Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: హిస్టరీ ఫ్యాక్టరీ

ఎమ్బీయస్‍: హిస్టరీ ఫ్యాక్టరీ

ఎవరైనా అప్పటిదాకా ఎవరూ సాధించని విజయాన్ని సాధిస్తే చరిత్ర సృష్టించారు అని అంటారు. ఇది అలాటిది కాదు. ఒక సాధారణ సంఘటన నుంచి చరిత్రను అల్లడం. ఔను, నేను సెంగోల్ గురించి చెప్పబోతున్నాను. పార్లమెంటులో దాన్ని ప్రతిష్ఠాపించినప్పుడు చాలా కవరేజి వచ్చింది కాబట్టి క్లుప్తంగా చెప్పేస్తాను. 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చిన వేళ ప్రజాస్వామ్య సారథిగా అవతరించిన ప్రధాని నెహ్రూకి తమిళనాడులోని ఒక శైవమఠం (అధీనం అంటారు) ప్రతినిథులు ఒక స్వర్ణదండాన్ని బహూకరించారు. ఆ సందర్భంలో ఆయనతో ఫోటో తీయించుకున్నారు. నెహ్రూ దాన్ని స్వీకరించి, తనకు వచ్చిన బహుమతులతో ఏర్పాటు చేసిన మ్యూజియంలో నిక్షిప్తం చేశారు. ఇంతే జరిగింది. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం దాన్ని కొత్త పార్లమెంటు భవనంలో ప్రతిష్ఠాపించ దలచింది. మంచిదే, అయితే దాన్ని మామూలు స్వర్ణదండం అంటే రంజుగా ఉండదని, అది అధికార బదిలీకి చిహ్నమని చరిత్ర సృష్టించింది. కానీ దానికి ఆధారాలు చూపించలేక పోవడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కాస్త వివరంగా చెప్పాలంటే, ఆ మఠం తమిళనాడులోని తిరువాడుదురై అధీనం అనే శైవ మఠం. దానికి అధిపతిగా ఉన్న అంబళవాన్ పందరసన్నధి స్వామిగళ్ అనే ఆయన దాన్ని తన శిష్యుల ద్వారా దిల్లీకి పంపారు. వాళ్లు 1947 ఆగస్టు 11న మద్రాసు సెంట్రల్ నుంచి రైలెక్కి దిల్లీ వెళ్లారు. రైల్వే స్టేషనులో రైలెక్కబోతున్న వీళ్ల ఫోటో మర్నాటి ‘‘హిందూ’’ పేపర్లో కూడా వచ్చింది. రైలే అని ప్రత్యేకంగా చెప్పడం దేనికంటే కొందరు వాళ్లను ప్రత్యేక విమానంలో తెప్పించారని కూడా కథ అల్లేశారు. దిల్లీలో వీళ్లేం చేశారన్నది ‘‘టైమ్స్’’ తన ఆగస్టు 25 నాటి కథనంలో రాసింది – ‘ఆగస్టు 14 సాయంత్రం నాదస్వరం బృందంతో సహా నెహ్రూ యింటికి వెళ్లారు, తంజావూరు నుంచి తెచ్చిన పవిత్ర జలాన్ని నెహ్రూ నెత్తి మీద జల్లి, విబూది ఆయన నుదుట పూసి, పట్టు పీతాంబరాన్ని ఆయనకు కప్పి, 5 అడుగుల పొడుగు, 2 అంగుళాలు మందం ఉన్న స్వర్ణదండాన్ని వెండిపళ్లెంలో పెట్టి ఆయనకు అందించారు. ఆ రోజు ఉదయమే విమానంలో తెప్పించిన నటరాజస్వామి ప్రసాదాన్ని ఆయనకిచ్చారు.

ఆ తర్వాత నెహ్రూ కాన్‌స్టిట్యుయెంట్ అసెంబ్లీ అధ్యక్షుడైన రాజేంద్ర ప్రసాద్ యింటికి వెళ్లారు. ఆయన పెరట్లో హోమం జరుగుతోంది. అక్కడ మంత్రులు కాబోయే వారందరిపై బ్రాహ్మణులు పవిత్రోదకాన్ని చల్లి నుదుట కుంకుమ పూశారు. ఇలా పూజా కార్యక్రమాలు ముగిశాక అప్పుడు ‘సెక్యులర్ బిజినెస్’ లోకి దిగారు. రాత్రి 11 గంటలకు కాన్‌స్టిట్యుయెంట్ ఎసెంబ్లీ హాలుకి చేరారు. అప్పుడు నెహ్రూ ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగం చేశారు...’ అంటూ రాసుకుపోయింది. ఆర్టికల్ చదివితే ఈ మత కార్యక్రమాలపై ఒక వెక్కిరింతలా తోస్తుంది. ఎగ్నోస్టిక్ (అజ్ఞేయవాది – దేవుడున్నాడో లేదో తెలియదనేవాడు) అయిన నెహ్రూ విబూది పూసుకుని.. అంటూ రాసిందా వ్యాసం. మొత్తం మీద దండసమర్పణ ఒక వ్యక్తిగత కార్యక్రమంగానే అందరూ చూశారు తప్ప అధికారిక కార్యక్రమంగా (అఫీషియల్ ఫంక్షన్)గా పరిగణించలేదు. అందుకే నెహ్రూ యింట్లో అక్కడున్న వారి సమక్షంలోనే జరిగింది. అందుకే ఫోటోలో నెహ్రూగారు యింట్లో కాజువల్‌గా ఉన్నట్లే బట్టతలతో కనబడ్డారు. అఫీషియల్ ప్రోగ్రాం అయితే గాంధీ టోపీ, జాకెట్‌తో కనబడేవారు.

ఇలా బహుమతులు యివ్వడానికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది? ఒక దేశాధినేత మరో దేశానికి వెళ్లినపుడు సింబాలిక్‌గా ఏదో ఒక వస్తువు యిస్తూంటారు, పుచ్చుకుంటూ ఉంటారు. యుద్ధం వద్దు, శాంతి ముఖ్యం అనే సందేశానికి యివ్వడానికి బుద్ధుడు తపోముద్రలో ఉన్న విగ్రహం బాగా చలామణీలో ఉన్న వస్తువు. దాతలు, గ్రహీతలు బౌద్ధులు కాకపోయినా దీన్నో చిహ్నంగా చూస్తారు. కేంద్రం నుంచి ఎవరైనా పెద్దవారు వస్తే రాష్ట్రాధిపతులు వెళ్లి బహుమతులు యిస్తూ ఉంటారు. కర్ణాటక వాళ్లయితే గంధం బొమ్మలు, కేరళ వాళ్లయితే గజదంతాలతో చేసిన బొమ్మలు యిచ్చేవారు. విదేశీ అతిథులెవరైనా వస్తే మన భారత ప్రభుత్వం వారు తాజ్‌మహల్ బొమ్మ యిచ్చేవారు. ఆ యా దేశాల పిల్లల కోసం ఏనుగుని బహుమతిగా పంపేవారు. మన తెలుగువాళ్లయితే అతిథులకు చార్మినార్ బొమ్మ యిచ్చేవాళ్లు. ఇప్పుడు ఆమెరికాలో ఉన్న తెలుగువాళ్లు వాళ్ల కార్యక్రమానికి ఆ రాష్ట్ర గవర్నరుని పిలవడానికి వెళ్లారనుకోండి. చార్మినారెందుకని తిరుపతి గుడి నమూనా యివ్వేవచ్చు, యిప్పుడు యాదాద్రి కూడా బాగా రూపొందుతోంది కాబట్టి ఆ గుడి నమూనా యివ్వవచ్చు.

మనం యిచ్చినంత మాత్రాన వాటిని వాళ్లు యింట్లో పూజాగృహంలో పెట్టుకోరు కదా. ఆ దేవుడెవరో వాళ్లకు తెలియను కూడా తెలియకపోవచ్చు. తీసుకుని షో కేసులో ఓ నాలుగు రోజులుంచి, ఆ తర్వాత ఒక పెద్ద హాల్లో సువెనీర్లన్ని పెట్టేచోటికి తరలిస్తారు. నెహ్రూ గారు కూడా అలాగే యీ స్వర్ణదండాన్ని తన మ్యూజియంకు తరలించారు. ఆయనకు వచ్చిన వందలాది బహుమతులతో పాటు దీన్ని కూడా అలహాబాదులోని ఆనంద నిలయంలో ఏర్పాటు చేసిన మ్యూజియంలో భద్రపరిచారు. దానిపై రాసిన అక్షరాలు తమిళంలో ఉండడంతో, అదేమిటో మ్యూజియం క్యూరేటర్లకు అర్థం కాక చేతికర్ర అనుకుని, ఆ విధంగా లేబుల్ రాసి అక్కడే పెట్టేశారు. ఇదీ యిప్పటిదాకా జరిగిన కథ.

ఇంతకీ ఆ స్వర్ణదండం రాజదండమా? ధర్మదండమా? ఎందుకంటే రాజదండం అనేది రాజరిక చిహ్నం. రాజుగారికి సింహాసనం, కిరీటంతో పాటు కత్తి, రాజదండం కూడా అధికార చిహ్నమే. ఇది ప్రపంచ దేశాలన్నిటిలోనూ వాడుకలో ఉంది. చోళులకో లేదా మౌర్యులకో పరిమితమైంది కాదు. అయితే అది ధర్మదండం కూడా. ఎందుకంటే ధర్మరక్షణ రాజు కర్తవ్యం. కానీ ధర్మరక్షణ చేయాలంటే అధికారం ఉండాలి. అవసరమైతే కత్తితో పోరాడి ధర్మాన్ని నిలబెట్టాలి. అందుకని అవి చేతికి యిస్తారు. అధికారం బదిలీ అయిందన్న దానికి గుర్తు మకుటధారణ! కిరీటం ఎవరి నెత్తిన ఉంటే వాళ్లే రాజు. వాళ్లదే అధికారం. పాతరాజు గారు తండ్రో, సోదరుడో అయితే అతను పెడతాడు. పాత వాళ్లను చంపి, కొత్తవాడు రాజైతే రాజపురోహితుడు పెడతాడు.

ఇక్కడ నెహ్రూ గారి నెత్తిన కిరీటం ఎవరూ పెట్టలేదు. ఒక దండాన్ని చేతిలో పెట్టారు. దాన్ని ధర్మదండంగానే అభివర్ణించాలి. ఎందుకంటే రాజదండం యివ్వడానికి వచ్చినవాళ్లు రాజపురోహితులు కాదు, మఠాధిపతులు. చోళ రాజ్యానికి అనాదిగా గురువులుగా ఉన్నామన్న క్లెయిమూ వారు చేయలేదు. చోళులు పాలించిన చాలా శతాబ్దాల తర్వాత 16వ శతాబ్దంలో యీ అధీనం వెలసింది. ప్రజల తరఫున ప్రతినిథులుగా పాలన చేయడానికి వచ్చారు కాబట్టి ధర్మంగా పాలించండి అని చెప్పడానికి సెంగోల్‌ చేయించి ఆయన చేతిలో పెట్టారు. సెంగోల్ చోళులకు సంబంధించినది మాత్రమే అని చెప్పడానికి లేదు. ఎందుకంటే సెంగోల్‌ను ధర్మదండంగా చెపుతూ ఉటంకించిన కణ్నగి కథలోని రాజు పాండ్యరాజు. కణ్నగి భర్తపై అన్యాయపు ఆరోపణ వస్తే రాజు సరైన విచారణ చేయకుండా అతనికి మరణశిక్ష విధించాడు. అతను నిర్దోషి అని తెలిశాక, తను పాపం చేశానని కుమిలి అసువులు బాశాడు. అతను పొరపాటు చేసినప్పుడు సెంగోల్ ఒరిగిందని, అతని ప్రాయశ్చిత్తంతో సెంగోల్ మళ్లీ నిటారుగా నిలబడిందని చేరరాజు వ్యాఖ్యానించాడు.

వలస పాలకుల హయాంలో వివక్షత చూపిస్తూ అధర్మపాలన జరిగిందని, స్వదేశీయుల పాలనలో ధర్మబద్ధ పాలన జరగాలని ఆకాంక్షిస్తూ ధర్మసూచకాలను ప్రమోట్ చేయడం జరిగింది. మన జాతీయపతాకంలోని అశోకచక్రం 24 సద్గుణాలకు ప్రతీక. ఎన్టీయార్ లోక్‌పాల్ వంటి వ్యవస్థ పెట్టినపుడు బౌద్ధకాలం నాటి ‘ధర్మమహామాత్ర’ అనే పేరు పెట్టారు. అలాగే యీ మఠాధిపతులు యికనైనా ధర్మపరిపాలన జరగాలని ఆకాంక్షిస్తూ నెహ్రూ గారికి యిది అందించి వచ్చారు. వారిని అధికారికంగా ఎవరూ పిలవనూ లేదు, ఆహ్వానం పంపనూ లేదు. వెళ్లి యిస్తామన్నారు, నెహ్రూ సరేనన్నారు, వెళ్లి యిచ్చి వచ్చారు. కథ అక్కడితో ముగిసిపోయింది. ఇన్నాళ్లకు బిజెపి ప్రభుత్వం దాన్ని తవ్వి తీసింది. న్యాయస్థానంలో త్రాసు పట్టుకున్న న్యాయదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠాపించినట్లు, కొత్త పార్లమెంటులో స్పీకరు ఆసనం పక్కన దీన్ని ప్రతిష్ఠాపించింది. ధర్మదండం ఒరగకుండా చూడవలసినది ప్రజా ప్రతినిథులే అని అది సూచిస్తోందని అనుకోవచ్చు. ఇది ఒక ప్రతీక.

వడ్లగింజలో బియ్యపు గింజ వంటి యీ చిన్న విషయానికి ప్రస్తుత బిజెపి నాయకత్వం చాలా పొట్టు చేర్చింది. బహుమతిగా యిచ్చిన ఆ ధర్మదండాన్ని అధికార బదిలీకి సూచకంగా యిచ్చారని చరిత్ర సృష్టించింది. ఇది మాత్రమే అభ్యంతరకరం. అధికార బదిలీ అంటే మౌంట్‌బాటెన్ తన పదవిని ఎవరికైనా అప్పగించారా? లేదే! 1947 ఆగస్టు 14 వరకు వైస్రాయ్‌గా ఉన్నాడు. మర్నాటి నుంచి గవర్నరు జనరల్ అయ్యాడు. పది నెలలు పోయాక మాత్రమే రాజాజీ గవర్నరు జనరల్ అయ్యారు. కావాలంటే మౌంట్‌బాటెన్ ఆ దండమేదో రాజాజీకి 1948లో యివ్వాల్సింది. ఎందుకంటే ఆ రాజరికపు చిహ్నాలన్నీ గవర్నరు జనరల్‌వి, ఆ తర్వాతి రోజుల్లో రాష్ట్రపతులవి. రాష్ట్రస్థాయిలో గవర్నర్లవి. అందుకే వాళ్లు హిజ్ ఎక్సలెన్సీ అని పిలిపించుకుంటారు, గుఱ్ఱపు బగ్గీల్లో తిరుగుతారు. ప్రధానులు, ముఖ్యమంత్రులూ అలాటి హంగులకు పోరు.

కానీ టైమ్స్ కథనంలో ‘‘Sri Amblavana thought that Nehru, as first Indian head of a really Indian Government ought, like ancient Hindu kings, to receive the symbol of power and authority from Hindu holy men. అని రాశారు. ద్రవిడోద్యమ నాయకుడు అణ్నాదురైకూ యిలాగే తోచింది. వాళ్ల నాటకాల్లో, సినిమాల్లో విలన్ ఎప్పుడూ రాజపురోహితుడే. 1947 ఆగస్టు 24 ద్రవిడనాడు వార పత్రిక సంచికలో రాస్తూ అణ్నా ‘ఇప్పుడు కొత్త పాలకులు వచ్చే వేళ యీ మఠం ఓ కానుక మాత్రమే యిచ్చినా తామే ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నట్లు, కొత్త ప్రభుత్వానికి ఆమోదముద్ర వేసినట్లు ఊరంతా చెప్పుకుంటుంది. ఇది ప్రమాదకరం. అసలు సన్యాసుల వద్ద యింత బంగారం ఎలా పోగుపడింది? దీన్ని ప్రజోద్ధరణకు వాడవచ్చుగా..’ అన్నాడు. అణ్నాదురై భయపడినట్లు నెహ్రూ కానీ, భారత ప్రభుత్వం కానీ సెంగోల్‌కూ, ఆ మఠానికీ ఏ ప్రాముఖ్యతా యివ్వలేదు. ‘టైమ్స్’ చెప్పినట్లు అధీనం మఠాధిపతి అంబళవానన్ దాన్ని అధికార చిహ్నం అని వ్యక్తిగతంగా అనుకున్నారేమో కానీ మఠం వారు బయట ఎక్కడా అనలేదు. అధికారికంగా సభాముఖంగా యివ్వలేదు. ఇంటికి పట్టుకెళ్లి యిచ్చేసి చక్కా వచ్చారు.

కానీ యిప్పుడు ప్రభుత్వం దాన్ని అధికార బదిలీకి చిహ్నంగా యిచ్చిన ఘట్టంగా చెప్తోంది. అమిత్ షా చెప్పినదేమిటంటే - ‘బ్రిటిషు వారి నుంచి భారతీయులకు అధికారం బదిలీ అవుతోంది కదా, దీనికి లాంఛనప్రాయంగా ఏదైనా చిహ్నం ఉందా, ఉంటే దాన్ని అమలు చేద్దాం అని మౌంట్‌బాటెన్ నెహ్రూని అడిగితే ఆయన రాజాజీని సలహా అడిగాడు. రాజాజీ చోళ సామ్రాజ్యం కాలంనాటి అధికార బదిలీ చిహ్నమైన సెంగోల్‌ను గుర్తు తెచ్చుకుని యీ అధీనం వాళ్లకి చెప్పాడు. వాళ్లు సెంగోల్‌ను పట్టుకుని వచ్చి మౌంట్‌బాటెన్‌ చేతి కిచ్చి, మళ్లీ వెనక్కి తీసేసుకుని, దాన్ని గంగాజలంతో శుద్ధి చేసి, అప్పుడు నెహ్రూ నివాసానికి వెళ్లి అందజేశారు. అందువలన భారత స్వాతంత్ర్యవేళ జరిగిన ముఖ్య ఘట్టం యిది. సెంగోల్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది.’

ఈ కథ వింటే ఎన్నో సందేహాలు వస్తాయి. నెహ్రూ రాజాజీని ఎందుకడుగుతాడు? నెహ్రూకి చరిత్ర తెలియదా? డిస్కవరీ ఆఫ్ ఇండియా రాసిన మహా పండితుడాయన. ఒకవేళ నెహ్రూ ఎవరినైనా సంప్రదిద్దామంటే డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గార్ని అడిగి ఉండేవాడు. ఎందుకంటే రాధాకృష్ణన్ భారతీయ సంస్కృతిని కాచి వడపోసిన పండితుడు. ఫిలాసఫర్‌గా పేరు బడినవాడు. రామాయణాన్ని ‘చక్రవర్తి తిరుమగన్’ అనే పేరుతో పుస్తకంగా రాజాజీకి పురాణాలు బాగా తెలుసనుకోవచ్చు తప్ప చరిత్రపై పట్టు ఉన్నట్లు ఎక్కడా దాఖలాలు లేవు. రాజాజీ గాంధీకి ఆత్మీయుడు, వియ్యంకుడు కానీ నెహ్రూకి అంత ఫ్రెండేమీ కాడు. రాజాజీ, గాంధీల మనుమడు, జీవిత చరిత్రలు రాసిన రాజమోహన్ గాంధీ, అమిత్ షా ప్రకటన తర్వాత యిలా ఏమీ జరగలేదని నిర్ధారించారు.

అయినా చోళులలో మాత్రమే అధికార బదిలీ జరిగిందా? ఉత్తర, తూర్పు, పడమర భారతాలలో ఎన్ని రాజవంశాలు లేవు? ఎవరి చిహ్నాన్నయినా తీసుకోవచ్చుగా! నెహ్రూకు దాని గురించి ఐడియా లేదా? చరిత్రకారులు లేరా? రాజాజీనే ఎందుకు అడగాలి? వైష్ణవుడైన రాజాజీ శైవ అధీనాన్ని సూచిస్తారా? వీళ్లకీ చోళులకీ సంబంధం ఏముంది? ఆయన సూచిస్తే యీయన వినాలని లేదు. గుప్త సామ్రాజ్యానికో. కళింగ సామ్రాజ్యానికో చెందినవారిని పిలుద్దామనవచ్చు. ఛత్రపతి శివాజీ పురోహిత కుటుంబాన్నో, విజయనగర సామ్రాజ్య గురువులనో పిలుద్దామనవచ్చు.

సరే, యీ అధీనం వారే ముందుకు వచ్చారు. వీళ్లు మౌంట్‌బాటెన్ దగ్గరకు వెళ్లి ఆయన చేతికి సెంగోల్ యిచ్చి, దీన్ని మీ చేతులతో నిండు సభలో నెహ్రూ చేతిలో పెట్టండి, మేం ఆ టైముకి మంత్రాలు చదువుతాం అనాలి. అంతేకానీ యిచ్చినట్లే యిచ్చి వెనక్కి తీసేసుకుని మేం యిస్తాంలెండి అనడమేమిటి? మ్లేచ్ఛులు ముట్టుకున్నారనా గంగాజలంతో శుద్ధి చేయడం? వాళ్లు కావేరీ జలాలతో నెహ్రూను సంప్రోక్షించినవారు. అప్పటిదాకా ప్రధాని కూడా అవని నెహ్రూతోనే ఫోటో దిగినవారు, అత్యున్నత స్థానమైన వైస్రాయి స్థానంలో ఉన్న మౌంట్‌బాటెన్ దగ్గరకు నిజంగా వెళితే ఆయనతో ఫోటో దిగరా? పేపర్లలో వేయించుకోరా? ఆ రాక మౌంట్‌బాటెన్ ఆఫీసు రికార్డుల్లో నమోదవ్వదా? ఆయన దగ్గరకు వీళ్లు వెళ్లినట్లు యిప్పటి ప్రభుత్వం ఒక్క ఆధారమూ చూపించలేక పోయింది.

తమిళనాడులోని శైవ అధీనాల గురించి పుస్తకం రాసిన ఊరన్ అడిగళ్ సెంగోల్‌ను నెహ్రూ కిచ్చిన సంగతి రాశారు తప్ప మౌంట్‌బాటెన్ గురించి ఒక్క ముక్క రాయలేదు. సెంగోల్ యిచ్చే సందర్భంలో నాదస్వరం వాయించిన రాజరత్నం పిళ్లయ్ గురించి ప్రఖ్యాత నాట్యకళాకారిణి బాలసరస్వతి సోదరుడైన టి శంకరన్ సంగీత నాటక అకాడెమీ వారి జర్నల్‌లో వ్యాసం రాస్తూ పిళ్లయ్‌ను డా. సుబ్బరాయన్ (1926-30లో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు) నెహ్రూకి పరిచయం చేశారని రాశారు. ఆయనా మౌంట్‌బాటెన్ వద్దకు వీళ్లు వెళ్లారని రాయలేదు. అంతెందుకు అధీనం ప్రతినిథిని అంటూ ఒకాయన మే 26న ‘మౌంట్‌బాటెన్‌కు యిచ్చిన విషయం అధీనం వెలువరించిన 1947, 1950 సువెనీర్లలో ఉంద’ని ప్రకటించగా మీడియా వాళ్లు వెళ్లి వాటిని చూపించమని అడిగారు. అప్పుడు అధీనం అధిపతి ‘ఆ సువెనీర్లు ఎక్కుడున్నాయో మాకు తెలియదు. నెహ్రూ కిచ్చినట్లు రికార్డులున్నాయి తప్ప మౌంట్‌బాటెన్ వ్యవహారం గురించి మా దగ్గర ఏ ఆధారమూ లేదు.’ అని జూన్ 8న చెప్పేశారు. అది జూన్ 9 పేపర్లలో వచ్చింది. మరి యీ మౌంట్‌బాటెన్, అధికార బదిలీ చిహ్నం కట్టుకథారచయిత ఎవరు? ఎస్ గురుమూర్తి అని ఆరెస్సెస్ సిద్ధాంతకర్త, ఆడిటరు, జర్నలిస్టు. చాలా పెద్ద ప్రొఫైల్ ఉన్న మనిషి. ప్రస్తుతం ‘‘తుగ్లక్’’ పత్రిక సంపాదకుడు.

చో రామస్వామి స్థాపించిన ఆ పత్రిక స్వతంత్ర భావాలతో చాలాకాలం నడిచింది. చో అన్ని పార్టీల వాళ్లని విమర్శిస్తూ మధ్యతరగతి వాళ్లను బాగా ఆకట్టుకున్నాడు. పోనుపోను ఆయన బిజెపి వైపు మొగ్గాడు. ఆయన తదనంతరం గురుమూర్తి ఆ పత్రికకు ఎడిటరు అయ్యి నడుపుతూ దాన్ని పూర్తిగా బిజెపి బాకాగా తయారు చేశాడు. తెలుగునాట ‘‘కృష్ణాపత్రిక’’ను 1902లో కొండా వెంకటప్పయ్యగారు స్థాపించారు. ఐదేళ్ల తర్వాత సంపాదకుడిగా చేరిన ముట్నూరి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో దానికి ఎనలేని కీర్తి వచ్చింది. కొంతకాలానికి ఆర్థికపరమైన యిబ్బందులతో పత్రిక మూతపడింది. ఆ గుడ్‌విల్ వాడుకుందామని పిరాట్ల అనే ఆరెస్సెస్ నాయకుడు దాన్ని తీసుకుని, తన సంపాదకత్వంలో వెలువరించారు. అలాగే తుగ్లక్ కూడా ఆరెస్సెస్ పాలైంది.

ఈ గురుమూర్తి యీ సెంగోల్ కథ కొత్త వెర్షన్‌ను 2021లో ‘‘తుగ్లక్’’లో వ్యాసంగా వేశారు. తన కథకు ఆధారమేమిటని అడిగితే 1994లో మరణించిన కంచి పీఠాధిపతి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి 1978లో తన శిష్యుడికి యిలా చెప్పారని క్లెయిమ్ చేశాడు. ధీరూభాయి అంబానీపై అనేక పరిశోధనాత్మక కథనాలను ‘‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’’లో వెలువరించిన గురుమూర్తి యీ కథనంలోని నిజానిజాలను ప్రభుత్వ రికార్డులతో క్రాస్‌చెక్ చేసుకోక పోవడం ఆశ్చర్యకరం. పరమాచార్య వాణిని దైవవాక్కుగా తమిళ ప్రజల్లో చాలామంది పరిగణిస్తారని తెలిసినపుడు మరింత బాధ్యతగా ఉండాల్సింది. ఈ సమాచారం దానాదీనా మోదీకి చేరిందని, దాని ప్రాశస్త్యాన్ని గుర్తించిన ఆయన కొత్త పార్లమెంటు భవనంలో దాన్ని ప్రతిష్ఠాపించ దలచుకున్నారని బిజెపి కథనం. ఈ వ్యాసాన్ని చివరి దాకా చదివితే యిదంత యాదృచ్ఛికంగా జరిగినది కాదని, ఒక వ్యూహం ప్రకారం జరిగిందని అర్థమౌతుంది.

దాన్ని ధర్మదండంగా అనుకుని అక్కడ నిలిపితే సబబే. కానీ అధికార బదిలీకి చిహ్నంగా గుర్తించామంటేనే తకరారు. ఇప్పుడు ఎవరి నుంచి ఎవరికి అధికారం బదిలీ అవుతోంది? మోదీ ఎవరికీ పగ్గాలు అప్పగించటం లేదు కదా! కానీ మోదీ ఏం చేసినా గ్రాండ్‌గా చేస్తారు. జిఎస్‌టి పన్ను విధింపు కూడా స్వాత్రంత్ర్యం మళ్లీ వచ్చినంత హంగు చేశారు. అది ఒక కొత్త రకమైన పన్ను అంతే కదా! దానిలో యిప్పటికీ మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇక దీన్ని ఎప్పుడైతే ఫంక్షన్‌గా చేద్దామనుకున్నారో అప్పణ్నుంచి తాజాగా వండిన యీ చరిత్రను పంపిణీలోకి తెచ్చారు. ఆ అధీనం వారిని ఆకాశానికి ఎత్తారు, ఆ దండం చేసిన ఉమ్మిడి ఫ్యామిలీని రప్పించారు, సత్కరించారు.

ఉమ్మిడివారు శాఖోపశాఖలుగా చీలినా యిప్పటికీ ఆభరణాల వ్యాపారంలో ఉన్నారు. వాళ్లు వెంకటేశ్వర స్వామి కిరీటాన్నీ తయారు చేస్తారు, వేలాంగణ్ని మేరీమాత కిరీటాన్నీ చేస్తారు. 100 కాసుల బంగారంతో సెంగోల్ ఆర్డర్ వచ్చింది, రూ. 15 వేల రూపాయల మజూరీ తీసుకుని తయారు చేశారు. దీనిలో వారి ప్రత్యేకత లేదా ఔదార్యం ఏముందో నాకైతే అర్థం కాలేదు. వారికీ కవరేజి యిచ్చారు. ఇవన్నీ చేయటంతో పాటు సెంగోల్‌ను అధికార బదిలీకి చిహ్నం అని ఎలా చెప్తారు అని ఆధారాలు అడిగినవార్ని తిట్టారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై మీకెందుకింత అసహ్యం అని నిందించారు. అలహాబాదు మ్యూజియం క్యూరేటరు రాంగ్ లేబుల్ పెట్టడం కుట్రలో భాగమే అన్నంత బిల్డప్ యిచ్చారు. కాంగ్రెసు పార్టీ శైవ అధీనాన్ని, సనాతన ధర్మాన్ని కించ పరిచిందని తమిళనాడు బిజెపి నేత అణ్నామలై అన్నాడు. నిజానికి అలా ఎవరూ కించపరచలేదు.

ఈ అధీనం యివాళ్టిది కాదు. 16వ శతాబ్దంలో నమశ్శివాయ మూర్తి అనే బ్రాహ్మణేతర శైవుడు స్థాపించిన మఠమది. అధీనం అంటేనే శైవమత వ్యాప్తికై ఆధ్యాత్మిక చింతన ఉన్న బ్రాహ్మణేతరులు స్థాపించినది అని అర్థం. అలాటివి తమిళనాట 20 ఉన్నాయి. వాటికి వేలాది ఎకరాల భూములున్నాయి. ఈ అధీనం కూడా యూనివర్శిటీలా నడిచి, మహా పండితులను తయారు చేసింది. దీనికి రాష్ట్రం మొత్తం మీద 69 శాఖలున్నాయి, విద్యాసంస్థ లున్నాయి. దీని ఆధ్వర్యంలో 50 ఆలయాలు నడుస్తాయి. ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల భూమి ఉండి, దానిపై ఆదాయం వచ్చేది. కానీ 1969లో కౌలుదారుల చట్టం వచ్చాక ఆదాయం బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగా లేదు. శతాబ్దాలుగా శైవ మఠాలకు యింత ఆదరణ కలగడానికి కారణం, వీటికి వెల్లాల కులస్తులు అందించిన అండ!

మన వైపు కమ్మ, కాపు, రెడ్డి, వెలమ వంటి ధనిక శూద్ర కులాలకు భూవసతి బాగా ఉన్నట్లే వెల్లాల కులస్తులు తమిళనాడు, కేరళ, ఈశాన్య శ్రీలంకలలో భూస్వాములు. (1901 జనగణనలో వారిని బ్రిటిషు వారు సత్-శూద్రులు అన్నారు). అరుణాట్టు వెల్లలార్, చోళియ వెల్లలార్, కర్కార్తర్ వెల్లలార్, కొంగు వెల్లలార్, తుళువ వెల్లలార్ అని ప్రాంతీయ విభేదాలతో వారిలో అనేక శాఖలున్నాయి. వ్యవసాయంపై ఆధారపడిన వీళ్లు రాజ్యాలు ఏలారు. ఉన్నతోద్యోగాల్లో పని చేశారు. ఐశ్వర్యంతో పాటు మతపరమైన విషయాల్లో బ్రాహ్మణులతో పోటీ పడ్డారు. 7వ శతాబ్దంలో హిందూమతోద్ధరణలో భాగంగా పెల్లుబికిన భక్తి ఉద్యమంలో వారు ప్రముఖపాత్ర వహించారు. వైష్ణవాన్ని 12 మంది ఆళ్వార్లు ప్రచారం చేయగా శైవాన్ని 63 మంది నాయనార్లు ప్రచారం చేశారు. నాయనార్లలో ఎక్కువమంది వెల్లాల కులస్తులే. చోళుల పాలనలో వీళ్ల ప్రభ బాగా వెలిగింది. చోళులతో వీళ్లకు వైవాహిక బంధాలు కూడా ఉన్నాయి. సంస్కృతాన్ని ఆదరించిన బ్రాహ్మణులకు విరుద్ధంగా వీళ్లు తమిళంలోనే పూజాది క్రతువులు నిర్వహించారు. కీర్తనలు రచించారు. బ్రాహ్మణులకు శృంగేరి, కంచి, జీయర్, మధ్య మఠాలుండగా బ్రాహ్మణేతరులు యీ అధీనాలకు విరాళాలిచ్చి ప్రోత్సహించారు. లక్షలాది మంది అనుయాయులున్నా వీళ్లు యిప్పటి దాకా రాజకీయాల జోలికి పోరు.

వీళ్లను యిప్పుడు హఠాత్తుగా ఆకాశానికి ఎత్తవలసిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. వ్యాపారి వరదన ఊరికే పోడని సామెత. మీరూ నేనూ ఉధృత తరంగాలను చూడ్డానికి వెళ్లవచ్చు, ఈతొచ్చిన కొందరు పరోపకారులు కొట్టుకు పోయేవారిని కాపాడడానికి వెళ్లవచ్చు. కానీ వ్యాపారి మాత్రం పై నుంచి కొట్టుకుని వచ్చే పుల్లాపుడకా పోగేసి, ఆరబెట్టి అమ్ముకోవడానికి వెళతాడని సామెత భావం. జూన్ 11న తమిళనాడులోని వెల్లూరులో బిజెపి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అమిత్ షా, సెంగోల్‌ను పార్లమెంటులో ప్రతిష్ఠాపించిన మోదీ ఋణాన్ని తమిళనాడు ప్రజలు తీర్చుకోవాలంటే 25 మంది ఎన్‌డిఏ ఎంపీలను తమిళనాడు నుంచి పంపాలని ప్రకటించారు. సెంగోల్‌ మాస్కట్‌గా బిజెపి భావి ప్రచారం సాగుతుందన్న దానికి సూచనగా కాబోలు న్యూ జస్టిస్ పార్టీ అమిత్‌కు ఒక వెండి సెంగోల్‌ను బహూకరించింది. ఇకపై ప్రతీ ఊళ్లో బిజెపి నాయకులకు శాలువా కప్పడంతో పాటు చేతిలో యిత్తడిదో, రాగిదో సెంగోల్‌ పెట్టడం, వారు దాన్ని గాలిలో ఊపి మోదీ ఋణాన్ని ఓటర్లకు గుర్తు చేయడం ఆనవాయితీ కావచ్చు.    

ఇదంతా బహిరంగంగా కనబడేది. అండర్ కరంట్‌గా జరిగే ప్రయత్నాలను ఊహించవచ్చు. ఒక తమిళ శైవమఠంపై బిజెపి యింత ఆదరణ కురిపించడంలో కర్ణాటకతో పోలిక తేవాలి. ఇటీవలే జరిగిన కర్ణాటక ఎన్నికల కారణంగా లింగాయతు మఠాల సంస్థాబలం, ఆర్థిక బలం, రాజకీయ బలం పాఠకులందరికీ విదితమై ఉంటుంది. వాళ్లు తలచుకుంటే కాంగ్రెసును దింపి, బిజెపిని ఎక్కించ గలిగారు. బిజెపి తన ముఖ్యమంత్రిని మార్చాలన్నా, లింగాయత మఠాలేమంటాయో అని భయపడే పరిస్థితి. తమిళనాడులో యీ మఠాలు, అధీనాలకు ఎంత ప్రాబల్యం ఉన్నా అనేక దశాబ్దాలుగా ద్రవిడ రాజకీయాలు పూజావిధానాలకు వ్యతిరేకంగా సాగడం చేత వీటికి రాజకీయ ప్రాధాన్యత లేదు.

ఇప్పుడు బిజెపి వెల్లలార్లను తమిళనాడు లింగాయతులుగా మార్చడానికి చూస్తోందని అంచనా. ఈ అధీనాలకు ప్రాధాన్యత యివ్వడం ద్వారా దాని అనుచరులను తమకు అనుకూలంగా మార్చుకుని తమిళనాట బలపడదామని చూస్తోందని అనుకోవాలి. రేపోమాపో లింగాయతులకు యిచ్చినట్లే ఒసిలైన వెల్లలార్లకు కూడా రిజర్వేషన్ యిస్తామనే ప్రతిపాదన చేసినా ఆశ్చర్య పడనక్కరలేదు. ఇక బిసిల మాట కొస్తే, తమిళనాడులో అన్ని కులాల్లో భక్తులెక్కువ. ద్రవిడ పార్టీలు నాస్తికత్వం పేర మైనారిటీలను వాటేసుకుని, హిందువులపై ఎన్ని దాడులు చేసినా భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. రాజకీయంగా డిఎంకె, ఎడిఎంకెలను అభిమానించిన వారు కూడా, వ్యక్తిగత నమ్మకాలకు వచ్చేసరికి గుళ్ల చుట్టూ తిరుగుతారు. స్వామీజీలను, మఠాధిపతులను ఆదరిస్తారు.

ఒబిసి జనాభా ఎక్కువ ఉన్న ఆ రాష్ట్రంలో వారు అనుయాయులుగా ఉన్న స్వాములు ఎందరో ఉన్నారు. ఉదాహరణకి ‘అమ్మ’ బంగారు అడిగళ్ స్వామి లక్షలాదిమంది భక్తులున్నారు. తిరుచ్చి ప్రాంతంలో కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి. 2021 ప్రాంతంలో ఆయన భార్య, కుమారుడు స్థానిక ఎన్నికలలో పోటీ చేశారు. ఆ సంవత్సరంలోనే ఆయన, మోదీ చెన్నయ్‌లో కలిశారు. ఈయనలాగే వెల్లూరులో స్వర్ణలక్ష్మి ఆలయం కట్టిన ‘నారాయణి అమ్మ’ ఉన్నారు. ఇలా కనీసం 25, 30 మంది స్వాములుంటారు. చివరకు నిత్యానంద స్వామికి కూడా లక్షలాది అనుయాయులున్నారు. రెండు ద్రవిడ పార్టీలకు అనుయాయులుగా చీలిపోయిన బిసిలను యీ స్వామీజీల రూటులో బిజెపి తనవైపు ఆకర్షించే ప్రయత్నం చేయవచ్చనే ఊహ తప్పకుండా పస్తోంది. దాని కోసమే సెంగోల్‌కు యింత వైభవం! లేని చరిత్రను కూడా సృష్టించడం! (ఫోటో – నెహ్రూ సెంగోల్ స్వీకరణ, అధీనాధిపతులతో మోదీ, క్రితం వారం వెండి సెంగోల్ స్వీకరిస్తున్న అమిత్ షా)

– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2023)

[email protected]

 

 

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా