Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ కథ: ప్రేతచిత్రం

ఎమ్బీయస్ కథ: ప్రేతచిత్రం

"మేడమ్ ఇప్పటిదాకా చెప్పిన కథలో విక్రమ్ అనే పెయింటర్ పరిశీలనాశక్తి గురించి చెప్పారు కదూ, నాకు తెలిసున్న ఒక పెయింటరు గురించి చెప్తాను వినండి. ఆయనకున్న శక్తి మరెవ్వరికీ ఉందనుకోను." అంటూ కథ చెప్పడం మొదలు పెట్టారు ముఖ్యమంత్రిణితో బాటు వచ్చిన ఆవిడ పర్శనల్ ఫిజిషియన్.

‘అవి నేను ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేసే రోజులు. హాస్పటల్లో కాజువాలిటీ వార్డు చూసేవాణ్ని. ఏక్సిడెంట్లో కాళ్లు, చేతులు విరిగిన వాళ్లూ, మతకలహాల్లో బుర్రబద్దలు కొట్టించుకున్నవాళ్లు, ఎమర్జన్సీ కేసులు అన్నీ ముందు నేనే చూడాల్సి వచ్చేది. నా కళ్లెదురుగా, వైద్య సహాయం అందేలోపునే ఎంతో మంది ప్రాణాలు పోయేవి. మనస్సంతా వికలంగా ఉండేది. అందువల్ల ఇంటి దగ్గర ప్రైవేటు ప్రాక్టీసు ఏమీ పెట్టుకోకుండా పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, ఆర్ట్ ఎగ్జిబిషన్లకు వెళ్లడం.. ఇలా కాలక్షేపం చేసేవాణ్ని.

అందుకనే మా ఎదురింట్లో ఎవరో ఆర్టిస్టు చేరేరంటే చాలా ఉత్సాహంగా చూడడానికి వెళ్లాను. మురళీధరం అని పెద్దాయనే, అరవైకి దగ్గరగా వయస్సుంటుంది. నల్లటి మనిషి, పెద్ద పెర్సనాలిటీ, నడినెత్తిన బట్టతల, చుట్టూ తెల్లవెంట్రుకలు అవీ బాగా పొడుగ్గా, గిరజాలు తిరిగి.. చూడగానే కాస్త భయం వేసింది. నేను డాక్టర్నని తెలియగానే చాలా మర్యాద చేసి కుటుంబసభ్యుల నందరినీ పరిచయం చేసాడు. భార్య చక్కనిదే. ఆయన కంటె బాగా చిన్నగా కనబడుతోంది. మొదటి భార్య పోతే మరదల్ని కట్టుకున్నాడని తర్వాత తెలిసింది. మరి ఆవిడకి పుట్టినవాళ్లో, వాళ్ల అక్కకి పుట్టినవాళ్లో కానీ ఇద్దరు ఆడపిల్లలు. డిగ్రీలు చదువుతున్నారు.

"బొమ్మలు చూద్దామని వచ్చాను, మీ కభ్యంతరం లేకపోతే" అన్నాను. "చూడండి, దాని కేముంది? కానీ మీకు నచ్చకపోవచ్చు. నావి ఆహ్లాదం కలిగించే బొమ్మలు కావు." అన్నాడాయన సీరియస్ గానే. "జీవితంలో లాగానే కళలో కూడా అన్ని రసాలూ ఉండాలిగా." అన్నాను. "మీ ఇష్టం" అంటూ చూపించేడు కొన్ని పెయింటింగ్స్ అన్నీ బీభత్సరసం ఉట్టిపడేట్లా ఉన్నాయి. వర్ణనలు వద్దన్నారు కాబట్టి వదిలేస్తున్నాను కానీ అవన్నీ చాలా 'బిజార్' గా ఉన్నాయని చెప్పక తప్పదు.

"అన్నీ ఇలాటివేనా? హ్యూమన్ ఫిగర్స్ ఏవీ వేయరా?" అన్నాను. "వేశాను. కానీ మోడల్స్ పెట్టుకుని వేయను. నాకు ఎలా వేయాలని తోస్తే అలా వేస్తాను. ఆ మనుష్యులను నేను కలిసినా, కలవకపోయినా నాకు వెయ్యాలనిపిస్తే చాలు. వేసేస్తాను." అంటూ కొన్ని పోర్ట్రయిట్లు చూపించేడు. గాంధీ, నెహ్రూ దగ్గర్నుంచి అనేక మంది బొమ్మలు ఉన్నాయి. పోలికలు బాగా వచ్చాయి. హైదరాబాదులో పేరు కెక్కిన దాత ఒకాయన పెయింటింగు అద్భుతంగా కుదిరింది. "ఇది చాలా బాగుంది. ఆయనకు ఇవ్వలేకపోయారా? సంతోషించేవాడు. బాగా ముట్టచెప్పేవాడు కూడాను. నాకు బాగా తెలుసు. కళంటే చెవి కోసుకునేవాడు." "తెలుసు. కానీ నేనీ బొమ్మ వేసేటప్పటికి ఆయన పోయేడు. నిజం చెప్పాలంటే ఆయన పోయిన తర్వాతనే నేనీ బొమ్మ వేసాను." అన్నాడాయన నిర్లిప్తంగా.

"భలేవారే." అంటూ చుట్టూ చూస్తున్నప్పుడే నాకు తట్టింది అక్కడున్న బొమ్మలన్నీ చచ్చిపోయిన వారివేనని. "నెహ్రూ గారి ఫోటో ఎప్పుడు వేసారు?" అని అడిగేను. "ఆదా? ఆయన పోయిన తర్వాతనే. ఒక ఫ్రెండు ఆటోగ్రాఫ్ పుస్తకం తెచ్చాడు. దానిలో ప్రముఖుల సంతకాలన్నీ ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత వాళ్ల వాళ్ల బొమ్మలు వేయాలనిపించింది. వేసాను." "బతికుండగా వేసి వాళ్లకు ప్రెజెంటు చేస్తే బాగుండేదిగా." "ఏమో, నాకు వేయాలనిపించదనుకుంటా. ఒక ఇన్స్పిరేషన్ లేనిదే బొమ్మ గీయలేను నేను." అన్నాడు.'

"డాక్టరు గారూ, మీరు చెప్తున్నది వింటూంటే సత్యజిత్ రాయ్ కథ ఒకటి గుర్తొస్తోందండి. దాన్లో కూడా ఒక పెయింటరు చచ్చిపోయిన వాళ్ల బొమ్మలే వేస్తూంటాడు. చూడ్డానికి వెళ్లిన వాడి బొమ్మ కూడా వాటిల్లో ఉంటుంది. ఇంటికొచ్చాక వాడు కూడా చచ్చిపోతాడనుకుంటాను. సరిగ్గా గుర్తు లేదు." అన్నాడు ఒక శ్రోత.

"మహానుభావా, నేను బతికే ఉన్నాను. ఇంతకుముందు కూడా ఎవర్తోనో చెప్తూ ఉంటే వాళ్లూ అన్నారీ మాట. తర్వాత జరిగిన కథ వింటే నేనా కథను కాపీ కొట్టి చెబుతున్నానో, నా స్వానుభవంతో చెబుతున్నానో మీకే తెలుస్తుంది." అని డాక్టరు అతనికి సమాధానం చెప్పి కథ కొనసాగించాడు.

'నేను వాళ్లింటి నుండి వచ్చేసేటప్పుడు నా రాకకు గుర్తుగా ఏదైనా బొమ్మ, కనీసం స్కెచ్, వేసి ఇమ్మని కోరాను. "నేను ముందే చెప్పానుగా, అడిగితే వేసి ఇవ్వలేనని. నాకు ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడే, అదీ నాకు తోచిన విధంగా వేస్తాను. అసలలాటి మనుష్యులు ఉన్నా, లేకపోయినా, నాకు తెలిసినా, తెలియకపోయినా సరే. అయినా మీరు కోరినట్లు ఓ స్కెచ్ వేసి ఇస్తాను. మీరు మా ఇంటికి వచ్చి షేక్‌హాండ్ ఇచ్చినప్పుడే నాకు ఒక రకమైన అనుభూతి కలిగింది. అందుకే వేసి ఇస్తున్నాను." అంటూ ఆయన ఒక స్కెచ్ వేసి ఇచ్చాడు. ముసలమ్మది. ఎక్కడో చూసినట్టనిపించింది. చిత్రకళలో ఉన్న అద్భుతమేమో ఆది, జీవం ఉట్టిపడుతూ, నిజమైన మనిషిని చూసినట్టుగా ఉండడమే ఆర్టిస్టు కళాకౌశలానికి నిదర్శనం కాబోలు. థాంక్స్ చెప్పి బయటపడ్డాను. ఆ రోజు రాత్రి నిద్రపట్టక దొర్లుతూంటే ఆ బొమ్మలో ముసలమ్మను ఎక్కడ చూసానో గుర్తుకువచ్చింది. ఆవేళ ఆసుపత్రిలో నేను ట్రీట్ చేస్తూండగా చచ్చిపోయినామె ఆవిడే. అంటే మురళీధరం గారి ఆనవాయితీ తప్పలేదన్నమాట. చచ్చిపోయిన వాళ్ల బొమ్మలు వేయడమే పనిలా ఉంది ఆయనకు. కానీ ఆవిడ ముఖం ఈయనెలా తెలిసిందో? గాంధీ, నెహ్రూ అంటే వాళ్ల మొహాలు అందరికీ తెలుసు. మరి ఈవిడ ముఖం? ఏమో!

ఆ తర్వాత వాళ్లింటికి ఎప్పుడు వెళ్లినా ఇదే కథ. నా చేతులు తగలగానే ఆయనకు ఇన్స్పిరేషన్ రావడం, రేఖాచిత్రం గీయడం, చూస్తే అవేళ నేను హేండిల్ చేసిన మృతుడిదే బొమ్మ కావడం. కాకతాళీయమేమో ననుకోడానికి వీలు లేకుండా, నేను నేను రకరకాల ప్రయోగాలు చేసాను. ప్రతీసారీ ఇదే జరిగింది. నాకు ఒకలా భయం వేయసాగింది. కారణం ఏమిటాని ఆలోచించాను. చనిపోయినవాడి తాలూకు ఆత్మో, స్పిరిటో, మరోటో నాలో ఆవహించి, నేను షేక్‌హేండ్ ఇచ్చినప్పుడు మురళీధరానికి దాని తాలూకు స్పృహ అనుభవంలోకి వచ్చి బొమ్మలు గీయిస్తోందేమో ననిపించింది. ఆటోగ్రాఫ్‌లు కూడా అలాటివే కదా. వాళ్ల దస్తూరీ తాకినప్పుడే ఈయనకు ఇన్స్పిరేషన్ వచ్చి నాయకుల తాలూకు బొమ్మలు వేసి ఉండవచ్చు. ఆలోచించిన కొద్దీ ఇదంతా ఎందుకొచ్చిన గోల అనుకున్నాను. వాళ్లింటికి వెళ్లడం క్రమంగా తగ్గించివేశాను. దీని వల్ల ఆయనకు గానీ, నాకు గానీ కలిగే ప్రయోజనం లేదు. శవాల గోల మర్చిపోదామని కళ నాశ్రయిస్తే, అక్కడా మృతుల చిత్రాలు చూడాలంటే చికాకు గాదూ!

ఒకరోజు నా పేషంటు ఒకతను మంచి బోటనీ స్టూడెంటు ఉంటే స్కాలర్షిప్ ఇస్తానని నాతో అన్నాడు. మురళీధరం గారి పెద్దమ్మాయి బోటనీ స్టూడెంటే కాబట్టి ఆ అమ్మాయి చేత అప్లయి చేయిద్దామని వాళ్లింటికి వెళ్లాను. అమ్మాయి లేదట. బోటనీ టూర్‌లో వెళ్లి నెల్లాళ్లయిందట. "ఈ టైములో టూర్ ఏమిటండీ? అదీ నెల్లాళ్లా?" అని ఆశ్చర్యపడ్డాను. "ఇంటి విషయాలు నేనస్సలు పట్టించుకోను. అదంతా మా ఆవిడ డిపార్ట్‌మెంటే. ఆ మాట కొస్తే నా బొమ్మలు మార్కెట్ చేయడం కూడా ఆవిడ పనే. నాకు తోచినవి గీసుకోవడమే నేను చేసే పని." అన్నాడు మురళీధరం. అంటూనే స్కెచ్‌బోర్డ్ దగ్గరికి వెళ్లాడు. "ఏమైనా బొమ్మ వేయాలనిపిస్తోందా ఏమిటి?" అన్నాను కాస్త ఆందోళనగానే, "అవునండి. అలా అనిపించాక వేసేదాకా ఉండలేను." అంటూ ఆయన ఆయన త్వరత్వరగా వేసేసేడు. ఒక అందమైన యువకుడి బొమ్మ అది. అప్పటికే నేనాయనకు చెప్పాను నా అనుభవాల సంగతి. 'మీ చేత ఇలాటి బొమ్మలు వేయించకూడదనే నేను రావడం తగ్గించుకుంటున్నా'నని కూడా చెప్పాను. ఆయనా గిల్టీగా ఫీలయ్యేడు కానీ ఏం చేయలేకపోయాడు.

ఇవాళ బొమ్మ పూర్తి చేస్తూనే ఆయనా పెద్ద రిలీఫ్‌గా ఫీలయ్యేడు. "హమ్మయ్య, జింక్స్ ఏదైనా ఉంటే అది తొలగిపోయినట్టుందండి. ఇది మీ చేతుల్లో ప్రాణాలు విడిచిన వాళ్ల బొమ్మ కాదు. అనుకోకుండా మా బంధువుల అబ్బాయి బొమ్మ వేసేశాను. ఇతను మా మిసెస్ మేనత్త కొడుకు. బాగా కుర్రాడిలా కనబడతాడు కానీ మా ఆవిడ కంటే రెండు, మూడేళ్లే చిన్న. పెళ్లి చేసుకోలేదు. 'మొదట జీవితంలో స్థిరపడాలి' అంటూ దుబాయి వెళ్లాడు. అక్కడే ఉంటున్నాడు. అనుకోకుండా అతని బొమ్మ వచ్చేసింది నా చేతిలోంచి. పోన్లెండి, అతను ఈ సారి వచ్చినప్పుడు ప్రెజెంటు చేస్తాను. సంతోషిస్తాడు." అన్నాడు ఆయన సంతోషంగా, "నాకూ సంతోషంగానే ఉందండి. బొమ్మ నాకు ఇస్తే, నేను జిరాక్స్ చేసుకుని పంపించేస్తాను. మీరు వేసిన అరుదైన బొమ్మ అని గుర్తుపెట్టుకోడానికి బాగుంటుంది." అన్నాను చేయి చాస్తూ. 'అరుదైన అంటే 'బతికివున్నవాళ్ల' అని అర్థమా?" అంటూ ఆయన పెద్దపెట్టున నవ్వాడు. ‘...అయినా నేను అంత పెద్ద చిత్రకారుణ్ని కానండి. నేను వేసిన బొమ్మలు ఆక్షన్‌లో అమ్ముడుపోడానికి. మీరు ఫలానా వారి అరుదైన బొమ్మ అని చెప్పినా, ఎవరూ కొనరు." అన్నాడాయన స్వచ్ఛంగా నవ్వుతూ.

ఆయన మాటల గురించి రాత్రి ఆలోచిస్తూ ఉంటే ఆ రోజు నేను హేండిల్ చేసిన కేసు గుర్తుకు వచ్చింది. మార్చురీ చూసే ఆయన రాకపోతే ఒక శవం పోస్టుమార్టమ్ చేయాల్సివచ్చింది. యువకుడి శవమే. గుర్తు తెలియకుండా మొహం చెక్కేశారు. కక్ష తీర్చుకోడం కూడా చాలా దారుణంగా తీర్చుకున్నా రనిపించింది. పొట్టలో ఎన్నోసార్లు కత్తితో పొడవడం జరిగింది. ఒకవేళ మురళీధరం గారు వేసిన బొమ్మ అతడిది కాదు కదా! ఆవేళ నా చేతుల్లో పడ్డ శవం అతనొక్కడిదే. కానీ అతను దుబాయ్ లో ఉన్నాడన్నారు. ఒకవేళ తిరిగివచ్చాడేమో. వీళ్లకి తెలియదేమో శవం గురించి పోలీసులకు అంతుపట్టకుండా ఉంది. ఎవరిదో గుర్తించలేకపోయారు. వీళ్ల తాలూకు మనిషని తెలిస్తే పాపం, తీసుకెళ్లి అంత్యక్రియలు చేయిస్తారేమో. వెంటనే మురళీధరం గారికి ఫోన్ చేసాను. ‘కేశవరావు (ఆ అబ్బాయి పేరుట) దుబాయ్‌లో ఉన్నట్టు కచ్చితంగా తెలుసా?’ అని అడిగాను. తెలుసుట. మురళీధరం గారి భార్య  ముందురోజే అతనితో ఫోన్లో మాట్లాడిందట. "అలాగా" అన్నాను. "ఏమిటి డాక్టరు గారూ, చాలా నిరాశపడ్డట్టుగా ఉన్నారు! చెప్పానుగా, నాకు ఆ జిన్క్‌స్ వదిలిపోయిందని. ఇక చూడండి. రకరకాల బొమ్మలు వేసి పేరు తెచ్చుకుంటాను." అన్నాడాయన.

మర్నాడు పోలీసు ఇన్స్పెక్టర్ కలిసినప్పుడు నాకు బొమ్మ విషయం గుర్తొచ్చింది. ఏమైతే అదే అయిందని అతన్ని పిలిచి, "చూడండి. ఈ శవం ఫలానా కుర్రాడిదేమో కనుక్కోండి. దుబాయ్‌లో ఉన్నాడంటున్నారు. కానీ.. ఐ డౌట్. కనుక్కుని ఏ విషయం చెప్పండి." అన్నాను. "డాక్టరు గారికి ఏమైనా క్లూ దొరికిందా? లేకపోతే మమ్మల్ని ఆటలు పట్టిస్తున్నారా?" అన్నాడతను. అన్నాడే గానీ నా మీద గౌరవం కొద్దీ ఆ ఫోటో పోలీసు స్టేషన్లకు, పాస్‌పోర్టు ఆఫీసుకీ పంపి వాకబు చేయించాడు.

దాంతో చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఆ శవం కేశవరావుదే. అతను దుబాయ్ నుంచి వచ్చి నెల దాటింది. కిరాయి రౌడీల చేత అతన్ని దారుణంగా చంపించి, గుర్తు తెలియనీకుండా మొహం చెక్కించేసినది మురళీధరం భార్యే! పోలీసులు ఆమెను అరెస్టు చేసి తీసుకెళ్లాక మురళీధరాన్ని పరామర్శించడానికి వెళ్లాను. బాధపడుతూంటా డనుకున్నాను కానీ మరీ అంత ఘోరంగా ప్రతిస్పందిస్తాడనుకోలేదు. కుడిచేయి మోచేతి దాకా తెగ్గోసేసుకున్నాడు!

కథ వింటూన్న వాళ్లందరూ ఒక్కసారిగా "అబ్బ" అనడంతో "డాక్టరు గారి కథలో బీభత్సరసం పాలు ఎక్కువయినట్టుంది." అన్నారు ముఖ్యమంత్రిణి.

"ఏం చేయమంటారు మేడమ్, జరిగిన వాస్తవాలివి. ఆ మొఖం చెక్కేసిన శవం, ఈయన మొండి చెయ్యి దృశ్యాలు నన్ను చాలాకాలం వెంటాడేయి. అవేళ నేను అడిగాను కూడా 'ఏమిటీ ఘోరం?' అని.

"నా కంటే బాగా చిన్న వయస్సు భార్యను చేసుకోవడం వల్లనే కదా డాక్టర్, ఇంత అనర్థం జరిగింది. ఆమె అతని ప్రేమలో పడింది. చెప్పానుగా మేనత్త కొడుకని. చిన్నప్పటినుంచీ మచ్చిక. ఎవరూ అనుమానించరు. దుబాయి తీసుకుపోతానని ఆశ పెట్టి, అనుభవించినంత కాలం అనుభవించి వేరెవరినైనా చూడు, పెళ్లాడతానన్నాడు లాగుంది. కసి పుట్టి, భీకరంగా చంపించేసింది."

"ఆవిడ సంగతి సరే, మీరెందుకు చెయ్యి.."

"డాక్టరుగారూ, నా భార్య తిరుగుబోతై దాని కంటె కుటుంబం పరువు పోయిందన్న బాధే ఎక్కువగా ఉంది నాకు. ఇన్నాళ్లూ వాడు ఈవిడతో వేషాలేసాడు. ఎవరికీ తెలియలేదు. గొడవలేదు. ఒకవేళ నాకు మరోలా తెలిసినా, బాధపడినా, పరువు బజార్న పడేసుకోవడం ఇష్టం లేక గోల చేసేవాణ్ని కాదు. ఇంట్లోనే ఉంచి దూరంగా మసిలేవాణ్నేమో! వాడి మీద పగ సాధించాలన్న కోపంలో కూడా ఈవిడకీ ఆ స్పృహ ఉన్నట్టుంది. శవాన్ని గుర్తు పడితే తనూ బయటపడతానన్న భయం ఉంది కాబోలు. అందుకే మొహం చెక్కించేసింది. అక్కడితో విషయం ఆగి ఉంటే ఎవరికీ తెలిసేది కాదు. కానీ, యిదిగో నా బొమ్మలు వేసే అలవాటు వల్లనే కదా, ఇదంతా బయటకు వచ్చింది. కుటుంబం పరువు బజారు కెక్కింది. ఇప్పుడు మా అమ్మాయిలను ఎవడు పెళ్లాడతాడు? నేనింకా బొమ్మలు వేస్తూ ఉంటే ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో! చెయ్యంటూ ఉంటే బొమ్మ గీయకుండా నిలవనీయదు నా ఆవేశం. అందుకే చెయ్యి తీసిపారేశాను." అన్నాడాయన ఏడుస్తూ.

'అయితే ఈ అఘాయిత్యంలో నాకూ పాలు ఉందన్నమాట.' అనుకుంటూ వాళ్లింటికి వెళ్లడం మానేసాను."

"డాక్టరు గారూ, ఓ చిన్న సలహా. ఏదైనా విషయం కథలా చెప్పేటప్పుడు పొయెటిక్ జస్టిస్ ఉండాలండి. విచ్చలవిడిగా తిరిగిందేమో మురళీధరం భార్య, దండనేమో మురళీధరానికి! నిజానిజాలెలా ఉన్నా.. " అని చెప్పబోయాడు ఓ పత్రికా రచయిత. అతను కథలు కూడా రాస్తూ ఉంటాడు.

"పూర్తిగా విన్నాక పొయెటిక్ జస్టిస్ గురించి ఆలోచించి చెప్పండి. వారం తర్వాత మురళీధరం భార్య బెయిల్ మీద ఇంటికి వచ్చింది. ఆవేళ సాయంత్రమే ఆయన పెద్దకూతురు నా వద్దకు వచ్చింది. "డాక్టరు గారూ, మీరోసారి మా ఇంటికి వచ్చి మా నాన్నకు సముదాయించి చెప్పాలండి. మా అమ్మను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు." అంది.

"ఆయన బాధ ఆయనది." అన్నాను ఏమనాలో తెలియక.

అమ్మాయి తలవంచుకుంది. "అసలు తప్పంతా నాదండి. కేశవరావుకి, అమ్మకి ఏ సంబంధమూ లేదు. అతను దుబాయ్ నుండి వచ్చాక మా ఇంటికి వచ్చాడు. మా నాన్న ఊళ్లో లేడు. అతను చెప్పిన మాయమాటలు విని, అతని డబ్బు చూసి బుట్టలో పడిపోయాను. అతనితో కలిసి బెంగుళూరు వెళ్లిపోయాను... అదే.. లేచిపోయాననుకోండి. మా నాన్నకి తెలిస్తే బాధపడతారని నేను స్టడీ టూర్లో వెళ్లానని చెప్పింది అమ్మ. నా కోసం వెతికించింది. మా నాన్నకు లోకవ్యవహారాలు ఏవీ తెలియవు. అంతా అమ్మ చూడాల్సిందే. ఈ లోపుగా కేశవరావు నన్ను వదిలేశాడు. చాలా ఘోరంగా అవమానించాడు. ఇంటికి రావడానికి మొహం చెల్లక ఓ ఫ్రెండ్ ఇంట్లో ఉండి అమ్మకు కబురంపించాను. కేశవరావు బ్లాక్‌మెయిల్ కూడా చేస్తానన్నాడని విని అమ్మ మండిపడింది. కుటుంబం పరువు కాపాడ్డానికి కిరాయి రౌడీల్ని పెట్టించి... తర్వాత జరిగినది మీకు తెలిసిందే కదా." ఆమె ఆగింది.

నాకు నోట మాట రాలేదు. అంతలోనే ఆ అమ్మాయి ఏడవసాగింది. "అమ్మంటే మా అమ్మ కాదు. పిన్ని. అంటే నేను తన సవతి కూతుర్నన్నమాట. అయినా నా కోసం అమ్మ ఇంత చేస్తే, నాన్న తనని పట్టుకుని తిట్టే తిట్లు..." అంటూ ఆ అమ్మాయి వెక్కి వెక్కి ఏడ్చింది. (వచ్చే నెల రెండో బుధవారం మరో అద్భుతరస యామిని కథ)

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?