Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: మృచ్ఛకటికమ్‌- 3

సరిగ్గా అప్పుడే వసంతసేన యింట్లోకి ప్రవేశించింది. దీపం వుంటే శకారుడి కంట పడతానని భయపడి, గట్టిగా వూది దాన్ని ఆర్పేసింది. 'అయ్యో గాలికి ఆరిపోయినట్లుంది, రదనికా, నువ్వు నడుస్తూ వుండు నేను దీపం వెలిగించుకుని తెస్తా' అంటూ మైత్రేయుడు లోపలకి వెళ్లాడు. రదనిక బయటకు వెళ్లగానే శకారుడు వసంతసేన అనుకుని ఆమె జుట్టు పట్టుకున్నాడు. 'ఇది మీకు తగునా?' అంది రదనిక. వసంతసేనే గొంతు మార్చి మాట్లాడుతోందేమోనని  శకారుడి అనుమానం. ఇంతలో మైత్రేయుడు దీపం పట్టుకుని వచ్చి శకారుడితో ''ఇది చారుదత్తుడి యిల్లు. మీరు అనుమతి లేకుండా వచ్చి, అతని దాసిని  యిలా పరాభవించడం తగదు.'' అన్నాడు. శకారుడి తరఫున విటుడు 'ఎవరో అనుకుని పొరపాటు పడడం వలన యిలా జరిగింది, ఏమనుకోకు' అంటూ క్షమాపణ చెప్పుకున్నాడు. 

శకారుడు విటుడిపై మండిపడ్డాడు - 'ఎవడా చారుదత్తుడు? వాడి కోసం క్షమాపణ చెప్పుకోవలసిన అవసరం వుందా?' అని. అప్పుడు విటుడు చెప్పాడు - 'అతని తాత తండ్రులు వ్యాపారస్తులు కావడం చేత చారుదత్తుడూ ధనవంతుడే. మా వంటి యాచకుల కోరికలు తీర్చితీర్చి సంపదలు పోగొట్టుకున్నాడు. ఎవరేం అడిగినా కాదనేవాడు కాడు. ఇప్పుడు డబ్బు లేకపోయినా అతని గుణగణాలు చూసి అందరూ గౌరవిస్తారు. అతనితో పోలిస్తే మనలాటి వాళ్లది ఒక బతుకే కాదు. పద పోదాం' అని. 'ఈ యింట్లోకి వెళ్లి దాక్కున్న వసంతసేనను పట్టుకోకుండా నేను కదలను' అన్నాడు శకారుడు. 'ఆమె అనురాగానికి లొంగుతుంది, బెదిరింపులకు లొంగదు, నీకు ఎంత చెప్పినా అర్థం కావటం లేదు, నేను వెళ్లిపోతా' అని విటుడు వెళ్లిపోయాడు. అప్పుడు శకారుడు మైత్రేయుడి ద్వారా చారుదత్తుడికి హెచ్చరిక పంపాడు. 'వసంతసేనను నాకు అప్పగించి నా స్నేహం పొందమని చారుదత్తుడికి చెప్పు, లేకపోతే నాతో ఆజన్మవైరం ఏర్పడుతుందని కూడా చెప్పు. నేను ఎక్కువకాలం వేచి వుండే రకం కాదు, వెంటనే తేలిపోవాలి.' అని చెప్పి వెళ్లిపోయాడు. ఈ విషయాలేవీ చారుదత్తుడితో చెప్పవద్దని మైత్రేయుడు రదనికను హెచ్చరించాడు. రదనిక సరే అంది. 

ఈ లోగా వసంతసేన యింట్లోకి వెళ్లింది. మసక చీకట్లో చారుదత్తుడు ఆమెను రదనికగా పొరబడి తన కొడుకు రోహసేనుణ్ని చూపించి ''ఇదిగో రదనికా, చల్లగాలికి వీడికి జలుబు చేస్తుంది. లోపలకి తీసుకెళ్లి యిదిగో, యీ ఉత్తరీయం కప్పు.'' అని అంతకుముందే మైత్రేయుడు తనకు తెచ్చియిచ్చిన  జాజిపూల వాసనగల ఉత్తరీయాన్ని యిచ్చాడు. వేశ్యపుట్టుక చేత గృహస్తుల యిళ్లలోకి వెళ్లే భాగ్యం లేని నాకు యిది ఒకరకంగా అదృష్టమే అనుకుంటూ ఆమె పిల్లవాణ్ని ఎత్తుకుని లోపలకి వెళ్లింది. ఇంతలో మైత్రేయుడు, రదనిక యింట్లోకి వచ్చారు. చారుదత్తుడు కంగారుపడ్డాడు. ఈమె రదనిక అయితే మరి ఆమె ఎవరు? అని. వసంతసేన మళ్లీ గదిలోకి రావడంతో 'శరన్మేఘం కప్పిన చంద్రరేఖలా వుంది, పరకాంతను యింత యిదిగా చూడడం తప్పు' అనుకున్నాడు. మైత్రేయుడు అది గ్రహించి 'ఈమె వేశ్య కాబట్టి పరకాంత కాదు, మదనోత్సవం నాటి నుంచి నీవంటే అనురక్తురాలు కాబట్టి పరాయిది కాదు' అని అనునయించాడు. 

'ఓహో వసంతసేనా!? వైభవం తరిగిపోయిన తర్వాత ఏ కాంతమీద నైనా నాకు ప్రేమ కలిగిందంటే అది యీమెపై మాత్రమే, కానీ  తీరే అవకాశం లేదు కాబట్టి పేదవాడి కోపంలా అది నాలోనే అణగిపోవాలి.' అనుకున్నాడు. ఆమెతో 'నిన్ను దాసి అనుకుని పనులు చెప్పినందుకు మన్నించు' అన్నాడు. 'కాదు, కాదు, వేశ్యనై వుండి కూడా మీ వంటి గృహస్థుల యింట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించినందుకు మీరే నన్ను మన్నించాలి' అంది వసంతసేన. 'పోనీలే, తప్పొప్పుల ప్రసక్తి ఎందుకు, మన స్నేహం వర్ధిల్లుగాక' అన్నాడు చారుదత్తుడు. ఆ మాటలకు ఆమె సంతోషించింది. మళ్లీమళ్లీ వాళ్ల యింటికి రావడానికి అవకాశం కల్పించుకోవడానికి తన నగలు తీసి ఒక పాత్రలో పెట్టి 'బయటకు వెళితే ఆ శకారుడు నన్ను వెంటాడతాడు. అందువలన మీ యింట్లో దాచవలసినదిగా కోరుతున్నాను.' అంది. 

'మా యిల్లు చూశావు కదా, పాడుపడి వుంది.' అని అభ్యంతరం తెలిపాడు చారుదత్తుడు. 'గృహస్థు గుణం చూసి వస్తువులు దాచుకుంటారు తప్ప యింటి గట్టిదనాన్ని చూసి కాదు' అంది వసంతసేన. 'సరే, మైత్రేయా, అది తీసుకుని, ఆమెను యింటి వద్ద దింపి రా' అన్నాడు చారుదత్తుడు. 'నయం, యీ అందగత్తెతో బాటు వెళితే వీధిలో ప్రజలు నన్ను తినేస్తారు, కావాలంటే నువ్వే వెళ్లు' అని అతను తప్పించుకున్నాడు. సరే అని చారుదత్తుడు వసంతసేనను వెంటపెట్టుకుని బయలుదేరాడు. మైత్రేయుడు వెంట వచ్చాడు. వసంతసేనను ఆమె యింటికి దింపి యిద్దరూ తిరిగి వచ్చారు. ఇల్లు చేరాక చారుదత్తుడు మైత్రేయుడితో 'నగలపాత్ర భద్రం సుమా, పగటి వేళ వర్ధమానుడు, రాత్రి నువ్వు దాన్ని కాపాడండి' అని ఏర్పాటు చేశాడు. పది అంకాల యీ నాటకంలో మొదటి అంకం దీనితో పూర్తయింది.

రెండో అంకం వసంతసేన యింట్లో ప్రారంభమైంది. ఆమె, ఆమె వద్ద పనిచేసే మదనిక యిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. మదనిక 'నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు కదా' అంటూ ప్రారంభించి ఆమె మనసులో మాట బయటపెట్టించింది. చారుదత్తుణ్ని ప్రేమిస్తున్నానని వసంతసేన అనగానే అతని వద్ద డబ్బు లేదు కదా అంది. 

'అది నాకు ముఖ్యం కాదు, డబ్బుండగా ప్రేమిస్తే వేశ్యను కాబట్టి దానికోసమే ప్రేమించానని మాట పడేదాన్ని'

'నువ్వు అతన్ని కామించి వుంటే అతని వద్దకు వెళ్లవలసినది కదా' 

'నేను వెళితే నాకు  అతను బహుమతులు యివ్వవలసి వస్తుంది. కానీ డబ్బు లేదు కాబట్టి జంకు చేత దూరమై పోతాడు.' 

'ఓహో, అందుకనేనా నీ నగలు అతని వద్ద దాచి వుంచి ఆ మిష మీద వెళ్లి వస్తూంటావా?'

'బాగానే గ్రహించావే' అంది వసంతసేన మెచ్చుకుంటూ. (సశేషం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు  2015)

[email protected]

Click Here For Archives

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా