Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: పూరి గుడిలో సుభద్ర

ఎమ్బీయస్‍: పూరి గుడిలో సుభద్ర

పూరీలో ఉన్నది జగన్నాథుడి ఆలయం. అక్కడ ఆయనతో పాటు కొలువై యున్నది రుక్మిణో, సత్యభామో, రాధో కాదు. చెల్లెలు సుభద్ర, అన్నగారు బలరాముడు. ఇది కాస్త వింతగా అనిపిస్తుంది. సాధారణంగా దేవుళ్ల పక్కన వారి భార్యలు మాత్రమే ఉంటారు. తమ్ముడు ఉండడం రాముడి విషయంలోనే చూస్తాం. అప్పుడు కూడా సీతామ్మవారు ఉండి, పక్కన లక్ష్మణుడు ఉంటాడు. ఏ దేవుడి చెల్లెలికీ యింత ప్రాధాన్యత చూడం. కొన్ని రాష్ట్రాలలో జరిపే భాయిదూజ్ పండగకు సంబంధించి ఆ రోజు యముడు తన సోదరి యమున యింటికి వెళతాడని ఐతిహ్యం. జగన్నాథుడి విషయంలో మాత్రం సుభద్ర ఆయనతో పాటు పూజలందుకుంటుంది, రథంలో ఆయనతో పాటు గుండిచా దేవి యింటికి వెళుతుంది. ఆవిడ గురించిన కాసిన్ని వివరాలివ్వడమే యీ వ్యాసం ఉద్దేశం.

సుభద్ర మనకు భారతంలో తారసిల్లుతుంది. ద్రౌపదితో పంచపాండవుల వివాహం అయ్యాక, వాళ్లు ఒక నియమం పెట్టుకున్నారు - అయిదుగురూ వంతుల వారీగా ఒక్కో ఏడాది చొప్పున ద్రౌపదితో కాపురం చేయాలి. ఆ సమయంలో తక్కినవారు వారింట్లో ప్రవేశించ కూడదు. ప్రవేశిస్తే పన్నెండేళ్ల పాటు వనవాసం చేయాలి అని. పాండవులు ఇంద్రప్రస్థానికి వచ్చి సుఖంగా ఉండగా, ధర్మరాజు ద్రౌపదితో కాపురం చేస్తున్న ఏడాదిలో ఒక విప్రుడు వచ్చి నా గోవులను దొంగలు అపహరించారు, మీరు వచ్చి కాపాడండి అని అర్జునుణ్ని ప్రాధేయపడ్డాడు. అయితే అర్జునుడి ఆయుధాలన్నీ ధర్మరాజు భవనంలో ఉన్నాయి. ధర్మరక్షణే ముఖ్యం అనుకున్న అర్జునుడు ఆ భవనంలోకి వెళ్లి ఆయుధాలు తీసుకుని, దొంగల్ని వేటాడి, బ్రాహ్మణుడికి గోవుల్ని అప్పగించాడు.

తిరిగి వచ్చి నియమభంగం కావించాను కాబట్టి పన్నెండేళ్లు వనవాసానికి వెళతానన్నాడు. ఫర్వాలేదంటూ ధర్మరాజు వారించినా వినలేదు. ఆ విధంగా ఐదేళ్ల కోసారి ద్రౌపదితో కాపురం చేసే అవకాశం రెండు సార్లు పోగొట్టుకున్నాడు. కానీ అరణ్యాలలో ఉండగానే అనేకమంది భార్యలను పొందాడు. గంగానదిలో స్నానం చేస్తూ ఉంటే ఉలూపి అనే నాగకన్య అతన్ని వరించి, లోపలికి లాక్కు పోయింది. అతన్ని వివాహమాడింది. తర్వాత ఇరావంతుడనే కొడుకుని కంది. అర్జునుడు అక్కణ్నుంచి తీర్థయాత్రలు చేస్తూ ముందుకు సాగాడు. చిత్రాంగద అనే కన్య వరించి, తండ్రి అనుమతితో పెళ్లాడింది.  వాళ్లకు బభ్రువాహనుడు కలిగాడు. అక్కడ మూడేళ్లు ఉండి అర్జునుడు ముందుకు కదిలాడు. దక్షిణ సముద్ర తీరంలోని తీర్థాలలో ఋషి శాపానికి గురైన ఐదుగురు అప్సరసలను శాపవిముక్తుల్ని చేశాడు. తర్వాత పశ్చిమ సముద్ర తీరాన ఉన్న ప్రభాస తీర్థానికి చేరాడు. అది ద్వారకకు దగ్గరగా ఉంది. చారుల ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడి రాక తెలుసుకుని అక్కడకు వచ్చి, తనతో పాటు రైవతక పర్వతానికి తీసుకుని వెళ్లాడు. అక్కడే వాళ్లు ఆ రాత్రి బస చేశారు.

మర్నాడు కృష్ణుడు ద్వారకకు తీసుకుని వెళ్లాడు. యదువీరులు అర్జునుణ్ని ఆహ్వానించారు. అక్కడ అతను కొన్నాళ్లు ఉన్నాడు. ఇంతలో రైవతక పర్వతంపై ఉత్సవం జరిగితే అందరూ వెళ్లారు. ఆ ఉత్సవంలో అర్జునుడు సుభద్రను చూసి మోహంలో పడ్డాడు. కృష్ణుడు అది గ్రహించి ‘‘ఆమె నా సవతి సోదరి. బలరాముని సహోదరి (ఒకే తల్లి కడుపున పుట్టిన సొంత చెల్లెలు). పేరు సుభద్ర. ఈమెను వివాహం చేసుకోవాలంటే చెప్పు,’’ అన్నాడు. అర్జునుడు చేసుకోవాలని ఉంది అనగానే కృష్ణుడు ‘అయితే శూరోచితంగా ఆమెను అపహరించి వివాహం చేసుకో. ఎందుకంటే స్వయంవరం అంటూ ఏర్పాటు చేస్తే ఎవర్ని వరిస్తుందో ఏమో’ అన్నాడు. అర్జునుడు దానికి ఒప్పుకోవడంతో దూతల ద్వారా ధర్మరాజుకి కబురు పంపి ఆయన అనుమతి తీసుకున్నారు.

అనుమతి రాగానే అర్జునుడు సుభద్ర రైవతక పర్వత పూజకు వెళ్లిన సందర్భం చూసి వేట మిషతో అక్కడకు వెళ్లి సుభద్రను బలవంతంగా రథం ఎక్కించి ఇంద్రప్రస్థానికి బయలు దేరాడు. సుభద్ర వెంట ఉన్న సైనికగణం ద్వారకకు పరుగున పోయి జరిగినది చెప్పారు. వెంటనే యదువీరులు యుద్ధానికి సిద్ధమయ్యారు. బలరాముడు అర్జునుడిపై తన కోపాన్ని ప్రకటించాడు. కానీ కృష్ణుడు అర్జునుని ప్రవర్తన క్షత్రియోచితమే అని వాదించి, అందర్నీ ఒప్పించాడు. దాంతో వాళ్లు అర్జునుడికి కబురు పంపి, ద్వారకకు రప్పించి యథావిధిగా వివాహం జరిపించారు. అర్జునుడు అక్కడ ఏడాదికి పైగా అక్కడ గడిపి, 12 ఏళ్ల గడువు చేరిన తర్వాత సుభద్రతో సహా ఖాండవప్రస్థానికి చేరాడు. అలిగిన ద్రౌపదిని సుభద్ర తన వినయంతో మెప్పించింది. ఇదీ సంస్కృత భారతంలో రాసినది. తిప్పాభట్ల రామకృష్ణమూర్తి, సూరం శ్రీనివాసులు గార్లు అనువదించిన పుస్తకంలోంచి తీసుకుని రాశాను. వారికి ధన్యవాదాలు. నన్నయ కూడా తెలుగు మహాభారతంలో యిలాగే రాశారు.

అయితే ‘‘విజయవిలాసం’’ పేర చేమకూర వెంకటకవి రాసిన ప్రబంధంలో కృష్ణుడి సలహాపై అర్జునుడు ద్వారకకు కపట సన్యాసి రూపంలో వచ్చి బలరామాదులను ఏమార్చి, సుభద్ర చేత వలపింప చేసుకుని, అపహరించుకుని పోతాడు. దీని ఆధారంగానే ‘‘శ్రీకృష్ణార్జున యుద్ధం’’ సినిమా తీశారు. అందువలన చాలామందికి సుభద్రా పరిణయం అనగానే అర్జునుడి మాయా యతి రూపం గుర్తుకు వస్తుంది. కానీ దానికి ఆధారం భారతంలో లేదు. భారతంలో యింత చోటు సంపాదించుకున్న సుభద్ర భాగవతంలో చోటు సంపాదించుకోలేక పోవడం నాకు విచిత్రంగా తోస్తుంది. భాగవతంలో కృష్ణబలరాముల బాల్యమే కాదు, యవ్వనం, కృష్ణుడి వివాహాలు అన్నీ ఉంటాయి కదా! మరి సుభద్ర ప్రస్తావన లేకపోవడమేమిటి? వింతగా లేదూ! పైగా భారతం రాశాకనే వ్యాసుడు భాగవతం రాశాడు. అలాటప్పుడు సుభద్ర గురించి కొంచెమైనా రాయకపోతే ఎలా? దానికి కారణం ఏమై ఉంటుంది? నాకు తెలియదు. విజ్ఞులెవరైనా చెప్పాలి.

విష్ణువు గురించి చెప్పిన మరో పురాణం ‘‘హరివంశం’’. దానిలో మాత్రం సుభద్ర గురించి ఉంది. వాసుదేవుడికి రోహిణికి రాముడు (బలరాముడు), శరణ, శాత, దుర్దమ, దమన, స్వాభ్ర, పిండారక, ఉసీనర అనే కొడుకులు, చిత్ర అనే కూతురు పుట్టారు. చిత్రకు యింకో పేరు సుభద్ర. (1.35.5-6). సుభద్ర గురించి వేరెవరైనా పట్టించుకున్నా పట్టించుకోక పోయినా పూరీ గుడిలో ఉన్న తూర్పు ప్రాంతాల వాళ్లు పట్టించుకుంటారు కదా సుభద్ర గురించి ఏం రాశారా అని వెతికాను. ఉన్న అయోమయానికి తోడు వాళ్లు సుభద్ర ఎవరి కూతురు అనే సందేహాన్ని కూడా చేర్చారు. అదేమిటో చెప్తాను. భాగవతం ప్రకారం వసుదేవుడికి యిద్దరు భార్యలు. మొదటి భార్య రోహిణి. వారికి పిల్లలు పుట్టలేదు. ‘నీ భర్త మారుమనువు చేసుకుని, నీ సవతికి బిడ్డలు పుడితేనే నీకు పిల్లలు పుడతారు’ అని నారదుడు కలలోకి వచ్చి చెప్పాడు. దాంతో ఆమె భర్తను ఒప్పించి దేవకినిచ్చి పెళ్లి చేసింది. దేవకి అన్న కంసుణ్ని ఆకాశవాణి హెచ్చరించడంతో దేవకీవసుదేవులను చెఱలో పెట్టాడు. తను బందీ కాబోతున్నానని తెలిసి వసుదేవుడు తన మొదటి భార్య రోహిణిని సోదర సమానుడైన నందుడి యింట్లో ఉండమని గోకులానికి పంపించాడు.  

వసుదేవుడి తాతకు యిద్దరు భార్యలు. ఒకరు క్షత్రియ స్త్రీ, మరొకరు గోపస్త్రీ. వసుదేవుడు క్షత్రియ స్త్రీ మనుమడైతే, నందుడు గోపస్త్రీ మనుమడు. ఆ విధంగా వాళ్లిద్దరికీ చుట్టరికం. సోదరి గర్భాన పుట్టబోయే ఎనిమిదవ శిశువు కోసం ఎదురుచూస్తున్న కంసుణ్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి, విష్ణువు దేవకి, రోహిణి, యశోద యీ ముగ్గురు స్త్రీల గర్భకోశాలతో సర్కస్ బఫూన్ బంతులతో ఆడినట్లు ఒక ఆట ఆడాడు. తనకు సోదరి సమానురాలైన యోగమాయతో ‘దేవకి కడుపులో ఏడవ వాడిగా ఆదిశేషుడు గర్భాన పడగానే ఆ గర్భాన్ని తీసుకెళ్లి ఆమె సవతి రోహిణి గర్బంలో పెట్టేయాలి.’ అన్నాడు. ఆమె అలాగే చేసింది. దాంతో దేవకికి గర్భస్రావం అయింది అనుకున్నాడు కంసుడు. ఆ తర్వాత ఎనిమిదో వాడిగా విష్ణువు దేవకి గర్భాన కృష్ణుడిగా పుట్టాడు. అదే సమయానికి యోగమాయ యశోద కడుపున ఆడపిల్లగా జన్మించింది.

కృష్ణుడు పుట్టగానే వసుదేవుడు పిల్లవాణ్ని గంపలో పెట్టుకుని యమున దాటి, గోకులానికి వచ్చి, యశోదకు పుట్టిన ఆడపిల్లను తీసుకుని, ఆ స్థానంలో కృష్ణుణ్ని ఉంచాడు. మర్నాడు కంసుడు వచ్చినపుడు పుట్టినది ఆడపిల్ల, వదిలేయవచ్చుగా అని బతిమాలినా అతను వినకుండా ఆ శిశువును గాల్లోకి ఎగరేసి, కింద కత్తి దూశాడు. అయితే ఆ బిడ్డ కిందకు రాకుండా యోగమాయగా మారి, ‘‘కంసుడా, నిన్ను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడు. ఆ బాలుడి చేతిలో నీ చావు తథ్యం.’ అని హెచ్చరించింది. ఈ కథ మనందరికీ తెలుసు. భాగవతంలో యోగమాయ పాత్ర యింతవరకే! అయితే బెంగాల్‌కు చెందిన కృష్ణభక్తులు కొందరి వాదన ప్రకారం సుభద్ర యోగమాయ అవతారం! నందుడికి, యశోదకు పుట్టింది. దీన్నే ఇస్కాన్ వాళ్లు కూడా ప్రచారం చేస్తున్నారు. దీనితో సుభద్ర యశోద కూతురా, రోహిణి కూతురా అనే సందేహం ప్రారంభమైంది.

https://magazines.odisha.gov.in/Orissareview/2015/July/engpdf/157-159.pdf అనే ఒక పోస్టులో బాలకృష్ణ దాస్ అనే ఆయన యీ విషయాన్ని రాశారు. దానితో పాటు అర్జునుడు మాయా యతి వేషం గురించి కూడా రాశారు. ‘రైవతక ఉత్సవంలో సుభద్రను చూసి వలచిన తర్వాత అర్జునుడు కృష్ణుడి సలహాపై  సన్యాసి వేషంలో వచ్చి ద్వారకలో చాతుర్మాస్యం గడుపుతానని అన్నాడు. బలరాముడు సరేనన్నాడు. సుభద్రను అతని సేవలకు ఉపయోగించాడు. సుభద్ర అతని ప్రేమలో పడింది. అర్జునుడు తనెవరో చెప్పుకున్నాడు. యాదవుల్లో చాలామంది సుభద్రను బలరాముడి శిష్యుడైన దుర్యోధనుడికి యిచ్చి వివాహం జరిపిద్దామనుకున్నారు. కానీ అర్జునుడు ఆ లోపునే సుభద్రను తీసుకుని పారిపోయాడు.’ అని రాశారు. అంటే చేమకూర వెంకటకవి ‘‘విజయవిలాసం’’కు ఆధారం యిక్కడ ఉందన్నమాట. ‘‘మాయాబజారు’’ సినిమాకు మూలమైన శశిరేఖా పరిణయ గాథ భారత దేశ పశ్చిమ ప్రాంతంలో చలామణీలో ఉన్నట్లు, యీ మాయా యతి ఉదంతం తూర్పు ప్రాంతంలో ప్రచలితంగా ఉందన్నమాట. దక్షిణాన కూడా ఉందేమో, ఎందుకంటే రవివర్మ యీ ఘట్టంపై చిత్రం గీశాడు.

అదే వ్యాసంలో పూరీ జగన్నాథాలయం గురించి కూడా ఆయన రాశారు. మాళవ రాజైన ఇంద్రద్యుమ్నుడికి విద్యాపతి అనే మంత్రి కృష్ణుడు నీలమాధవుడని పేరుతో ఉద్రదేశం (ఒడిశా)లో వెలిశాడని చెప్పాడు. వెతకడానికి వచ్చిన ఇంద్రద్యుమ్నుడికి ఆకాశవాణి ‘సముద్రతీరాన నాలుగు కొమ్మలున్న దారుబ్రహ్మ వద్ద నీలమాధవుడికై యజ్ఞం చేయి. నీకు జగన్నాథుడి పేరుతో కృష్ణుడు, బలభద్రుడనే పేరుతో బలరాముడు, దేవీ సుభద్ర పేరుతో సుభద్ర, సుదర్శన చక్రం విగ్రహాలు దొరుకుతాయి. వాటికి నీలాచలంపై ఆలయం కట్టించు.’ అని చెప్పింది. అలాగే జరిగింది. నిజానికి చాలాకాలం పాటు నీలమాధవుడే జగన్నాథుడిగా ఒంటరిగా పూజలందుకున్నాడని, తర్వాతి రోజుల్లో శక్తిపూజ ప్రబలినప్పుడు సుభద్రను, ఆ తర్వాత యితర వర్గాలను కూడా సంతృప్తి పరచడానికి బలభద్రుణ్ని, సుదర్శనాన్ని  చేర్చారని కొందరు చరిత్రకారుల ఉద్దేశమని వ్యాసంలో రాశారు. బలభద్రుడి మాట ఎలా ఉన్నా సుభద్రను పరాశక్తిగా కొలవ నారంభించారు. జగన్నాథుణ్ని పరంబ్రహ్మగా, బలరాముణ్ని జీవబ్రహ్మగా, సుభద్రను జ్ఞానశక్తిగా పరిగణించారని కూడా రాశారు.

శక్తి రూపం అనగానే బెంగాల్, ఒడిశాలలో దుర్గే గుర్తుకు వస్తుంది. అందువలన సుభద్ర దుర్గ మరో రూపం అనే వాదనా ముందుకు వచ్చింది. అబ్బే ఆమె దుర్గ కాదు, యోగమాయ అని ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఎసి భక్తివేదాంత ప్రభుపాద అన్నాడు. ఆమె యోగమాయ కాదు, కృష్ణుడు కంసుణ్ని చంపాక ఆమె వసుదేవ, రోహిణిలకు పుట్టిందని, కృష్ణుడి ద్వారకాలీలలో ఒక భాగం, భక్తి స్వరూపం అని శ్రీధర దేవ గోస్వామి అన్నారు. భక్తివినోద స్వామి ఆవిడ మహామాయ అన్నారు. ముగ్గురూ గౌడీయ వైష్ణవ ఆచార్యులే! అనే వ్యాసంలో వ్యాసకర్త ముగ్గుర్నీ సమన్వయం చేయడానికి గోకులంలో ఉన్నపుడు యోగమాయ అని, మధురకు తీసుకుని వచ్చినపుడు మహామాయ అని అన్నారు. కంసుణ్ని హెచ్చరించాక వింధ్య పర్వతాలకు వెళ్లి అక్కడ దుర్గగా, భద్రకాళిగా పూజలందుకుందని రాశారు.

కానీ పోనుపోను ఇస్కాన్ ప్రాబల్యం హెచ్చడంతో సుభద్ర యోగమాయ అని ప్రభుపాద చేసిన వాదన బలంగా వినిపించ సాగింది. 15వ శతాబ్దం నాటి చైతన్య మహాప్రభు నాటి అవతారంగా ప్రభుపాదను ఇస్కాన్ వాళ్లు గౌరవిస్తారు. వాళ్ల వాదన ఒప్పుకుంటే సుభద్ర తలిదండ్రులే మారిపోతారు. భారతంలో, హరివంశంలో ఆమె వసుదేవుడికి, రోహిణికి పుట్టిందని ఉంటే వీళ్లు నందుడికి, యశోదకు పుట్టిందంటారు. కొందరు వైష్ణవులు ఆమెను శక్తి అవతారంగా కాకుండా లక్ష్మి అవతారంగా భావిస్తారు. ఏదో ఒక రూపంలో సుభద్ర ఒడిశా, బెంగాల్, బంగ్లాదేశ్‌లలో గుజరాత్ పూజలందుకుంటోంది. పశ్చిమ రాజస్థాన్‌లోని భద్రాజున్ అనే గ్రామంలో సుభద్రను ధుమ్‌దా మాతగా కొలుస్తారట. ద్వారక నుంచి పారిపోయి వస్తూ, అర్జునుడు, సుభద్ర అక్కడే వివాహమాడారని వారి నమ్మకమట. ఈ వ్యాసంలో పొరపాట్లున్నా, సుభద్ర గురించి అదనపు సమాచారం ఉన్నా చెప్పగోర్తాను. (ఫోటో – మాయాయతిగా అర్జునుడు, సుభద్ర, రవివర్మ చిత్రం, పూరీలో జగన్నాథుడు, బలభద్రుడి మధ్యలో సుభద్ర)

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?