Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఎన్నాళ్లీ మోసం?

ఎన్నాళ్లీ మోసం?

ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనే యావ ముదిరితే అది చంద్రబాబు. అలాంటి అలవిమాలిన అత్యాశ ఒక మనిషి రూపంలోకి మారితే అది చంద్రబాబు! ఆయన ప్రచారం గానీ.. ఓట్లు యాచించే టెక్నిక్ గానీ.. ఈ అధికారంమీది యావ, అత్యాశకు నిదర్శనాలుగానే మనకు కనిపిస్తున్నాయి. ఆయన వాగ్దానాల పేరిట ఎన్ని హద్దులు దాటుతున్నా కూడా ప్రతి ఒక్కటీ కూడా.. ఆయనలోని దుర్మార్గపు అత్యాశకు ప్రతిరూపమే. ఆయన ఇచ్చే హామీలు.. ఆయన మేనిఫెస్టోను గమనిస్తే అడుగడుగునా.. చంద్రబాబు మోసాల విశ్వరూపం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన తీరుమీదనే ఈవారం గ్రేట్ఆంధ్ర కవర్ స్టోరీ ‘ఎన్నాళ్లీ మోసం?’

చంద్రబాబునాయుడు మేనిఫెస్టోను గమనించారా? ఆకాశాన్ని నీకోసం నేలమీదికి దించి.. చుక్కలన్నీ తెంపి మాలకుట్టి యిస్తా.. వంటి కవితాత్మకమైన డైలాగులు మాత్రమే అందులో లేవు. అంతకుమించిన అనేక మాయ హామీలు ఉన్నాయి. టక్కు టమార గజకర్ణ గోకర్ణ మాటలగారడీ విద్యలున్నాయి. అరచేతిలో స్వర్గం కాదు కదా.. పదునాలుగు భువనభాండమ్ములనూ చంద్రబాబునాయుడు తన మేనిఫెస్టోలో దర్శింపజేసేంతటి ఘనులు. ఆయన చెప్పని వాగ్దానం లేదు. టచ్ చేయని రంగం లేదు. కాగితం మీద అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒకవేళ ప్రజల ఖర్మగాలి వారు నమ్మిగెలిపిస్తే.. అప్పుడు ఆయన చూపించే విశ్వరూపం ఏమిటి.. అదే పైన చెప్పుకున్న వంచన, మోసం!

మేనిఫెస్టోను చూసుకుంటూ వెళితే.. ఎన్నెన్ని మాయహామీలు ఉన్నాయో గమనించి మనకు పిచ్చెక్కుతుంది. అన్నీ అక్కర్లేదు. కీలకమైన కొన్ని హామీలు.. వాటి విషయంలో చంద్రబాబునాయుడుకు ఉండగల చిత్తశుద్ధి, ప్రజలకున్న అనుమానాలు ఇలాంటివి కొన్ని గమనిద్దాం. 

యాభయ్యేళ్లకు పెన్షను!

చంద్రబాబు తన మేనిఫెస్టోలో ప్రకటించిన ఒక అతిశయమైన హామీ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు యాభయ్యేళ్లకే వృద్ధాప్య పెన్షను ఇచ్చేయడం. చంద్రబాబునాయుడు సమాజాన్ని కులాల ప్రాతిపదిక మీద చీల్చేసి సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న దుర్మార్గుడు కాకపోతే.. ఇలాంటి హామీ ఎవరైనా ఇస్తారా? ఆయనకు అసలు సమాజం మీద కాస్తయినా పట్టింపు ఉందా? సమాజహితం గురించిన శ్రద్ధ ఉందా? చంద్రబాబునాయుడు ప్రకటించిన ఈ హామీలో రెండు దుర్మార్గమైన కోణాలున్నాయి. అవి తెలుసుకునే ముందు మరో విషయం గమనించాలి.

కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు వంటి వారికి ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 45 ఏళ్లకే వృద్ధాప్య పెన్షను వస్తుంది. అలాంటి వృత్తుల్లో ఉండేవారు.. విపరీతమైన శారీరక శ్రమతో కూడుకున్న వృత్తుల్లో ఉండేవారు, అలాగే వృత్తిపరంగా కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నవారు కావడం వలన అలాంటివారికి ఆ ఏర్పాటు.

అయితే ఇప్పుడు చంద్రబాబునాయుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరికీ యాభయ్యేళ్లకే పెన్షను ఇచ్చేస్తా అంటున్నారు. ఆయనకు ముందు ఓట్లు కావాలి. జగన్ ను ఓడించడానికి ఇబ్బడి ముబ్బడిగా ఓట్లు కావాలి. ఏదో ఒకరీతిగా అందరినీ మభ్యపెట్టడం కావాలి. సరే.. ఆయనే కరెక్టని అనుకుందాం. ఓట్ల కోసం ఎన్ని అబద్ధపు హామీలైనా ఇవ్వవచ్చుననే అనుకుందాం. యాభయ్యేళ్లకు పెన్షను ఇచ్చేస్తే పోనీలే అనుకుందాం.

కానీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు మాత్రమే ఎందుకివ్వాలి? వృద్ధాప్యానికి కూడా కులం ఒక్కటే ప్రాతిపదికగా చూడడం అనేది చంద్రబాబునాయుడు సంకుచితత్వం కాదా? అంటే వార్ధక్యం కమ్ముతున్న వాళ్లని కూడా, ఆ వయసు మళ్లిన సమాజాన్ని కూడా.. కులం పేరిట కట్టిన అడ్డుగోడలతో చీల్చేసి.. తన స్వార్థం కోసం, తన ఓటు బ్యాంకు నిర్మాణం కోసం ఇలాంటి దుర్మార్గపు వేషాలు వేయాలని.. సమాజంలో కులాల మధ్య సఖ్యత లేకుండా, ఒకరినొకరు ద్వేషంతో చూసుకునే, ఒకరి పట్ల ఒకరు కక్షలు పెంచుకునే సామాజిక వాతావరణాన్ని భవిష్యత్ తరాలకోసం చంద్రబాబు సృష్టించదలచుకున్నారా? ‘నేను రేపటి తరాలకోసం పనిచేస్తా’ అని చంద్రబాబునాయుడు నాటకీయమైన డైలాగులు చెబుతూ ఉంటారు. ఆయన రేపటితరాలకోసం అందించే కానుక ఇలాంటి కులాల కాట్లాటల సమాజం అన్నమాట!

ఈ యాభయ్యేళ్ల  పెన్షను వ్యవహారంలో ఇంకో దుర్మార్గం ఉంది. ఇవాళ్టి రోజుల్లో యాభయ్యేళ్లకు ముసలివాళ్లయిపోయి, పనిచేయని స్థితికి చేరుకుంటున్నవారు ఎందరు? అసలు వృద్ధాప్య పెన్షను యొక్క లక్ష్యం ఏమిటి? వార్ధక్యం వలన పనులు చేసుకుని సంపాదించుకుని తినగలిగే పరిస్థితిలో ఉండరు గనుక.. అలాంటి వారు జీవితం వెళ్లదీయడానికి ప్రభుత్వం అందించే సాయం అది.

ఈ రోజుల్లో యాభయ్యేళ్లకు పనిచేయలేని స్థితికి చేరుకుంటున్న వాళ్లు ఎందరు? ఒకవైపు ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో ఉద్యోగులకు పదవీవిరమణ వయస్సు పెంచేసింది. 58కి రిటైరయ్యే వారిని, 60 దాకా మీకు ముసలితనం రాదు.. అప్పటి దాకా పనిచేయండి అని చెప్పింది. తీరా ఇప్పుడు ఓట్ల కక్కుర్తితో ఏపీలోని సగానికి మించిన జనాభాను యాభయ్యేళ్లకు ముసలితనంలోకి నెట్టేస్తున్నారు చంద్రబాబు. ఇలాంటి దుర్మార్గపు హామీలను ప్రజలు ఎందుకు నమ్మి ఓటు వేయాలి. 

నిరుద్యోగ భృతి!

చంద్రబాబునాయుడు సుదీర్ఘకాల మోసపూరితమైన బుద్ధులకు ఈ భృతి ఒక చక్కటి ఉదాహరణ. ఇప్పుడు కూడా ఆయన రాష్ట్రంలోని నిరుద్యోగులు అందరికీ భృతి ఇస్తానంటున్నారు. ఇలాంటి వంచన ఆయనకు కొత్త కాదు. దాదాపు పాతికేళ్ల కిందట కూడా ఆయన ఇలాగే నిరుద్యోగ భృతి అనే మాటను మొదటిసారిగా జనం మీద సమ్మోహక అస్త్రంలాగా ప్రయోగించారు.

1995లో పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి, ఆయనను పదవీచ్యుతుడినిచేసి, ఆయన మీద చెప్పులు వేయించి.. చివరికి అధికారం హస్తగతం చేసుకుని ఆయన మరణానికి కూడా కారణమైన చంద్రబాబునాయుడు.. 1996లో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇలాంటి పాచిక ప్రయోగించారు. పదో తరగతి పాసయి, ఉద్యోగంలేని వారికి నెలకు వంద రూపాయల భృతి ఇస్తానంటూ ఆయన ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక్కరికి కూడా ఇవ్వకుండానే.. ఆ పథకం కనుమరుగైపోయింది. ఇప్పటికైనా సరే.. చంద్రబాబునాయుడు చెప్పినట్టుగా నిరుద్యోగ భృతి ఇస్తాడనే నమ్మకం ఎవరికుంది?

ఆ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పగలరా?

జగన్మోహన్ రెడ్డి దాదాపుగా తన ప్రతి ఎన్నికల సభలోనూ చంద్రబాబునాయుడుకు ఒక ప్రశ్న సంధిస్తుంటారు. ఆయన గురించి చెప్పాల్సిందిగా ప్రజలను కూడ అడుగుతుంటారు. చంద్రబాబు తాను మూడు పర్యాయాలు పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన మహానుభావుడిని అని చెప్పుకుంటూ ఉంటారు కదా.. మరి ఇన్నేళ్ల సుదీర్ఘ ముఖ్యమంత్రిత్వంలో తన సొంత ముద్ర తో తీసుకువచ్చిన సంక్షేమ పథకం ఒక్కటైనా ఉందా? అని జగన్ అడుగుతూ ఉంటారు. ఈ ఒక్క ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పగలిగితే చాలు.. చాలా చిక్కుముడులు వీడిపోయతాయి. వాళ్లూ వీళ్లూ ప్రారంభించిన సంక్షేమ పథకాలను ఏడుస్తూ గతిలేక కొనసాగించడం.. అందులో లబ్ధిదారులకు ఎన్ని రకాలుగా కోతపెట్టవచ్చునో ఆలోచిస్తూ కొత్త కుట్రలు చేయడం మాత్రమే చంద్రబాబునాయుడు పాలన.

ఇప్పుడైనా సరే చంద్రబాబు కేవలం ఓట్లను కొల్లగొట్టడం తప్ప మరో లక్ష్యం తన జీవితానికి లేదన్నట్టుగా అనేక దొంగహామీలు ప్రకటించేశారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతిమహిళకు నెలకు రూ.1500 ఇస్తానంటున్నారు. నిరుద్యోగ భృతి అంటున్నారు. ఇవన్నీ ఓకే. వీటికి వర్తించే కండిషన్లు ఏమిటి? కనీసం ఏ ఒక్కదాని గురించి అయినా.. లబ్ధిదారుల ఎంపికలో ఎన్నిరకాల వడపోతలు, విధివిధానాలు, నియమనిబంధనలు ఉంటాయో చెప్పగల ధైర్యం చంద్రబాబునాయుడుకు ఉందా?

చంద్రబాబునాయుడు అనుసరించేది ప్రతిసారీ ఇదే దుర్మార్గమైన మోసపూరిత వైఖరి. గతంలో ఆయన రుణమాఫీ చేస్తానన్నారు. రైతులు నమ్మి గెలిపించారు. ఆ రుణమాఫీని ఒక్కసారిగా చేయకుండా.. నాలుగు విడతల్లోకి మార్చి.. అసలు పూర్తిగా మాఫీ చేయకుండానే గద్దె దిగిపోయిన వంచనాత్మకమైన చరిత్ర చంద్రబాబునాయుడుది. చంద్రబాబునాయుడు ఎక్కడైతే మోసగాడుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారో సరిగ్గా అక్కడే జగన్మోహన్ రెడ్డి తన క్రెడిబిలిటీని నిర్మించుకుంటున్నారు. చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నారు.

జగన్ తాజాగా పెన్షనును 3000 నుంచి 3500 కు పెంచుతానని చెప్పారు. అయితే అందులో మాయామర్మం లేవు. 2028లో 250, 2029లో మరో 250 పెంచుతానని ముందే చెప్పేశారు. అంటే తను ఇచ్చిన వాగ్దానంలో ఉండే నియమాలను కూడా ఆయన ముందే చెబుతున్నారు. అంతటి క్లీన్ మనసు, చిత్తశుద్ధి చంద్రబాబునాయుడుకు చరిత్రలో ఏనాడైనా ఉన్నాయా? ఇప్పటికైనకా సరే.. ఆయన ‘ప్రతి మహిళలకు’ అనే పదాల అర్థం.. కులమతాల రహితంగా, ఆర్థిక భేదాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఆ 1500 అందిస్తానని చెప్పగలరా? గెలిచిన తర్వాత దీనికి నియమాలను నిబంధనలను రూపొందిస్తానని అనకుండా ఉండగలరా? అనేది ప్రజల ప్రశ్న. 

వాలంటీర్లకు కూడా మోసం..

జగన్  బుర్రలోంచి పుట్టిన ఒక అద్భుతమైన ఆలోచన వాలంటీరు వ్యవస్థ. ఇవాళ దేశంలోని అనేక రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు తలతిప్పి చూస్తున్నాయంటే.. అందుకు వాలంటీరు వ్యవస్థ ఒక కారణం. ఈ వ్యవస్థను ఎలా అమలు చేస్తున్నారా? మనం కూడా మన మన రాష్ట్రాల్లో అమలు చేద్దామా అని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ సిబ్బందిని పంపి ఈ వ్యవస్థను పరిశీలించేలా చేస్తున్నారు.

లబ్ధిదారులకు పెన్షను, రేషను ఇళ్ల వద్దనే అందజేయడంలో కీలకంగా పనిచేస్తూ వాలంటీర్లు ప్రజల కష్టాలు దగ్గరుండి గమనిస్తూ ప్రభుత్వంతో అనుసంధానమై పనిచేస్తున్నారు. నెలలో కొన్ని రోజులు పనిచేసి.. 5000 గౌరవవేతనం పొందుతున్నారు. అయితే వాలంటీర్లు లబ్ధిదారులను ప్రభావితం చేయగలరనే ఒక అనుమానం చంద్రబాబుకు ఉంది.

అందుకని ఆయన ఏకంగా వాలంటీర్ల మీదనే వల విసరడానికి పూనుకున్నారు. వాలంటీర్లకు నెలకు రూ.పది వేల వేతనం చెల్లిస్తానని అబద్ధాలు చెబుతున్నారు. ఇది కూడా నిలబడే హామీ కానేకాదు. కాకపోతే.. వంచనకు ముసుగువేసి ఆయన మాట్లాడుతున్నారు. అయితే వారికి జీతం హామీ ఇవ్వడంలో చంద్రబాబునాయుడు కుట్ర బుద్ధులు వేరే ఉన్నాయి.

వాలంటీర్లను ఇప్పుడున్న పరిధిలోనే, ఇప్పుడున్న బాధ్యతలకు మాత్రమే వినియోగిస్తూ వారికి పదివేల వేతనం ఇస్తాననే మాట చంద్రబాబునాయుడు స్పష్టంగా చెప్పగలరా? అది మాత్రం కుదరదు. ఆయన కుట్ర ప్రకారం.. తన ప్రభుత్వం ఏర్పడితే.. వాలంటీర్ల సంఖ్యను సగానికి పైగా తగ్గించేసి, వారికి నెలవారీగా అప్పగిస్తున్న బాధ్యతలను బాగా పెంచేసి అప్పుడు పదివేలు ఇవ్వాలనేది ఆలోచిస్తున్నారు.

ఇప్పటికే 60 వేల మందికి పైగా వాలంటీర్లు రాజీనామాలు చేసేశారు. వారి స్థానంలో మరొకరు కూడా తిరిగి నియామకాలు ఉండవు. జీతంతో పాటు బాధ్యతలు, పరిధి కూడా రెట్టింపు చేసి.. ప్రభుత్వం మీద పైసా భారం పడకుండా వాలంటీర్లను నడిపించాలనేది బాబు ఆలోచన. కానీ జీతం పెంపు అనే మాటలతో బుట్టలో వేసుకోవాలని అనుకుంటున్నారు. 

మంచి చూడలేకపోవడం ఒక రోగం..

ఎవరైనా ప్రజలకు మంచి చేసినప్పుడు.. దానిని పాజిటివ్ దృష్టితో అభినందించడం అనేది ఒక భోగం. కానీ ఎవరైనా చేసిన మంచిని చూడలేకపోవడం అనేది.. ఒక రోగం! మాయరోగం! చంద్రబాబునాయుడు ఈ రెండో కేటగిరీకి చెందుతారు. చంద్రబాబు నాయుడు మంచిని చూడలేని వ్యక్తి. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను చూస్తే ఆయన కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. కూడూ గూడూ గుడ్డా తర్వాత మనిషికి అత్యంత ప్రాథమిక అవసరాలైనటువంటి విద్యా వైద్య రంగాలను గురించి చంద్రబాబు చెప్పినవన్నీ కల్లబొల్లి హామీలే.

ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా చేయిస్తానని, ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తారని రకరకాల మాయోపాయాలు, కార్పొరేట్ ఆసుపత్రులను పెంచి పోషించే దుర్మార్గ ఉపాయాలను చంద్రబాబు నాయుడు తన హామీలలో జతచేరుస్తున్నారు. అంతే తప్ప వైద్యరంగంలో మౌలిక వసతులు కల్పన పెంచడం గురించి గానీ ఆసుపత్రుల బాగోగులు గురించి గానీ వాటి సరైన నిర్వహణతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం గురించి కానీ చంద్రబాబు నాయుడుకి పట్టింపు లేదు.

జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పాఠశాలల మీద ఎంత గొప్పగా దృష్టి కేంద్రీకరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏ ఊరిలోకి అడుగుపెట్టినా అత్యద్భుతమైన నిర్మాణాలుగా విద్యార్థుల ఆటపాటల శిక్షణతో బడులు మనకు కనిపిస్తాయి. నాడు నేడు కింద పాఠశాలలను అత్యద్భుతంగా తీర్చిదిద్దిన ఈ వైనాన్ని గురించి చంద్రబాబు నాయుడు ఒక్క మాట కూడా చెప్పడం లేదు. స్కూళ్ల రిపేర్లను తమ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది అనే మాట కూడా చెప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు గురించి కూడా చంద్రబాబు నాయుడు ఎలాంటి హామీ ఇవ్వకుండా డొంక తిరుగుడు డైలాగులు మాట్లాడుతున్నారు.

ఎందుకంటే కేవలం కుటుంబాలకు ఇన్సూరెన్సు చేయిస్తానని అనడం అంటే ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలను పోషించడం మాత్రమే అని అందరికీ తెలుసు. అలా కాకుండా ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత అనే సత్యాన్ని గుర్తించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆమేరకు మౌలిక వసతుల కల్పనపై చాలా శ్రద్ధ పెట్టారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను ప్రకటించినా సరే విద్యా వైద్య వసతుల మౌలిక సేవల రంగానికి ఎంత ప్రకటిస్తారనేది కీలకం. ఇలాంటి ఏ విషయంలోనూ స్పష్టత ఇవ్వకుండా, జరుగుతున్న పనులను సగంలోనే వదిలేయాలనే నిలకడ దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు.

ఆయన బతుకే ఒక వంచన. అడుగడుగునా ఆ వంచనకు సరైన పద్ధతులనే అవలంబిస్తుంటారు. వెంట నిలిచిన దత్తపుత్రుడు వంటి వారి రాజకీయ జ్ఞానశూన్యత చంద్రబాబు మాయమాటలను గమనించలేని స్థితిలో ఉంటుంది. అలాగే చంద్రబాబునాయుడు పప్పుడు ఉడుకుతున్నాయి. కానీ.. ఈసారి ప్రజలు చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు చేస్తారు. మాయ మాటలకు కాదు.. చిత్తశుద్ధికి ఓటేస్తారని అంతా అనుకుంటున్నారు.

ఎల్. విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?