Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: భారాస జనసేనను దెబ్బ తీస్తుందా?

ఎమ్బీయస్‍: భారాస జనసేనను దెబ్బ తీస్తుందా?

కెసియార్ భారాస శాఖను ఆంధ్రలో పెడతానంటే అసలు దానికేసి చూసేవారెవరు అనుకున్నాను. వేర్పాటు ఉద్యమసమయంలో కెసియార్ తమను తిట్టిన తిట్లను ఆంధ్రులు అంత త్వరగా మర్చిపోగలరా? అని నా లెక్క. కానీ తీరా చూస్తే కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే భారాస ఆంధ్ర శాఖలో చేరికలు ప్రారంభమయ్యాయి. తోట చంద్రశేఖర్‌ను రాష్ట్ర అధ్యక్షుడు చేశారు. ఆయనతో పాటు కాపునాడు నాయకులిద్దరు, వెలమ యిత్యాది యితర కులస్తులు మరి కొందరు చేరారు. సంక్రాంతి నాటికి పార్టీ ఊపందుకుంటుందని, కొందరు సిటింగ్ ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరవచ్చని కెసియార్ అన్నారు. చంద్రశేఖర్ కాపు కులస్తులు, జనసేన మాజీ నాయకులు కావడంతో కెసియార్ స్ట్రాటజీపై అనుమానాలు, దానితో పాటు జనసేన భవిష్యత్‌పై సందేహాలు పొడసూపుతున్నాయి. నిజానికి దీనిపై వ్యాఖ్యానించడం టూ ఎర్లీ అనిపించుకుంటుంది. కానీ ఆంధ్రలో ఉన్న పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని యిలా కావచ్చేమో అని ఆలోచించడంలో తప్పేమీ లేదు. రాబోయే రోజుల్లో జరిగే సంఘటనల బట్టి మన ఊహ సరైనదో కాదో మనకే తెలిసిపోతుంది. ఇదంతా కేవలం ఊహ అనే చెప్తున్నాం కాబట్టి, అభిజ్ఞవర్గాల భోగట్టా అంటూ బుకాయించటం లేదు కాబట్టి పాఠకులకు కూడా యీ విషయంలో స్పష్టత ఉంటుంది.

భారాసలో చేరికల గురించి రాజకీయంగా విశ్లేషిస్తే – అనేక చోట్ల చూస్తున్నాం, అధికార పార్టీ కనీసం 20శాతం మంది సిటింగ్ ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు. ఆ లెక్కన వైసిపి ఓ 30 మందిని రిపీట్ చేయకపోవచ్చు. టిడిపి టిక్కెట్లు ఆశించి భంగపడేవారూ కొందరుంటారు. టిక్కెట్లు దొరకనివాళ్లే కాదు, టిక్కెట్లిచ్చినా వైసిపి ప్రజాదరణ కోల్పోతోందని భావించినవారు, టిడిపి కోలుకోవటం లేదని భావించేవాళ్లకూ యిన్నాళ్లూ బిజెపి ఒక్కటే ఆశాదీపంగా ఉండేది. ఇప్పుడు భారాస తోడైంది. దీనితో పాటు కుల కోణంలోంచి కూడా పరిస్థితిని సమీక్షించవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆంధ్రుల్లో కులస్పృహ ఎక్కువగా ఉంది. సినిమా నటులను కూడా కులం కళ్లతో చూడడం వికటించి, అమెరికాలో సైతం తన్నుకులాడుకున్నారని తాజా వార్త.

అన్ని కులాల్లోనూ వివిధ పార్టీల అభిమానులున్నా టిడిపిని అధికాంశం కమ్మలు తమ పార్టీగా, వైసిపిని అధికాంశం రెడ్లు తమ పార్టీగా భావిస్తున్నారు. తక్కిన కులాల వారు అటూయిటూ చెదిరిపోతున్నారు. తమ కులానికి చెందినవారు ముఖ్యమంత్రి అవుతారనే ఆశ అడుగంటింది వారికి. కాంగ్రెసు, బిజెపి వంటి జాతీయ పార్టీలలో అయితే ఏ కులం వారికైనా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సుంది కానీ ప్రాంతీయ పార్టీలలో ఆ అవకాశం ఉండదు. పార్టీ అధ్యక్షుడో, అతని కుటుంబీకుడో ముఖ్యమంత్రి అవుతాడు. అందువలన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కమ్మో, రెడ్డో (జగన్ క్రైస్తవుడు కాబట్టి, రెడ్డి అనడానికి లేదు, అయినా అలాగే ముద్ర పడింది) ముఖ్యమంత్రి అవుతాడు తప్ప అన్యులకు ఛాన్సు లేదు. దీనికి తక్కిన కులాల వారు సర్దుకుపోతున్నారు కానీ కాపులకు మాత్రం మింగుడు పడటం లేదు.

