cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: చరిత్రలో ఖాళీని పూరించిన నాటకం

ఎమ్బీయస్: చరిత్రలో ఖాళీని పూరించిన నాటకం

మన దేశంలో చరిత్ర పుస్తకాలు నిర్దుష్టంగా వుండవు. అతిశయోక్తులు ఎక్కువ, సంఘటనలు గ్రంథస్తం చేసి వుంచితే, భవిష్యత్తులో వాటి అవసరం పడుతుందన్న స్పృహ చాలా తక్కువ రాజులకే వుంది. కొన్ని సందర్భాల్లో కొందరు రాజుల ప్రస్తావనే వుండదు. గుప్తరాజుల్లో చరిత్ర కెక్కని రామగుప్తుడి గురించి యీ వ్యాసం. స్కూలు పుస్తకాల్లో చదివిన గుప్తరాజుల పేరు వినగానే స్వర్ణయుగం అనే జంటపదం తడుతుంది. రెండున్నర శతాబ్దాల పాటు వాళ్లు దేశంలో చాలా ప్రాంతాలను పాలించారు. క్రీ.శ. 319 నుంచి 467 వరకు ఉచ్చదశ అని చెప్పుకోవచ్చు. కాళిదాసు, ఆర్యభట్టు, వరాహమిహిరుడు, వాత్సాయనుడు ఆ కాలం వాళ్లే. రామాయణ, మహాభారతాలు రూపుదిద్దుకున్నది ఆ కాలంలోనే. అంతటి సాహిత్యం వెలసిల్లిన ఆ కాలంలోని వాడైన ఒక రాజు గురించి విస్మరించడమేమిటి?

చరిత్ర ఎప్పుడు విజేతలు రికార్డు చేసినదే. తమతో వైరం వున్న వారి గురించి, తమతో పోటీ పడలేక వెనకపడిపోయిన వారి గురించి విజేతలు సరిగ్గా రాయనివ్వరు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినపుడు కెసియార్‌తో బాటు తెరాసలో ఆలె నరేంద్ర కూడా పోరాడాడని, చాలా కాలం అగ్రశ్రేణి నాయకుడిగా వున్నాడని తెరాస రాయించే పుస్తకాల్లో కనబడుతోందా? అమరవీరుల పేర్లు కనబడుతున్నాయా? తనొక్కడే చావునోటిలో తల పెట్టి, తెలంగాణ తెచ్చానని కెసియార్ పాఠ్యపుస్తకాల్లో రాయిస్తారు. కరుణానిధి కొడుకులెంతమంది అని అడిగితే స్టాలిన్ పేరు, అళగిరి పేరు గుర్తుకు వస్తాయి. రాజకీయాల్లో లేని తమిళరసు పేరు కానీ, తండ్రి ప్రోద్బలంతో ఎమ్జీయార్‌కు వ్యతిరేకంగా సినీనటుడై, విఫలమై, ఆ పై తండ్రికి ఎదురు తిరిగిన ము.క. ముత్తు పేరు కానీ గుర్తుకు రావు. ఇప్పుడు అళగిరి కూడా పార్టీకి దూరమై పోయాడు కాబట్టి, అతని పేరూ త్వరలో మరుగున పడుతుంది. 20 ఏళ్లు పోయాక డిఎంకె వెబ్‌సైట్ చూస్తే కరుణానిధి కొడుకుగా స్టాలిన్ పేరు ఒక్కటే కనబడుతుంది. ఇప్పటి టిడిపి వెబ్‌సైట్ చూస్తే 1995 నాటి అధికార మార్పిడి గురించిన వాస్తవాలు తెలుస్తాయా?

