cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సంతాన చింత 05

ఎమ్బీయస్‌: సంతాన చింత 05

పిన్నలు ప్రేమవివాహం చేసుకుంటానంటే పెద్దలు వద్దనడానికి ప్రధాన కారణం - వాళ్ల ఎంపిక సరిగ్గా వుండదనే భయం! కుర్రతనపు ఆవేశంలో వాళ్లకు యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం ఉండదని, ఏదైనా పొరపాటు జరిగితే జీవితాంతం బాధపడతారని, అడుసు తొక్కాక కాళ్లు కడుక్కోవడం కష్టమని భయపడతారు. తమకైతే రకరకాల జీవితాలను చూసిన అనుభవం ఉంది కాబట్టి సరైన మార్గదర్శకత్వం చేయగలమని నమ్ముతారు. వీళ్లు చెప్పగా చెప్పగా, పిన్నలకు కూడా ఆ మాటల మీద నమ్మకం కుదురుతుంది. అయితే మీరే సంబంధాలు చూడండి, మీరు సెలక్టు చేసిన వాటిల్లో ఏది నాకు నప్పుతుందో తేల్చుకుని, అంతిమంగా నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం నాకివ్వండి అని అంటారు.

ఉభయతారకంగా ఉందనుకుని ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాతి నుంచి కష్టాలు ప్రారంభమవుతాయి. పిన్నలు ఏ విషయంలోనూ రాజీ పడడానికి యిష్టపడరు. అన్ని రకాలుగా బెస్టుగా ఉండాలనుకుంటారు. తాము 100% పెర్‌ఫెక్ట్‌గా ఉన్నామా అని సమీక్షించుకోరు. అవతలివాళ్లలో ఏ లోపమూ ఉండకూడదంటారు. పెద్దలకు యిది మింగుడు పడదు. ఇలా శల్యపరీక్ష చేస్తే ఏ సంబంధమూ కుదరదు, యిది ఒప్పేసుకో, యింతకంటె మెరుగైనది రాదు, దీన్ని వదులుకున్నందుకు తర్వాతి రోజుల్లో చింతిస్తావు అని చెపుతూ వుంటారు. పిన్నలు వినరు. మరోటి చూడు మరోటి చూడు అంటారు.

చివరకు విసుగెత్తి నీకెవరు నచ్చారో నువ్వే సెలక్టు చేయి, వాళ్ల గురించి వాకబులూ, అవీ మేం చేసి మా అభిప్రాయం చెప్తాం అంటారు. అలా అని ఏవైనా సంబంధాలు చెప్తే వాళ్లు మనవాళ్లు కాదనో, జాతకాలు నప్పలేదనో, వాళ్ల నాన్న ఉద్యోగం పెద్దది కాదనో, ఆ జిల్లా వాళ్లను నమ్మడానికి లేదనో.. యిలాటి కారణాలు చెప్పి అడ్డు కొడతారు. దాంతో పిన్నలకు విసుగు వస్తుంది. అలుగుతారు. కొన్నాళ్లదాకా సంబంధాలు చూడవద్దంటారు. ఇక పెద్దలు అలుగుతారు. ఇలా చాలా సమయం ఖర్చవుతుంది.

గతంలో అయితే ఓ పట్టాన వధూవరుల ఫోటోలు చూపించేవారు కారు. సమాచారం కూడా అరకొరగా యిచ్చేవారు. ఇప్పుడు మాట్రిమోనియల్‌ సైట్‌లలో, మారేజి బ్యూరోలలో సమస్త వివరాలు లభిస్తున్నాయి. వాటిలో జీతం, హోదా వంటి విషయాలలో అబద్ధాలు, అతిశయోక్తులు ఉంటే ఉండవచ్చు. కానీ ఎత్తు, బరువు తెలుస్తాయి. రకరకాల పోజుల్లో ఫోటోలుంటాయి. జాతకాలు కలిశాయో లేదో ముందే చూసుకుంటారు. అందువలన పెళ్లిచూపులకు వెళ్లేలోపునే అవతలివాళ్ల గురించి చాలా తెలిసి ఉంటుంది. ఇక చూడాల్సింది యాటిట్యూడ్‌ మాత్రమే అనిపిస్తుంది. వైకుంఠపాళీలో పావు యిక్కడే పాము నోట్లో పడిపోతోంది.

అబ్బాయి, అమ్మాయి యిద్దరూ మాట్లాడుకోవాలనేది అందరూ ఒప్పుకుంటున్నారు. పెళ్లిచూపులకు వెళ్లినపుడు విడిగా ఓ పావుగంట మాట్లాడుకుంటే చాలని పెద్దల అభిప్రాయం. జీవితాన్ని మొత్తం శాసించే నిర్ణయాన్ని పావుగంట యింటర్వ్యూతో ఎలా తేల్చుకోగలమని పిన్నలు అభ్యంతర పెడుతున్నారు. 'మా టైములో అదే మహద్భాగ్యం అనుకునే వాళ్లం. మా ముందు తరంలో అయితే అదీ ఉండేది కాదు.' అని పెద్దలు నచ్చచెప్పబోతారు.

'చుట్టూ పెద్దలున్నారని తెలిస్తే వాళ్లకు నచ్చేట్లు నటిస్తారు. మీరెవరూ లేకుండా మేమిద్దరమే ఏ కఫెటేరియాలోనో గంటో, గంటన్నరో మాట్లాడుకుంటే మనిషి స్వభావం కాస్త తెలుస్తుంది. లేదా కనీసం స్కైప్‌లో, ఫోన్లలో గంటలు గంటలు మాట్లాడడానికి మీరు ఒప్పుకోవాలి.' అని పిల్లలు వాదిస్తారు. సరే, యిదీ పాయింటే కదా, ఎలాగోలా సంబంధం కుదిరితే యీ వేట ముగుస్తుంది కదా అని పెద్దలు అనుమతిస్తారు. 

కానీ యిక్కడే చాలా సంబంధాలు వీగిపోతున్నాయి. టేబుల్‌ మ్యానర్స్‌ లేవనో, ఏరోగెన్స్‌ ఉందనో, ఎంతసేపూ తన డబ్బా కొట్టుకోవడమే తప్ప కానీ నా గురించి ఏమీ అడగలేదనో, ఇంగ్లీషు సరిగ్గా రాదనో, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లేవనో... యిలా బోల్డు ఫిర్యాదులు. దాంతో అడుగు ముందుకు పడదు. వృత్తిపరంగా అనేకమందిని యింటర్వ్యూలు చేసేవాళ్లు సైతం యీ యింటర్వ్యూల్లో ఫెయిలవుతున్నారు. ఇలా కొన్ని ఫెయిలవగానే తలిదండ్రులు యిలాటి సమావేశాలను ప్రోత్సహించడం మానేస్తారు. అవతలివాళ్లు 

అడుగుతూంటే 'అది మన సంప్రదాయం కాదండి, మా అబ్బాయి/ అమ్మాయిని మేం అలా పెంచలేదండి' అని చెప్పనారంభిస్తారు. డేటింగ్‌, కోర్టింగ్‌ వంటివి వుంటే అవతలివాళ్ల గురించి కొంత తెలుస్తుంది. అవి లేనప్పుడు యిలాటివి కాస్త ఐడియా యైనా యిస్తాయి. ఇవేమీ లేకుండా పెళ్లి చేసేస్తే, తర్వాత వాళ్లు సర్దుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.

అది తెలిసి కూడా పెళ్లి జరగాలంటే యీ అవకాశం యివ్వకూడదని పెద్దలు అనుకుంటున్నారు. 'నీతో ఎక్కువ సేపు గడిపితే అవతలివాళ్లకు నీ సంగతి తెలిసిపోతుంది, నువ్వు ఎవరినీ యింప్రెస్‌ చేయలేవు, ఇలా అయితే నీకు పెళ్లవడం కష్టం, పెళ్లయ్యాక గత్యంతరం లేక వాళ్లే నీ దారికి వస్తారు.' అని పిన్నలకు నచ్చచెపుతున్నారు. పెళ్లి తర్వాత యిది అనేక సమస్యలకు దారి తీస్తోంది. 

గతంలో పెళ్లి సంబంధాలు చూడడం ఒకటి, రెండేళ్లల్లో ముగిసిపోయేది. ఇప్పుడా ప్రక్రియ సరాసరిన ఐదారేళ్లు పడుతోంది. మాట్రిమోనియల్‌ సైట్‌లలో అవే సంబంధాలు మళ్లీమళ్లీ పలకరిస్తాయి. కొత్తగా ఎవరైనా మార్కెట్‌లోకి వస్తే తప్ప ఆ మొహాలే కనబడతాయి. ఇదంతా తలిదండ్రులకు చింత పెంచుతోంది. పిన్నలకూ వర్రీ ఉంటుంది కానీ వాళ్లకు ఉద్యోగం వంటి ప్రధాన వ్యాపకం ఉంటుంది. తలిదండ్రులూ ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, వేరే ఏదైనా వృత్తిలోనో ఉన్నా ఆ వయసులో వారికి యిదే ముఖ్యమైన వ్యాపకమై పోతుంది. పెద్దలకు ఎటు చూసినా బంధుమిత్రుల్లో పెళ్లయినవాళ్లే కనబడతారు కానీ పిన్నలకు ఎటు చూసినా స్నేహితుల్లో, సహోద్యోగుల్లో పెళ్లి కాని వాళ్లే కనబడతారు. అందువలన మనకేం తొందర అని వాళ్లనుకుంటారు.

ఈ దృక్కోణవైరుధ్యం పెద్దలకు చింత పెంచుతోంది. సంబంధాలు చూడడం ఐదారేళ్లు సాగితే ఆ తర్వాత కుదరడం మరీ కష్టమై పోతుంది. ఆలస్యమైన కొద్దీ కొళాయి ధార సన్నగిల్లుతుంది. ఆఫర్లు తక్కువగా వస్తాయి. అదే సమయంలో యివతల 'ఇన్నాళ్లూ ఆగినది యిలాటి సంబంధం కోసమా?' అంటూ తిరస్కరణలూ ఎక్కువౌతాయి. చివరకు ఏదో ఒక శుభముహూర్తాన సంబంధం కుదిరి పెళ్లవుతుంది. తమాషా ఏమిటంటే పెళ్లి కుదిరిన మరుక్షణం నుంచి అవతలి వాళ్లల్లో లోపాలు కనబడడం మొదలవుతుంది. పెళ్లయిన తర్వాతి నుంచి యింకా కనబడతాయి. మరి పెద్దల అనుభవం, పిన్నల తెలివితేటలు అన్నీ ఎక్కడికి పోయాయో ఎవరికీ అర్థం కాదు. పైపై మెరుగులు చూసి ఏమారిపోయాం, ఇది కాకుండా మరోటి చేసుకోవాల్సింది, తొందరపడ్డాం.. అని అనుకోవడాలు ప్రారంభమౌతాయి. 

పెళ్లి విషయంలో మనం గ్రహించాల్సిన సంగతి ఒకటుంది. వైవాహిక బంధంలో ఒక బలం ఉంది. సమాజం ఏర్పడే తొలినాళ్లల్లో గుంపు పెళ్లిళ్ల వంటి ప్రయోగాలు జరిగాయి. చివరకు ఒకరి కొకరు అనే వివాహ పద్ధతి కాళ్లూనుకుని స్థిరపడింది. ఎంపికలో పొరపాటు జరిగితే సరిదిద్దుకునే అవకాశం అప్పట్లో ఉండేది. క్రమేపీ మన సమాజంలో తగ్గిపోయింది. అందువలన వైవాహిక వ్యవస్థ పట్ల మనం నిరసనగా మాట్లాడుతూ ఉంటాం.

అయితే గమనించాల్సింది ఏమిటంటే - పాశ్చాత్య సమాజంలో సైతం విడాకులు తీసుకున్నవాళ్లు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. భరణం సమస్య ఎక్కువగా ఉన్న దేశాల్లో యింకో పెళ్లికి జంకుతున్నారు కానీ తక్కిన చోట్ల మారుమనువులు బాగానే జరుగుతున్నాయి. అంటే దాని అర్థం వాళ్లకు వైవాహిక వ్యవస్థ పట్ల నమ్మకం పోలేదు. తమ ఎంపిక పట్ల నమ్మకం పోయిన సందర్భాల్లో తప్పు దిద్దుకోవాలని చూస్తున్నారంతే. విశ్వజనీనంగా రుజువైన సత్యమేమిటంటే - లోపాలున్నా పెళ్లి ఆచారం చిరకాలం మన్నేదే. అయితే అన్ని పెళ్లిళ్లూ విజయవంతం కావు.

భార్యాభర్తల మధ్య అవగాహన ఒక్క రోజులో సిద్ధించదు. క్రమేపీ ఏర్పడుతుంది. ఆలస్యంగా పెళ్లయిన సందర్భాల్లో యిది మరింత ఆలస్యమవుతుంది. పెళ్లయిన కొత్తల్లో అవతలివాళ్లను తమ కనుకూలంగా మలచేసుకోవాలన్న తాపత్రయం ఉంటుంది. పోనుపోను, అవతలివాళ్లను ఏ మేరకు పుష్‌ చేయవచ్చో తెలిసి వస్తుంది. ఇద్దరి మధ్య ఒక కనబడని గీత ఏర్పడుతుంది. అది దాటితే ప్రమాదం అని యిద్దరికీ అర్థమవుతుంది. చివరకు ఏరియా ఆఫ్‌ మ్యూచువల్‌ ఎకార్డ్‌ అని ఒకటి స్థిరపడుతుంది. కానీ యీ ప్రాసెస్‌కి జంటను బట్టి సరాసరి ఏడాది, రెండేళ్లు పడుతుంది.

ఈ లోపునే తలిదండ్రులు కంగారు పడిపోతూ ఉంటారు. పెళ్లయిన మర్నాటి నుంచి మీ ఆయన లేదా ఆవిడ ఎలా వున్నాడు, ఎలా వుంది అంటూ ఫోన్లు చేసి ఊదర గొట్టేస్తూంటారు, ముఖ్యంగా తల్లులు! ఈ కమ్యూనికేషన్‌ విప్లవం కాపురాలకు ఎసరు పెడుతోందనడం అతిశయోక్తి కాదు. పెళ్లిపుస్తకంలో అందమైన సంగతులూ ఉంటాయి, అచ్చుతప్పులూ ఉంటాయి. అవతలివాళ్లు అడిగినపుడు రసవద్ఘట్టాల గురించి చెప్పలేరు, నీరస ఘట్టాలు, విరస ఘట్టాల గురించి మాత్రమే చెప్తారు. అది విని పుస్తకమంతా అవి తప్ప మరేమీ లేవని తలిదండ్రులు బెంబేలు పడతారు, దిగాలు పడతారు. నూటికి తొంభై కేసుల్లో భార్యాభర్తల తగాదాలను పట్టించుకోకుండా ఉంటే వాటంతట అవే అడ్జస్టు అవుతాయి.

స్త్రీపురుషుల మధ్య ప్రకృతి ఏర్పరచిన సహజమైన ఆకర్షణ ఆ సంగతి చూసుకుంటుంది. సాధ్యమైనంత చనువుగా మసలుతూ భార్యాభర్తలు దానికి దోహదపడితే చాలు. అలా కాకుండా ఇరువైపుల తలిదండ్రులు, కొలీగ్స్‌, స్నేహితులు అందరూ కలగచేసుకుని సలహాలివ్వడం మొదలుపెడితే విషయం క్లిష్టమై పోతుంది. కానీ తలితండ్రులు తమ ఆరాటంతో, వాళ్ల జీవితాల్లో చొరబడి సమస్యను పెద్దదిగా చేస్తున్నారు. ఎన్నో తరాలుగా ఆటుపోటులను తట్టుకుని నిలబడిన వైవాహిక వ్యవస్థ నేటి సమాజంలో విపరీతంగా బలహీనపడడానికి కారణం తలితండ్రుల జోక్యమే. దీనివలన వారు బావుకుంటున్నదీ లేదు. బిపి, సుగర్లు పెంచుకోవడం తప్ప! 

వైవాహిక సమస్యల గురించి చర్చించడానికి యిది వేదిక కాదు. తలిదండ్రుల పక్షాన్నుంచి చింత ఎలా తగ్గించుకోవచ్చో చర్చించి వదిలేస్తున్నానంతే. ఎన్నో విషయాలు పరిగణించి యీ సంబంధం చేశాం, పిల్లా, పిల్లవాడూ యిద్దరూ చదువుకున్నవారే, తెలివైన వారే, కొన్నయినా సుగుణాలున్నవారే, తక్కినవాళ్ల కాపురాలు చూసి, అందరూ ఎలా వున్నారో, లోకరీతి ఎలా వుందో గ్రహించేవారే, అంతిమంగా అంతా సవ్యంగానే జరుగుతుంది అనే ఆశాభావంతో కనీసం ఆర్నెల్లయినా దంపతుల విషయాల్లో మరీ జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది.

వాళ్లేదైనా పితూరీలు చెపుతూంటే 'అనవసర భయాలతో అలా ప్రవర్తిస్తున్నారేమో, నీ మంచితనం గ్రహించాక మారుతుందేమో/మారతాడేమో చూదాం' అని ఓదార్చి పంపడమే మేలు. కొంతకాలానికి సయోధ్య పెరిగి, ఒక అవగాహనకు వచ్చి సర్దుకోగలిగితే సరేసరి. కాదూకూడదంటే యిబ్బందులు తప్పవు. విడాకుల ఘట్టం, పునర్వివాహ ఘట్టం యివన్నీ అబ్బాయికి, అమ్మాయికి ఎంత బాధాకరమో, తలిదండ్రులకూ అంతే బాధాకరం. ఇక అకాల వైధవ్యం వంటివి మరీ బాధాకరం. అవి జరిగే కేసులు తక్కువే కాబట్టి వాటి గురించి విస్తారంగా చర్చించనక్కరలేదు. ఇక్కడితో సంతాన చింత గురించిన చర్చ వదిలేద్దాం.

ఎమ్బీయస్‌: సంతాన చింత

ఎమ్బీయస్‌: సంతాన చింత - 2

ఎమ్బీయస్‌: సంతాన చింత - 3

ఎమ్బీయస్‌: సంతాన చింత-4

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmial.com