ఉమ్మడి రాష్ట్రం ఉండగా, జనాభాలో తక్కువ శాతం ఉన్న బ్రాహ్మణ, వైశ్య, వెలమ కులాల వారు కూడా ముఖ్యమంత్రులయ్యాకు కానీ జనాభాలో అధికంగా ఉన్నా కాపుల్లో ఎవరూ ముఖ్యమంత్రి కాలేదు. తెలంగాణలో కంటె ఆంధ్రలో కాపుల సంఖ్య ఎక్కువ కాబట్టి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక అక్కడ కాపుల శాతం మరింత పెరిగింది. అయినా ఆ కులం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనబడటం లేదు. ముఖ్యమంత్రి అభ్యర్థులలో పవన్ కళ్యాణ్ ఒక్కరికే ఆ అవకాశం ఉంది కానీ ఆయన వేస్తున్న అడుగులు ముఖ్యమంత్రి పీఠానికి మెట్లెక్కుతున్నట్లు లేవు. తన అభిమానులను ఊరించడానికి తను ముఖ్యమంత్రి కావచ్చు అని అప్పుడప్పుడు అంటూంటారు కానీ ఆయన వ్యూహం దానికి అనుగుణంగా లేదు. జనసేన సొంతంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవలసినదే.

బిజెపి-జనసేన కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ అని ఒకప్పుడు బిజెపి అన్నా, ఆ మాటను వాళ్లు వెనక్కి తీసేసుకున్నారు. ఇక టిడిపి-బిజెపి-జనసేన కూటమి ఏర్పడి అధికారంలోకి వస్తే వారి ముఖ్యమంత్రి అభ్యర్థి సహజంగా చంద్రబాబే అని అందరూ అనుకుంటారు. అబ్బే, నేను కాదు, పవన్ అని బాబు ప్రకటించలేదు, పవనూ ప్రకటించలేదు. ఎంతసేపూ వైసిపి వ్యతిరేక శక్తులను కూడగడతాను, జగన్‌ను గద్దె దించుతాను అంటారు తప్ప ఆ స్థానంలో కొంతకాలమైనా కూటమి తరఫున నేను ముఖ్యమంత్రిని అవుతాను అని పవన్ హామీ యివ్వటం లేదు.

తను ముఖ్యమంత్రి కాకపోవడం పవన్‌కి అంగీకారమే కానీ, పవన్ అభిమానులు, ఆయన కులస్తులకు సమ్మతం కాదు. జగన్‌ను దింపడానికి టిడిపికి పవన్ పొత్తు కీలకమైనపుడు, కొంతకాలానికైనా పవన్‌కు ముఖ్యమంత్రి అప్పగించకపోతే ఎలా? అని వారి బాధ. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి తమ కులం ఓట్లు ఎందుకు వాడాలి అని వారి ప్రశ్న. అందువలన ఏ పార్టీ తమకు మేలు చేస్తుందని వారనుకుంటున్నారో ఆ ప్రకారం వాళ్లకు ఓట్లేస్తున్నారు. మేలు చేసే పార్టీ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండటం చేత వాళ్ల ఓట్లు చీలిపోతున్నాయి. తమను బాగా చూసుకునేవారికి ఓటేయడం వేరు, తమవాడికే ఓటేయడం వేరు. ఎంతసేపూ కమ్మనో, రెడ్డినో గెలిపించడమే తమ పనా? అనే నిస్పృహ ఆవరించి ఉంది. తమ కులస్తుడు బరిలో ఉంటే, గట్టిగా నిలబడితే, గెలుస్తాననే ఆశ కల్పిస్తే వాళ్లు ఆ వ్యక్తికి ఓట్లేయవచ్చు.

జనసేన యిప్పటివరకు ఆ ఆశ వాళ్లకు కల్పించలేక పోతోంది. ఆ పార్టీకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. అన్ని నియోజకవర్గాలలోనూ పోటీ చేయగల సత్తా మాకుంది అని చెప్పుకుంటారు తప్ప నియోజకవర్గాల వారీగా కాదు, జిల్లాల వారీగా కూడా పార్టీ ఆఫీసులు పని చేయటం లేదు. పార్టీ అధ్యక్షుడు కార్యకర్తలకు నిధులు విదల్చడు. ఏ వ్యాపారవేత్తల నుంచో నిధులు సేకరించి సమకూర్చడు. క్యాడర్ చేసిన మంచి పనులను హైలైట్ చేసి, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకు గుర్తింపు వచ్చేట్లా చేసే మీడియాను ఏర్పాటు చేయడు. ఇంకో 15, 16 నెలల్లో ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి యీ పాటికే అభ్యర్థులను గుర్తించి, వారిని ప్రజలకు పరిచయం చేసి, వారి ప్రతిభాపాటవాలకు ప్రాచుర్యం కల్పించవలసిన అవసరం ఉంది. కానీ అది జరగలేదు.

పవన్ కళ్యాణ్‌ సినిమా పడవలో ఒక కాలు, రాజకీయాల పడవలో మరొక కాలు పెట్టి ప్రయాణం సాగిస్తున్నారు. ఆయన వచ్చి మొహం చూపించకపోతే జనసేన సభలకు జనం రారు. నాదెండ్ల మనోహర్ స్ట్రాటజీలు రచించగలరేమో కానీ జనాదరణ గల నాయకుడు కాడు. గ్లామరున్న నాయకులు, సినీనటులు జనసేనలో ఎవరూ చేరలేదు. ఆ దిశగా పవన్ చొరవ తీసుకోలేదో, వాళ్లే ముందుకు రాలేదో తెలియదు. ఎన్నికల సమయంలో పవన్ ఒక్కరే అన్ని నియోజకవర్గాలూ తిరగగలరా? ఓ వంద నియోజకవర్గాల్లోనో ఒక్కో సభ పెడితే చాలనుకుంటే సరిపోతుందా? ఫాలో అప్ చేయడానికి ఒక వ్యవస్థ ఉండాలి కదా! టిడిపి, వైసిపి వంటివి బూత్‌ల వారీగా కార్యకర్తలను సమీకరించి వినియోగించు కుంటున్నపుడు జనసేన కొంతమేరకైనా సన్నద్ధం కాకపోతే ఎలా? పవన్ టిడిపికి అనుకూలంగా వ్యవహరించిన సందర్భాలలోనే తెలుగు మీడియా హైలైట్ చేస్తోంది. టిడిపికి దూరం జరుగుతున్నాడన్న అనుమానం రాగానే ఔట్ ఆఫ్ ఫోకస్ చేసేస్తోంది. ఇది గమనించైనా జనసేన సొంత మీడియాను ఏర్పాటు చేసుకోవాలి కానీ యిప్పటికీ చేసుకోలేదు.

ఇవన్నీ గమనించిన కాపు ఓటర్లు నిరాశతో ఉన్నారు. ఈ శూన్యతను గుర్తించి, దాన్ని భర్తీ చేయడానికి కెసియార్ ప్రయత్నిస్తారేమోనని నా అనుమానం. ఉన్న ప్రధాన పార్టీలు రెండూ చెరో కులానికి అంకితమై పోయాయి కాబట్టి, కాంగ్రెసు, లెఫ్ట్ సోదిలోకి లేకుండా పోయాయి కాబట్టి, బిజెపి యింకా పుంజుకోలేదు కాబట్టి, భారాస తనను కాపు కేంద్రిత రాజకీయపక్షంగా ప్రొజెక్టు చేసుకుంటే, దానికొక గుర్తింపు దొరుకుతుంది. ఎలాగూ యితర కులస్తులను కూడా చేర్చుకుంటారు కాబట్టి, కమ్మ-రెడ్డి వైరంతో విసిగి, వారి రాజకీయాలలో నలిగి, తృతీయశక్తి కోసం చూస్తున్న యితర కులాల వారు కూడా మద్దతివ్వవచ్చు. భారాస విషయంలో గమనించ వలసినదేమిటంటే కెసియార్‌కు, ఆయన కుటుంబీకులకు ఆంధ్ర ముఖ్యమంత్రి పదవిపై ఆశ లేదు. ఎవరో ఆంధ్రుణ్నే చేస్తారు. ఆంధ్రలో వెలమ బలమైన కులం కాదు కాబట్టి, ఏ కులస్తుడికైనా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సుంది అనే ఆలోచన తక్కిన కులాలవారిని ఊరిస్తుంది.  

పవన్‌కు లేనివి, కెసియార్‌కు ఉన్నవి ఏమిటంటే – పార్టీ నిర్మాణకుశలత, ప్రచారానికై రాగల వాగ్ధాటి గల వక్తలు, నిధుల ప్రవాహం, మీడియా దన్ను! టీవీలన్నిటికి హైదరాబాదులో ముఖ్యకేంద్రాలున్నాయి కాబట్టి కెసియార్‌కు వ్యతిరేకంగా ఏ టీవీ ఛానెలూ మాట్లాడదు. అనుకూలంగా మాట్లాడేవాటిల్లో ప్రముఖమైనవి ఉన్నాయి. ఈ బలాల ఆధారంగా భారాస పవన్‌కు ప్రత్యామ్నాయంగా మరొక కాపు నాయకుణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపితే కాపులు అతనికి అనుకూలంగా ఆలోచించే అవకాశం లేకపోలేదు. కాపులకు తమవాడు ముఖ్యమంత్రి అయితే బాగుండును అని ఉంది తప్ప, అది పవన్ అయి ఉండాలనే పట్టుదల లేదు. గతంలో చిరంజీవి అవుతాడనుకుంటే అతనికి మద్దతిచ్చారు. ఇప్పుడు పవన్ వచ్చాడు. రేపు మరొకరు రావచ్చు. చిరంజీవి, పవన్ విషయంలో సినిమా గ్లామర్ కొన్ని ఓట్లు తెచ్చిపెడుతోంది తప్ప అది చాలటం లేదు. వారికి బదులుగా వచ్చేవారికి సినిమా గ్లామర్ లేకపోవచ్చు కానీ సీరియస్‌గా పాలిటిక్స్ చేస్తే ఆ మేరకు ఎడ్వాంటేజి ఉంటుంది కదా.

ఆ మరొకరు తోట చంద్రశేఖర్ కావచ్చు, జెడి లక్ష్మీనారాయణ వస్తే ఆయన కావచ్చు, లేదా మరొకరు కావచ్చు. కాపుల ప్రతినిథిగా హింసా రాజకీయాలు నడిపిన వంగవీటి మోహనరంగాను చూపుకోవడం కంటె యిలాటి విద్యావంతులను, అధికారులను చూపుకోవడం గౌరవంగా ఉంటుంది కదా! వీరు ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ముందుకు వచ్చినపుడు కాపు కులస్తులు గర్వంగా చెప్పుకుని, మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుంది. పూర్తి మెజారిటీ రాకపోయినా, గణనీయమైన సీట్లు తెచ్చుకుంటే రాజకీయాల్లో కీలకపాత్ర పోషించవచ్చు.

వైసిపి ప్రభుత్వవైఫల్యాల గురించి పార్టీ ఎమ్మెల్యేలే ప్రస్తావిస్తున్నారు, నాయకులు ఒకరితో మరొకరు కలహించడం కూడా చూస్తున్నాం. వైసిపి మెజారిటీ తగ్గడం ఖాయమే అని తెలుస్తోంది కానీ ఏ మేరకు తగ్గుతుందో యింకా చెప్పలేం. ఒకవేళ విజయం అంచున ఆగిపోతే, టిడిపి తగినంత ఎదగలేక అదీ అంచునే ఆగిపోతే యీ భారాస వంటి పార్టీలు కింగ్ మేకర్ పాత్ర ధరించవచ్చు. ఆ సమీకరణాల్లో భారాస తరఫు వ్యక్తి కొద్దికాలం పాటైనా ముఖ్యమంత్రి కావచ్చు. ముందే చెప్పినట్లు యివన్నీ ఊహాగానాలే. కానీ భారాస వ్యూహం కనుక కాపుకేంద్రితంగా రచించబడితే జనసేనకు దెబ్బ పడవచ్చు. జనసేన నిస్తేజంగా ఉందని నిరాశలో మునిగినవారందరూ హుషారుగా దూసుకుపోయే భారాసలో చేరవచ్చు. ఇది ముందుగానే గ్రహించి, మేల్కొని దెబ్బ కాసుకోవాలి. ఎందుకంటే జనసేన కంటె భారాసకు అన్ని రకాల వనరులు ఎక్కువ. దానితో పాటు లక్ష్యం కోసం నిలబడి, వైఫల్యాలు ఎదురైనా ఏకాగ్రచిత్తంతో నిరంతరం పోరాడే పట్టుదల కెసియార్‌కు ఉంది. పవన్‌కు లేనిది అదే!

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2023)

[email protected]

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా