ఈ వ్యాసం చదివే ముందు ఎమ్బీయస్: స్కిల్ స్కామ్‌పై కాస్త వెలుగు ఆర్టికల్ చదవగోర్తాను. దానిలో చివరిలో సీమెన్స్ పాత్ర తథ్యం, గ్రాంట్ మాట మిథ్య అని ముగించాను. అయితే సీమెన్స్ వారు మాకు సంబంధం లేదని ఈ మెయిల్ పంపించారని యిటీవల పత్రికల్లో చదువుతున్నాను. అబ్బే, ఆ మేరకు మేజిస్ట్రేటు ఎదురుగా 164ఎ కింద స్టేటుమెంటు యిచ్చారని జగన్ ఆర్నెల్ల క్రితం అసెంబ్లీలో యీ స్కాము గురించి చేసిన ప్రసంగంలో చెప్పారు. సీమెన్స్ అలా చెప్పలేదని చాలా రోజులుగా తెలుగు మీడియా వాదిస్తూ వచ్చింది. కానీ ఆంధ్రజ్యోతి 22.09.23న సీమెన్స్ ఒప్పందం విషయంపై తన 03.02.22 లేఖలో తడబాటు ప్రదర్శించిందని రాసింది. ఈ 164ఎ స్టేటుమెంటును సిఐడి కోర్టులో విచారణ సమయంలో బయట పెడుతుందేమో చూడాలి. అప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్లు సీమెన్స్‌ను ఏ ప్రశ్నలూ వేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్లకు కావలసినది అలాటి స్టేటుమెంటే కాబట్టి!
*కానీ డిఫెన్స్ వాళ్లు సీమెన్స్‌ను చాలా ప్రశ్నలే వేస్తారు. అప్పుడు సీమెన్స్ ఏ జవాబులు చెప్తుందో చూడాలి. ఒప్పందం డాక్యుమెంటు చెల్లదని వాదిస్తారేమో! ఎందుకంటే దాని మీద ఎక్కడా తేదీ లేదు, స్థలం లేదు, ఇద్దరు సాక్షుల సంతకాలు ఉండవలసిన చోట్ల ఖాళీగా ఉంది. లెటర్ రిఫరెన్స్ అన్న చోటా ఖాళీగా ఉంది. ఇలాటి సాంకేతిక కారణాలు చూపించి, మా జవాబుదారీ లేదు పొమ్మంటారేమో! మీకు డబ్బు ముట్టింది కదా అంటే అది డిజైన్‌టెక్‌కు మేం అమ్మిన సాఫ్ట్‌వేర్ తాలూకుది, ఎవరికైనా అమ్ముతాం, అది మా సాఫ్ట్‌వేర్ కాబట్టి ఆ సెంటర్లకు సీమెన్స్ సెంటర్లని పేరు పెడితే ఊరుకున్నాం అంటారేమో. మీ 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏది? అని అడిగితే ఆ మాట ఒప్పందంలో ఉందా? అని ఎదురు ప్రశ్నించవచ్చు. ఇప్పటికే సుమన్ బోస్ ‘జీఓ 4 నేను చూడలేదు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని దానిలో మీ అంతట మీరే రాసుకున్న సంగతి నాకు తెలియదు’ అని చెప్పాడు.
*ఒప్పందంలో సీమెన్స్, డిజైన్‌టెక్‌ల 90% వాటా గురించి కాదు కదా, గ్రాంట్‌లో ప్రభుత్వం వాటా 10% అని కూడా లేదు. ప్రభుత్వం యిచ్చేది ఫైనాన్షియల్ ఎసిస్టెన్స్ (గుజరాత్ ఒప్పందంలో అలాగే ఉంది, అలాగే పెట్టాలని డిజైన్‌టెక్- సీమెన్స్ వారు అడిగారేమో) అని రాశారు. జీఓలో సీమెన్స్, డిజైన్‌టెక్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లలో 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్ యిస్తాయని రాశారు. తర్వాతి రోజుల్లో సీమెన్స్ గ్రాంట్ ఇన్ కైండ్ యివ్వడమే మా అలవాటు అని చెప్తోంది. అది సాఫ్ట్‌వేర్‌కి మాత్రమే పరిమితం. తక్కినవన్నీ డిజైన్‌టెక్ చూసుకుంది. అది యిచ్చిన గ్రాంట్ (ఎయిడో, కైండో) ఏముంది కనుక? ఒప్పందం రాసుకున్నపుడే కాదు, తర్వాత కూడా అది తనిచ్చిన గ్రాంట్ గురించి ఏమీ క్లెయిమ్ చేయటం లేదు కదా!
*3300 కోట్ల కాంట్రాక్టు కదా, టెండర్లకు పిలిచారా అని అర్ణబ్ గోస్వామి దగ్గర్నుంచి చాలామంది అడిగారు. దానికి లోకేశ్ జవాబు – గుజరాత్‌లోనూ పిలవలేదు కదా! అని. గుజరాత్ కాంట్రాక్టు 3వేలదా? కాదు కదా, చిన్న చిన్న కాంట్రాక్టులవి. మొత్తం 11 సెంటర్లు. నేను ఉదహరించిన కాంట్రాక్టు ఒక రాజ్‌కోట్ సెంటరుది 17 కోట్లది. 3300 కోట్ల కాంట్రాక్టు అన్నపుడు సీమెన్స్-డిజైన్‌టెక్ కంటె తక్కువ రేటుకి చేసే వాళ్లెవరున్నారంటూ స్విస్ ఛాలెంజ్‌లు వగైరాలు చేయిస్తారు కదా! సాఫ్ట్‌వేర్ చేసేది సీమెన్స్ ఒక్క కంపెనీయేనా? బాబుగారికి ఎప్పణ్నుంచో పరిచయం ఉన్న మైక్రోసాఫ్ట్ ఉందిగా? గుజరాత్ ఒప్పందంలో 90% మాట లేదు. ఇక్కడ ఎందుకు వచ్చింది? బాబుగారి ప్రచారప్రీతి వలన వచ్చింది. లోకంలో మహానుభావులందరూ నన్ను చూసి మురిసి వచ్చారని చెప్పుకోవడం ఆయనకు అలవాటు. అదే కొంప ముంచింది. నిజానికి అది 371 కోట్ల ప్రాజెక్టే అంటే దానిపై యింత దృష్టి పడేది కాదేమో!
*3300 కోట్ల ప్రాజెక్టు, దానిలో 90% వారిది అనడంతో అధికారులందరూ గందరగోళ పడ్డారు. వాళ్ల దగ్గర్నుంచి కాస్తకాస్తగానైనా డబ్బులు రానీయండి అన్నారు. అబ్బే కాదంటూ డబ్బులు విడుదల చేస్తూ పోయారు. అవతలి నుంచి ఒక్క పైసా అయినా రాకుండానే యిచ్చారు. సరే యిచ్చారయ్యా, పని జరుగుతూంటే దాని ప్రోగ్రెస్ చూసి విడుదల చేయవచ్చుగా! ఇల్లు కట్టడానికి బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నపుడు వాళ్లు ఎలా యిస్తారు? పునాదుల వరకు అయితే యింత, స్లాబ్ వరకు యింత, యిలా స్టేజీల వారీగానే కదా డబ్బు విడుదల చేస్తారు! ప్రభుత్వం నిధులు విడుదల చేయాలంటే చాలా పెద్ద తతంగం. టెండర్లు పిలిచి, ఒకర్ని అప్పగించి, పనులు అప్పగించి, వాళ్లు పనులు పూర్తి చేసి, బిల్లులు చెల్లించండి మహాప్రభో అని అడిగితే, తిప్పించుకుంటారు. చివరకి అధికారులకు, నాయకులకు ఏ పది శాతమో ముడుపులు చెల్లిస్తే తప్ప బిల్లులు పాస్ కావు. ఇది దశాబ్దాలుగా జరుగుతున్న సంగతి.
వైయస్ జలయజ్ఞం ప్రాజెక్టులు మొదలుపెట్టినపుడు, ‘ఆ పనులు త్వరగా పూర్తయి, రైతుల పొలాలకు నీళ్లు రావాలి. డబ్బులు కోసం తిరగాల్సి వస్తుందనే భయంతో కాంట్రాక్టర్లు ఓ పట్టాన పనులు చేపట్టరు. అందువలన వాళ్లని మొబిలైజ్ చేయడానికి గాను మొబిలైజేషన్ ఎడ్వాన్సులు యిస్తున్నాం’ అంటూ పనులు ప్రారంభం కావడానికి ముందే వాళ్లకు కొంత డబ్బులు యిచ్చేశారు. పైకి ఏం చెప్పినా, యీ వింత ప్రాక్టీసు వెనక్కాల అవినీతి ఉందని కచ్చితంగా తేలుతోంది. ఆ డబ్బులో కొంత వాటా అయినా పాలకులకు ముట్టి ఉంటుందని తేటతెల్లమౌతోంది కదా! అదే పని స్కిల్ స్కామ్‌లో కూడా జరిగిందా? నిధులు విడుదలైన తీరు, తారీకులు చూస్తే మీకే అర్థమౌతుంది.
* 6 క్లస్టర్లలోనూ ఒక్కోదానిలో 6 చొప్పున మొత్తం 36. తర్వాత 4 పెంచారు. అంటే 40 సెంటర్లు ఏకకాలంలో రెడీ కావు కదా. అసలు వాటి పని తీరు ఎలా ఉంటుందో తెలియదు కదా. అందుకనే సునీత గారు ఒక పైలట్ ప్రాజెక్టుగా ఒక క్లస్టర్‌ను ప్రారంభించి చూసి, అది బాగుంటే విస్తరిస్తూ పోవచ్చని సూచించారు. అనేక పథకాల విషయంలో యిలాగే జరుగుతుంది. అబ్బే, స్కిల్స్ లేక విద్యార్థులు అల్లాడుతున్నారు. వెంటనే అన్నీ ప్రారంభించాలి అనుకుని ఆరు క్లస్టర్ల పనీ ఒకేసారి మొదలుపెడదామని ప్రభుత్వం అనుకుంది. మంచిదే, కానీ అన్నిటిలోనూ సౌకర్యాలు వెనువెంటనే సమకూర్చడం ఎవరి వల్లా కాదు కదా! ఇదేమీ చిన్నమయ కట్టే మాయాబజారు కాదుగా! అందుకే 31.05.17 కి రెండు సెంటర్లు ప్రారంభమయ్యాయి, 31.12.17 నాటికి 19 సెంటర్లు ప్రారంభమయ్యాయి. మొత్తం 40 పూర్తయ్యేసరికి 2018 మార్చి 31 అయింది. ఈ మాత్రం జాప్యం జరగడం సహజమే అని ఒప్పుకోవచ్చు.
*అయితే యీ ప్రాజెక్టుకి నిధులు ఎప్పుడు విడుదల అయ్యేయి అన్నదే కీలకం యిక్కడ. 2017 జూన్‌లో ప్రారంభమైన పనులకు 2015 డిసెంబరు 5 నుంచి చెల్లింపులు మొదలు పెట్టేశారు. అది కూడా మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 50%! అక్షరాలా 185 కోట్లు. పనులు పూర్తి చేసినా బిల్లులు చెల్లించడానికి కాంట్రాక్టర్లను తమ చుట్టూ తిప్పించుకునే ప్రభుత్వాలు యిలా 19 నెలల ముందే డబ్బులిచ్చేశాయంటే విడ్డూరంగా తోచదూ!? సీమెన్స్-డిజైన్‌టెక్ అడుగుతున్నది దేని కోసం? ఒక క్లస్టరుకి 559.32 కోట్లు ఖర్చవుతుందంటూ వేసిన అంచనాల సర్వీసెస్‌కు 13.31 కోట్లు, హార్డ్‌వేర్‌కు 48.48 కోట్లు, పోగా డిజిటల్ కోర్సులకు 249.75 కోట్లు, సాఫ్ట్‌వేర్‌కు 247.78 కోట్లు అని చూపించారు. సెంటరు నెలకొల్పనిదే హార్డ్‌వేర్ పెట్టలేరు. అది పెడితే తప్ప సాఫ్ట్‌వేర్ యిన్‌స్టాల్ చేయలేరు. సాఫ్ట్‌వేర్ వేస్తే తప్ప డిజిటల్ కోర్సులు ఫీడ్ చేయలేరు. ఆ తర్వాతనే సర్వీసెస్ అంశం ప్రారంభమౌతుంది. ప్రభుత్వం సెంటర్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు మొదలు పెట్టకుండానే, సెంటర్లను ఐడెంటిఫై చేయకుండానే (అది 2016 ఏప్రిల్‌లో జరిగింది) అర్జంటర్జంటుగా డిజైన్‌టెక్‌కు డబ్బులివ్వాల్సిన పనేమొచ్చింది?
*మొబిలైజేషన్ ఎడ్వాన్సుల విషయంలో మొత్తం అంచనా వ్యయంలో 10% విడుదల చేశారు. దీన్ని కాగ్ తిట్టి పోసింది.
వైయస్‌ను అందరూ తూర్పారబట్టారు. జలయజ్ఞం భారీ అంచనాలతో కూడుకున్నది. ఈ పథకం చిన్నది. అక్కడ 10% యిస్తే యిక్కడ 100% యిచ్చేశారు, అదీ ఒక్క సెంటరూ సిద్ధం కాకుండానే! దాని కంటె పెద్ద స్కాము యిది అనుకోవాలి.
*సరే, పనులు త్వరగా ప్రారంభం కావాలి, సీమెన్స్ నుంచి 59 కోట్లతో అర్జంటుగా సాఫ్ట్‌వేర్ కొనకపోతే రేట్లు పెరిగిపోతాయి కాబట్టి వెంటనే కొనాలి, వేరేగా హార్డ్‌వేర్ కొనాలి, ఫ్యాకల్టీకి తర్ఫీదు యివ్వాలి అనుకుని జాలి పడి 50% నిధులు ముందే యిచ్చేశారనుకోండి. తక్కిన 50% యివ్వడానికైనా ఆగాలిగా! అబ్బే, 05.12.15న 185 కోట్లు యిచ్చిన తర్వాత 29.01.16కి 85 కోట్లు యిచ్చారు, 11.03.16కి మరో 67 కోట్లు, 31.03.16న మిగిలిన 34.25 కోట్లు యిచ్చేసి 2015-16 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే సరికి మొత్తం వాళ్ల చేతిలో పెట్టేశారు. ప్రభుత్వ పనులు నత్తనడక నడుస్తాయని, రెడ్ టేపిజం ఉందని అనేవారు యీ స్పీడు చూస్తే కళ్లు తిరిగి కింద పడతారు. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదంటారు కానీ యింత స్పీడుగా వడ్డించేవాడు మనవాడవడానికి బంతిలో కూర్చున్నవాడు ఎంతో ఆత్మీయుడవ్వాలి.
*గుర్తుంచుకోండి, అప్పట్లో ఆంధ్ర ప్రభుత్వం నిధుల కొరతతో అల్లాడుతోంది. విభజన తర్వాత, కేంద్ర యివ్వాల్సిన నిధులు విడుదల చేయక తొక్కిపెట్టిన వేళ అది. 2015 మేలో జరిగిన రేవంత్ రెడ్డి క్యాష్ ఫర్ ఓట్ స్కామ్ పరిణామాల అనంతరం చంద్రబాబు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదులో పదేళ్లు ఉండే సౌకర్యాన్ని జారవిడుచుకుని, ఆంధ్ర సెక్రటేరియట్‌ను అమరావతికి తరలించడానికి ఆలోచిస్తున్న సమయమది. అమరావతి రావడానికి నిరాకరిస్తున్న హైదరాబాదు ఉద్యోగులను బుజ్జగించి, వారికి అనేక సౌకర్యాలను సమకూర్చడానికి అయ్యే వ్యయం గురించి బాబు చింత పడుతున్న కాలమది. చివరకు బాబు నిర్ణయం తీసుకుని 2016మేలో ఆంధ్రకు తరలిపోతున్నామని ప్రకటించేశారు కూడా! చెప్పవచ్చేదేమిటంటే, ఈ నిధులు ఉదారంగా విడుదల చేసిన సమయంలో ఆంధ్ర ప్రభుత్వం వద్ద నిధులేమీ పొంగి పొర్లటం లేదు.
*మొబిలైజేషన్ ఎడ్వాన్సుల విషయంలో కొన్ని పనులు ప్రారంభం కాకపోవడం చేత ఆ డబ్బులు కాంట్రాక్టర్ల వద్దనే కొంతకాలం ఉండిపోయాయి కదా, స్కిల్ విషయంలో అన్ని చోట్లా 2018 మార్చికైనా ప్రారంభమయ్యాయి కదా, సంతోషించండి అనవచ్చు కొందరు. అంతే కాదు, 2.13 లక్షల మంది ట్రైనింగ్ అయ్యారు కదా, 317 కోట్లను యీ సంఖ్యతో భాగిస్తే విద్యార్థికి సగటున 17 వేల ఖర్చు మాత్రమే అయింది కదా, అదేమైనా పెద్ద ఎక్కువా? అని కొందరు పాఠకులు అడుగుతున్నారు. విద్యార్థులకు నైపుణ్యం నేర్పించడం కూడా నేరమేనా? వాళ్లు చదువుకోవద్దా? ఉద్యోగాలు తెచ్చుకోవద్దా? మీలాగ మొద్దుల్లా ఉండాలా? నైపుణ్యం ఉన్న కార్మికులున్న చోటికే పరిశ్రమలు వస్తాయి. అది మీకు అక్కరలేదా? పరిశ్రమలు లేకుండా రాష్ట్రం కునారిల్లి పోవాలా? బాబుగారు ఎంతో దూరదృష్టితో పారిశ్రామికాభివృద్ధికై యీ ప్రాజెక్టు ప్రారంభిస్తే బురద చల్లుతారా? అంటూ ఆవేశం ప్రదర్శిస్తున్నారు.
*జాతీయ మీడియా ‘టెండర్లు పిలవలేదేం?’, ‘అవతలి వాళ్లు తమ 90%లో ఒక్క పైసా యివ్వకపోయినా మీ 10%గా 371 కోట్లు ధారపోసేశారేం?’ వంటి ప్రశ్నలు వేసినప్పుడు లోకేశ్ చెప్పిన సమాధానం ఒక్కటే – 2.13 లక్షల మంది తర్ఫీదు అయ్యారు చూడండి అని. (2020 మార్చి 31 నాటికి ఆ అంకె చేరింది). అన్నిటికీ అదే తారకమంత్రం. సరే, వాళ్లకు ఎలాటి తర్ఫీదు యిచ్చారు అనేదాని గురించి తర్వాతి వ్యాసంలో చెప్తాను. ముందుగా ఈ ట్రైనింగ్ అంతా 371 కోట్లతోనే పూర్తయిందా? అనే ప్రశ్నకు సమాధానం చెప్తాను. బుగ్గన తన 220923 నాటి అసెంబ్లీ ఉపన్యాసంలో చెప్పినదాని ప్రకారం 2015-16లో కార్పోరేషన్ పేరు చెప్పి బజెట్ యుటిలైజేషన్ 399 కోట్లు. అనగా 371 కోట్లు డిజైన్‌టెక్‌కి యివ్వగా ప్రభుత్వం 28 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ మొత్తం ఆ కార్పోరేషన్ సిబ్బంది జీతభత్యాలకే పోయింది అనుకోలేము. సెంటర్లలో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ఖర్చయిందనుకోవాలి. ఇక 2016-17లో బజెట్ యుటిలైజేషన్ 110 కోట్లు, 2017-18లో 93 కోట్లు, 2018-19లో 150 కోట్లు. మొత్తం 724 కోట్లు!
*స్కిల్ కార్పోరేషన్‌కై ఎలాట్ చేసిన 371 కోట్లలో 241 కోట్లు కైంకర్యం అయిపోయాయంటూ ఉంటే మరి యీ సెంటర్లు ఎలా నడిచాయా, ఫండింగ్ ఎవరు చేశారా అన్న సందేహం నన్ను పీడించింది. కార్పోరేషన్ వెబ్‌సైట్‌లో దీని గురించి వివరాలు లేవు. బుగ్గన అసెంబ్లీ ఉపన్యాసంలో నాకు వివరాలు దొరికాయి. ఈ లోగా సమాచారం కోసం వెతుకుతూంటే కేంద్ర ప్రభుత్వపు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెనార్‌షిప్ వారి 31.03.2017నాటి లేఖ ఇంటర్నెట్‌లో దొరికింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనా పథకం కింద ఆంధ్ర స్కిల్ కార్పోరేషన్‌కు అది శాంక్షన్ చేసిన నిధుల వివరాలు దానిలో ఉన్నాయి. 2016-20 టెర్మ్‌కై 23.68 కోట్లు శాంక్షన్ చేస్తూ 2016-18కి గాను 50% నిధుల కింద 11.84 కోట్లు వాళ్లు విడుదల చేశారు. దానిలో జనరల్ కేటగిరీకి 8.95, ఎస్సీలకై 1.92, ఎస్టీలకై 0.97 ఖర్చు చేయాలని చెప్పారు. స్కిల్ కార్పోరేషన్ ఈ సీమెన్స్‌వే కాక తక్కిన సెంటర్లు కూడా నిర్వహిస్తుందా? వాటికి యీ నిధులు వెచ్చించిందా? ఆంధ్ర బజెట్‌లో చూపించిన అంకెలలో యీ నిధులు కూడా కలిశాయా, విడిగానా అన్నది తెలియదు.
*ఎలా చూసినా ఈ స్కిల్ సెంటర్లకై ఖర్చయింది 725 కోట్లు అని, 371 కాదని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. డిజైన్‌టెక్ సమకూర్చేది సాఫ్ట్‌వేర్ (దీనికై అది ఖర్చు పెట్టినది 58.8 కోట్లే అని సీమెన్స్ నిర్ధారించింది) హార్డ్‌వేర్ (దీనికి ఎంతైందో తెలియదు), అధ్యాపకుల శిక్షణ (దీనికి ఎంతైందో తెలియదు), రెండేళ్ల పాటు సెంటర్ల నిర్వహణ (అధ్యాపకుల జీతాల మాట ప్రత్యేకంగా చెప్పలేదు). సెంటర్ల నిర్మాణం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫర్నిచర్ వగైరాలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. గుజరాత్ ఒప్పందంలో కూడా అలాగే ఉంది. ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వం 2016-17, 2017-18లలో నిధులు జారీ చేసినది కూడా వాటికే అయి వుంటుంది. పైగా డిజైన్‌టెక్ యీ సెంటర్లను నిర్వహించినది రెండు సంవత్సరాలు మాత్రమే. అదనంగా మరో ఏడాది హేండ్-హోల్డింగ్ (అనగా పర్యవేక్షించడం, యిబ్బందులొస్తే సరిదిద్దడం) చేసింది.
*2018 మార్చి నాటికి అన్ని సెంటర్లు ప్రారంభించారు. రెండేళ్లకు సెంటర్ల ఆస్తిపాస్తులను హేండోవర్ చేసింది అన్నారు. అంటే 2020 మార్చి నాటికి హేండింగ్ ఓవర్ అయిపోయింది. పట్టాభి గారు తన పవర్ పాయింటు ప్రెజంటేషన్‌లో డిజైన్‌టెక్ నుంచి తాము హేండోవర్ చేసుకున్నామంటూ వివిధ కాలేజీలు యిచ్చిన లెటర్స్‌ను చూపించారు. వాటిల్లో ఆ బదిలీ ఎప్పుడు జరిగిందో తారీకు లేదు. ఎందుకంటే 2టి కాలపరిమితి 2019 మార్చికి అయిపోయింది, 21టికి 2017 డిసెంబరుతో అయిపోయింది, 19 టికి 2020 మార్చితో అయిపోయింది. అప్పటికి 2.13 లక్షల మంది తర్ఫీదయ్యారు. ఇక అప్పణ్నుంచి రాష్ట్ర ప్రభుత్వమే ఆ సెంటర్ల నిర్వహణాభారాన్ని భరిస్తోంది. ఆ పైన తర్ఫీదయ్యే లక్షలాది విద్యార్థులందరూ ప్రభుత్వం ఖాతాలోకి వస్తారు తప్ప, డిజైన్‌టెక్-సీమెన్స్ ఖాతాలోకి రారు.
*ఇంత ఖర్చు పెట్టినపుడు యీ ప్రాజెక్టు విలువ ఎంత? ఏమిటి? సీమెన్స్ కంటె చౌకగా యితర సాఫ్ట్‌వేర్లు లభ్యమౌతాయా? ఇవన్నీ మదింపు వేయించాలి. ‘మేము సిఐటిడి (సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్) అనే కేంద్ర సంస్థ చేత చేయించాం. వాళ్లు ఓకే అన్నారు’ అని టిడిపి నేతలే కాదు, సుమన్ బోస్ కూడా చెప్పారు. సెంటర్లు ప్రారంభమైంది 2018 మార్చిలో. ఈ రిపోర్టు యిచ్చినది 2016 మార్చిలో. అంటే డబ్బులు మొత్తం డిజైన్‌టెక్‌కు యిచ్చేశాక! ఈ డబ్బులతో అది పెడతాం, యిది పెడతాం అని ప్రొజెక్షన్లు చూపించి తెప్పించుకున్న రిపోర్టు యిది. మాకు యిచ్చిన పేపర్ల బట్టే వేల్యూ చేశాం తప్ప, ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదు, చేయమని మమ్మల్ని ఎవరూ అడగలేదు అంటోంది సిఐటిడి. ‘మాది థర్డ్ పార్టీ మదింపు కాదు, అది కేవలం డిజైన్‌టెక్ మాకు 2015 డిసెంబరు5న (అనగా మొదటి విడతగా 185 కోట్లు తీసుకున్న రోజు) యిచ్చిన పత్రాల పరిశీలన మాత్రమే. ఈ ప్రాజెక్టు 3300 కోట్ల విలువ చేస్తుందని, దానిలో ప్రభుత్వ వాటాగా 371 కోట్లు విడుదల చేయవచ్చని కానీ మేం చెప్పలేదు. మా నివేదిక 2016 మార్చిలో యిచ్చాం. ఆ పాటికే డిజైన్‌టెక్‌కి 371 కోట్లు వెళ్లిపోయాయి.’ అని అది సిఐడికి చెప్పింది. ఇది 15.09.23 నాటి సాక్షిలో వచ్చింది.
*ఈ స్కాము బయటకు వచ్చాక ప్రభుత్వం శరత్ అసోసియేట్స్ అనే కంపెనీకి ఆడిటింగు అప్పగించింది. వాళ్లు సెంటర్లకు స్వయంగా వెళ్లి చూడకుండానే రిపోర్టులు యిచ్చారు. వెళ్లమని ముందుగా అనుమతి యిచ్చిన ప్రభుత్వం అక్కర్లేదులే అంది. ఆ విషయంపై పట్టాభి ప్రెస్‌మీట్ పెట్టి దులిపేశారు. సెంటర్లలో ఉన్న భౌతికమైన ఆస్తుల కయ్యే ఖర్చు ప్రభుత్వమే పెట్టింది. క్లస్టర్‌కు డిజైన్‌టెక్ చూపించిన ఖర్చు 48.48 కోట్లు హార్డ్‌వేర్‌కే పోయింది. 497 కోట్లు తక్కినది సాఫ్ట్‌వేర్, డిజిటల్ కోర్సులకు పోయింది. సర్వీసెస్‌కి 13 కోట్లన్నారు. ఏతావతా చెక్ చేయాల్సింది 6 సెంటర్లలో 48 కోట్ల హార్డ్‌వేర్ ఉందా లేదా అన్నది. దాని కోసం ఆడిటర్లు యీ 40 సెంటర్లకు తిరుగుతూ కూర్చుంటే కాలయాపన జరుగుతుందని, అంతకంటె దారి మళ్లిందని అనుకుంటున్న 241 కోట్లను వెతికి పట్టుకుంటే మేలని ప్రభుత్వం అనుకుందేమో తెలియదు. ఏది ఏమైతేనేం, ఆడిటర్లు ఎలాగైతే వెళ్లి సెంటర్లు చూడలేదో, సిఐటిడి కూడా వెళ్లి చూడలేదు. రెండు సంస్థలూ వాళ్ల ముందు పెట్టిన కాగితాల బట్టే మదింపు చేశాయి.
*ఇంత భారీ ఎత్తున ఫండ్స్ రిలీజ్ చేసినపుడు ప్రభుత్వం తన యంత్రాంగం చేత కూడా ఎసెస్ చేయించాలి కదా. పట్టాభి దాని విషయమై కూడా వివరణ యిచ్చారు. ‘అండర్‌టేకింగ్ ఫర్ ఓవరాల్ వేల్యుయేషన్ ఆఫ్ సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్’ అని 109 పేజీల డాక్యుమెంటు ఉందన్నారు. దానిపై సంతకం పెట్టినది 2015 నవంబరు నుంచి 2016 మార్చి వరకు స్కిల్ కార్పోరేషన్ ఎండీగా ఉన్న ప్రేమచంద్రా రెడ్డి గారు. మాజీ ఎండీ గంటా సుబ్బారావు గారిది సాక్షి సంతకం. ఈ-గవర్నెన్స్ విషయంలో బాబు, వైయస్ ప్రభుత్వాలలో గతంలో పని చేసిన గంటా సుబ్బారావు గారికి ఆయనకు టెక్నికల్ విషయాలపై మంచి అవగాహన, అనుభవం ఉందనుకుంటాను. ప్రేమచంద్రా రెడ్డిగారి ఎక్స్‌పోజర్ నాకు తెలియదు. విషయాలు అర్థం చేసుకునే సంతకం పెట్టాలనుకోవాలి. ఈ అండర్‌టేకింగ్ ఎవరికి యిచ్చారనేది తెలియలేదు. ఫైనాన్స్ వాళ్లకు యిచ్చారేమో! ప్రాజెక్టు వేల్యుయేషన్ 3300 కోట్లని దీనిలో ఎలా జస్టిఫై చేశారో మనకు తెలియదు. ఆంధ్రజ్యోతి ఎత్తి చూపినది ప్రేమచంద్రా రెడ్డి చేసిన యీ సంతకాన్నే!
*05.12.15న మొదటి విడతగా 185 కోట్లు యివ్వబోతూ జస్ట్ ఒక్క రోజు ముందు అంటే 04.12.15న యీ డాక్యుమెంటుపై సంతకాలు చేశారు. ఒక్క రోజులోనే ఫైనాన్స్ శాఖ యీ 109 పేజీలు చదివేసి, కన్విన్స్ అయిపోయి నిధులిచ్చింది అనుకోవాలా? వివిధ శాఖల్లో వివిధ పదవులు అనుభవిస్తూ ఫైళ్లను శరవేగంగా పరిగెత్తించి, త్రైపాక్షిక ఒప్పందంలో కార్పోరేషన్ తరఫున సంతకం పెట్టిన గంటా సుబ్బారావు గురించి ఆంధ్రజ్యోతి ఎత్తదు. టిడిపి వాళ్లు పెట్టిన ఎపిస్కిల్‌డెవలప్‌మెంట్‌ట్రూత్ డాట్‌కామ్ చూస్తే కార్పోరేషన్ ఆవిర్భావం నుంచి ఏడాది దాకా ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు గురించి రాయలేదు. కానీ 21.10.15 నుంచి ప్రేమచంద్రారెడ్డి కార్పోరేషన్ ఎండీగా వచ్చారని మాత్రం రాశారు. అంతే కాదు, ఆయన ఎండీగా ఉన్న కాలంలోనే 2015 డిసెంబరు – 2016 మార్చి మధ్య 371 కోట్ల చెల్లింపులు జరిగాయని నొక్కి వక్కాణించింది. ఈ విషయాన్ని ఎపిసిఐడి కానీ, సాక్షి కానీ ఎత్తదు. వింతగా లేదూ! నా ఉద్దేశంలో ప్రేమచంద్రా రెడ్డిని కూడా ఒక నిందితుడిగా చేర్చాలి.
*ఆంధ్రజ్యోతి కానీ, టిడిపి శ్రేణులు కానీ పగబట్టిన మరో వ్యక్తి అజేయ కల్లం! నిధులు విడుదలైన సమయంలో ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు. నిధులు విడుదల చేయమని ఆయన రాసినట్లు ఎక్కడా చదవలేదు. ‘కార్పోరేషన్ నెలకొల్పడానికి కాబినెట్ అనుమతి కావాలి’ అని నోట్ రాశారని బుగ్గన చెప్పారు. 2014 అక్టోబరులో కార్పోరేషన్‌ను నెలకొల్పినపుడు కాబినెట్ అనుమతి తీసుకోలేదని అందరికీ తెలుసు. ఆయనకు నిధుల విడుదల గురించి తెలిసి ఉంటుంది అని పివి రమేశ్ అన్నారు.. ఫైల్ మీద ఆయన నోటింగ్స్ లేనంతవరకు ఆయనను కేసులో యిరికించ లేరనుకుంటాను. కానీ టిడిపి అజేయపై కక్ష కట్టింది. సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పిలో రాష్ట్రప్రభుత్వంతో పాటు యీయన్నీ ప్రతివాదిగా ఎందుకు చేర్చిందో వాళ్లకే తెలియాలి.
వివేకా హత్య కేసులో వివేకా పిఏ శవాన్ని చూడడానికి ముందే, హత్య వార్త జగన్‌కు చేరింది అని నిరూపించడానికి అజేయను వాడుకుందామని చూస్తున్నారు. ఆ తెల్లవారు ఝాము సమావేశంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దువ్వూరి కృష్ణ, యిత్యాదులున్నా వాళ్లను ఎందుకు నిలదీయటం లేదో నాకు అర్థం కావటం లేదు. ఈ అజేయ కల్లం గారు విభీషణుడి తరహాలో పాత ప్రభుత్వపు గుట్టుమట్లన్నీ జగన్ ప్రభుత్వానికి చెపుతున్నాడన్న అనుమానమా? ‘‘స్కిల్ స్కామ్ – మరి కాస్త వెలుగు’’ అనే వ్యాసంతో యీ సీరీస్ ముగిస్తాను.
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2023)