Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: మధ్యలో కులాల గోల ఏల?

ఎమ్బీయస్‍: మధ్యలో కులాల గోల ఏల?

‘‘వీరసింహారెడ్డి’’, ‘‘వాల్తేరు వీరయ్య’’ సినిమాల రిలీజు సందర్భంగా రెండు కులాల మధ్య పోరాటం జరుగుతుందని ఆంధ్రజ్యోతి జోస్యం చెప్పింది. ఇటీవల సన్నిహితమౌతున్న ఆ కులాల మధ్య అగాధం సృష్టించడానికి వైసిపి వ్యూహం పన్ని ఆ పోరాటం తెచ్చిపెడుతోందని, దానివలన తెలుగు సమాజం అల్లకల్లోలమౌతుందని ఆరాటపడింది. రెండు సినిమాలు రిలీజయ్యాయి. కానీ అల్లర్లేమీ జరిగినట్లు లేదు. స్టార్ల సినిమాలు రిలీజయ్యేటప్పుడు జరిగే మామూలు హడావుడే జరిగింది తప్ప యితరులపై దాడులు అవీ జరిగినట్లు వార్తలు రాలేదు. ఈ రెండు సినిమాలూ ప్రయోగాల జోలికి పోకుండా ఆ యా హీరోల యిమేజికి తగ్గట్టే రూపొందాయని, తక్కినవారి మాట ఎలా ఉన్నా వారి అభిమానులకు ఫుల్ మీల్స్ అందించాయని సమీక్షకులు అంటున్నారు. పండగపూటా ఎల్లెడలా శుభం, సంతోషం అన్నమాట.

కానీ ఆంధ్రజ్యోతి మాత్రం నిరాశపడి ఉంటుంది. ఎందుకంటే యీ సినిమాల విడుదల సందర్భంగా అదో పెద్ద కథను అల్లుకుని కూర్చుంది. ‘జగన్‌కు వ్యతిరేకంగా కమ్మ, కాపు వర్గాలు కలిసి పనిచేసే వాతావరణం ఏర్పడుతోందని పసిగట్టిన వైసిపి, మళ్లీ ఆ కులాల మధ్య అగాధం సృష్టించడానికి, సమాజంలో సామరస్య వాతావరణాన్ని దెబ్బ తీయడానికి సంక్రాంతి సినిమాలను వాడుకునే కుట్రకు తెరలేపిందని అంటున్నారు..’ అంటూ కథనాన్ని గురువారం వెలువరించింది. దీనికోసం వైసిపిలోని పెద్ద నాయకులు ప్రశాంత కిశోర్ సంస్థ ఐ ప్యాక్ బృందాలను విస్తృతంగా వినియోగించు కుంటున్నారని కూడా చెప్పింది. ఈ కథనం అచ్చులో వెలువడడానికి ముందు రోజు సాయంత్రం రఘురామ కృష్ణంరాజు ఎబిఎన్ ఛానెల్‌లోకి వచ్చి యిదంతా పరమ సత్యం అన్నట్లు చెప్పేశారు. వైసిపి తరఫున పనిచేసే వారికి యిది తగదని కూడా హితవు చెప్పారు.

వైసిపి వ్యూహమంటూ ఆంధ్రజ్యోతి వెల్లడించిందేమిటంటే – బెంగుళూరు, తాడేపల్లి, హైదరాబాదు కేంద్రాలుగా వైసిపికి సంబంధించిన 500 మంది సిబ్బంది ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి మాధ్యమాల్లో వేలాది నకిలీ ఖాతాలు సృష్టించి పెట్టుకున్నారు. సినిమాలు విడుదల కాగానే అవి చెత్తగా ఉన్నాయని రెండో హీరో అభిమానుల పేర్లతో, ఆ పెట్టుడు పేర్లకు కులాల తోకలు తగిలించి వ్యాఖ్యలు, సమీక్షలు చేస్తారట. కులపరమైన విమర్శలు జోడిస్తారట. దాంతో అవతలివాళ్లు విరుచుకు పడతారట. ఇలా నిప్పు రగిలించి, మూడు, నాలుగు రోజుల పాటు దాన్ని ఎగదోస్తారట. దానికి తోడు థియేటర్ల వద్ద హీరోల బ్యానర్లు పోస్టర్లు చించడం, అభిమానులపై దాడులు చేయించడం కూడా చేయిస్తారట. ఆంధ్రజ్యోతి యింత కథనాన్ని వండి వార్చాక, రఘురామ రాజు అంత నొక్కి వక్కాణించాక లోకేశ్ నమ్మకుండా ఎలా ఉంటారు?  అందుకనే ఆయన జనవరి 11న ‘కులాల పేరుతో అభిమానుల మధ్య యుద్ధాన్ని ప్రేరేపించబోతున్న వైసిపి మాయలో పడకుండా అప్రమత్తంగా ఉండాల’ని ట్విటర్ వేదికగా పిలుపు నిచ్చారు.

ఇంతా చేసి ఏ గొడవలూ జరగకపోతే తమది చిలకజోస్యం అంటారనే బెంగ పుట్టి వాళ్లే ఆ దిశగా ఏమైనా చేస్తారేమో చూడాలి. ఒకవేళ చేయలేక పోతే తాము ఆ కుట్రను ముందుగా వెల్లడించడంతో వైసిపి భయపడి ఆ కార్యక్రమానికి బ్రేకులు వేసిందని కూడా చెప్పుకోగలరు. ఇప్పటివరకు భౌతికంగా దాడులు, అల్లర్లు జరిగినట్లు న్యూస్‌లో రాలేదు. ఇక సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయిందేమో నాకు తెలియదు. ఒకవేళ జరిగినా దానిలో పెద్ద విశేషమేమీ లేదు. ఆ భాగ్యానికి ఐప్యాక్ వాళ్లకు డబ్బులిచ్చి సలహాలు కొనుక్కో నక్కరలేదు. ట్రోలింగులు ప్రతీదానికీ అవుతాయి. హీరోలు, హీరోయిన్లు అనే కాదు, ఏ కొద్దిపాటి పేరు వచ్చినవాళ్ల మీదైనా ఎవరో ఒకరు ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. వాటి ప్రభావమంటారా? క్షేత్రస్థాయిలో ఏమీ కనబడదు. పాత సినిమాల్లో యిద్దరు ఎదురుబొదురుగా నిలుచుకుని ఆకాశంలో బాణాలు వేసుకుంటూ ఉంటారు చూడండి. ఒకటి పాము అయితే, మరొకటి గద్ద అవుతుంది. ఒకటి నిప్పులు చిమ్మితే, అవతలిది నీళ్లు కుమ్మరిస్తుంది. కింద నేల మీద ఉన్నవాళ్లకు ఏమీ కాదు. ఇద్దరూ ఆకాశంలో జరిగే సర్కస్ చూస్తూ నిలబడతారు. ఈ సోషల్ మీడియా వార్ కూడా అలాటిదే!

ఇక్కడ మనం ఆలోచించ వలసినదేమిటంటే, దీన్ని సినిమాల మధ్య, అభిమానుల మధ్య పోటీగా నిలిపితే సరిపోయేది. దీనిలో కులాన్ని తెచ్చి పెట్టారు. ఆ పై రాజకీయ కుట్రకోణాన్ని చేర్చి, పెద్ద మసాలా వంటకాన్ని వండారు. ఇంత అవసరమా అనిపిస్తుంది. దక్షిణాదిన ప్రత్యర్థి హీరోల అభిమానులు కొట్టుకోవడం ఎప్పణ్నుంచో వస్తోంది. ఎయన్నార్-ఎన్టీయార్, శివాజీ-ఎంజీఆర్, రాజ్‌కుమార్-విష్ణువర్ధన్ యిలా.. ఎంతోమంది హీరోల అభిమానులు కొట్టుకు చచ్చేవారు. పోస్టర్ల మీద పేడ వేయడాలు, చించడాలు, కొట్టుకుని రక్తాలు చిందించుకోవడాలు కూడా జరిగేవి. వారిని వారించడానికి హీరోలు నానా అవస్థా పడేవారు. వీటిలో ఎక్కడా కులప్రస్తావన లేదు. హీరోలు ఒకే కులానికి చెందినా, వేర్వేరు కులాలకు చెందినా ఆ ప్రసక్తే రాలేదు. అంతెందుకు అల్లు అర్జున్ సభలో పవన్ కళ్యాణ్ అభిమానులు అతని పేరు చెప్పాలంటూ గొడవ చేస్తే, చెప్పనని అర్జున్ కరాఖండీగా చెప్పాడు కదా. మరి అర్జున్, కళ్యాణ్ బంధువులే కదా!

రేపో, ఎల్లుండో నిజంగా బాలకృష్ణ, చిరంజీవి అభిమానుల మధ్య ఘర్షణ జరిగినా దాన్ని అభిమానుల మధ్య కొట్లాటగానే చూడాలి తప్ప రెండు కులాల మధ్య పోరాటంగా చూడకూడదు. ఎందుకంటే కులాలతో సంబంధం లేకుండా అభిమానులు హీరోలకు ఆరాధిస్తారు. బాలయ్య సినిమాను కమ్మలే చూస్తారా? మరి జగన్మోహన రెడ్డి స్టూడెంటు రోజుల్లో బాలయ్య అభిమానసంఘం కడప జిల్లా అధ్యక్షుడు కదా! దానికేమంటారు? అలాగే చిరంజీవి సినిమాను కాపులే చూస్తారా? కొంతమంది కులపిచ్చి గాళ్లు ఫలానా హీరో మా వాడు అని బోర విరుచుకుని చెప్పుకోవచ్చు. అది కూడా ఆ కులస్తులైన అందరి హీరోల విషయంలో కాకుండా కొందరి విషయంలోనే చెప్పుకోవచ్చు. అది వాళ్ల ఖర్మ.

ఏ హీరో కూడా తను ఫలానా కులం వాళ్ల కోసమే నటిస్తున్నానని చెప్పుకోడు. తారాగణాన్ని, సాంకేతిక గణాన్ని తన కులస్తులతోనే నింపుకోడు. తాను అందరివాడనని, తన సినిమా సమాజంలోని వివిధ వర్గాల వారినీ, వివిధ వయస్కులనూ, వివిధ అభిరుచులు కలవారినీ, ఆడామగా తేడా లేకుండా ఆకట్టుకుంటుందని చెప్పుకుంటాడు. అతన్ని ఏదైనా ఒక్క కులానికే పరిమితం చేసేవాళ్లు అతనికి ద్రోహం చేస్తున్నట్లే. అతని పరిధిని కుదిస్తున్నట్లే. సినిమాను హీరో కులం బట్టి ఫలానా కులం వాళ్ల సినిమా అని బ్రాండ్ చేయగలరా? హీరోయిన్‌ది, విలన్‌ది, కారెక్టర్ యాక్టర్లది, కథకుడిది, దర్శకుడిది, సంగీతదర్శకుడిది, నిర్మాతది ఏ యే కులమో రోలింగ్ టైటిల్స్‌లో యిస్తారా? ఇచ్చినా ప్రేక్షకుడు పట్టించుకుంటాడా? అతనికి కావలసినదేమిటి? తనిచ్చిన డబ్బులకు సరిపడా వినోదం సమకూరి, పైసా వసూలయిందా లేదా? వసూలు కాని సినిమాల విషయంలో తన కులం వాడు కాదు, బంధువు నటించినా చూడడు. అందుకే పెద్ద హీరోల సినిమాలు కూడా ఫెయిలవుతున్నాయి.

ఇవన్నీ ఎవరూ ఎవరికీ చెప్పనక్కరలేదు. అందరికీ తెలిసిన సత్యాలే. అయినా మీడియా ఏదో జరిగిపోతోందన్నట్లు బిల్డప్ యిస్తోంది. ఇటీవల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అమెరికాలోని డాలస్‌లో జరిగిన సంఘటనను కూడా పవన్, బాలయ్య అభిమానుల మధ్య జరిగిన గొడవలా చూడాలి తప్ప దానికి కులం రంగు పులమడం అర్థరహితం. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దాని గురించి రాస్తూ కూటి కోసం వెళ్లినవారు కులాల రొచ్చులో దిగబడడం మహా విషాదం అంటూ వాపోయారు. ఇక్కడ కులపరమైన విభేదం ఎక్కడుంది? రాజకీయపరమైన విభేదం కూడా లేదు. ఎందుకంటే పవన్, బాలయ్య పార్టీ టిడిపితో సఖ్యంగానే ఉన్నారు. ఇదే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీయార్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగి ఉంటే దాన్ని ఎలా చిత్రీకరించేవారో మరి.

ఆంధ్రజ్యోతి తాజా కథనంలో రాసిన మరో పాయింటు, వైసిపికి వ్యతిరేకంగా కమ్మ, కాపు మళ్లీ కలిసి పని చేసే వాతావరణం ఏర్పడిందట! ఔనా? ఎప్పణ్నుంచి? పవన్, బాబు కలిసిన దగ్గర్నుంచా? వాళ్లు కలిసి పనిచేయాలని నిశ్చయించుకున్నంత మాత్రాన కమ్మలు, కాపులు కలిసి పోయినట్లేనా? 2019లో కమ్మల్లో 65శాతం మంది మాత్రమే బాబుకి ఓటేసినట్లు సర్వేలు చెప్పాయి. ఇక పవన్ విషయానికి వస్తే ఆ శాతంలో పదో వంతు మంది కాపులు కూడా ఆయన వెనక రాలేదు. కాపు నాయకుడి యిమేజి చట్రంలో యిమడాలో వద్దో పవనే యింకా నిశ్చయించుకోలేదు. ఓ సారి తను కాపునని గుర్తు చేస్తారు, మరోసారి తనకు అలాటి దృక్పథం లేదంటారు. 2019లో పవన్‌కు ఓటేసినవారందరూ కాపులనడం అన్యాయమౌతుంది. నటుడిగా ఆయనకు అన్ని వర్గాల్లో, అన్ని కులాల్లో అభిమానులున్నారు. రాజకీయ నాయకుడిగా కూడా ఆయన ప్రభావం అన్ని వర్గాల్లో, అన్ని కులాల్లో, అన్ని ప్రాంతాల్లో ఉండి ఉంటుందనుకోవడం కామన్ సెన్స్.

రామగోపాల వర్మకు యిదే లోపించినట్లుంది. చంద్రబాబును కలిసి మాట్లాడడంతోనే పవన్ కాపుల్ని అమ్మేశాడంటూ ఆయన ట్వీట్ చేసేశాడు. ఎవరైనా తన సొంత వస్తువునే అమ్మగలరు. కాపుల్ని అమ్మడానికి ముందు వాళ్లందరినీ ఆయన జేబులో పెట్టుకుని ఉండాలి కదా, అదెక్కడ జరిగింది? 2019 ఎన్నికలలో ఒకే ఒక్క సీటు గెలిచిన పార్టీ అది. కాపులు గణనీయంగా ఉన్న నియోజకవర్గాల్లో పవన్ స్వయంగా ఓడిపోయారు. అలాటప్పుడు పవన్ కాపుల్ని అభిమానంతోనో, మరోలాగానో కొనేసుకున్నట్లు, వాళ్లను హెచ్చు ధరకి కమ్మలకి అమ్మేసినట్లు ఎలా అనగలరు? అంతటితో ఆగకుండా కాపులకు శ్రద్ధాంజలి కూడా ఘటించేశారు వర్మ. బజారు సరుకులా కనిపిస్తున్నారా వాళ్లు? బాబు, పవన్ తమ పొత్తును ప్రకటించలేదు. ఒకవేళ పొత్తు కోసమే కలిశారనుకున్నా, పొత్తు పెట్టుకున్నంత మాత్రాన తమ ఓటర్లను అమ్మేసినట్లా? 2019లో కమ్యూనిస్టులు, బియస్పీ పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకున్నాయి. అంతమాత్రాన కార్మికకర్షక వర్గాలను, దళితులను కాపులు కొనేసుకున్నట్లా?

వర్మ వ్యాఖ్యానాల గురించి ఎక్కువగా చర్చించడం అనవసరం. ఆయన ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. కొత్తగా వైసిపి ఆయన్ను సినిమాలు తీసిపెట్టమని అడిగి, తంటా తెచ్చిపెట్టుకుంది. ఆయన చేత వైసిపియే యిలా అనిపించింది అని ప్రత్యర్థులు ఆరోపించేందుకు ఆస్కారం కల్పించింది. ‘నీ బోటి మిత్రులుండగా శత్రువులతో ఏం పని?’ అని హిందీలో సామెత. జగన్ వర్మతో అదే అనాలి. పంచతంత్రంలో ఓ కథ ఉంది. అంగరక్షకుడిగా కోతిని పెట్టుకున్న ఒకతని తలపై యీగ వాలిందట. యజమానిని రక్షిద్దామనే ఉద్దేశంతో కోతి దుడ్డుకర్రతో యీగను మోదిందట. అలా ఉంది వర్మ వైసిపికి చేసే సాయం!

జనసేన, టిడిపి కలిస్తే భూనభోంతరాళాలు కలిసిపోయినట్లు తెలుగు మీడియా బిల్డప్ యిస్తోంది. ఈ మధ్య తెర తీసేశారు కానీ, అవి ఎప్పణ్నుంచో కలిసే ఆపరేట్ చేస్తున్నాయి. 2014 మాట అందరికీ తెలుసు. 2019లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికై పవన్‌ను విడిగా పోటీ చేయమని బాబు ప్రోత్సహించి, అవసరమైతే ఎన్నికల అనంతరం పొత్తు పెట్టుకుందా మనుకున్నారు. పవన్ ఎప్పుడూ జగన్‌కి వ్యతిరేకే. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ తిట్టారు, అధికారంలో ఉన్నపుడూ తిడుతున్నారు. జగన్‌తో తలపడగలిగేది బాబు మాత్రమే కాబట్టి, ఆయనతో సన్నిహితంగా ఉన్నారు. అధికారికంగా పొత్తు పెట్టుకోకపోయినా, తమకు బలం లేదనుకున్నచోట్ల 2019 ఎన్నికలలో కానీ, స్థానిక ఎన్నికలలో కానీ వైసిపికి విజయం దక్కకుండా చూడడానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలిసే పని చేశారు తప్ప ఎన్నడూ కలహించుకోలేదు.

