Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: ప్రచండ నేపాళం

ఎమ్బీయస్‍: ప్రచండ నేపాళం

జనసేన-టిడిపి పొత్తుకు పవన్ అభిమానులు ఓటేయాలంటే పవన్‌కు సగం టర్మ్ అయినా ముఖ్యమంత్రిగా ప్రకటించాలని నేను రాస్తే ‘అలాఎలా  కుదురుతుంది? జనసేనకు టిడిపి కంటె తక్కువ సీట్లు వస్తాయి కదా’ అని కొందరు వాదించారు. ఏకనాథ్ శిందే, దేవెగౌడ ఉదాహరణలు చూపినా వారికి నచ్చలేదు. ఇప్పుడు కళ్లెదురుగా నేపాల్‌ పార్లమెంటులో 275 సీట్లుంటే కేవలం 32 సీట్లతో ప్రచండ ప్రధానమంత్రి అయిన తీరు కనబడుతోంది. కానీ అది మూణ్నాళ్ల ముచ్చట కావచ్చని యివాళ్టి తాజా వార్త. మార్చి 9 నాడు దేశాధ్యక్ష పదవికి ఎన్నిక జరగబోతోంది. ఫిబ్రవరి 25లోపున నామినేషన్ వేయాలి. తను చెప్పిన అభ్యర్థినే నిలబెట్టాలని ప్రచండను ప్రధానిగా చేసిన ఓలి (అతని పార్టీకి 78 సీట్లున్నాయి) పట్టుబడుతున్నాడు. అలా కాదు, కూటమి సభ్యులందరూ అంగీకరించిన వారినే పెట్టాలని ప్రచండ పట్టుబడుతున్నాడు. ఇద్దరి మధ్య గొడవలు ముదురుతున్నాయని యివాళే పేపర్లలో వచ్చింది. డిసెంబరులో ఏర్పడిన ప్రభుత్వం మార్చి దాకా ఉంటుందో లేదో ఎవరూ చెప్పలేని పరిస్థితి.

పార్లమెంటులో మొత్తం 275 సీట్లుంటే ప్రచండ పార్టీ ఐన సిపిఎన్ (ఎంసీ)కి ఎన్నికల్లో వచ్చినవి 11% ఓట్లు, 32 సీట్లు. ఎన్నికల్లో అతని భాగస్వామిగా నిలిచిన నేపాలీ కాంగ్రెసు (ఎన్‌సీ) కు వచ్చినవి 89 సీట్లు! ఇంకా కొందర్ని కలుపుకుందాం, తొలివిడత ముఖ్యమంత్రి ఛాన్సు నాకివ్వమని ప్రచండ అడిగితే 76 ఏళ్ల ఎన్‌సీ అధ్యక్షుడు దేవ్‌బా ఒప్పుకోలేదు. దాంతో ప్రచండ బయటకు వచ్చేసి కెపి ఓలీ సారథ్యంలో ఉన్న 78 సీట్ల సిపిఎన్ (యుఎంఎల్)తో చేతులు కలిపాడు. ఇద్దరూ కలిసినా మెజారిటీ రాలేదు. మరో 5 పార్టీలను కలుపుకుని మొత్తం 165 మంది అండతో 2022 డిసెంబరులో సీటు ఎక్కేశాడు.

ప్రచండ తనతో 2020 వరకు కలిసి ఉంటూ తనతో తెగతెంపులు చేసుకుని, దేవ్‌బాతో చేతులు కలిపి తనకు వ్యతిరేకంగా పోటీ చేసినా, ఎన్నికల అనంతరం తన చేతిలో 78 సీట్లున్నా, 32 సీట్ల ప్రచండను ప్రధానిగా చేశాడు ఓలీ. 2023 జనవరిలో పార్లమెంటులో బలపరీక్షలో నెగ్గేట్లు చేశాడు కూడా. పగ్గాలన్నీ తన చేతిలోనే పెట్టుకుని నడపవచ్చు కానీ జూనియర్ పార్ట్‌నర్నే గద్దె నెక్కించాడు. అది గమనించాలి మనం. నేపాల్ రాజకీయాలు యిలాగే అఘోరిస్తాయి. శతాబ్దాలుగా నేపాల్ రాచరిక పాలనలో నడిచింది. పోనుపోను రాజుల చుట్టూ వివాదాలు పెరగడంతో రాజు జ్ఞానేంద్ర 2008లో దిగిపోయి నేపాల్‌ను రిపబ్లిక్‌ను చేసి యికపై ఎన్నికైన ప్రధానమంత్రులు, దేశాధ్యక్షులే పాలిస్తారన్నాడు. ఈ 15 ఏళ్లలో 12 మంది ప్రధానులు మారారు. వీరిలో రెండేసి సార్లు ప్రధాని అయినవారున్నారు. ప్రచండ కూడా గతంలో రెండుసార్లు ప్రధాని అయి 13వ వాడిగా మళ్లీ అయ్యాడు. ఒక ప్రధాని పదవీకాలం 82 రోజులే!

దేశజనాభా మూడు కోట్లే కానీ, 70 దాకా పార్టీలున్నాయి. కొన్ని రాచరికాన్ని సమర్థించేవి ఉన్నాయి. కొన్ని ప్రాంతీయత ఆధారంగా ఏర్పడ్డవి ఉన్నాయి. సరిహద్దు దేశం కాబట్టి చైనా, భారత్‌లు నేపాల్ వ్యవహారాల్లో తలదూరుస్తూ ఉంటాయి. దాంతో పార్టీలు అటూయిటూ మారుతూ గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంటాయి. సెంట్రిస్ట్, డెమోక్రాటిక్ పార్టీ ఐన నేపాలీ కాంగ్రెసు భారత్‌కు అనుకూలం. దీని అధినేత షేర్ బహదూర్ దేవ్‌బా. పేరులో కమ్యూనిస్టు ఉన్న సిపిఎన్ (యుఎంఎల్) – కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్), యుసిపిఎన్ (ఎమ్) – యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మార్క్సిస్ట్) చైనాకు అనుకూలం. మొదటిదానికి ఖడ్గ ప్రసాద్ ఓలీ అధినేత కాగా ప్రచండ రెండో దానికి అధినేతగా ఉండేవాడు. ఇప్పుడతను తన వర్గానికి సిపిఎన్ (ఎంసీ) – కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మార్క్సిస్ట్ సెంటర్) అని పెట్టుకున్నాడు. ఈ పేర్లు గుర్తు పెట్టుకోవడం కష్టం కాబట్టి అధినేతల పేర్ల మీదుగా గుర్తించడం మేలు.

ప్రస్తుతం ప్రధాని ఐన ప్రచండ చైనాకు అనుకూలుడు. అతనికి అక్కడ కూర్చోబెట్టి చక్రం తిప్పుతున్న ఓలీ కూడా చైనా పక్షమే. అందుచేత వీళ్ల గురించి వివరంగా తెలుసుకోవడం అవసరం. వాళ్ల కథతో పాటే నేపాల్ ప్రజాస్వామ్య పోకడలు కాస్త తెలుస్తాయి. ప్రచండ అనే బిరుదు సంపాదించుకున్న పుష్పకుమార్ దహాల్ 1954లో ఒక సామాన్య కుటుంబంలో పుట్టాడు. ఇతను అగ్రికల్చర్‌లో డిగ్రీ చేసి, స్కూలు టీచరుగా పని చేసే రోజుల్లో కమ్యూనిస్టు భావాలతో ప్రభావితుడై ఉద్యోగం మానేసి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (ఫోర్త్ కన్వెన్షన్) అనే నిషేధిత సంస్థలో చేరాడు. తర్వాతి రోజుల్లో దానిలోంచి మోహన్ బిక్రమ్ సింగ్ అనే నాయకుడు విడిపోయి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మసాల్) అనే పార్టీ పెట్టినపుడు దహాల్ అతన్ని అనుసరించాడు. 1984లో పార్టీ సెంట్రల్ కమిటీకి ఎన్నికయ్యాడు. ఆ పార్టీ విడిపోయినప్పుడు దహాల్ మోహన్ బైద్యా అనే నాయకుడితో పాటు బయటకు వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మషాల్)లో చేరాడు.

ఈ పార్టీ 1986లో ఒక హింసాత్మక సంఘటనలో పాలుపంచుకోవడంతో నేపాల్ పోలీసులు పార్టీ నాయకత్వాన్ని అరెస్టు చేశారు. బైద్యా రాజీనామా చేయడంతో దహాల్ పార్టీ జనరల్ సెక్రటరీ అయ్యాడు. భారతదేశం వచ్చి మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆధ్వర్యంలో బిహార్‌లో నడిచిన క్యాంపులో గెరిల్లా యుద్ధంలో తర్ఫీదు పొందాడు. తర్వాత మషాల్ గ్రూపు కూడా వదిలేసి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిటీ సెంటర్) అనే పార్టీలో చేరాడు. మన భారతీయ కమ్యూనిస్టుల లాగానే నేపాలీ కమ్యూనిస్టులు కూడా గ్రూపులుగా, పార్టీలుగా విడిపోవడంలో ఘనులు. ఈ పార్టీ కూడా ముక్కలుచెక్కలై చివరకు 1994లో దహాల్ నేతృత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు) పార్టీ తయారైంది. ఇది 1996లో పశ్చిమ నేపాల్‌లో రాజరికానికి వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాలు చేయసాగింది. అప్పుడే దహాల్‌కు ‘ప్రచండ’ అనే బిరుదు వచ్చి చేరింది. మొత్తం మీద 13 ఏళ్ల పాటు అజ్ఞాతజీవితం గడిపాడు.

జనజాతీలు, మాధేసీలు వంటి తెగలకు రాజకీయ హక్కులుండాలని వాదిస్తూ వారిలో యీ పార్టీ విస్తరించింది. పరిస్థితి యిలా వుండగా 2001లో నారాయణహితి ప్యాలెస్‌లో విందు జరుగుతూండగా మారణకాండ జరిగింది. రాజు బీరేంద్ర పెద్ద కొడుకు దీపేంద్ర పిచ్చెక్కినట్లు తుపాకీతో తండ్రిని, తల్లిని, సోదరుణ్ని, సోదరిని, అత్తలను, బాబాయిని మొత్తం 9మందిని కాల్చేసి, చివర్లో తనను కాల్చుకుని మూడు రోజుల తర్వాత ఆసుపత్రిలో చనిపోయాడు. అతను ఎందుకలా చేశాడో ఎవరికీ తెలియలేదు. ఈ ఘటన తర్వాత రాజైన రాజుగారి తమ్ముడు జ్ఞానేంద్ర యిదంతా చేయించాడని, దీపేంద్ర మాస్క్ పెట్టుకుని మరెవరో కాల్పులు జరిపారని పుకార్లు పుట్టాయి. ఎందుకంటే జ్ఞానేంద్ర అప్పుడక్కడ లేడు. ఉన్న అతని భార్య, కొడుకులకు ఏమీ కాలేదు. రాజుగా జ్ఞానేంద్ర, యువరాజుగా అతని కొడుకు పరాస్ చాలా చెడ్డపేరు తెచ్చుకున్నారు. ప్రజలకు రాజరికంపై అసహ్యం వేసింది.

అదను చూసి, ప్రచండ ప్రజాస్వామ్య పార్టీలతో చేతులు కలిపి 8 పార్టీల కూటమిగా ఏర్పరిచాడు. వీళ్లంతా జ్ఞానేంద్రకు వ్యతిరేకంగా 2006లో జన ఆందోళన్-2 పేరుతో తిరుగుబాటు చేశారు. జ్ఞానేంద్ర వీళ్లతో రాజీకి వచ్చి రాజరికం స్థానంలో ప్రజాస్వామ్యం ఏర్పడ్డానికి ఒప్పుకున్నాడు. 2008లో పార్లమెంటుకి ఎన్నికలు జరిగాయి. 601 సీట్లు. మెజారిటీ కావాలంటే 301 రావాలి. ఎవరూ ఊహించని విధంగా అందరి కంటె ఎక్కువగా ప్రచండ పార్టీకి 29% ఓట్లతో 220 సీట్లు వచ్చాయి. నేపాల్ రాజకీయాల్లో భీష్ముడు, భారత అనుకూల నేపాలీ కాంగ్రెస్ అధినేత గిరిజా ప్రసాద్ కోయిరాలా పార్టీకి 21% ఓట్లతో 110, సిపిఎన్ (యుఎమ్ఎల్)కి 20% ఓట్లతో 103 వచ్చాయి. అయితే త్వరలోనే ప్రచండ పార్టీ (సిపిఎన్ మార్క్సిస్ట్) లోని అతివాదులు వైద్య అనే అతని నాయకత్వంలో ప్రచండ వామపంథాను నీరుకారుస్తున్నాడని ఆరోపిస్తూ విడిపోయింది. దాంతో ఏడు నెలల్లోనే ప్రచండ గద్దె దిగాల్సి వచ్చింది.

