారు. నాలుగేళ్లు పని చేశాక తను సూచించిన తీవ్రమైన మార్పులు ఆమోదించడానికి ప్రభుత్వం వెనకాడుతోందని కోపగించుకుని ఆంబేడ్కర్ 1951 అక్టోబరులో రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. అయినా ఆర్నెల్లకే 1952 ఏప్రిల్‌లో పిలిచి రాజ్యసభ సభ్యత్వం యిచ్చారు. 1956లో చనిపోయేవరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు.

1946 డిసెంబరులో రాజ్యాంగరచనా కార్యక్రమం మొదలు పెడదామనుకుంటూండగానే ముస్లిము లీగు కాంగ్రెసుతో కలిసి కూర్చోనంది. ముస్లిములకై వేరే కా.అ. కావాలంది. దాంతో పని ఆగిపోయింది. మౌంట్‌బాటెన్ 1947 జూన్‌లో కాబినెట్ మిషన్ రద్దు చేసి, పాకిస్తాన్‌కు వేరే కా.అ. పెట్టేశాడు. దాంతో దీనిలో సభ్యుల సంఖ్య 299కి తగ్గిపోయింది. స్వాతంత్ర్యం వచ్చాక 1947 డిసెంబరు 31న తొలిసారి సమావేశమయ్యారు. ప్రావిన్సెస్ నుంచి 229 మంది ఉన్నారు. వారిలో యునైటెడ్ ప్రావిన్సెస్ నుంచి 55, మద్రాసు నుంచి 49, బిహార్ నుంచి 36, బాంబే నుంచి 21, వెస్ట్ బెంగాల్ నుంచి 19 యిలా ఉన్నారు. భారత్‌లో మిగిలిన రాజసంస్థానాల నుంచి 70 మంది. అప్పణ్నుంచి దాదాపు మూడు సంవత్సరాలో 11 సెషన్స్‌లో 165 రోజులు దీనిపై గడిపారు. రాజ్యాంగ నమూనాపై 114 రోజులు చర్చలు జరిపి, చివరకు 1949 నవంబరులో ప్రభుత్వానికి సమర్పించారు. అది ఆమోదం పొంది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది.

రిజర్వేషన్ విధానంపై మంట ఉన్నవారు రాజ్యాంగం రాసేటప్పుడు ఆంబేడ్కరే యీ రిజర్వేషన్లు యిప్పించేసు కున్నాడని అనుకుంటూంటారు. రాజ్యాంగ నిర్మాణంలో ఎన్ని కమిటీలు ఉన్నాయో పైన చెప్పాను కదా. డ్రాఫ్టింగ్ కమిటీలో సయ్యద్ సాదుల్లా అనే ముస్లిముని తప్పిస్తే అల్లాడి కృష్ణస్వామి, గోపాలస్వామి అయ్యంగార్, న్యాపతి రాఘవరావు, టిటి కృష్ణమాచారి, కెఎం మున్షీ వీరందరూ బ్రాహ్మణులే. అందువలన తప్పు పడితే వీళ్లనీ తప్పు పట్టాలి. వీరిలో కొందరు ఆంబేడ్కర్‌కు సీనియర్లు. వాళ్లు వద్దని ఉంటే ఆంబేడ్కర్ అడ్డు చెప్పగలిగేవారు కాదు. రిజర్వేషన్ల సృష్టికర్త ఆంబేడ్కర్ అనుకోవడం తప్పంటూ ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఎడిటరు రాహుల్ కుమార్ ఏప్రిల్ 14 నాటి వ్యాసంలో చాలా వివరాలు యిచ్చారు. వాటిని ప్రస్తావించే ముందు కొన్ని సంగతులు చెప్పాలి.

బ్రిటిషు పాలన అప్రతిహతంగా నడిచే రోజుల్లో వలస పాలనలోని అన్యాయాలను కనిపెట్టి, బ్రిటన్ తరహాలో ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులుండాలని నినదించిన వారిలో బ్రాహ్మణులు, యితర అగ్రవర్ణాల వారు ప్రముఖంగా నిలిచారు. వీరు బ్రిటన్ పాలనలోనే వర్ధిల్లి, ఉన్నత విద్యాభ్యాసానికి ఇంగ్లండ్ వెళ్లి అక్కడి పరిస్థితులు గమనించి, ప్రజాస్వామ్యం అంటే యిది కదా అని తెలుసుకుని, మన దేశానికి తిరిగి వచ్చి సాధారణ ప్రజలకు తెలియ చెప్పసాగారు. వీరి వలన చైతన్యవంతులైన ప్రజలు తమ పాలనపై తిరగబడతారేమోనన్న భయంతో ఆంగ్లేయులలో కలిగింది. అప్పుడు ఏ హక్కు అడిగినా సామరస్యంగా అడిగి తీసుకోవాలనే పంథాతో కాంగ్రెసు పార్టీని ఆంగ్లేయుడే అయిన స్కాట్ ప్రారంభించాడు.

కానీ అది బతిమాలే ధోరణిలో ఉండడం కొందరికి నచ్చలేదు. క్రమేపీ దానిలో మితవాదులు, అతివాదుల మధ్య చీలిక వచ్చింది. ఇది సాగనిస్తే తమకు అంతిమంగా ముప్పు వస్తుందనే భయంతో ఆంగ్లేయులు భారతీయుల మధ్య చీలికలు తేవడానికి ప్రయత్నించారు. ప్రథమంగా మతపరమైన చీలిక తెచ్చారు. వేలాది సంవత్సరాలుగా హిందూ ముస్లిములు కలిసి ఉన్న దేశంలో వాళ్లు తరతరాలుగా సంఘర్షిస్తూనే ఉన్నారంటూ చరిత్రను ప్రొజెక్ట్ చేశారు. వేల సంవత్సరాల చరిత్రలో కొన్ని వందల ఘర్షణలు జరగడం సహజం. (ఆ మాటకొస్తే ముస్లిం దేశాల్లోనే షియా, సున్నీ, మరోటీ మరోటీ అంటూ కొట్టుకుని ఛస్తారు). వాటినే భూతద్దంలో చూపి, నిత్యపోరాటం జరిగినట్లు చూపడం పొరపాటు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు, ముస్లిములకు మధ్య ఎప్పుడూ వైరుధ్యమే. ముస్లిములను శత్రువులుగా చూడడం క్రైస్తవులైన ఆంగ్లేయులకు సహజలక్షణం.

పైగా హిందూ, ముస్లిం రాజులు పాల్గొన్న 1857 తిరుగుబాటు ఆఖరి మొఘల్ బాదుషా బహదూర్ షాను భారతపాలకుణ్ని చేస్తామనే లక్ష్యంతో జరిగింది. ఈ హిందూ-ముస్లిం సఖ్యతను చెడగొట్టడానికి ముస్లిం రాజులను తమవంటి వలస పాలకులుగా, బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడినవారిగా చూపించారు. అంతకు ముందు దాడి చేసి వెళ్లిపోయిన ఘోరీలను, గజనీలను వదిలేయండి. క్రీ.శ.1200 నుంచి పాలించిన ముస్లిం పాలకులు వాళ్లిక్కడే స్థిరపడిపోయారు కదా, ఇంగ్లిషు వాళ్లలా సంపదను వాళ్ల దేశానికి తరలించుకుని పోలేదు కదా. ఉత్తరానే కాదు, తూర్పు, పడమర, దక్షిణం నలువైపులా ముస్లిం పాలకులునారు. వాళ్లంతా మతమార్పిళ్లకు పాల్పడి ఉంటే 1947 నాటికి అవిభక్త భారతంలో 75% మంది హిందువులు ఎలా ఉంటారు?

భారతీయుల్లో మతపరమైన ఘర్షణ తేవడంతో బాటు, కులపరమైన విభజన కూడా తెచ్చారు ఆంగ్లేయులు. దేశంలో కులపరమైన వ్యత్యాసాలు, ఘర్షణలు, శివ-కేశవ తగాదాలు లేవని అనలేం. వాటిని ఆంగ్లేయులు ఉపయోగించుకో దలచారు. తమకు ఎదురు తిరుగుతున్న అగ్రవర్ణాల వారికి వ్యతిరేకంగా యితర కులాలను ప్రోత్సహించి, వారిని తమకు అనుకూలంగా మలచుకుందామని చూశారు. ఇక్కడే మరొక మాట కూడా చెప్పాలి. గొప్పాబీదా తేడా ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది. కానీ కొన్ని కులాలు అంటరానివనడం, కొన్ని కులాలు గొప్పవి, మరి కొన్ని కులాలు వాటి కంటె తక్కువవి, యింకొన్ని యింకా తక్కువవి అనే సోపానవర్గీకరణ ఆంగ్లేయులకు ఎబ్బెట్టుగా, అనాగరికంగా, అమానవీయంగా తోచి ఉంటుంది. దాన్ని సవరించడానికి తమ చేతిలో అధికారం ఉన్నచోట్ల ఉపయోగించి ఉంటారు. దీనివలన జరిగిన మేలేమిటంటే అన్ని కులాలకూ ప్రగతి ఫలాలు అందాయి. సమాజంలో సముచిత స్థానం కోసం నినదించే ధైర్యం వారికి వచ్చింది.

కాంగ్రెసు ఏర్పడిన ఏడేళ్లకే 1892లో బ్రిటిషు పాలకులు అంటరానివారికి ప్రత్యేక పాఠశాలలు ఏర్పరచారు. అగ్రవర్ణాలు నడిపే స్కూళ్లలో వాళ్లని చేర్చుకోనందున అలా చేయవలసి వచ్చింది. క్రమేపీ ఉద్యోగాల్లో దళితులకు రిజర్వేషన్లు అమలు చేస్తూ వచ్చింది. 1932 నాటి కమ్యూనల్ ఎవార్డు ప్రకారం ప్రొవిజినల్ లెజిస్లేచర్స్‌లో డిప్రెస్‌డ్ క్లాసెస్ (1935 చట్టంలో షెడ్యూల్ కాస్ట్ అన్నారు, యిప్పుడు దళితులు అంటున్నారు) 148 సీట్లు కేటాయించారు. అంటరానివారి విషయంలో తరతరాలుగా అన్యాయం జరుగుతూ వచ్చింది కాబట్టి యీ విధమైన వెసులుబాటు సమంజసమే అనుకోవచ్చు. కానీ సామాజికంగా వెనకబడిన తరగతులంటూ ఆర్థికంగా బలమైన కులాల వారిని కాంగ్రెసులోని బ్రాహ్మణ, అగ్రవర్ణ నాయకత్వానికి ప్రత్యర్థులుగా, తమకు మద్దతుదారులుగా నిలపడం మాత్రం బ్రిటిషు రాజనీతే.

మద్రాసు ప్రెసిడెన్సీలో ద్రవిడ ఉద్యమం పేర బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమానికి బ్రిటిషు వారు మద్దతిచ్చారు. కాంగ్రెసుకు ప్రతిగా ద్రవిడ ఉద్యమకారులచే జస్టిస్ పార్టీ స్థాపింప చేసి దానికి దన్నుగా నిలబడ్డారు. కాంగ్రెసు గెలిచి భూసంస్కరణలు తెస్తే తమ భూములు పోతాయని భయపడిన జమీందార్లు దానిలో సభ్యులుగా ఉన్నారు. 1920లో మద్రాసు ప్రెసిడెన్సీలో అధికారంలోకి వచ్చిన జస్టిస్ పార్టీ తన ఓటు బ్యాంకు కోసం మద్రాసు కౌన్సిల్‌లో 65 సీట్లలో 28 స్థానాలను బ్రాహ్మణేతర వర్గాలకు ప్రత్యేకించింది. 48% ఉద్యోగాలను యీ వర్గాలకు రిజర్వ్ చేసింది. మహారాష్ట్రలో కూడా అగ్రకులాల నేతృత్వంలోనే కాంగ్రెసు ఉద్యమం నడుస్తోంది కాబట్టి 1902లో కొల్హాపూర్‌లో 50% ఉద్యోగాలను బిసిలకు కేటాయించారు. మైసూరు సంస్థానంలో బిసిలకు 50% ఉద్యోగాలను యివ్వాలని మిల్లర్ కమిషన్ సిఫార్సు చేసింది. బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో 1919 నాటికి మరాఠాలకు 7% రిజర్వ్ చేశారు. ఇవన్నీ రాహుల్ కుమార్ యిచ్చిన గణాంకాలు.

రిజర్వేషన్లను శాశ్వత ఏర్పాటుగా ఆంబేడ్కర్ పరిగణించలేదు. ఒకసారి రిజర్వేషన్ల ద్వారా అభివృద్ధి చెందిన దళితులు తక్కిన దళితుల పురోగతికి తోడ్పడతారని, క్రమేపీ అసమానత పోతుందని ఆశించారు. మార్క్స్ కూడా కార్మిక నియంతృత్వం ఏర్పడితే వాళ్లు సమసమాజం ఏర్పరచేస్తారని ప్రతిపాదించాడు. ఆచరణలో యివేమీ జరగలేదు. ఒకసారి పైకి వచ్చాక, తనవారైనా, పెరవారైనా తన స్థాయికి చేరుకోకూడదనే స్వార్థబుద్ధి అడ్డు వచ్చింది. అందుకే అసమానతలు కొనసాగుతున్నాయి. కొత్త రిజర్వేషన్ల కోసం, పెంపు కోసం పోరాటాలతో సమాజం చీలిపోతోంది. రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం వీటిని ఎగదోస్తున్నాయి. ఈ రగడ నంతటినీ ఆంబేడ్కర్‌కు అంటగట్టడం అన్యాయం.

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆంబేడ్కర్ విగ్రహాలు కనబడడంతో ఆయన జీవితకాలంలో యింకెంత పాప్యులరో అనుకునే అవకాశం ఉంది. దాని గురించీ రాస్తాను. స్వాతంత్ర్యానంతరం 1952లో, అంటే ఆంబేడ్కర్ రాజ్యాంగ రచనా కార్యక్రమం ముగించి, న్యాయశాఖా మంత్రిగా నాలుగేళ్లు పనిచేసి రాజీనామా చేసి వచ్చిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలలో తను స్థాపించిన షెడ్యూల్డ్ కాస్ట్‌స్ ఫెడరేషన్ పార్టీ తరఫున బొంబాయి నార్త్ నుంచి పోటీ చేస్తే కాంగ్రెసు అభ్యర్థి చేతిలో 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దేశం మొత్తం మీద 489 పార్లమెంటు స్థానాలకు పోటీ జరిగితే ఆ పార్టీకి వచ్చిన సీట్లు 2! ఒకటి బొంబాయిలో, మరొకటి హైదరాబాదు రాష్ట్రంలోని కరీంనగర్‌లో. అప్పుడు ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారు.

దానిలో ఉంటూనే 1954లో భండారాలో ఉపయెన్నిక జరిగితే పోటీ చేశారు. దానిలో ఆయనకి మూడో స్థానం దక్కింది. 1956 సెప్టెంబరులో రిపబ్లికన్ పార్టీ స్థాపించారు కానీ తర్వాత కొద్ది నెలలకే మరణించారు కాబట్టి 1957లో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసే సందర్భం రాలేదు. 1957 నాటికి రిపబ్లికన్ పార్టీ పేరు రిజిస్టర్ కాలేదేమో, ఆంబేడ్కర్ అనుయాయులు షెడ్యూల్డ్ కాస్ట్‌స్ ఫెడరేషన్ పేరు మీదే పోటీ చేశారు. ఈ ఎన్నికలలో మొత్తం 494లో 6 సీట్లలో నెగ్గారు. ఆంబేడ్కర్ పోయారన్న సింపతీ కూడా పని చేసినట్లు లేదు. ఈ 6టిలో 5 బొంబాయి రాష్ట్రంలో, 1 మైసూరు రాష్ట్రంలో వచ్చాయి. రిపబ్లికన్ పార్టీకి మహారాష్ట్ర బయట చాలా తక్కువ రాష్ట్రాలలోనే ఉనికి ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి జె.ఈశ్వరీబాయి (మాజీ మంత్రి గీతారెడ్డి తల్లి) ప్రాతినిథ్యం వహించేవారు. ఆ పార్టీ ముక్కలుచెక్కలుగా చీలిపోయింది. ప్రస్తుత లోకసభలో దానికి సీట్లు పూజ్యం. షెడ్యూల్ కులాల పేర యితర పార్టీలు ఏర్పడినా వాటిని ఆంబేడ్కర్ ఖాతాలో వేయలేము.

ఎందుకిలా జరిగింది? నేను గమనించిన దాని ప్రకారం ఆంబేడ్కర్ మేధోజీవి, దళితులకు సముచిత స్థానంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరిపిన వ్యక్తి తప్ప ప్రజల్లో మసలిన మనిషి కాదు. ఆయన చేసిన కొద్ది ఉద్యమాలు మహారాష్ట్రలోనే చేశారు. ప్రజల్లో ఉంటూ, దేశమంతా తిరుగుతూ హరిజనులు కూడా మనలాటి వారే, అంటరానితనం కూడదు అని అందరికీ బోధిస్తూ, పత్రికలు నడుపుతూ, ఉద్యమాలు చేస్తూ వచ్చినది గాంధీ, ఆయన అనుచరులే. అందువలన హరిజనులు కాంగ్రెసునే అంటిపెట్టుకుని ఉన్నారు. ఆంబేడ్కర్ బ్రిటిషు వారితో పేచీ పెట్టుకోలేదు, జైలుకి వెళ్లలేదు. ప్రభుత్వోద్యోగాలు చేశారు, వారిచ్చిన పదవులు తీసుకున్నారు. నిజాంతో సహా సంస్థానాధీశులతో భుజాలు రాసుకుని తిరిగారు. ఇవన్నీ ఆయనను ప్రజలకు చేరువ చేయలేదనుకుంటా.

పైగా అప్పట్లో అక్షరరాస్యత తక్కువ. పత్రికలు తక్కువ. ఉన్న పత్రికలు కూడా కాంగ్రెసుకో, కమ్యూనిస్టులకో అనుకూలంగా ఉండేవి. ఆంబేడ్కర్ యిద్దరినీ ద్వేషించేవాడు. పాకిస్తాన్ యివ్వాలని చాలా ముందుగానే ప్రకటించాడు. హిందువుగా ఉంటూ దాన్ని సంస్కరించడం అసాధ్యం అనుకుని దానిలోంచి బయటకు వెళ్లి బౌద్ధంలో చేరాడు. ఈ కారణాల వలన ఆయన తన జీవితకాలంలో తెచ్చుకోవలసినంత పాప్యులారిటీ తెచ్చుకోలేక పోయారని నా అభిప్రాయం. ఆయన పోయిన 34 ఏళ్లకు భారతరత్న యిచ్చారు. అప్పటిదాకా ఎందుకివ్వలేదని గట్టిగా అడిగినవారు లేరు. ఆంబేడ్కర్ జీవితచరిత్ర తెలుగులో తొలిసారి వెలువడినది 1968 లోనే అని డా. శిఖామణి రాశారు. దాన్ని బట్టి మహారాష్ట్ర బయట ఆయనకు పబ్లిసిటీ బొత్తిగా శూన్యమని తెలుస్తోంది. 

ఇప్పుడు మాత్రం పబ్లిసిటీకి కొదవ లేదు. కానీ ఆయన లేరు కదా! రాజకీయ పరంగా ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయినా ఆయన నిశ్చయంగా గొప్పవాడు, గొప్ప ప్రతిభామూర్తి. కఠోర పరిశ్రమతో, ఓర్పుతో వివక్షతను ధైర్యంగా ఎదుర్కోవాలో చూపిన ఆదర్శమూర్తి. (ఫోటో – హైదరాబాదులో ఆంబేడ్కర్ విగ్రహం, ఇన్‌సెట్ - రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ సభ్యులు)

– ఎమ్బీయస్ ప్రసాద్  

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?