ఇంత చేసినా, అవి రెండూ కలిసి స్థానిక ఎన్నికలలో ఏ పాటి సత్తా చాటారని యిప్పుడేదో జరిగిపోతోందని హంగామా చేయాలి? 2019కి 2022కి మధ్య వైసిపి పట్ల ఓటర్లకు అసంతృప్తి పెరిగిందనుకున్నా, ఆ బెనిఫిట్ టిడిపి-జనసేనకు బదిలీ అయిందని చెప్పడానికి రుజువేదైనా ఉందా? అసలు వైసిపిని ఓడించేటంత తీవ్రంగా ఆగ్రహం ఉందా? అది తేలాలంటే ఏదైనా సంకేతాలు మనకు దొరకాలి. టీవీ చర్చల్లో కూర్చుని మాట్లాడుకుని ప్రజలంతా విసిగిపోయారని తీర్మానిస్తే చాలదు. వైసిపికి సరైన ప్రత్యామ్నాయంగా టిడిపిని ఓటర్లు చూస్తున్నారని ఏ ఉపయెన్నికైనా నిరూపించిందా? అలాటప్పుడు టిడిపి, జనసేన కలిసినంత మాత్రాన వైసిపి భయపడిపోయి, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర పన్నేస్తుందని ఊహాగానాలు చేయడం సబబా?

మీడియా ఏం చెప్పినా, టిడిపి, జనసేన కలిసినంత మాత్రాన వైసిపి ఓడిపోదని బాబుకి తెలుసు. 2014లో బిజెపి కూడా కలిసి వస్తేనే ఆ కూటమికి ఒంటరిగా పోటీ చేసిన వైసిపిపై 2శాతం కంటె తక్కువ మెజారిటీ వచ్చింది. అప్పటికింకా బాబు పాలనను ఆంధ్రులు రుచి చూడలేదు. చూశాక 23 సీట్లిచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడు జగన్ పాలన రుచి చూశాక, టిడిపికి సీట్లు పెరగవచ్చు. కానీ అధికారంలోకి రావడానికి అవసరమైన 90 సీట్లు వస్తాయన్న నమ్మకం బాబుకి లేదు. బిజెపి కలిసి వస్తేనే అది సాధ్యపడవచ్చనే లెక్క ఆయనది. అయితే యిప్పుడు బిజెపి కలుస్తుందన్న ధైర్యం లేదు,

2014లో కేంద్రంలో బిజెపి లేదు, యిప్పుడుంది. యమ స్ట్రాంగ్‌గా ఉంది. టిడిపి తనపై తిరుగుబాటు చేసినందుకు కోపగించుకుని బుద్ధి చెప్పాలని 2019లో వ్యతిరేకంగా పనిచేసిందనే నమ్మకం టిడిపిలోనే కాదు, యితరుల్లోనూ ఉంది. అందువలన యీసారి బిజెపి కూడా తమతో కలిసి వస్తేనే గెలుస్తామని బాబు, పవన్ అనుకుంటున్నారు. ఆ ముప్పేట కూటమి ఏర్పడేదాకా వైసిపికి చింత లేదు. ప్రస్తుతానికి బిజెపి తన పేక ముక్కల్ని ఎవరికీ చూపించటం లేదు. ఎటూ మొగ్గు చూపటం లేదు. ఈ లోపున పవన్, టిడిపి కలిసి ఎంత హడావుడి చేసినా అది పేపర్లలో హెడ్‌లైన్లగా రావడానికి పనికి వస్తుంది తప్ప వైసిపిని ఓడించడానికి ఉపయోగపడదు. ఇది యిప్పటి పరిస్థితి. రాబోయే రోజుల్లో వైసిపి పరిస్థితి దిగజారితే ఆలోచించాలి తప్ప, ప్రస్తుతానికి టిడిపి, జనసేన కలయిక వలన బ్రహ్మాండం బద్దలవుతోందని, దాన్ని అడ్డుకోవడానికి వైసిపి కులసమరాల్ని తెచ్చిపెడుతోందని అనుకోవడం హాస్యాస్పదం.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?