ఆ తర్వాత ఆ ఐదేళ్ల (2008-13) కాలంలో మరో ముగ్గురు ప్రధానులు అయ్యారు. 2013 ఎన్నికలు వచ్చేసరికి ప్రచండ సిపిఎన్ (మావోయిస్ట్ సెంటర్) పేర పోటీ చేస్తే 15% ఓట్లతో 80 సీట్లు వచ్చాయి. నేపాలీ కాంగ్రెస్‌కు 26% ఓట్లతో 196, సిపిఎన్ (యుఎమ్‌ఎల్)కు 175 వచ్చాయి. నేపాలీ కాంగ్రెసుకు చెందిన సుశీల్ కోయిరాలా ప్రధాని అయ్యాడు. 2015లో కొత్త రాజ్యాంగాన్ని తెచ్చారు. తమకు ప్రత్యేక ప్రతిపత్తి కోరుతున్న మాధేసీలకు అది నచ్చలేదు. ప్రచండ అనుచరుడు భట్టరాయ్ పార్టీని చీల్చి వెళ్లి మాధేసీలతో చేతులు కలిపాడు. తన పార్టీ బలహీనపడినా, యుఎమ్‌ఎల్, ఎన్‌సిల మధ్య ఉన్న విభేదాలను ఉపయోగించుకుని ప్రచండ 2016లో మళ్లీ ప్రధాని అయి, పది నెలల పాటు పాలించాడు. అప్పణ్నుంచి వేరేవాళ్లు పాలించారు.

కొత్త రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు సీట్ల సంఖ్య 275 అయింది. 2017లో ఎన్నికలు జరిగాయి. అంతకుముందు దాకా నేపాలీ కాంగ్రెసుతో కలిసి అధికారాన్ని పంచుకున్న ప్రచండ ఎన్నికలకు సరిగ్గా నెలకు ముందు ఓలి పార్టీ ఐన సిపిఎన్-యుఎమ్‌ఎల్‌తో చేతులు కలిపాడు. యుఎమ్‌ఎల్‌కు 121 సీట్లు వస్తే ప్రచండకు 53 వచ్చాయి. ఓలీ పార్టీ పేరుకి మార్క్సిస్ట్ లెనినిస్ట్ అయినా మరీ అంత లెఫ్టిస్ట్ కాదు, యథాతథ స్థితి కొనసాగాలనే చూస్తుంది. నేపాలీ కాంగ్రెసు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది. కానీ ప్రచండ తన మాటే వేదంగా భావించాలంటాడు. అందుకే అతని పార్టీ బలహీనపడుతూ పోయింది. ఓలీ ప్రచండకు ‘నేను ప్రధాని అవుతా, నీ పార్టీని నా పార్టీలో విలీనం చేయి, నీకు పార్టీ పగ్గాలు అప్పగిస్తాను’ అని మాటిచ్చాడు. దాని ప్రకారం 2018 మేలో ప్రచండ విలీనం చేశాడు. కానీ ఓలి మాట తప్పాడు. ప్రచండకు పార్టీని అప్పగించలేదు.

ఓలి నియంతృత్వ పోకడలు అతని సహచరులకు ఎవ్వరికీ నచ్చలేదు. కానీ అందరూ కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కొత్త రాజ్యాంగం ప్రకారం తొలి రెండేళ్లలో పెట్టడానికి వీల్లేదు. అందువలన 2020 వరకు ఆగాల్సి వచ్చింది. తనకు మెజారిటీ పోయిందని అర్థం కాగానే ఓలి పార్లమెంటును రద్దు చేద్దామని చూశాడు. ఆర్డినెన్సులు తెచ్చాడు. వాటికి అధ్యక్షురాలిగా ఉన్న విద్యాదేవి ఆమోదముద్ర వేసింది. ఆమె ఓలి పార్టీ సభ్యురాలే. 2015లో, 2018లో అధ్యక్ష ఎన్నికలలో ఆమెను ఓలీయే గెలిపించాడు. అయితే సుప్రీం కోర్టు యీ అర్డినెన్సులు కొట్టేసింది.

దానితో పాటు 2021 మేలో 2018లో జరిగిన సిపిఎన్(ఎమ్‌సి), సిపిఎన్ (యుఎమ్‌ఎల్) విలీనం కూడా చెల్లదనేసింది. దాంతో ప్రచండకు మళ్లీ తన పార్టీ దక్కింది. వెంటనే యుఎమ్‌ఎల్‌లో ఓలీకి వ్యతిరేకిగా మారిన మాధవ్ నేపాల్‌తో చేతులు కలిపి యిద్దరూ వెళ్లి నేషనల్ కాంగ్రెసును దేవ్‌బాను సమర్థించి 2021 జులైలో ప్రధానిని చేశారు. ముగ్గురూ కలిసి ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల అనంతరం ఇప్పటికే రెండు సార్లు ప్రధానిగా చేసినా పదవీకాంక్షతో మళ్లీ అవుదామని చూస్తున్న 70 ఏళ్ల ఓలీ ప్రస్తుతం ప్రచండను తనవైపు లాక్కుని దేవ్‌బాకు చెక్ పెట్టాడు. ఆ కారణంగా మళ్లీ యిన్నాళ్లకు డిసెంబరులో ప్రచండ ప్రధాని అయ్యాడు. వీళ్లిద్దరినీ చైనా కలిపిందనే పుకారూ ఉంది. పైగా అధ్యక్షురాలిగా ఉన్న విద్యాదేవి కూడా సాయం చేసింది. ఇప్పుడు మార్చి9న మళ్లీ అధ్యక్ష ఎన్నిక ఉంది. ఈ లోగా యీ సంకీర్ణ ప్రభుత్వానికి ఫిబ్రవరి మొదటివారంలో చిన్నపాటి కుదుపు వచ్చింది.

ప్రభుత్వానికి మద్దతిచ్చిన ఐదు పార్టీలలో ముఖ్యమైనది, 20 సీట్లున్న ఆర్‌ఎస్‌పి (రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ). దీనికి చైర్మన్ రబీ లామిచ్ఛానే. టివి టాక్ షో హోస్ట్‌గా అతనికి యువతలో చాలా పాప్యులారిటీ ఉంది. అతి నాలుగో పెద్ద పార్టీ కాబట్టి అతన్ని ఉపప్రధానిగా, హోం మంత్రిగా చేశారు. అతను తన ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన సిటిజన్ సర్టిఫికెట్టు చెల్లదని సుప్రీం కోర్టు జనవరి 27న తీర్పిచ్చింది. దాంతో అతను పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. జనవరి 29న అతను మళ్లీ పౌరసత్వాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. అందువలన మళ్లీ కాబినెట్‌లోకి తీసుకోమని ప్రచండను కోరాడు. అయితే అతను ససేమిరా అన్నాడు. దాంతో కోపం వచ్చిన రబీ కాబినెట్‌లోని తన మంత్రులందర్నీ రాజీనామా చేయమన్నాడు. కానీ ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందన్నాడు. ఎందుకంటే పార్టీలో ఉన్నవారు ఒకే సిద్ధాంతానికి కట్టుబడినవారు కాదు. కమ్యూనిస్టు పార్టీలతో, నేపాలీ కాంగ్రెసుతో విసిగి, ఒక దగ్గరకు వచ్చి, తమ ఖర్చులతో తాము నెగ్గినవారు.  

మాధేసీల గురించి పని చేస్తామంటూ 2006లో ఏర్పడిన మాధేసీ జన అధికార్ ఫోరమ్, నేపాల్ 2008 ఎన్నికల్లో 52 సీట్లు తెచ్చుకుంది. కానీ దాని పనితీరుతో నిరుత్సాహ పడిన మాధేసీలు 2013లో 10 సీట్లు మాత్రమే యిచ్చారు. దాంతో దాని స్థానంలో మాధేసీలు సికె రౌత్ నేతృత్వంలోని జనమత్ పార్టీకి మద్దతిచ్చి 2022లో 6 సీట్లు యిచ్చారు. ఇప్పుడది కూటమిలో భాగం. కూటమిలోని యితర పార్టీల్లో ప్రస్తుతం జైల్లో ఉన్న రేషమ్ చౌధురీ నేతృత్వంలోని నాగరిక్ ఉన్ముక్త్ పార్టీ ఉంది. దానికి వచ్చినవి 3 సీట్లు. ఉపేంద్ర యాదవ్ నాయకత్వంలోని జనతా సమాజ్‌బాద్ పార్టీ నేషనల్ కాంగ్రెసుతో బేరాలాడుతూ వచ్చి, ప్రచండ అధికారంలోకి వస్తున్నాడనగానే అతనితో చేతులు కలిపింది. రాచరికానికి, హిందూత్వానికి అనుకూలంగా ఉండే హిందూత్వ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కమ్యూనిస్టులకు మద్దతిస్తోందంటే నేపాల్ అవకాశ రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఇలాటి ప్రభుత్వం ఎంతకాలం స్థిరంగా ఉంటుందో ఎవరైనా ఊహించగలరా? దీన్ని చైనా అవకాశంగా తీసుకుని ఏం చేస్తుందో, మనకు ఎలాటి యిబ్బందులు తెచ్చిపెడుతుందో వేచి చూడాలి. (ఫోటో – ప్రచండ, ఓలీ)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?