గుప్తరాజుల్లో ప్రఖ్యాతి చెందిన రాజు సముద్రగుప్తుడు క్రీ.శ.335 లోనో ఆ తర్వాతో సింహాసనమెక్కి 380 లోపునే చనిపోయాడు. ఖచ్చితమైన సంవత్సరం తెలియదు. అతనికి వారసుడిగా వచ్చిన రెండవ చంద్రగుప్తుడు (విక్రమాదిత్యుడి పేరుతో కీర్తి గడించాడు) 380 నుంచి 413 వరకు పాలించాడని తెలుస్తోంది. సముద్రగుప్తుడు పోయాక, 380 వరకు పాలించిన రాజు ఎవరు? రికార్డు ఏమీ లేదు. ‘‘మిసిమి’’ పత్రిక 1995 జనవరి సంచికలో డా. సూరత్తు వేణుగోపాలరావు గారు ‘చరిత్రలో తప్పిపోయిన రాజు’ పేర రాసిన వ్యాసం చదివి ఆ రాజు పేరు రామగుప్తుడు అని తెలుసుకున్నాను. అతను అసమర్థుడు. శకరాజును ఓడించలేక రాజీ పడడానికి అతని అమర్యాదకరమైన షరతుకు ఒప్పుకున్నాడు. అలాటివాణ్ని చంపి, అతని తమ్ముడు రాజయ్యాడు. రాజయ్యాక అన్నగారి కథను చరిత్రలోంచి తుడిపేశాడు.

అయితే 1923లో ఒక సంస్కృత నాటకం బయటపడడంతో ఆ రాజు పేరు, కథ బయటకు వచ్చాయి. అది వట్టి కల్పనే అని చాలాకాలం వాదించుకున్నారు. అయితే తర్వాతికాలంలో బయటపడిన కొన్ని నాణాలు, శాసనాలు ఆ రాజు వున్నాడనే విషయాన్ని ధృవీకరించాయి. ఇప్పటికీ చరిత్రకారులందరూ అతని ఉనికి విషయంలో ఏకాభిప్రాయానికి రాలేదు. ఇదీ సంగతి. ఇప్పుడు ఆ నాటకం గురించి చెప్తాను. విశాఖదత్తుడనే నాటకకర్త వున్నాడు. రాచవంశానికి చెందినవాడని తెలుసు కానీ ఏ కాలంవాడో నిశ్చయంగా చెప్పడం కష్టం. 6 వ శతాబ్ది వాడనుకుంటున్నారు. అతను క్రీస్తు పూర్వం నాటి మౌర్యచంద్రగుప్తుడు, చాణక్యుడు, నందుల మంత్రియైన రాక్షసుడి కథతో ‘‘ముద్రారాక్షసం’’ (ఎప్పటికైనా దీని కథ చెప్తానని చాలాకాలం క్రితమే నేను ఊరించాను) రాశాడు. అతనే రాసిన మరో నాటకం ‘‘దేవీ చంద్రగుప్తం.’’ ఇది అలభ్యం. అయితే దీనిలోని కొన్ని భాగాలను గుణచంద్రుడు, రామచంద్రుడు తమ ‘‘నయదర్పణం’’లో ఉటంకించారు. దాన్ని 1923లో సిల్వన్ లెవీ ప్రపంచం దృష్టికి తెచ్చారు.

నాటకం ప్రకారం సముద్రగుప్తుడు చనిపోయాక అతని పెద్దకొడుకు రామగుప్తుడు రాజయ్యాడు. అప్పుడు శకరాజు దండెత్తాడు. శకులనేవారు ఇరాన్‌కి చెందిన సంచార జాతుల వారు. దండయాత్రలకై భారతదేశం వచ్చి యిక్కడే స్థిరపడిపోయారు. క్రీ.పూ. 2 వ శతాబ్దం మధ్య నుంచి క్రీ.శ. 4 వ శతాబ్దం వరకు వారు వస్తూనే వున్నారు. గాంధార, సింధు, కశ్మీర, పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలో వీరున్నారు. బహుశా గుజరాత్‌లో వున్న శకరాజు గుప్తసామ్రాజ్యంపై దండెత్తాడు. పిరికివాడైన రామగుప్తుడు రాజీ పడతానన్నాడు. శకుడు అనేక షరతులు విధించాడు.  వాటిలో ఒకటి – రాజు తన భార్య ఐన ధ్రువదేవిని తనకు అప్పగించాలని. రాజు దానికీ ఒప్పుకున్నాడు. అది అతని తమ్ముడు చంద్రగుప్తుడికి నచ్చలేదు. నాకు వదిలేయ్ అన్నాడు.

తనే ధ్రువదేవి వేషంలో పల్లకి ఎక్కి, పరిచారికల వేషంలో కొందరు సైనికులను వెంటపెట్టుకుని శకరాజు కోటలోకి వెళ్లాడు. ఆడవాళ్లు కదాని తనిఖీ చేయించకుండా అంతఃపురంలోకి పంపించారు. చంద్రగుప్తుడు, అతని అనుచరులు కత్తులు బయటకు లాగి శకరాజును చంపేశారు. రామగుప్తుడు సంతోషించాడు. అతని భార్య యింకా ఎక్కువ సంతోషించింది. తన పరువు కాపాడిన మరిదిపై వలపు పెంచుకుంది. దగ్గరైంది. అన్నకు తమ్ముడిపై అసూయ కలిగింది. చాటుగా అతన్ని చంపించే ప్రయత్నాలు చేశాడు. తమ్ముడు సాహసే కాదు, యుక్తిపరుడు కూడా. ఉన్మాది అయిపోయినట్లు నటించాడు. అన్న ఉపేక్షించాడు. తమ్ముడు ఓ రోజు ముష్టివాడిలా చిరిగిన బట్టలతో రాజాంతఃపురానికి వెళ్లాడు. రాజదంపతులు చెఱుకుగడ తింటున్నారు. అన్న ‘ఇదిగో తిను’ అంటూ తమ్ముడికి ఒక చెఱుకు గడ యిచ్చాడు. ‘అంత పెద్ద ముక్క ఎలా తింటాడు? కత్తి యివ్వండి కోసుకుంటాడు.’ అంది రాణి. అన్న యిచ్చాడు. తమ్ముడు అదే కత్తితో అన్నపై పడి వదిన సాయంతో అతని పీక కోసేశాడు.

తర్వాత రాజయ్యాడు. వదినను పెళ్లి చేసుకుని రాణిని చేసుకున్నాడు. ఇప్పటికాలానికి యిది ఎబ్బెట్టుగా తోచవచ్చేమో కానీ, అప్పటికి కాదు. భర్త పోతే మరిదిని పెళ్లాడడాన్ని ‘దేవరన్యాయం’ అంటారు. ఇప్పటికీ పంజాబ్‌లో వుంది. రామాయణ కాలంలో వాలి ఓ గుహలో చనిపోయా డనుకున్నపుడు అతని భార్య తార సుగ్రీవుణ్ని పెళ్లాడింది. గుహలోంచి వాలి బయటకు వచ్చి తన భార్యతో బాటు, సుగ్రీవుడి భార్య రుమను కూడా తీసుకెళ్లిపోయాడు. ఆ విషయమై సుగ్రీవుడు ఫిర్యాదు చేస్తే, రాముడు వాలిని చంపాడు. వాలి చనిపోయాక సుగ్రీవుడు సొంత భార్యతో బాటు, వదిన గారిని కూడా తెచ్చుకుని రాణిని చేసుకున్నాడు.

ఈ నాటకానికి ‘‘దేవీ చంద్రగుప్తం’’ అని పేరు పెట్టడంతో యిది వీళ్లిద్దరి ప్రేమగాథ అని సూచించినట్లయింది. చంద్రగుప్తుడి భార్య పేరు ధ్రువదేవి అని వైశాలిలో దొరికిన ముద్రలు చెపుతున్నాయి. వాళ్లిద్దరూ చారిత్రక వ్యక్తులైనప్పుడు రామగుప్తుడు మాత్రం కల్పిత పాత్ర ఎలా అవుతాడనే సందేహంతో చరిత్రకారులు పరిశోధించారు. 1951లో భిల్సాలో రామగుప్తుని పేర నాణాలు కనిపించాయి. విదిషలో దుర్జనపురంలో మూడు జైన విగ్రహాలు దొరికితే వాటి వేదికలపైన నాలుగేసి పంక్తులు గుప్తుల కాలం నాటి బ్రాహ్మీలిపిలో వున్నాయి. వాటిలో మహారాజాధిరాజు రామగుప్తుడి ప్రశంస వుంది. కానీ అతని వంశప్రస్తావన లేదు.

ఏడవ శతాబ్దం నాటి బాణుడు రాసిన ‘‘హర్షచరిత్ర’’లో చంద్రగుప్తుడు రాణి వేషంలో వెళ్లి శకరాజును హత్య చేసినట్లు వుంది. రాష్ట్రకూటుల నాటివైన సంజన్, కాంబే రాగి శాసనాల మీద కూడా యీ ఉదంతం రాశారు. శృంగార ప్రకాశంలో భోజరాజు కూడా రాశాడు. రాజశేఖరుడు అతని ‘‘కావ్యమీమాంస’’లో రాశాడు. ఒక సంస్కృత గ్రంథాన్ని  క్రీ.శ. 800లో అరబ్బీలోకి అనువదిస్తే దాన్ని 1226లో ‘‘ముజ్మల్ ఉత్ తవారిఖ్’’ పేర అబ్దుల్ హసన్ పర్షియన్ భాషలోకి అనువదిస్తే దానిలోనూ వుంది. వీటి వేటిల్లోనూ రామగుప్తుడి పేరు రాయలేదు. అందుకే అనుమానాలు వీడలేదు. మాక్మిలన్ వారు ప్రచురించిన ‘‘ఏన్ ఎడ్వాన్స్‌డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా’’ రాసిన ఆర్‌సి మజుందార్, ఎచ్‌సి రాయచౌధురి, కాళీకింకర దత్తాలు విషయాలన్నీ చెప్పి యితమిత్థంగా ఏమీ చెప్పలేక ‘మేటర్ యీజ్ సబ్‌జ్యుడిస్’ (విచారణలో వుంది) అనేశారు.

దీన్ని బట్టి రామగుప్తుడు వున్నాడందామా? లేడందామా? ‘‘టెన్ కమాండ్‌మెంట్స్’’ సినిమాలో సీనియర్ రామ్‌సెస్ మోజెస్‌కు దేశబహిష్కారం విధిస్తూ ‘నీ పేరు యీ దేశచరిత్రలో ఎక్కడా కనబడకూడదు. ప్రతీ శాసనం నుంచి కొట్టివేయబడుతుంది....’ అంటూ మేఘగర్జనలాటి స్వరంతో చెప్పిన డైలాగ్ గుర్తుకు వస్తోంది నాకు. చంద్రగుప్తుడు రాజయ్యాక ‘ఇంతటి బలహీనుడైన రాజు మన గుప్తవంశంలో వున్నాడని చెప్పుకోవడమే అవమానం. అతని పేరు చరిత్రలోంచి, శాసనాల్లోంచి తుడిచేయండి. అతను రాజ్యం చేసిన (మూడేళ్లో, ఐదేళ్లో) కాలం గురించి ప్రస్తావించకండి.’ అని గర్జించి వుంటాడు. అయినా యీ నాటకం రామగుప్తుణ్ని చరిత్ర సమాధిలోంచి బయటకు లాగి ప్రాణం పోసి, నిలబెట్టింది. (ఫోటో – రామగుప్తుడి పేర వున్న నాణెం, కుడివైపు రెండవ చంద్రగుప్తుడి విగ్రహం, మధ్యలో రామగుప్తుడి ఊహాచిత్రం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2021)

mbsprasad@gmail.com

లోకేష్ సవాల్ చూస్తే.. బ్రహ్మానందం గుర్తొస్తున్నాడు

దేవి సిక్స్ కొడితే...నేను రెండు సిక్సులు కొడ‌తా

 


×