Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: బ్రెయిన్ డెడ్ కేసులు

ఎమ్బీయస్‍: బ్రెయిన్ డెడ్ కేసులు

ఇటీవల మరణించిన తారకరత్నది బ్రెయిన్ డెడ్ కేసు. ఎప్పుడో చచ్చిపోతే లోకేశ్‌కు అపఖ్యాతి వస్తుందని దాచి పెట్టారని వచ్చిన పుకారు అబద్ధమే అనుకోవచ్చు. అతను వెంటనే పోయినా, నెల్లాళ్లు ఆగి పోయినా లోకేశ్ పాదయాత్ర ప్రారంభమైన రోజున కుప్పకూలాడు అన్న వాస్తవాన్ని ఎవరూ దాచలేరు కదా. అదృష్టవశాత్తూ తారకరత్న అనారోగ్యానికి, లోకేశ్ పాదయాత్రకు ప్రజలెవ్వరూ ముడిపెట్టలేదు. మూఢనమ్మకాలతో సతమతమవుతున్న యీ కాలంలో కూడా జనాలు విజ్ఞతతో ప్రవర్తించడం హర్షదాయకం. తారకరత్నది ఎన్నాళ్లగానో ఉన్న అనారోగ్య సమస్య అని తేలుతోంది. అతను అక్కడ కాకపోతే జనసమ్మర్దం ఉన్న మరొక చోట కూలేవాడేమో! అవేళే కావడం యాదృచ్ఛికం. దాన్ని లోకేశ్ నెత్తిన చుట్టడం సబబు కాదు. ఏదో యిరుకు సందులో సభ పెట్టి జనాలకు ఊపిరి సలపకుండా, గాలి ఆడనీయకుండా చేశాడంటే నాయకుణ్ని తప్పు పట్టవచ్చు కానీ యిది విశాల ప్రాంగణంలోనే జరిగిన ఘటన. ప్రజలు అది అర్థం చేసుకున్నారు. లోకేశ్ యాత్రకు వెళితే పరలోకయాత్ర తథ్యం అనే భయం పెట్టుకోకుండా పాల్గొంటున్నారు.

బ్రెయిన్ డెడ్ కేసుల్లో పేషంటు బంధువులు ఏం చేయవచ్చు అనే దానిపై యీ వ్యాసం. దానికి ముందు అది ఎలా సంభవిస్తుందో తెలుసుకుందాం. తారకరత్నకు హృద్రోగసమస్య వచ్చి బ్రెయిన్ డెడ్ అయిందన్నారు. హార్ట్ ఎటాక్ అయిన అన్ని కేసుల్లోనూ యిలా కావటం లేదే, యితనికి మాత్రమే ఎందుకలా అయింది అనే సందేహం రావడం సహజం. నిత్యజీవితంలో మనం చాలా మెడికల్ టర్మ్స్ వింటాం కానీ యితమిత్థంగా నిర్వచించమంటే తల గోక్కుంటాం. హార్ట్ ఎటాక్ అంటారు, హార్ట్ ఫెయిల్యూర్ అంటారు, కార్డియాక్ అరెస్ట్ అంటారు, బ్రెయిన్ డెడ్ అంటారు. డాక్టరేదో చెప్తారు. మనం మరొకళ్లకి చెప్పినపుడు ఒకదానికి బదులు మరొకటి చెప్పేస్తాం. నాబోటి వాడు ఎందుకైనా మంచిదని హార్ట్ ప్రాబ్లెమ్‌ట అనేస్తాడు. ఏమిటి వీటి మధ్య తేడా? నేను సేకరించిన సమాచారాన్ని పంచుకుంటున్నాను. తప్పులుంటే చెప్పండి.

మొదటగా గమనించాల్సింది, ఛాతీ నొప్పులన్నీ గుండె నొప్పులు కావు. గ్యాస్, ఎసిడిటీ కారణంగా కూడా ఛాతీలో నొప్పి రావచ్చు. ఆ నొప్పి గుండె కారణంగా వచ్చిందా, గ్యాస్ కారణంగా వచ్చిందా అనేది డాక్టరే తేలుస్తారు. గుండె కారణంగా వస్తే గుండె నొప్పి లేదా గుండె పోటు అంటారు. ఇది ఎందుకు వస్తుంది? గుండెకు రక్తప్రసరణ బాగా తక్కువైనప్పుడు పోటు వస్తుంది. చిన్నప్పటి నుంచి చదువుకున్నదే, గుండె పంపింగ్ స్టేషన్‌గా పని చేసే ఒక కండరం. దాని కుడి భాగానికి శరీరంలోని అన్ని భాగాల నుంచి చెడు రక్తం సిరల ద్వారా వెళుతుంది. గుండె దాన్ని ఊపిరితిత్తులకు పంపితే అవి రక్తాన్ని శుద్ధి చేసి, ఆక్సిజన్‌ మిళాయించి, మంచి రక్తంగా చేసి, గుండెకు పంపుతాయి. గుండె ఆ మంచి రక్తాన్ని బృహద్ధమని (అయోర్టా)కి పంపితే అది తన శాఖల ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు పంపుతుంది. దాంతో పాటు కొన్ని శాఖల (కరోనరీ ఆర్టరీస్‌) ద్వారా గుండె కండరానికి కూడా పంపుతుంది. ఈ శాఖల్లో అట్టకట్టిన కొవ్వు బ్లాక్స్ (పూడికలు) గా ఏర్పడి, గుండె కండరానికి తగినంత రక్తసరఫరా చేరకుండా అడ్డుపడడం వలన మనకు గుండె పోటు వస్తుంది.

గుండెలో నొప్పి మాత్రమే వచ్చినా, అంతకంటె తీవ్రంగా హార్ట్ ఎటాక్ వచ్చినా ఏంజియో చేసి 70%, 80% పూడుకుపోయింది అని చెప్పేది వీటిల్లోనే కాబట్టి దీన్ని కరోనరీ ఆర్టరీ డిసీజ్ (సిఎడి)గా వ్యవహరిస్తారు. ఇంత పూడుకుపోయినా యిన్నాళ్లూ తెలియలేదే అని ఆశ్చర్యపడుతూంటాం. కిచెన్ సింక్ కింద గొట్టంలో ఎంత పాచి చేరుకున్నా, ఎంతో కొంత ఖాళీ ఉండి నీళ్లు వెళ్లిపోతున్నంత కాలం మనం పట్టించుకోం. ఎప్పుడో ఒకప్పుడు ఆ కాస్త సందు కూడా మూసుకుపోయి, సింక్‌లో నీళ్లు నిలిచిపోతేనే మేలుకొంటాం. దీన్ని ఛాతీలో నొప్పి, చెయ్యి లాగడం, చెమటలు పట్టడం, ఊపిరి కష్టం కావడం వగైరా లక్షణాలు రావడంతో ఆసుపత్రికి వెళ్లడంతో పోల్చవచ్చు. నీళ్లు నిలిచిపోయాక సింక్ కింది వేస్ట్ పైప్‌ను తట్టి, ఊపి, లోపల బ్రష్ పెట్టి గిరగిరా తిప్పి, లోపల మడ్డిని లాగేసి, శుభ్రం చేసే లాటి పనే స్టెంటు వేయడం. పైపే మార్చేయడమంటే బైపాస్ సర్జరీ లాటిది. ఆ దారి వదిలేసి, పక్కన యింకో దారి వేయడం. హార్ట్ ఎటాక్ వస్తే గుండె కండరం కొంత మేరకు డ్యామేజి అవుతుంది. రావడానికి ముందే చూపించుకుని, సరి చేయించుకుంటే కోలుకోవడం సులభం.

హార్ట్ ఎటాక్ వచ్చినపుడు మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ఆ లోపుగా చికిత్స ప్రారంభమైతే ప్రమాదం ఉండదు. గుండె 80-90 ని.ల తర్వాత చచ్చుబడడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత రక్తాన్ని తీసుకోవడం మానేస్తుంది. 6 గంటల్లోపున చికిత్స ప్రారంభం అయి తీరాలి. లేకపోతే దానికి సంబంధించిన అవయవాలన్నీ పాడవుతాయి. వాటిని మళ్లీ బాగు చేయలేము. ఆసుపత్రికి తీసుకురావడం ఆలస్యం కావడంతో.. అనే మాటలు యిలాటి సందర్భాల్లోనే వాడతారు. మరి తారకరత్న కేసులో గంట లోపే డాక్టర్లు చూశారు కదా, అతనెందుకు బతకలేదు? అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం, అతనికి వచ్చినది హార్ట్ ఎటాక్ కాదు, కార్డియాక్ అరెస్ట్. ఎటాక్ అనేది రక్తసరఫరా సమస్య అయితే, కార్డియాక్ అరెస్ట్ అనేది ఎలక్ట్రికల్ సమస్య. హార్ట్ ప్రాబ్లెమ్ అనగానే మనం వెంటనే విద్యార్థిని మార్కుల శాతం అడిగినట్లు, బ్లాక్స్ పెర్సంటేజి ఎంత అని అడిగేస్తాం. అది తప్ప వేరే సమస్య లేనట్లు. గుండెకు అనేక రకాలుగా సమస్యలు రావచ్చు. పై రెండూ కాక మెకానికల్‌గా వచ్చే సమస్య హార్ట్ ఫెయిల్యూర్.

పేర్లు సరిగ్గా గుర్తు లేకపోయినా, గుండె నాలుగు గదులుగా ఉంటుందని మనసులో నాటుకుని ఉండి ఉంటుంది. కింది రెండు గదులు భిన్నమైన పనులు చేస్తున్నా ఏకసమయంలో సంకోచిస్తాయి, వ్యాకోచిస్తాయి. బ్లాక్స్ వలన గుండెకు రక్త సరఫరా తగ్గడం కారణంగా, యింకా యితర కారణాల వలన క్రమేపీ గుండె కండరాలు బలహీనపడి,  యీ సంకోచవ్యాకోచాల పనితీరులో సమస్య వచ్చి, రక్తం తెప్పించుకోవడం, పంపిణీ చేయడం సరిగ్గా చేయలేక పోయినప్పుడు కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. దానికి విరుగుడు స్టెంటు, బైపాసూ కాదు, పేస్‌‌మేకర్! గుండె యొక్క అన్ని రకాల సమస్యలను చెప్పి అవి రాకుండా ఏం చేయాలి, వచ్చాక ఏం చేయాలి వంటివి చర్చించడం యిక్కడ అప్రస్తుతం. వాటి గురించి మీడియాలో చాలా సమాచారం లభ్యమౌతోంది. పక్కనే యాంబులెన్స్ ఉన్నా తారకరత్న ఎందుకు బతకలేక పోయాడు అనేది చెప్పడం మాత్రమే నా ఉద్దేశం.

అతనిది ఎలక్ట్రికల్ సమస్య అన్నాను కదా. గుండె ఒక పంపింగ్ స్టేషన్ కాబట్టి అది నడవడానికి విద్యుత్ కావాలి. అది నిరంతరం సరఫరా అవుతూ ఉండాలి. కరంటు సరఫరాలో ఎగుడుదిగుడులు (ఫ్లక్చువేషన్స్) వస్తే బల్బులు వెలిగి, ఆరుతూ డిమ్‌గా, బ్రైట్‌గా అయిపోతాయి. ఫ్యూజ్ పోతుందేమో, బల్బు పూర్తిగా మాడిపోతుందేమోనని భయపడతాం. అలాగే శరీరపు విద్యుత్ సరఫరాలో తేడా వస్తే గుండె వేగంగా కొట్టుకుంటుంది, మందగిస్తుంది, కంగారు పెట్టేస్తుంది. సరఫరా కుదుటపడేవరకూ యిదే అవస్థ. ఆ ఫ్లక్చువేషన్ ఒక స్థాయి లోపలే ఉంటే దీనితో పోతుంది. కానీ షార్ట్ సర్క్యూట్ అయిందనుకోండి, గుండె అదివరకే బలహీనపడి ఉంటే యిప్పుడు ఏకంగా ఆగిపోతుంది. మెదడు, ఊపిరితిత్తులు, యితర అవయవాలకు రక్తాన్ని సరఫరా చేయలేక షట్‌డౌన్ అయిపోతుంది. మనిషి స్పృహ కోల్పోతాడు. శ్వాస కోసం విలవిలలాడతాడు, ఊపిరి నిలిచిపోవచ్చు కూడా. అదే కార్డియాక్ అరెస్ట్. ఇది హార్ట్ ఎటాక్‌తో బాటు రావచ్చు. ఎటాక్ వచ్చినప్పుడల్లా కార్డియాక్ అరెస్ట్ కాదు. కానీ కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు ఎటాక్ రావడం జరుగుతూంటుంది.

గుండె ఆగిపోగానే మరుక్షణం ప్రాణం పోతుందనుకుంటాం. అబ్బే, గుండె మళ్లీ కొట్టుకోవడం మొదలుపెడుతుంది. మరణ సమయంలో గుండె ఆగడం, మళ్లీ కొట్టుకోవడం యిలా 14% కేసుల్లో జరుగుతుందట. ఆగి కొట్టుకోవడం మధ్య వ్యవధి 4ని.ల 20 సెకన్లు ఉన్న సందర్బం కూడా ఉందట. కార్డియాక్ అరెస్టు కాగానే ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డిప్రిబిలేటర్ (ఎఇడి) అందుబాటులో ఉంటే దాన్ని ఛాతీకి తాకిస్తే గుండెకు కరంటు షాక్ తగిలి, తిరిగి కొట్టుకోవడం ప్రారంభమౌతుంది. లేకపోతే సిపిఆర్  చేయాలి. దీనిలో ఏడు స్టెప్స్ ఉన్నాయి. అరచేతితో ఛాతీ మీద పదేపదే గట్టిగా నొక్కి పైకి తీయడం, కృత్రిమంగా శ్వాస అందివ్వడం అలాటివన్న మాట. తారకరత్న విషయంలో సిపిఆర్ చేయాలని నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైంది, అదే అతని మృత్యుకారణమైంది అని ఒక డాక్టరుగారు యూట్యూబులో చెప్పారు. యాంబులెన్స్ దగ్గర్లో ఉన్నా కాపాడలేక పోయారెందుకు అన్నదానికి సమాధానం యిక్కడుంది. 40 ఏళ్ల లోపు యువకుడు, చూడ్డానికి బాగానే ఉన్నాడు, ఆరోగ్య సమస్యలున్నట్లు ఎవరూ చెప్పలేదు, అనుకుని కాన్ఫిడెన్స్‌తో ఉండడంతో వచ్చినది కార్డియాక్ అరెస్ట్ అని ఎవరూ గెస్ చేయలేక పోయారన్నమాట. గుండెను ఏదోలా చేసి మళ్లీ కొట్టుకునేట్లు చేశారు. కానీ యీ లోపున దిద్దుకోలేని అనర్థం జరిగిపోయింది.

ఆ అనర్థమే బ్రెయిన్ డెత్. గుండె నుంచి మంచి రక్తాన్ని తెప్పించుకునే దానిలో ముఖ్యమైనది బ్రెయిన్. గుండె ఒకసారి కొట్టుకున్నప్పుడల్లా అది రక్తంలోని 20-25% తెప్పించుకుంటుంది. బ్రెయిన్‌లోని కోట్లాది సెల్స్ ఆ రక్తంలోని ఆక్సిజన్‌లో 20% గ్రహించి రీచార్జ్ చేసుకుంటాయి. ఎప్పుడైతే కొంతసేపు రక్తసరఫరా జరగలేదో బ్రెయిన్ సెల్స్ చచ్చిపోయాయి. అక్కడొచ్చింది ముప్పు. ఆగిపోయిన గుండెను ఎంత త్వరగా మళ్లీ కొట్టుకునేట్లా చేశాం అన్నది అతి ప్రధానం. ఒక అంచనా ప్రకారం 4ని.ల లోపే అలా చేయగలిగితే బ్రెయిన్ డామేజి కాదు. 4-6 ని.లు పడితే బ్రెయిన్ డామేజి అయ్యే అవకాశాలున్నాయి. 6-8 ని.లైతే ఆ అవకాశాలు మెండుగా ఉన్నాయి. 8 ని.లు దాటినా సిపిఆర్ (కార్డియో పల్మనరీ రిసస్కిటేషన్) ప్రారంభం కాకపోతే బ్రెయిన్ డామేజి కచ్చితం. ఈ అంకెలే కరక్టని చెప్పడానికి లేదు. రోగి ఆరోగ్యస్థితిని బట్టి అటూయిటూ మారవచ్చు.

గ్రహించవలసిన దేమిటంటే హార్ట్ ఎటాక్ విషయంలో గంటల వ్యవధి ఉంది కానీ కార్డియాక్ అరెస్టు విషయంలో మూడు, నాలుగు నిమిషాలే వ్యవధి. బ్రెయిన్ డెత్ లక్షణాలేమిటంటే కంటిపాపలు కాంతికి స్పందించవు. కంటిని ముట్టుకున్నా, కనురెప్పలు కదలవు, తల అటూయిటూ తిప్పితే కళ్లు కదలవు. మనిషికి నొప్పి తెలియదు. ఇలాంటివి ఉన్నాయి. హార్ట్ ఎటాక్ రాగానే త్వరగా ఆసుపత్రికి తరలించడాలు జరుగుతున్నాయి కానీ కార్డియాక్ అరెస్టు కాగానే సిపిఆర్ చేయడం అరుదుగా జరుగుతోంది. తారకరత్న వంటి ప్రఖ్యాత వ్యక్తి విషయంలోనే ఆలస్యం జరిగినప్పుడు సామాన్యుడి సంగతేమిటో అలోచించండి. మా చిన్నపుడు స్కూళ్లలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్ అంటూ సోషల్ సర్వీస్ కూడా నేర్పించేవారు. ఫస్ట్ ఎయిడ్‌లో కొందరు శిక్షణ పొందేవారు. ఇప్పుడు అలాంటివి కొందరు వాలంటీర్లకు నేర్పిస్తే మంచిది.

తారకరత్న సంఘటన తర్వాత ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ సిపిఆర్ చేసి ఎవర్నో రక్షించాడని చదివాను. అలాటి వాళ్లకు ఇన్సెన్టివ్ యిచ్చి, నిరంతరం రోడ్డు మీద తిరుగాడే కొరియర్లు, రోడ్డు పక్కన వ్యాపారాలు చేసేవారిలో కొందరికైనా తర్ఫీదు యిప్పిస్తే బాగుంటుంది. కోవిడ్ తర్వాత హృద్రోగాలు పెరిగాయని రిపోర్టులు వస్తున్నాయి. ఐటీ వంటి సెక్టార్లలోని ఉద్యోగులకు విధిగా నేర్పిస్తే అనేక ప్రాణాలు కాపాడవచ్చు. ఇలాటి సందర్భాల్లో మిడిమిడి జ్ఞానంతో ఏదో చేసి ప్రాణం తీశారనే మాట పడతామనే భయంతో ఎవరూ ముందుకు రారు. రోగి బంధువులు పరిస్థితిని అర్థం చేసుకుని, సహాయం చేసినవారి ప్రయత్నాలను హర్షించాలి. ఎందుకంటే కార్డియాక్ అరెస్టు జరిగి స్పృహ తప్పగానే 3 ని.ల లోపున వైద్యసహాయం అందడం సాధ్యమా? నగరాలలో అయితే ఆ పాటికి ఎవరైనా గమనించడం కూడా జరగదు. 3 నిమిషాలలో చేయకపోతే బ్రెయిన్ డెత్ సంభవిస్తుందనే లెక్కతో ఎవరైనా ఛాన్సు తీసుకుని సిపిఆర్ చేస్తే తప్పుపట్టడం ధర్మం కాదు. ఎందుకంటే బ్రెయిన్ డెత్‌ని నివారించడమే మన ప్రధానోద్దేశం.

మనిషి శరీరానికి మెదడే హెడాఫీసు. మనం అసంకల్పితంగా అనేక పనులు చేసేస్తూన్నామంటే అదిచ్చే ఆదేశాలే కారణం. హెడాఫీసు మూసేసిన తర్వాత తక్కిన అవయవాలను వెంటిలేటరు వంటి యంత్రాల సహాయంతో నడిపించినా యిక్కణ్నుంచి సంకేతాలు వెళ్లక, అదంతా వృథాప్రయాస అవుతుంది. ఇలాటి పరిస్థితిని బ్రెయిన్ డెడ్ అంటారు. బ్రెయిన్ డెడ్ అయినవారు మళ్లీ బతికిన దాఖలాలు లేవు. ఇది కోమాలాటిదే అనుకోకూడదు. కోమాలో తీవ్ర అస్వస్థత, బ్రెయిన్ డామేజి కారణంగా శరీరం స్పందించడం మానేసిన స్థితి. అది రివర్స్ కావచ్చు. కోమాలోంచి మనిషి కోలుకున్న సందర్బాలున్నాయి. ఒక కేసులో 29 సంవత్సరాలకు ఒకతను కోలుకున్నాడు.

బ్రెయిన్ డెడ్ వచ్చాక మనిషి దాదాపుగా మరణించినట్లే. దాదాపుగా అనే మాట ఎందుకు వాడుతున్నానంటే శరీరంలో ప్రాణం యింకా మిగిలింది కాబట్టి! మనం అనవచ్చు - ఆ స్థితిలో మనిషి రబ్బరు బొమ్మ వంటి వాడు, తనంతట తాను ఊపిరి పీల్చలేడు, వదలలేడు, తనంతట తాను ఆహారం తీసుకోలేడు, విసర్జించలేడు. ఆ పనంతా యంత్రాలే చేస్తున్నాయి అని. కానీ ఆలోచించండి ఒక రబ్బరు బొమ్మకు ఆ వెంటిలేటరూ గట్రా పెడితే అవన్నీ చేస్తుందా? లేదు కదా, అంటే అక్కడ ఉన్నది రబ్బరు బొమ్మ ప్లస్ ప్రాణం. ఆ సపోర్టు సిస్టమ్ తీసేస్తే ప్రాణం క్షణాల్లో ఎగిరిపోతుంది నిజమే. తనంతట తను ఎగిరేదాకా ఆ ప్రాణం ఆ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్నట్లే. ఆయుర్దాయం పూర్తిగా తీరక, టుబి ఆర్ నాట్ టుబి స్థితిలో జీవాత్మ కొట్టుకుంటోందన్నమాట.

ఇది మనిషి జీవితంలో అత్యంత క్లిష్టమైన దశ. అతనికి కాదు, అతని కుటుంబానికి. నాలుగు రోజులు చూశాక డాక్టర్లు అడుగుతారు ‘ఎలాగూ ఆశ లేదు, క్రిటికల్‌గా ఉన్న మరొకరికి హెల్ప్ అవుతుంది కదా, సపోర్టు తీసేయమంటారా?’ అని అడుగుతారు. నిర్ణయం తీసుకోవడానికి భార్యబిడ్డలకు మనసు రాదు. డబ్బు మిగుల్చుకోవడానికి, లేదా అనవసర ఖర్చు నివారించడానికి తీసేస్తున్నామా అనే మథనకు గురవుతారు. ప్రాణం ఉండగానే చేతులారా చంపేస్తున్నామా అని సంకోచిస్తారు. ఇలాటి విషయాల్లో సదరు వ్యక్తే నిర్ణయం తీసుకోవాలి. అది కూడా ఆరోగ్యంగా ఉండగానే తీసుకోవాలి. ఎందుకంటే ఆ సందర్భం వచ్చినపుడు మనం స్పృహలో ఉండం. మన వాళ్లకు ఏ అపరాధభావనా లేకుండా మనమే ముందుగా చెప్పాలి. బ్రెయిన్ డెత్ అని డాక్టర్లు కన్‌ఫమ్ చేశాక ఓ వారం చూసి, సపోర్టు సిస్టమ్ తీసేయమని చెప్పండి అని. నేనలాగే చెప్పేశాను. ఈ వారం మార్జిన్ ఎందుకంటే బ్రెయిన్ డెత్ అంటే ఏమిటి అనేదానిపై రకరకాల నిర్వచనాలున్నాయట. చావు కచ్చితమని డాక్టర్లకూ నిస్సందేహంగా తెలియాలి కదా!

ఇది ఆత్మహత్య కాదు, కారుణ్యమరణం కాదు. ఆ మాటకొస్తే సాటి రోగి పట్ల ఔదార్యప్రదర్శనం. మనం బెడ్ ఖాళీ చేస్తే చావుబతుకుల్లో ఉన్న మరో రోగికి ఆ సౌకర్యాలు అందుతాయి. అదృష్టవశాత్తూ అతను బతికితే ఆ పుణ్యం మనకూ దక్కుతుంది. ఇది ఒక రకంగా అవయవదానం వంటిదే. ఇటీవల మంచి ఫిట్‌గా ఉన్న  ప్రముఖ మధ్యవయస్కులు వ్యాయామం చేస్తూ హఠాత్తుగా మరణించడంతో ఏ మేరకు ఎక్సర్‌సైజ్ చేయాలనే దానిపై అవగాహన ఏర్పడుతోంది. మోతాదు మించకుండా జాగ్రత్త పడడం ప్రారంభమైంది. ఇప్పుడు తారకరత్న మరణం సందర్భంగా బ్రెయిన్ డెత్ గురించి అవగాహన పెరగాలి. ఎలా నివారించాలి, అలాటిది సంభవిస్తే ఎలా వ్యవహరించాలి అనే దానిపై ముందుగానే ఒక ఆలోచన చేస్తే మంచిది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?