Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: హిమాచల్ ఫలితాలు

ఎమ్బీయస్‍: హిమాచల్ ఫలితాలు

గుజరాత్‌లో బిజెపి గెలుపు ఊహించినదే. అఫ్‌కోర్స్ ఆ స్థాయి గెలుపు ఊహించడం కష్టమనుకోండి. కానీ హిమాచల్‌లో కాంగ్రెసు గెలుపు వాళ్లకే ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. ఏ పార్టీకి రెండోసారి అధికారం యివ్వకపోవడమనే హిమాచల్ సంప్రదాయం యీసారి భగ్నమౌతుందని అందరూ అనుకుంటే, హిమాచల్ ఓటరు మాత్రం వ్రతభంగం చేయలేదు. నా పద్ధతి నాదే అన్నాడు. బిజెపి ఎక్కడ పోటీ చేసినా, స్థానిక అభ్యర్థి ఎవరన్నది అనవసరం మోదీ మొహం చూసే ఓటేయండి అని చెప్తున్న యీ తరుణంలో, గుజరాత్‌లో మేజిక్ చేసిన మోదీ యిమేజి హిమాచల్‌లో చతికిల పడడం మోదీ అభిమానులను కంగు తినిపించి ఉంటుంది. ఎందుకిలా జరిగిందో అర్థం చేసుకునే ప్రయత్నమే యీ వ్యాసలక్ష్యం.

హిమాచల్‌లో మొత్తం 68 సీట్లుంటే కాంగ్రెసుకు 43.9% ఓట్లు, గతంలో కంటె 19 ఎక్కువగా 40 సీట్లు వచ్చాయి. బిజెపికి దాని కంటె 0.9% (సంఖ్యాపరంగా చూస్తే 20 వేలు మాత్రమే) ఓట్లు మాత్రమే తక్కువ వచ్చినా సీట్ల సంఖ్యలో 19 తగ్గి 25 వచ్చాయి. ఇతరులకు 13.1% ఓట్లు వచ్చాయి. 3 సీట్లలో స్వతంత్రులు నెగ్గారు. ఆప్‌కు ఒక్క సీటూ రాలేదు. 15 మందికి 2 వేల లోపు మెజారిటీ మాత్రమే వచ్చిందనేది పోటీ హోరాహోరీగా సాగిందనడానికి నిదర్శనం. 12 సీట్లలో కాంగ్రెస్, బిజెపిల మధ్య ఓట్ల తేడా వెయ్యికి లోపే. కాంగ్రెసుకు గుజరాత్‌లో సిఎంలను మార్చి బిజెపి గెలిచింది, హిమాచల్‌లో మార్చక ఓడింది.

ఫలితాల అనంతరం జరిగిన లోకనీతి-సిఎస్‌డిఎస్ సర్వేలో తేలిన విషయాలేమిటంటే - కాంగ్రెసు, బిజెపిలకు సాంప్రదాయకంగా ఓట్లేసేవాళ్లలో 65% మంది తమతమ పార్టీలకు ఓటేయడానికి ముందుగానే నిర్ణయించుకున్నారు. వాళ్లని పోలింగు బూతులకు రప్పించగలిగాయి రెండు పార్టీలూ. కాంగ్రెసుకు ఓటేసినవాళ్లలో అభ్యర్థి గుణగణాలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పినవారు 45% మంది ఉంటే బిజెపి ఓటర్లలో 39% మంది మాత్రమే ఉన్నారు. అభ్యర్థి కులం బట్టి ఓటేశామని అన్నవాళ్లు 5% మందే ఉంటే చేసిన పనిని లెక్కలోకి తీసుకున్నాం, చదువును లెక్కలోకి తీసుకున్నాం అని 90% మంది అన్నారు. పిన్నవయస్కుడని వేశామని 54% మంది అంటే స్థానికుడని వేశామని 41% మంది అన్నారు.

ఓటు వేసేటప్పుడు అభివృద్ధిని లెక్కలోకి తీసుకున్నామని 45%, ద్రవ్యోల్బణాన్ని తీసుకున్నామని 12%, నిరుద్యోగాన్ని తీసుకున్నామని 9% అన్నారు. ధరలు పెరిగాయని 94% మంది, నిరుద్యోగం పెరిగిందని 88% అన్నారు. పెరిగాయని అన్నవారిలో 45% మంది కాంగ్రెసుకు ఓటేశారు. రాష్ట్రంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడిందని 48%, చెడిందని 28% అనగా, విద్యుత్ సరఫరా మెరుగుపడిందని 74% చెడిందని 8% అనగా, తాగునీటి సరఫరా మెరుగుపడిందని 70% చెడిందని 10% అనగా, ప్రభుత్వ బడులు మెరుగుపడ్డాయని 46% చెడ్డాయని 19% అనగా, ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుపడ్డాయని 35%, చెడ్డాయని 27% అన్నారు. ఇలా చూస్తే ప్రభుత్వం పని తీరుపై అసంతృప్తి పెద్దగా లేదని తోస్తుంది. కానీ అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయిందంటే యితర కారణాలున్నాయని అర్థమౌతుంది.

వర్గాల పరంగా చూస్తే పేదల్లో 51% కాంగ్రెసుకు, 38% బిజెపికి వేశారు. దిగువ మధ్యతరగతి వాళ్లలో 43% కాంగ్రెసుకు, 44% బిజెపికి వేశారు. మధ్యతరగతి వాళ్లలో 43% కాంగ్రెసుకు, 43% బిజెపికి వేశారు. ధనికులలో 40% కాంగ్రెసుకు, 46% బిజెపికి వేశారు. కులాలపరంగా చూస్తే బ్రాహ్మణుల్లో 48% బిజెపికి, 33% కాంగ్రెసుకు ఓటేశారు. రాజపుత్రుల్లో 49% బిజెపికి, 40% కాంగ్రెసుకు, ఇతర అగ్రకులాల్లో 51% బిజెపికి, 34% కాంగ్రెసుకు, ఒబిసిల్లో 36% బిజెపికి, 58% కాంగ్రెసుకు, దళితుల్లో 47% బిజెపికి, 53% కాంగ్రెసుకు, ఆదివాసుల్లో 60% బిజెపికి, 33% కాంగ్రెసుకు ఓటేశారు.

ప్రాంతాల వారీగా చూస్తే మూడు ప్రాంతాలున్నాయి. 30 సీట్లున్న కాంగ్రా, 19 సీట్లున్న మండీ, 19 సీట్లున్న షిమ్లా! అధికారంలోకి ఎవరు రావాలో నిర్ణయించేది కాంగ్రా ప్రాంతమే. ఆట్టే మాట్లాడితే 15 సీట్లున్న కాంగ్రా జిల్లాయే. 2017లో కాంగ్రెసు యీ జిల్లాలో 3 గెలిచింది, యీసారి 10 గెలిచింది. మొత్తం కాంగ్రా ప్రాంతంలో 3% ఓట్లు, 11 సీట్లు ఎక్కువగా తెచ్చుకుని యీసారి 45% ఓట్లు, 20 సీట్లు గెలుచుకుంది. బిజెపి గతంలో కంటె 5% ఓట్లు, 12 సీట్లు పోగొట్టుకుని, 43% ఓట్లు 8 సీట్లు తెచ్చుకుంది. మండీ ప్రాంతం బిజెపికి కంచుకోటగా ఉంటూ వచ్చింది. ఈసారి కూడా గతంలో కంటె 5% ఓట్లు తగ్గి 47%, గతంలో కంటె 2 సీట్లు తగ్గి 14 తెచ్చుకున్నా, మొత్తం 19 సీట్లలో 74% సీట్లు దానివే. కాంగ్రెసుకు గతంలో కంటె 1% ఓట్లు, 3 సీట్లు పెరిగి 40% ఓట్లు, 5 సీట్లు వచ్చాయి.

షిమ్లా ప్రాంతం కాంగ్రెసుకు కంచుకోట. గతంలో కంటె 1% ఓట్లు, 5 సీట్లు ఎక్కువగా తెచ్చుకుని యీసారి 45% ఓట్లు, 15 సీట్లు గెలిచింది. బిజెపికి గతంలో కంటె 8% ఓట్లు, 5 సీట్లు తగ్గి 38% ఓట్లు, 3 సీట్లు మాత్రం తెచ్చుకుంది. మిగిలిన 1 సీటు యితరులకు పోయింది. సాధారణంగా యితర రాష్ట్రాలలో బిజెపికి అర్బన్ ఓటు బాగా పడుతోంది. కానీ హిమాచల్‌లో మాత్రం అర్బన్‌లో కాంగ్రెసు కంటె 1% తక్కువ ఓట్లు వచ్చాయి. సెమీ అర్బన్‌లో అయితే 8% తక్కువ వచ్చాయి. సెమీ రూరల్‌లో 1.4%, రూరల్‌లో 2.4% ఎక్కువ వచ్చాయి.

మొత్తం మీద చూస్తే కాంగ్రెసు తన 21 సీట్లలో 16 నిలుపుకుని 23 బిజెపి నుంచి, 1 యితరుల నుంచి గెలుచుకుని యీసారి 40 తెచ్చుకుంది. బిజెపి తన 44 సీట్లలో 20 నిలుపుకుని, 4 కాంగ్రెసు నుంచి, 1 ఇతరుల నుంచి గెలుచుకుని యీసారి 25 తెచ్చుకుంది. బిజెపికి 5.8% ఓట్లు పోగా, కాంగ్రెసుకు 2.2% ఓట్లు వచ్చి చేరాయి. విక్టరీ మార్జిన్ల గురించి చెప్పాలంటే 25% కంటె ఎక్కువ మార్జిన్‌తో బిజెపి 4 సీట్లు గెలిస్తే, కాంగ్రెసు 9 సీట్లు గెలిచింది. 15-25% మార్జిన్‌తో బిజెపి 3 గెలిస్తే, కాంగ్రెసు 4 గెలిచింది. 5-15% మార్జిన్‌తో బిజెపి 10 గెలిస్తే కాంగ్రెసు 17 గెలిచింది. 5% కంటె తక్కువ మార్జిన్‌తో బిజెపి 8 గెలిస్తే కాంగ్రెసు 10 గెలిచింది. 25 సీట్లలో కాంగ్రెసుకు 50% మించి ఓట్లు వస్తే, బిజెపి 9 సీట్లలో మాత్రమే 50% కంటె ఎక్కువ తెచ్చుకుంది.  67 స్థానాల్లో పోటీ చేసిన ఆప్‌కు 1% ఓట్లు మాత్రమే వచ్చాయి. చాలా చోట్ల దాని కంటె నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. సిపిఎం 0.7% ఓట్లు తెచ్చుకుంది. సిటింగ్ సీటు పోగొట్టుకుంది. ఇండిపెండెంట్లు 10% ఓట్లు తెచ్చుకున్నారు.

బిజెపి ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ 38 వేల మెజారిటీతో నెగ్గినా, 8 మంది మంత్రులు ఓడిపోయారు. ఉచితాలను వెక్కిరించే మోదీ హిమాచల్‌లో చాలా హామీలు గుప్పించారు. స్కూల్లో చదివే విద్యార్థినులకు సైకిళ్లు, డిగ్రీ చదివే విద్యార్థినులకు స్కూటీలు యిస్తామన్నారు. యాపిల్ ప్యాకేజింగ్‌పై జిఎస్టీ ఎత్తివేస్తామన్నారు. 10 లక్షల మంది రైతులకు నెలకు రూ.3 వేల చొప్పున నగదు యిస్తామన్నారు. ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా మంచి పేరు ఉన్నా, ఆయన చుట్టూ ఉన్న కోటరీపై అవినీతి ఆరోపణలున్నాయి. ప్రభుత్వ కార్యదర్శులను పదేపదే బదిలీ చేయడంతో పాలన పట్ల ప్రజలు పెదవి విరిచారు. యాపిల్ పళ్లను నిలవ చేసే గోడౌన్లపై జిఎస్టీ విధింపు, అదానీ గ్రూప్‌కి తక్కువ ధరకు ఆపిల్స్ అమ్మవలసి రావడం రైతులకు బిజెపిపై కోపం తెప్పించాయి.

కాంగ్రెసు పాత పెన్షన్ పునరుద్ధరణ హామీ యిచ్చి 2 లక్షల మంది ఉద్యోగులను ఆకట్టుకుంది. వారి ఓటు షేరు 5%, నిరుద్యోగం, యాపిల్ రైతుల సమస్యలు ప్రస్తావించి ఉత్తర హిమాచల్ రైతులను మెప్పించింది, అగ్నిపథ్‌ రద్దుకి ప్రయత్నిస్తామని హామీ యిచ్చి జనాభాలో 10% ఉన్న సైనిక కుటుంబాలను ఆకర్షించింది. ప్రియాంకా ప్రచారం చేసింది, కాంగ్రెసు గెలిచింది. రెండిటినీ కలిపి చూపి, సోనియా వర్గీయులు ప్రియాంకాను కాంగ్రెసు అధ్యక్షురాలని చేయాలని పట్టుబడతారేమో చూడాలి. కానీ కాంగ్రెసు విజయానికి కారణం మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ యిమేజి అంటున్నారు. ఆయన భార్య ప్రతిభా సింగ్ ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షురాలిగా ఉంటూ బిజెపి నాయకత్వాన్ని తట్టుకుని 2019 ఉపయెన్నికలో ఎంపీగా గెలిచి, పార్టీ శ్రేణులను ఉత్తేజ పరుస్తూ వచ్చారు. ఫలితాల తర్వాత ఆవిడ కుటుంబానికి కాకుండా సుఖ్‌వీందర్ సింగ్ సుఖూని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెసు.

హిమాచల్‌కి చెందిన బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా తన సొంత రాష్ట్రానికి వచ్చేసరికి ముఠా నాయకుడిగా వ్యవహరించి, ముఖ్యమంత్రి ఠాకూర్‌ను కీలుబొమ్మగా చేసి, తన ప్రత్యర్థి ఐన ప్రేమ్ కుమార్ ధూమల్ వర్గాన్ని తొక్కేశాడు. 75 ఏళ్ల నిబంధనను చూపి 78 ఏళ్ల ధూమల్‌ను పక్కకు పెట్టడంతో బాటు అతని అనుచరులెవరికీ టిక్కెట్లివ్వలేదు. దానితో వాళ్లంతా తిరగబడ్డారు. టిక్కెట్లు దక్కని 11మంది సిటింగ్ ఎమ్మెల్యేలు రెబెల్స్‌గా బరిలోకి దికారు. వారిలో చాలామంది గెలవకపోయినా బిజెపి ఓటుకు గండి కొట్టారు. మొత్తం 21 చోట్ల బిజెపి రెబెల్స్ నిలబడి వాళ్లు నడ్డా అభ్యర్థులను ఓడించాలని చూశారు. నడ్డా వారితో చర్చించి చల్లార్చే ప్రయత్నం చేయలేదు. ధూమల్ కుమారుడు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నడ్డా వర్గీయుల ప్రాంతాల్లో పర్యటించలేదు. ఇలా ఒక వర్గం మరో వర్గాన్ని ఓడించాలని చూసింది.

నడ్డా సొంత ప్రాంతమైన బిలాస్‌పూర్‌లో 3 సీట్లలో స్వల్ప మెజారిటీతో బిజెపి నెగ్గింది. అనురాగ్ ఠాకూర్ లోకసభ నియోజకవర్గం హమీర్‌పూర్‌లోని 17 అసెంబ్లీ స్థానాల్లో 4టిలో మాత్రమే గెలిచింది. తక్కిన 13టిలో కాంగ్రెసు లేదా రెబెల్స్ నెగ్గారు. నెగ్గిన ముగ్గురు స్వతంత్రులూ బిజెపి రెబెల్స్. హిమాచల్‌లో ఓటమికి యీ వర్గకలహమొక్కటే కారణమని బిజెపి అభిమానులు మనల్ని నమ్మమంటున్నారు. ఇతర కారణాలతో పాటు యిది కూడా ఒక కారణమనే అనుకోవాలి. కేవలం నడ్డా కారణంగానే ఒక రాష్ట్రం ఓటమి పాలవుతోందని మోదీ, షాలు అనుకుంటే మధ్యలోనే అతన్ని వారించేవారు. ఫలితాలు వచ్చాకైనా అతన్ని శిక్షించేవారు. అది జరగలేదు కాబట్టి యితర కారణాలున్నాయని వాళ్లూ నమ్ముతున్నారనే అనుకోవాలి. (ఫోటో ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షురాలు ప్రతిభా సింగ్, కొత్త ముఖ్యమంత్రి సుఖూ)

- ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?